క్రైస్తవులు ప్రతి యేట క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన స్మరణ చేయుటకై ఈ పండుగను ఏర్పాటు చేసిరి. దైవావతార వ్యక్తియగు క్రీస్తుప్రభువు ఈ లోకములో నున్నప్పుడు సాతానును, దయ్యములను, పాపములను, వ్యాధులను, అవమానములను, శతృత్వమును, అన్యాయపు తీర్పును, శరీర బాధను, మరణమును జయించి మూడవ దినమున లేచి శిష్యులకు కనబడిన గొప్ప వృత్తాంతము తలంచుకొనుచు విశ్వాసులు ఈ పండుగను ఆచరించుచున్నారు. క్రీస్తుప్రభువు లోకమును రక్షించుటకు వచ్చి చనిపోయిన దినమున శత్రువులు చూచి ఆయన దేవుడని చెప్పుకొన్న్నమాట వట్టిదని తలంచి ఆనందించిరి. మిత్రు లాయనను పాతిపెట్టిరి.
బంటులు సమాధి మీద పెద్దరాయివేసి ముద్రించిరి. సమాధిచుట్టు కావలి యుండిరి. మూడవనాటి ఉదయమున ఆయన లేచినపుడు సైతాను ఆయనను వశపరచుకొనలేకపోయెను. మరణము ఆయనను పట్టియుంచలేకపోయెను. సమాధి ఆయనను అణచిపెట్టలేకపోయెను. ముద్రరాయి ఆయనకు అడ్డము లేకపోయెను. కావలివారు ఆయనను బంధింపలేకపోయిరి. గనుక పైన చెప్పిన అన్నిటిని ఆయన జయించెను. ఈ జయము మన నిమిత్తమే. కాబట్టి నమ్మిన వారికి ఆ జయము ఉత్సాహదాయకము.
ఆయన ఆ సమాధిలోనే ఉండిపోయిన యెడల లోకజనమును రక్షింపలేడుగదా? ఆయన ఇష్టపడి స్వయముగా మరణము మొదలైనవాటికి తాత్కాలికముగా స్వాధీనమైనందున వాటియంతము అప్పటికి నెరవేరెను. ఇప్పుడో? ఆయనను అవి యేమియు చేయలేకపోయెను. మనమైతే వాటిలో దేనినైనను జయింపలేకపోదుముగదా? మరణము పొందకముందు సహింపువలన ఆయన జయము పొందెను ఇప్పుడు పునర్జీవితుడైనందువలన జయము పొందెను. ఈ రెండు విధములైన జయము ఆయన మనకొరకే సంపాదించెను. విశ్వాసులకును విజయము, సహనము అనుపాఠములు నేర్పునట్టి శ్రమలు ఎన్ని కలిగినను తుదకు అన్నిటిలో క్రీస్తు జయములను బట్టి వారికి జయము కలుగును.
మీకందరకును ఈస్టరు పండుగ విజయానందము కలుగును గాక!