IIవ రాజులు 2:1-12, ఏలీయా ఆయన శిష్యుడైన ఎలీషా ప్రయాణములో నుండిరి. ఆరోహణమునకు ఒకచోటనుండి మరియొకచోటికి వెళ్ళుచుండిరి. మొదట వారు గిల్గాలు నుండి వెళ్ళినట్లు తెలియుచున్నది.
1. గిల్గాలు:- ఆరోహణము సంగతి గురుశిష్యు లిరువురికి తెలియునుగాని ఎక్కడ జరుగునో తెలియదు. గిల్గాలులో జరుగునేమో తెలియదుగాని ఆరోహణము మాత్రము ఉదహరింపబడెను. వారు ఈ పట్టణము చేరిరి గాని ఆరోహణము అక్కడకాదు. అక్కడనున్న సమయమున కాదు. అలాగే సంఘారోహణ విషయములో కూద అనేకులు పలానప్పుడు అని అనుకొందురు గాని అప్పుడు జరుగదు. సంఘము భూమిమీద రెండు వేల సంవత్సరములు ఉన్నది. ఆది సంఘములోనే రెండవ రాకడ జరుగునని తలంచిరి గాని జరుగలేదు. గిల్గాలు అను పట్టణము, ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చి యొర్ధానుదాటి వాగ్ధానదేశములో ప్రవేశించిన మొదటి స్థలము. (యెహోఎషువ 4:20) గిల్గాలు అనుమాటకు “తొలగిపోవుట” అని అర్ధము. ఐగుప్తులో ప్రారంభించిన తొలగిపోవుట ఇక్కడ పూర్తయినది. ఏలీయాకూడ ఈ లోకమునుండి తొలగిపోవుటకు, ఈ స్థలము ముంగుర్తుగా నున్నది. పెండ్లికుమార్తె సంఘముకూడ లోకమునుండి తొలగియుండవలెను. తొలగించుకొనిన వెంటనే రెండవ రాకడ రాదు. అయిననువేరగుట అవసరము.
2. బేతేలు:- ఈ స్థలమునకు వెళ్ళుమని దేవుడు ఏలీయాకు చెప్పెను. ఈ పట్టణములోనే పూర్వము యాకోబు దైవమందిర నిర్మాణము చేసెను. ఇపుడు ఏలీయా అదే మార్గమున ప్రయాణము చేసెను. (ఆది 28:19) సంఘము ఈ లోకమును విడచిన తర్వాత దైవమందిర భాగ్యము కలిగి యుండవలెను. బేతేలులో ఆరోహణము అని కొందరు తలంచిరి గాని అది జరుగలేదు. అలాగే కొందరు రెండవ రాకడను గురించి అనుకొందురు గాని అట్లు జరుగదు.
3. యెరికో:- దైవాజ్ఞ ననుసరించి ఏలీయా ఇచ్చటికి వచ్చెను. పూర్వము ఇశ్రాయేలీయులు అద్భుతకరమైన జయముపొందిన స్థలము, విజయ నిరీక్షణార్భాట ధ్వని చేయుచు ప్రదక్షిణము చేసిన స్థలము. పూర్వము వారు చేసినట్లే, సంఘముకూడ్ద్ద ఆరోహణ నిరీక్షణతో స్తొత్రధ్వని చేయును. జయమునకు ముందే యాజకులు బూరల ధ్వని చేసిరి. అలాగే సంఘముకూడ విజయ ధ్వని చేయవలెను. చివరకు జయము కలుగును. ‘అదిగో క్రీస్తు రాక ‘ అనే విజయ ధ్వని సంఘము చేయును. లోకములోని వారు – వీరెన్ని కేకలు వేసినను ప్రభువు రాలేదు అని ఆక్షేపణ చేసినను, సంఘము మాత్రము ఆయనవచ్చి వేసినట్లే, స్తోత్రార్పణలు చేయును. ఈ స్థలములో ఆరోహణమని వారు తలంచిరి గాని ఇక్కడను జరుగలేదు.
4. యొర్ధాను:- ఈ నది దగ్గరకు దైవాజ్ఞనుబట్టి ఏలీయా వచ్చెను. ఇది పాలెస్తీనాలో ముఖ్యమైనది. ఇశ్రాయేలీయులు ఈ నదిలో మునిగిపోలేదు. అద్భుతమైన రీతిగా ఈ నదిని దాటియున్నారు. సంఘముయొక్క ఆరోహణమునకు ముందు ఇటువంటి ఆటంకములు కలుగును. అయినను వాటిని సుళువుగా దాటగలరు. ఇన్ని ఆటంకములున్న ఎట్లు దాటుట? అని విశ్వాసులు అనుకొనకూడదు. నదివంటి అడ్డమేకాదు, ఎర్ర సముద్రమంత అడ్డమున్నను దేవుడు దాతించగలడు. దేవునికి అసాధ్యమైనవి ఏవియులేవు. నది ఈ ప్రక్క ఆరోహణమని తలంచిరి గాని అట్లు జరుగలేదు. అలాగే ఆటంకములకు ముందు సంఘారోహణము అని ఎవరును తలంచరాదు. ఏలీయా ఎత్తబడుట, నది ఇవతలే అని ఎవరైన అనుకొనినయెడల అది అట్లు జరిగినదా? లేదు. అలాగే క్రీస్తు రాకడ అడ్డులకు ముందే అని అనుకున్న యెడల వచ్చునా? రాదు.
5. యొర్ధాను:- నది పాయలు చేయబడెను. వారు పొడి నేలను నడిచి నది దాటిరి. ఇక్కడే ఏలీయా ఆరోహణము. ఇది చివరి స్థలము. వారు ఐదు స్థానములకు ప్రయాణము చేసిరి. అన్ని స్థలములలోను ఏలీయా ఆరోహణమని తలంచినట్లే, ఆయా కాలములలోనే సంఘము ఎత్తబడునని తలంచుట సహజమై యుండును గాని జరుగలేదు. సంఘము తన ఆసక్తి చొప్పున, ఆయా కాలములలో రాకడ అని తలంచెను గాని జరుగలేదు. ఏలీయా ఆరోహణము మొదటి నాలుగు స్థలములలోను జరుగలేదని చెప్పి ఇక ఆరోహణము జరుగదని తలంచిన యెడల మోసపోయి యుందురు. అలాగే సంఘము ఎత్తబడుట ఇంతవరకు జరుగలేదని నిర్లక్ష్యము చేసినయెడల మోసపోవుదురు. ఆయా స్థలములలో జరుగలేదని చెప్పి, యొర్ధాను అద్దరిని కూడ జరుగకుండునా? ఇన్నాళ్ళనుండి రాకడకు ఎదురు చూచిన రాలేదు. ఇప్పుడు మాత్రము వచ్చునా! అని తలంచుట అజ్ఞానము. అది జ్ఞానము కాదు. ఆయన ఎప్పుడు వచ్చినను సిద్ధముగా నుండుట సంఘముయొక్క పని. అప్పుడు ఏర్పాటు సమయములో ఎత్తబడుట జరుగును. అందు పాల్గొనినవారే ధన్యులు. వారే జ్ఞానులు, అట్టి ధన్యత చదువరులకును, విశ్వాసులకును కలుగునుగాక!