(1థెస్స 4:13-18)
“నన్ను వెంబడించుడి” అని ప్రభువు ఆదిలోనే తన శిష్యులకు చెప్పెను. ప్రభువు బోధించెను. గనుక వారును బోధింపవలెను; ప్రభువు మాదిరి చూపెను. వారును మాదిరి చూపవలెను; ప్రభువు పరోపకారార్ధమైన పనులు చేసెను. వారుకూడా అట్టిపనులు చేయవలెను; ఆయన అద్భుతములను చేసెను, వారును అద్భుతములు చేయవలెను; ప్రభువు శత్రువులను క్షమించెను, వారును క్షమింపవలెను; ఆయన శ్రమలను సహించెను, వారును సహింపవలెను; ఆయన మరణించెను. వారును మరణించవలెను; ఆయన లేచెను, వారును లేవవలెను; ఆయన సజీవుడుగా మోక్షారోహణమాయెను. వారును సజీవులుగా మోక్షరోహణము కావలెను, ఇదే ఆయనను కడవరి వరకు వెంబడించుటయైయుండును.
అది ఆ శిష్యులయొక్క వరుసలో వచ్చిన, నేటి క్రైస్తవ భక్తుల సంఘమునకు సంబంధించిన ఆరోహణ పథము, గనుక ఇప్పుడు రేపోమాపో రానైయున్న యేసుప్రభువు మేఘములో ఉండగా, భూమిమీద ఉన్న సజీవులు శరీరముతోనే అనగా మరణములేనివారై మారిన శరీరముతో ఆరోహణము కావలెను. తత్పూర్వమే మృతులైనవారు యేసుప్రభువు లేచినట్టు లేవవలెను. ఆ దినము యొక్క వర్ణన ఏ కవీశ్వరునకు చేతనగును? చదువరులారా! రేపు ఆయన రానైయున్న రాకడలో పాల్గొనుటకు మీరు సిద్ధపడరా! అనునదినము మీ మనస్సులో ప్రార్ధించుకొన్న యెడల సిద్ధపడగలరు. ఈ మాట అన్ని మతములవారికిని అన్వయింప జేయుచున్నాము.