క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. కానుకల పండుగ...
  5. కానుకల పండుగ -2

కానుకల పండుగ -2

 (ఆది 4:3-10; మత్తయి 23:35; హెబ్రీ 11:4; 12:24; 1యోహాను 3:12.) 

కానుకల పండుగ దినమున, మొదటి కానుక ఇచ్చిన హేబెలు యొక్క చరిత్ర తెలిసికొనుట మంచిది. ఆయన కానుక రెండుభాగములు. 1. ఆయనయే అనగా హేబెలు,. 2. అతని అర్పణ, ప్రభువు హేబెలును లక్ష్యపెట్టెను. అతని అర్పణను కూడ లక్ష్యపెట్టెను. ప్రభువు హేబెలు యెడల గౌరవము చూపెను. అదే లక్ష్యపెట్టుట. అతని అర్పణను కూడ గౌరవముతో చూసెను. హేబెలు చరిత్ర వాక్యమునకు సంబంధించి చూడవలెను.

(1) హేబెలులో విశ్వాసమున్నది అని వ్రాయబడి యున్నది. అతడు నీతిమంతుడని వ్రాయబడి యున్నది. ఇంకను అతనికి నీతిగల క్రియలు గలవని వ్రాయబడెను. విశ్వాసము గలవాడు. నీతి గలవాడు. నీతిక్రియలు గలవాడు. అతడు మృతిపొందినను విశ్వాసమునుబట్టి మాట్లాడుచున్నాడు.. అనగా సజీవుడై యున్నాడని వ్రాయబడెను (హెబ్రీ11:4) మరియు దేవుడే అతనిని గూర్చి సాక్ష్య మిచ్చెను. మరియు హేబెలు తన విశ్వాసమును గూర్చి తానే సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ కథ చదువువారలారా! వినువారలారా! నేను విశ్వాసముగలిగి యున్నట్లు మీరును కలిగియుండుడి అని వ్రాత ద్వారా హేబెలు చెప్పుచున్నాడు. తర్వాత దేవుడు అతనిని గురించి సాక్ష్యమిచ్చెనని గలదు. అనగా దేవుడు హేబెలును, అతని అర్పణను మెచ్చుకొనుట వల్ల సాక్ష్యమిచ్చెను. ఏమని? హేబెలు మంచివాడే, అతని అర్పణ మంచిదే. అదే దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యము. పౌలు హెబ్రీ పత్రికలో విశ్వాసుల జాబితా వ్రాసి, ఒక విశ్వాసి తన విశ్వాసమును బట్టి ఏమి పని చేసినది, ఇంకొకరు ఏ మంచి క్రియ వారి విశ్వాసము ద్వారా చేసినది, కొంతవరకు వ్రాసెను. తర్వాత ఇంకేమి చెప్పెను, ఇంకా చాలమంది గలరు. వారందరిని గురించి చెప్పిన యెడల సమయము చాలదని చెప్పి ముగించెను.

ఆ జాబితాలో హేబెలు మొదటి విశ్వాసి. హేబెలే మొదట అర్పణ తెచ్చిన విశ్వాసి. హేబెలే విశ్వాసము ద్వారా మంచి క్రియలు చేసిన మొదటి విశ్వాసి, అ మంచి క్రియలకే నీతిక్రియలని పేరు. యోహాను పత్రికలో కూడ నున్న హేబెలుయొక్క బిరుదులు:- విశ్వాసి, నీతిపరుడు, సత్క్రియాపరుడు, నీతిమంతుడైన సజీవుడు, నేటి వరకు మాట్లాడువాడు, మొట్టమొదట దేవుని వలన లక్ష్యపెట్టబడినవాడు. మొదట దేవుడు లక్ష్యపెట్టు అర్పణ ఇచ్చినవాడు. మొట్టమొదట తన నీతి నిమిత్తము తరువాత మంచి కానుక ఇచ్చినందునవలనను హతుడైనవాడు, హతసాక్షి అయినవాడు, మొదటి హతసాక్షి హెబెలే. హెబ్రీపత్రికలోను, 1యోహాను పత్రికలోను, సువార్తలలోను హేబెలును గురించియు ఉన్న చరిత్ర వ్రాసి, దానిని ఆది 4అ.నకు అతికించిన అప్పుడు హేబెలుయొక్క సంపూర్ణ చరిత్ర తెలియును. ఎన్ని సద్గుణములు గలవాడో! ఇది హేబెలు చరిత్ర. .  

(2) హేబెలు యొక్క అర్పణ చరిత్రయేమి? మందలోని గొర్రెలలో మొదట పుట్టిన గొర్రెపిల్లను తెచ్చెను. ఇది ప్రధమ ఫలముల పండుగను జ్ఞాపకము చేయును. దీనినే తరువాత యూదులు ఆచరించిరి. తొలిచూలిగా పుట్టిన గొర్రెపిల్లనిచ్చి ప్రధమ ఫలముల పండుగను ఆచరించెను. ఇప్పుడు మనము సంఘములో ప్రధమ ఫలముల పండుగ చేయుచున్నాము. హేబెలు మొదటి దానిని దేవుని కప్పగించెను. మరియు అది శ్రేష్టమైన అర్పణ అని బైబిలులోనే గలదు. ప్రధమ ఫలముల పండుగ అను పేరు తర్వాత వచ్చినది. గాని ముందుగానే హేబెలు అంతరంగములో ఆ ఉద్దేశము గలదు. మనము హేబెలువంటి వారమై యుండవలెను. ఆయనకున్న గుణములు కలిగి యుండవలెను.

(3) ఆయనయొక్క ఆఖరు లక్షణమేది? అది వ్రాయబడలేదు. ఆయనను గురించి యున్న వాక్యములన్నియు ఆలోచించగా ‘కానుక ‘ అర్పించుట అని తోచినది. ఆ గుణము ఎక్కడనుండి వచ్చినది? హేబెలూ! నీవు మందలోని గొర్రెపిల్లను దేవునికి అర్పణగా తీసికొని వెళ్ళు అని ఎవరు చెప్పినారు. కానుక తీసికొని వెళ్ళుట. అదియు శ్రేష్టమైనది ఇవ్వవలెననునది. హేబెలుయొక్క స్వంత ఆలోచనయై యున్నది. మంద స్వంత మంద, ఆలోచన స్వంత ఆలోచన, తొలిచూలిని ఏరడము స్వంతము. అర్పణ ఇవ్వడముకూడ స్వంత ఆలోచన, నీతిగా ఉండుట అనేది స్వంతము. నీతిక్రియలు చేయడము స్వంతము. విశ్వాసము కలిగియుండుటకూడ స్వంతము: ఇవన్ని స్వంతమే. మనము కూడ మన స్వంత సొమ్ము అయినా, పనలు అయినా, కూరగాయలు అయినా మనకు స్వంతముగా ఆలోచన పుట్టినది తెచ్చిన యెడల, మన స్వంత కానుక అగును. స్వభావ సిద్ధముగా మనలో పుట్టినది తెచ్చిన యెడల హేబెలు కానుక వంటి దగును. మనలో ఎందరు ఇట్టి కానుక తెచ్చితిమని చెప్పగలరు? స్వంత బుద్ధికి తోచినది, స్వంత భక్తికి స్వంత జ్ఞానమునకు, స్వంత మనస్సాక్షికి, తోచినది తెచ్చిన వారు ఎందరు గలరు? హేబెలు అట్లు తెచ్చుటకు కారణమేమి? తెలుగుమాట ఒకటి గలదు. “ఇంగిత జ్ఞానము ” అదే హేబెలునకు గలదు. దేవునికియ్యవలెను. మంద లోనిది తేవలెను. మంచిదై యుండవలెను అని లోపలనుండి పుట్టుకువచ్చెను. అదే నైజ సంబంధమైన జ్ఞానము. అదే విశ్వాసి యొక్క అర్పణ.    

(4) నేను తీసికొని వెళ్ళిన కానుక ప్రభువు అంగీకరించును అను విశ్వాసము ఆయనకు గలదు. ఇప్పుడు మీరు తెచ్చిన కానుకలన్ని పాదిరిగారు అంగీకరింతురు. ప్రభువు కూడ అంగీకరించునని హేబెలువంటి విశ్వాసముతో తెచ్చినవారు అనగలరు. ఇది విశ్వాస అర్పణ. తన స్వంత ఇష్టముతో తెచ్చెను గనుక స్వేచ్చార్పణ, విశ్వాస అర్పణ రెండునూ అర్పించెను. మరియు నీతిపరుడు అనగా కళంకము లేనివాడు అని గలదు. పౌలు శ్రేష్టమైన కానుక అని వ్రాసెను. అటువంటి కానుక తీసికొని రావలెనని మనము విన్నాము గనుక ఆయనకిచ్చే కానుక మనకు ఇష్టమైనదిగా మార్చుకొని తేవలెను, హేబెలుకున్న గుణములు గుడికి రాకముందు తెలియక పోయినను, ఇప్పుడు తెలిసినవి గనుక మార్చుకొనండి. అప్పుడు ఒక్కొక్కరు నా పేరు హేబెలు, నా పేరు హేబెలు, ఎందుకనగా హేబెలుయొక్క అర్పణకున్న గుణాలు, నా అర్పణకున్నవని సంతోషించ వచ్చును.

    (5) ముఖ్యవిషయము:- హేబెలు అర్పించిన గొర్రెపిల్ల, లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తుప్రభువునకు ముంగుర్తుగా నున్నది. దేవుడు తన కుమారుని (యేసుప్రభువు) మనకు కానుకగా నిచ్చిన అర్పణకు ముంగుర్తు అయిన మొదటి గొర్రెపిల్లను హేబెలు ఇచ్చెను. మొదటిది హేబెలు గొర్రెపిల్ల. రెండవది దేవుని గొర్రెపిల్ల. హేబెలు యొక్క గొర్రెపిల్ల మొదలు సిలువపై చనిపోయిన దేవుని గొర్రెపిల్ల వరకు, ఈ మధ్యకాలములోని 4వేల ఏండ్లలో జీవించిన భక్తులు ఎన్ని గొర్రెపిల్లలను అర్పించిరో అవన్ని హేబెలు గొర్రె వలె దేవుని గొర్రెపిల్లకు (అనగా ప్రభువునకు) ముంగుర్తుగా నున్నవి. అవి గొర్రెపిల్లలు కాకపోయినను, ఇతర జంతువులైనను, సొమ్ము అయినను అర్పణయే. ఇవన్ని దేవుడు మనకు ఇచ్చిన కానుకకు ముంగుర్తుగా నుండును. వారు హేబెలుతో సమాన లక్షణములు గలిగి యున్నప్పుడు, వారు కూడ హేబెలులై యున్నారు. ఆయన తెచ్చినది శ్రేష్టమైన కానుక గనుక దేవుని దృష్టిలో గొప్పది.

(6) విధవరాలు రెండు దమ్మిడీలు వేసెను. క్రీస్తుప్రభువు ఆ కానుకనే మెచ్చుకొనెను. పరిసయ్యుల కానుక ఎంత పెద్దదైనను ప్రభువు మెచ్చుకొనలేదు. విధవరాలు వేసినది కొంచెమైనను అది దేవునికిష్టమైన కానుక. మనది కూడ దేవునికిష్టమైన కానుకై యుండవలెను. “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును” అని గలదు. దేవునికిష్టులైన వారికి సమాధానము, గనుక ఇష్టముగా కానుకలిచ్చిన వారు దేవునికిష్టులగుదురు. ఉదా:- అబ్బాయీ! అరటిపండు తిను అని ఇచ్చిన, పిల్లవానికి సంతోషము, సలాము అని కూడ చెప్పును. సలాము చెప్పుట, ఇచ్చినందుకు కాదుగాని, ఇష్టముతో ఇచ్చినాడు గనుక. అలాగే మనమిచ్చిన కానుకలు ఇష్టముతో కూడిన పరిశుద్ధమైన కానుకలైయున్నయెడల, మన కానుకల పండుగ నిజముగా పండుగే. 

(7) పూర్వకాలము అన్న తమ్ముడు కానుకలు తెచ్చిరి. హేబెలు అన్నాయెను. కయీను తమ్ముడాయెను, హేబెలు యొక్క కానుక పెద్దది. అనగా బుద్ధికి పెద్దవాడు. గనుక హేబెలే అన్న, హేబెలువంటి అన్నలైయుండుడి.

Please follow and like us:

How can we help?

Leave a Reply