షరా:- వీటిని ఒక్కొకరికి ఇచ్చి చక్కగా చదివించవలెను.లేదాకంఠత చేసి చెప్పించవలెను.
1. బాలుడు:- ఈష్టరు పండుగ అనే పునరుత్థాన మహోత్సవ వాస్తవ్వులారా! నేడు ప్రభువు లేచినందువల్ల క్రైస్తవ సంఘమునకు వచ్చిన భాగ్యము మీకును కలుగును గాక! మా బాల సమాజము వారు మనకు రెండు సంగతులు జ్ఞాపకము చేయుదురు. అవి ఏవనగా మొదటిది అవిశ్వాసపు మాటలు, రెండవది జయ సూచన పలుకులు. ఈ రెండు పలుకులు ఈష్టరు కాలమందు వినబడి పలుకులు. వీరు మనకు వాటిని జ్ఞాపకము చేస్తారు.
అవిశ్వాసపు పలుకుల సమాజము:-
2. బాలుడు:- నేను సమాధి యొద్దకు వెళ్ళుచున్న స్త్రీల ప్రతినిధినై యున్నాను. వారు పలికిన దేమనగా – సమాధి ద్వారము నుండి మన కోసరము ఆ రాయి ఎవడు పొర్లించును?
3. బాలుడు:- నేను మగ్ధలేనే మరియ యొక్క ప్రతినిధినై యున్నాను. ఆమె పలికినదేమనగా – ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగము.
4. బాలుడు:- నేను కూడ మగ్ధలేనే మరియ యొక్క ప్రతినిధినై యున్నాను. ఆమె ఇంకను పలికినదేమనగా – అయ్యా నీవు ఆయనను మోసికొని పోయిన యెడల ఆయన నెక్కడ నుంచితివో నాతో చెప్పుము. నేను ఆయన నెత్తికొని పోవుదును.
5. బాలుడు:- నేను క్లెయొప అను శిష్యుని యొక్క ప్రతినిధినై యున్నాను. ఆయన మాటలేమనగా – యెరూషలేములో బసచేయుచుండిన ఈ దినములలో జరిగిన సంగతులు నీవొక్కడవే యెరుగవా?
6. బాలుడు:- నేను బాటసారుల ప్రతినిధినై యున్నాను. వారు అన్నమాట లేవనగా – ఆయన దేవుని యెదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియలోను, వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను మన ప్రధాన యాజకులును, అధికారులును ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి ఆయనను సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదియు గాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్న్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడనున్న వారిలో కొందరు సమాధియొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదు.
జయసూచన పలుకుల సమాజము:-
- బాలుడు:- నేను దేవదూతయొక్క ప్రతినిధినై యున్నాను. ఆయన చెప్పినదేమంటే – మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన మనుష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని.
- బాలుడు:- నేను పరలోకము నుండి వచ్చిన ఇద్దరి యొక్క ప్రతినిధినై యున్నాను. వారు పలికినదేమంటే -సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి యున్నాడు. ఆయన ఇంకనూ గలిలయలో నున్నప్పుడు మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, శిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి.
- బాలుడు:- నేను ప్రభువు యొక్క ప్రతినిధినై యున్నాను, ఆయన పలికినదేమనగా – మరియా! నేనింక తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము.
- బాలుడు:- నేనుకూడ ప్రభువుయొక్క ప్రతినిధినై యున్నాను. ఆయన ఇంకను పలికినదేమనగా – మీకు శుభము. భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి.
- బాలుడు :- నేను మగ్ధలేనే మరియ యొక్క ప్రతినిధినై యున్నాను. ఆమె ‘నేను ప్రభువును చూచితిని ‘ అని పలికెను.
- బాలుడు – నేను బాటసారులతో మాట్లడిన ప్రభువు యొక్క ప్రతినిధినై యున్నాను. ఆయన చెప్పినదేమంటే – అవివేకులారా! ప్రవక్తలు చెప్పిన మాటలన్నియు నమ్మని మందమతులారా! క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా?
- బాలుడు:- నేను ఇంటిలోనున్న బాటసారుల ప్రతినిధినైయున్నాను. వారు చెప్పుకొన్నదేమంటే – ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?