మత్తయి 28:1-10;మార్కు 16:1-13; లూకా 24:1-12; యోహాను 20:1-18;
ప్రభువుయొక్క జీవిత కాలములో చేసిన ప్రతి కార్యమునకు పండుగ చేయవలసినదే, హృదయములో ఆయన చేసిన ప్రతి కార్యము విషయమై కృతజ్ఞత కలిగియున్న యెడల పండుగ చేసినట్లే. మొన్న శుక్ర వారము, నిన్న శని వారము, ఈ దినము ఆదివారము. ఈ మూడు రోజులు మూడు కాలములు. మనము పుట్టినదినము మొదలు చనిపోవు వరకు ఒక కాలము, చనిపోయి సమాధిలో నుండుట రెండవ కాలము, తర్వాత ప్రభువు మనలను సమాధులలో నుండి లేపు కాలము మూడవ కాలము. బైబిలులో కాలమునకు దినము అను పేరున్నది. దానికి అర్ధము కూడ ఉన్నది. ఈ మూడు కాలములు మూడు దినములు. ఒకటవ కాలము శుక్ర వారమని చెప్పవలెను. ఈ కాలములో అన్ని శ్రమలే, ఈ శ్రమలు నూరేండ్ల వరకు ఉండవచ్చును. ప్రభువునకు ఈ దినము శ్రమలు. శనివారము రెండవ కాలము. సమాధిలో ఎక్కువ కాలముండ వచ్చును. ఈ కాలమునిండ నిద్ర గలదు. అనగా క్రీస్తుప్రభువు సమాధిలో నుండుట. మూడవ కాలము ఆదివారము అనగా లేచేరోజు. పై రెండు కాలములలో ఎక్కువ దినములు ఉండును గాని సమాధిలోనుండి లేచు కాలము ఒక్కదినము మాత్రమే, ఒకటవ రోజును పెద్దలు మంచి శుక్ర వారమన్నారు. రెండవ రోజు సమాధి గనుక శని వారమన్నారు. మూడవ దినము అనగా ఆది వారమున లేచెను గనుక ఈస్టరు అన్నారు. అవి యేసుప్రభువునకు, గాని మనకైతే పై మూడు కాలములు శుక్ర, శని, ఆది వారములు. మనలో కొందరు ప్రభువుయొక్క రాకడలో చావు లేకుండ వెళ్ళువారికి రెండవ కాలము అనగా శని వారము ఉండదు. క్రీస్తుప్రభువు ఏలాగు శ్రమలుపడి చనిపోయినారో ఆలాగే భక్తులు కూడ శ్రమపడి చనిపోవుదురు. ప్రభువు సమాధిలో నున్నట్లు భక్తులు కూడ సమాధిలో నుందురు. యేసుప్రభువు లేచినట్లు భక్తులు కూడ లేస్తారు. చనిపోయిన భక్తులకు శుక్ర వారము అయిపోయెను అనగా శ్రమలు ముగిసెను. ఇప్పుడు శని వారములో వారున్నారు అనగా నిద్రలో, సమాధిలో నున్నారు, రేపు క్రీస్తుప్రభువు వచ్చినప్పుడు ఈస్టరు అగును. కాబట్టి ప్రభువు మూడవ దినమందు లేచినట్లు భక్తులు కూడ మూడవ దినమందు, లేక మూడవ కాలమందు లేస్తారు. అయితే బ్రతికియున్న భక్తులు ఎత్తబడుదురు. ఈస్టరు పండుగ వలన మనము నేర్చుకొనవలసిన విషయములు చెప్పునప్పుడు ప్రభువుయొక్కయు లేక మన యొక్కయు, లేక భక్తుల యొక్కయు శుక్ర, శని, ఆదివారములు జ్ఞాపక ముంచుకొనవలెను.
(1) ప్రభువు సిలువ మీద నున్నప్పుడు నిన్ను నీవు రక్షించుకొనుము. నిజముగా దేవుని కుమారుడవైతే సిలువనుండి దిగిరమ్ము అని అపహాస్యము చేసినారు. ఆయన దిగి వచ్చిన యెడల అద్భుతమే కాని, ఆయన ఆలాగు చేయలేదు. ఆది వారమున ఆయన సమాధిలోనుండి లేచి వారనుకొన్న దానికన్న గొప్ప అద్భుతము, పెద్ద అద్భుతము చేసెను. మనిషి అడిగినదానికన్న ప్రభువు ఇంకా ఎక్కువ చేసెను. ఆదివారమున జరిగే గొప్ప అద్భుతమును వారెరుగరు. భక్తులే ఎరుగలేదు. గనుక ప్రభువుయొక్క జీవితమంతయు మరుగే. మనము పరలోకములో అనుకొనని సంగతులు చూస్తాము, వింటాము. ఇక్కడ అనుకొన్న అద్భుతము కంటే అక్కడ ఎక్కువ పొందుదుము. (2) శుక్రవారమునాడు ఆయనకెన్ని శ్రమలున్నను, అంతకు పూర్వము 33 సంవత్సరములలో ఎన్ని శ్రమలున్నను, (మేకులతో గ్రుచ్చిన, బల్లెపు పోటున్న, పగ, శ్రమ, అపహాస్యమున్న, సైతాను ఉన్న, దయ్యము, పాపము, జబ్బు, కోర్టులు, చావు, సమాధి వంటివి) లెక్కచేయనని మనసులో అనుకొన్నాడు. ఎందుకనగా మూడవ దినమున లేస్తాను, ఇవన్నియు ఆయనను ఆటంక పరచవని చెప్పెను. సంసోనుకు పగ్గాలున్నను, జడలన్నీ మేకులతో దింపిన లెక్కలేదు. ఎందుకనగా అన్నిటిని తెంపివేయగలడు. క్రైస్తవ భక్తులు కూడ ఆలాగే లెక్కచేయరు. ఎందుకనగా లేస్తారు. వారు లేవకుండ ఏ శ్రమలు వారిని ఆటంకపరచలేవు. అందుకనే “రాబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కావని” పౌలు వ్రాసెను. ప్రభువు చనిపోయెను, సమాధి చేయబడెను, ముద్ర వేయబడెను. కావలివారు ఉన్నారు. ఆయన లేచినప్పుడు ఈ ఆటంకములన్ని పరుగెత్తెను. ఆయనను ఏవియు ఆపలేదు. మా ప్రభువునకు శుక్ర వారము నాడు ఎన్ని శ్రమలు ఉన్ననూ ఏలాగున 3వ దినమున లేచినాడో ఆలాగే మేముకూడా లేస్తాము అను లెక్కలేని తనము భక్తులు కలిగియుందురు. (3) యేసుప్రభువు పుట్టినది మొదలుకొని సమాధికి వెళ్ళువరకు పై శ్రమల జాబితా ఆయనను తిప్పలు పెట్టినవి, బాధించినవి. అయితే మూడవ దినమున ఆయన లేచిన తర్వాత అవి దగ్గరకు రాలేదు. ఎందుకనగా ఆ శరీరము వేరు, లేచిన తర్వాత శరీరము వేరు. ఇది మహిమ శరీరము గనుక ఏవియును ఆయనను బాధపెట్టలేవు. ఏవియు గ్రుచ్చుకొనలేవు, సమాధి నోరు ఆవులించలేదు, రాయి అడ్డము రాదు, ఏ బంటు కాపు కాయలేడు. ఈ మహిమ శరీరము దగ్గరకు వచ్చుటకు వాటికి సాధ్యము కాదు. ప్రభువు శ్రమలన్నిటిని జయించెను గనుక మహిమ శరీరము వచ్చెను. జయించక పోయిన మహిమ శరీరములేదు. మహిమ శరీరముతో వచ్చినప్పుడు పై జాబితా అంతా ఉన్నవి గాని ఆయనను ఏమి చేయలేవు. ఆలాగే భక్తులయొక్క మానవ శరీరము దగ్గరకు అవన్ని రాగలవు. గాని మహిమ శరీరముతో లేచినప్పుడు అవి రాలేవు. ఇవన్ని వారిని శోధించుటకు సందులేదు, శోధన కలుగనే కలుగదు. ఎందుకనగా అది మహిమ శరీర దేహము, మహిమ శరీరమును ఎంత భక్తులైన ముట్టుకొనలేరు, అందుచేతనే తోటలో ముట్టవద్దని చెప్పెను. గెత్సెమనే తోటలో యూదా ముద్దు పెట్టుకొనెను, గాని ఈ మహిమ శరీరమును ముద్దుపెట్టుకొనలేడు. అట్లుచేయుటకు సందు లేదు. పిశాచి ఇప్పుడు మనలను శోధించుటకు సందున్నదా? శోధించుట, పడవేయుట రెండు కథలున్నవి. శోధించ గలడు గాని పడవేయలేడు. కొందరిని శోధించగలడు. పడవేయగలడు. మనము సందివ్వకపోయినను సాతాను ఇప్పుడు మనలను శోధించగలడు, గాని పడవేయలేడు. మనము సందు ఇస్తే శోధించగలడు. పడవేయగలడు. మన జీవిత కాలములో వాడికి సందిచ్చిన పడిపోతాము. ఇవ్వకపోయిన పడము. మొదటి సందు ఆక్రమించుకొనును, తర్వాత పడవేయును. యేసు ప్రభువు 33 1|2 సంవత్సరములు సాతానుకు సందివ్వలేదు, మనముకూడ ఇవ్వకూడదు. శోధించుటకు దానికి సెలవిచ్చెను గాని పడవేయుటకు సందివ్వలేదు. ఇప్పుడు ప్రభువు లేచెను, అన్నిటిని జయించెను. ఇవన్ని నమ్మిన యెడల పునరుత్థాన బలము వచ్చును. ఆ బలము సైతానుకు సందివ్వని బలము, సందేహమునకు వీలులేని బలము. క్రీస్తుప్రభువుయొక్క పునరుత్థాన బలము వలన మనకు అట్టి శక్తి కలుగును. ఆయన పునత్థానమును, బలమును, జయమును నమ్ముట వలన సైతానుకు సందు ఉండదు. సందేహమునకు వీలుండదు. ఆయన లేచుట వల్ల పై జాబితా అంతటిని దులిపివేసెను. అంతవరకు అన్నిటిని తనను వెంటాడనిచ్చెను. (సైతానును, దయ్యములను మొ||) అన్నిటిని రానిచ్చి ఒక్క దులుపు దులిపివేసెను. ఇదే ఈస్టరు నవ్వు!!!రేపు మనము కూడ శోధనలు వచ్చిన దులిపి వేయవలెను. అవి రాకమానవు, వాటికి వచ్చుటకు సెలవున్నది. ప్రభువు దులిపి వేసినట్టు మనమును దులిపివేయవలెను. సాతానా పొమ్ము అని దానిని దులిపివేసెను. శుక్రవారము శ్రమపడి, ఆది వారము దులిపివేసెను. తర్వాత దులిపివేయనక్కరలేదు. మనముకూడ పునరుత్థానమందు అన్ని పూర్తిగా దులిపివేయుదుము. నేను నా పునరుత్థానము వల్ల అన్ని కీడులను ఏలాగు దులిపి వేసినావో మీరును ఆలాగు చేయండి అనునది ప్రభువు మన కిచ్చిన వర్తమానము, నా ఈస్టరును బట్టి మీ ఈస్టరు అని ఆయన చెప్పుచున్నాడు. నా దులిపి వేతే, మీ దులిపివేత. ప్రార్ధన: ఓ ప్రభువా ఈ వేళ కూడ మాకు నీ పునరుత్థాన బలము దయచేయుము. ఈ ప్రార్ధన ప్రతి ఉదయమున మంచమునుండి దిగకముందు చేయవలెను.
రోగులకు వర్తమానము: సమాధి నుండి లేచు శక్తి ఉన్న యేసుప్రభువునకు మీ జబ్బులు బాగుచేయు శక్తి లేదా? మూడు దినములుండి మురిగిపోవలసిన దానికిబదులు లేచివచ్చిన యేసుప్రభువునకు మీ జబ్బు పోగొట్టగల శక్తి లేదా? ఆయనయొక్క అయిదు గాయములు, రక్తము కారిన గాయములు ఏ మందువలన మానిపోయెను? ఆయన గాయములు ఎవరు కడిగి కట్టినారు? ఆది వారము ఆ గాయములు లేవు, ఎవరూ ఆయనకు కట్టు కట్టలేదు.
ఇవి నమ్మగలిగిన వింత, లేకపోయిన సంత!
(వింత = అద్భుతము. సంత= గందర గోళము)
ప్రభువు యొక్క మరణ పునరుత్థానములను బట్టి (1) విశ్వాసులుగా చనిపోయిన యెడల మరణ భయము లేదు. సమాధి భయము లేదు. (2) సజీవుల గుంపు అయిన యెడల వాటి తలంపు అసలే లేదు. ప్రభువా! మమ్మును సజీవుల గుంపునకు తయారు చేయుము అని ప్రార్ధింప వచ్చును గాని పాపము విడచిపెట్టకుండ చేయకూడదు. అట్లుచేసిన యెడల ప్రభువును వేళాకోళము చేసినట్టు. పాపములో నున్న అట్టిప్రార్ధన చేయకూడదు, ఆలాగు చేయుట శాపము తెచ్చుకొన్నట్లు, చిన్న పాపము ఉన్ననూ ఆ ప్రార్ధన చేయకూడదు, ఆలాగు చేస్తే ఈత ముల్లుతో మనము గ్రుచ్చుకొనుచు ప్రభువా గ్రుచ్చుకొనకుండ చేయి అన్నట్లుండును. ఒకవేళ ఆ సమయానికి పాపము మానివేయుదును అంటే అది ఇంకా ఎక్కువ శాపము. (1) నా బదులు సమాధిలోకి వెళ్ళినాడు గనుక నాకు సమాధి లేదని సజీవుల గుంపువారు అందురు. (2) ప్రభువు సమాధిలో నున్నాడు గనుక నేను సమధికి పోవుటకు భయపడను. ఇది మృతుల గుంపు యొక్క మాట.
(“జనక సుతాత్మలకు నేడు-శాశ్వతంబు జయము జయము” రక్షకా)
ప్రభువా! మాలో ఎవరు సజీవుల గుంపునకు తయారు కాగలరో, ఎవరు మృతుల గుంపునకు తయారు కాగలరో నీకు తెలుసును. గనుక నీవే రెండు గుంపుల వారిని తయారు చేయుము. మృతుల గుంపులోని వారికి మరణ భయము, సమాధి భయము లేకుండ చేయుము. ఆమెన్.