క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఈష్టరు పండుగ...
  5. పునరుత్ధాన బలం

పునరుత్ధాన బలం

సర్వ ప్రపంచ చరిత్రలో అద్భుతకరమైన సంగతి ఏమనగా ‘క్రైస్తవులు క్రీస్తుప్రభువు యొక్క పునరుత్థానమును తలంచుట . ‘కొంతకాలము తరువాత సంఘముయొక్క పునరుత్థానము జరుగును. ప్రభువుయొక్క పునరుత్థానము లేని యెడల సంఘముయొక్క పునరుత్థానము కూడ లేదు. ఈ దినము ప్రభువుయొక్క కష్టములు, శ్రమలే గాక విజయ పునరుత్థానమును కూడ తలంచవలెను. ప్రభువు సిలువ మీద నున్నప్పుడు ముండ్ల కిరీటము, మేకులు, రక్తము కారుట మొదలగునవి ఉన్నవి. కొండమీద సిలువ వేసిన వారు ఉన్నారుసైతాను ఉన్నది. బహిరంగముగ కనబడుచున్న ముండ్ల కిరీటము, మేకులు, రక్తప్రవాహము చూచి భక్తులయొక్క విశ్వాసము, భక్తి పోయినవి గనుక వారు చెదిరిపోయిరి. సాతాను, దుర్జనులు, భక్తులు కూడ ఈ పైకి కనబడు వాటినే చూచిరి. అయితే ఆదివారము నీతి సూర్యుడు ఉదయించునని భక్తులు కూడ మరచిపోయిరి. యేసుప్రభువుయొక్క దృష్టిలోను, తండ్రి, పరిశుద్ధాత్మల దృష్టిలోను, ఆదివారము ఉదయమున ధరించబోవు కిరీటము కనబడుచున్నది. ప్రభువు తనకు రాబోవు మహిమ కిరీటము కనబడుచున్నది. ప్రభువు తలవాల్చునట్లు చేసినది ముండ్ల కిరీటము, అయితే మహిమ కిరీటము, ఆయన తల యెత్తునట్లు చేసి జయమిచ్చినది. శిష్యులు ఈ సంగతి మరచిపోయిరి. ఈ కిరీటము వచ్చునని సాతానుకు, దుర్జనులకు ఏమి తెలియును? వారికి బహిరంగ రక్తము మాత్రము కనబడుచున్నది. ప్రభువు తనకు రాబోవు మహిమ కిరీటము వైపు చూచి, ముండ్ల కిరీటమును సంతోషముతో భరించెను. శుక్రవారము బహిరంగముగా కనబడు కిరీటము గాక, ఆదివారము మహిమ కిరీటము వచ్చుననుటయే పునరుత్థాన వర్తమానము. క్రైస్తవులు పైకి కనబడు శ్రమలను చూచి నిరాశపడుదురు.

యేసుప్రభువు యొక్క జీవిత వృత్తామతమును బట్టి, మన జీవిత వృత్తాంతములను సరిచేసికొనవలెను. కష్టములు కలిగినప్పుడు నిరాశపడక వాటి తరువాత వచ్చు మహిమను మరువరాదు. లక్ష్మివారము దుర్జనులు ప్రభువుయొక్క చేతులు కట్టివేసిరి. సాతానుయొక్క ప్రశ్న – ‘ఈయన చేతులు మేకులతో బంధించినాను. గనుక ఇప్పుడు ఈయన పిల్లలను ఎట్లు దీవించగలడు? అయిదు వేల మందికి ఆహారము ఎట్లివ్వగలడు? ప్రయాసపడి భారము మోయువారలారా! రండి’ అని ఎట్లు పిలువగలడు? అయితే అంతరంగముగా ఆయన చేతులు చాపి అందరిని పిలుచుచూ దీవించుచున్నాడు. ఇది సాతానుకు, దుర్జనులకు తెలియదు. మేకులు కొట్టిన సంగతి మాత్రమే వారికి తెలియును, అలాగే విశ్వాసి తన యొక్క విశ్వాస జీవితములె కూడ అనేక కష్టములు, శోధనలు ఉండుట వలన సేవ చేయలేక పోవుచున్నానని తలంచవచ్చును. గాని అంతరంగముగా ప్రభువు ఆ విశ్వాసిని తెలియని రీతిగా ఆదరించి, బలపరచి తన సేవ చేయించుకొనును. ఇది సైతానుకు తెలియదు. ప్రభువుయొక్క చేతులు మేకులతో బంధించబడినప్పుడు, మరియొక రీతిగా అందరిని దీవించి, కౌగలించినట్లుగా నున్నది. అందరిని పిలుచుచున్నట్లుగా నున్నది. బహిరంగముగా కలుగు ఈ శోధనలు, శ్రమలు, కష్టములు మొదలగు విషయములలో, ప్రభువును బట్టి చింతలేకున్న యెడల ప్రభువు పని ఎక్కువగా జరుగును. గనుక విశ్వాసి తన విశ్వాస జీవితములో ప్రభువును అంతరంగముగా ఎరిగియుండవలెను. మనము ప్రభువును బట్టియే ఇతరులను దివించగలము. పౌలు బంధింపబడి కీర్తనలు పాడుచుండగా, తలుపులు తెరువబడ లేదా! విశ్వాసులు కూడ తమ చేతులతో ఏమి చేయలేరో అదే ప్రభువును బట్టి తప్పక చేయగలరు. యేసు ప్రభువుయొక్క దేహముపై మన పాపములు మేకులతో బంధింపబడెను. అపుడు సాతాను ప్రశ్న – ‘ఇప్పుడు పాపులతో, సుంకరులతో కలసి ఎట్లు భోజనము చేయగలవు? ఆ ప్రాంతము, ఈ ప్రాంతము ఎట్లు సంచరించగలవు? దేవాలయములలో, సంత వీధులలో ఎట్లు తిరుగ గలవు? అయితే ప్రభువు 33 1|2 సంవత్సరములు యేయే గ్రామములలో ఉండవలెననిన అక్కడే ఉండువాడు. మరొక చోటికి వెళ్ళవలెననిన వెళ్ళేవాడు. పునరుత్థానము తరువాత ఎక్కడికిబడితే అక్కడికి వెళ్ళగలిగెను. సమాధి ఉన్న తోట ఎక్కడ? గలిలయ ఎక్కడ! శరీరము విదల్చుకొని వచ్చి పనిచేసెను. రేపు వెయ్యేండ్ల పాలనలో పెండ్లికుమార్తెకు ఇట్టి శక్తి వచ్చును. అదే పునరుత్థాన బలము. అన్ని దేశములకు వెళ్ళి సువార్త చెప్పగలరు. గనుక శ్రమలకు భయపడక పునరుత్థాన బలమును బట్టి ధెర్యముగా నున్నయెడల, ప్రభువు పెండ్లుకుమార్తె ద్వారా గొప్పసేవ చేయించును.

యేసుప్రభువు ప్రక్కలో పొడువగానే రక్తము, నీరు కారెను. సాతాను యొక్క సంతోషము – ప్రభువును పొడిచినాను అనునది. ఆయన మానవుల నందరిని తన ప్రక్కలోనికి తీసికొనుటకే నరావతారిగా వచ్చెను. పునరుత్థాన బలము వలన ఆయన అందరిని ఆకర్షించుకొనును. దేవుని మీద విసుగుకున్నయెడల ఆయన ప్రక్కలో నుండలేరు. దేవుని దూషించినయెడల ఆయన ప్రక్కలో నుండలేరు. విశ్వాసులు శ్రమలను చూచి చెదిరిపోయిరి గాని పునరుత్థానము తరువాత తిరిగి ఆకర్షింపబడిరి. విశ్వాసులు ప్రభువునకు దూరమైనప్పుడు ఆయనే వారిని దగ్గరకు, చేర్చుకొనును. పునరుత్థాన బలము వలన ఆయన విశ్వాసిని ఆకర్షించునుపైకి బల్లెపు పోటు కనబడుచున్నది. కాని అట్టిస్థితి అందరిని ఆకర్షించునని ఎవరికిని తెలియలేదు. ఈష్టరు పండుగ వర్తమానము లెక్కలేనితనము. శుక్రవారము బంధింపబడుట. గాయములు పైకే గాని, వాటినన్నింటిని జయించెను అన్నిటి పైన ప్రభువుండి వాటన్నిటిని త్రొక్కివేసినాడు. ఇదే పునరుత్థాన వర్తమానము. శిరస్సు మొదలు పాదముల వరకు ఉన్న వాటినన్నిటిని ప్రభువు లెక్క లేకుండ త్రొక్కివేసినాడు. క్రైస్తవులు జన్మము మొదలు మరణము వరకు, శిరస్సు మొదలు పాదముల వరకు ఉన్న శ్రమలన్నిటిని త్రొక్కివేయవలెను. ప్రభువు అన్నిటిని త్రొక్కి బయటికి వచ్చెను. క్రైస్తవులు కూడ అన్నింటిని త్రొక్కి బయటికి రావలెను. ఎవరు అట్లు చేయుదురో వారే పునరుత్థాన బలము పొందినవారు.

ఆయన సమాధి చేయబడెను. సమాధి ద్వారము దగ్గర రాయి ఉన్నది. ముద్ర ఉన్నది. కావలివారు ఉన్నారు. ప్రభువు లేచి ఉన్నప్పుడు అవన్ని అడ్డువచ్చెనా? పునరుత్థాన బలము యెదుట అవి నిలువలేక పోయెను. మరణము ఆయనను చంపి ఉంచక ఆయనను బ్రతుకనిచ్చెను. మరణమునకు చంపుటకు, బలమున్నది కాని, లేవదీయుటకు దానికి బలము లేదు. ప్రభువు వాటినన్నింటిని జయించెను. అన్ని శోధనలలో ప్రభువు తట్టు ఆకర్షింపబడు దీవెన పునరుత్థాన బలము వలన మీకు కలుగును గాక!

Please follow and like us:

How can we help?

Leave a Reply