క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. కానుకల పండుగ...
  5. కానుకల పండుగ – 4

కానుకల పండుగ – 4

కానుకల పండుగ ఆచరించు ప్రియులారా! మీ అందరకు ఈ పేరుగల పండుగ యొక్క సంతోషము కలుగును గాక!

కోత పండుగ, కానుకల పండుగ, చందా పండుగ, అర్పణల పండుగ, కృతజ్ఞత పండుగ అని పేరులు గల ఈ పండుగను, ఆ పేరులకు తగిన రీతిగా ఆచరించుటకై నేను చెప్పేమాటలు మీలో ప్రవేశించే నిమిత్తమై, నేడు మీ హృదయములు విప్పి మనోనిదానముతో చదవండి.

త్రిత్వ దేవునికి మహిమ, మనకు రక్షణ, సైతాను రాజ్యమునకు నాశనము కలుగును గాక. ఈ పండుగ రెండు పండుగలు గల పండుగ. ఇది ఇద్దరి పండుగ. ఒకటి, సంతోషముతో మనము చేసే మన పండుగ. రెండు, మనమిచ్చే కానుకలు సంతోషముతో ఇస్తే పరలోకములో నున్న దేవునికి ఎంతో సంతోషము గనుక ఆయనకు పండుగ మనము పుట్టక ముందు, మనము పుట్టిన తర్వాత, ఆయనను అడిగిన తరువాత, మనకు అనుదినము ఇస్తూవున్న కానుకల నిమిత్తమై ఆయన చేసే రెండవ పండుగ. ఆయనే మనకు గాలి, వాన, ఎండ ఇస్తున్నారు. ఆయనకు ఎప్పుడూ పండుగే గనుక ఎన్ని పండుగలు చేసినా, ఆయన ఇచ్చినవన్నీ జ్ఞాపకముంచు కొనండి. మొట్టమొదట దేవుడు మనకు రెండు కానుకలు ఇచ్చినారు.అవి మనము పుట్టక ముందే ఇచ్చెను. ఇప్పటికి ఇంకా ఇస్తూనే యున్నారు. అవి ఏవంటే పైన ఆకాశము, క్రింద భూమి. ఈ రెండు కానుకలలో ఏది గొప్పది? సూర్య కాంతి (మేఘముల ద్వారా) వర్షము ఇచ్చును. అది ఆకాశము నుండి వచ్చును. భూమి ఫలవృక్షములను ఇచ్చుచున్నది. గనుక దేవుడిచ్చిన ఈ రెండు కానుకల నిమిత్తము కృతజ్ఞతా కానుకలను చెల్లించవలెను. మూడవ కానుక, ఇది మొదటిచ్చిన వాటికన్న మరి గొప్పది, అది ఏమంటే భూమిని, ఆకాశమును బోధించే ఈ బైబిలు గ్రంధమే. ఆకాశమును గురించి, భూమిని గురించి మనకు కొన్ని వివరములు తెలియుచున్నవి. ఆ గ్రహింపునకు మనము బైబిలు చదివితే ఇంకొన్ని వివరములు తెలియును. భూమి, ఆకాశము గొప్పవా? ఆ రెండింటిని గూర్చి బోధించే బైబిలు గొప్పదా? మూడవ కానుక, మొదటి రెండు కానుకల కంటే ఇంకా గొప్పది. దేవుడు మనకు గొప్ప కానుకలు ఇస్తున్నారు. ఏ కానుకైనా దేవుడు మనకు ఇచ్చేది మనము పుచ్చుకొనేది, మనము దేవునికిచ్చేది, మనము ఆయన కొరకు చేసేదియునైయున్నది.

నాల్గవ కానుక ఏమంటే, అసలు దేవుడే మనిషి అయి మనకు కానుక అయిపోయినాడు. ఇది మనకు గ్రహింపు కాదు. ఉదాహరణ:- ఆవు ఉన్నది, అది పక్షి అగునా? అవ్వదు. ఎందుకు? (అవి రెండూ వేరు గనుక) ఆయన మనిషి అవడమేకాదు; మనకు కానుకగా ఏర్పడినాడు. ఆ మనిషిని గురించి మనము క్రిష్ట్మస్ పండుగ చేస్తాము. ఇంకొకటి యున్నది. అది ఐదవ కానుక. అది దేవుడిచ్చేది, మనకు ఇష్టమైతే అందుకొనేది. ఆ పండుగ ఏమంటే, పరిశుద్ధాత్మ పండుగ. ఇంతకు ముందు కుమారు నిచ్చిన పండుగ. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇచ్చిన పండుగ యేసుప్రభువు పరలోకమునకు వెళ్ళిన తరువాత 120మందికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చుట కానుకలలో గొప్ప కానుక, అయితే ఈ కానుక ద్వారా మనకు వచ్చిన వరములు అనేకములున్నవి. ఆ వరములన్నియు బైబిలులో నున్నవి. మన అనుభవములోనున్నవి. 1. భాషలతో మాటలాడుట, 2. భాషలకు అర్ధము చెప్పుట. 3. రోగులను స్వస్థపరచే వరము మొదలగునవి. ఎవరైతే ఈ నాలుగు దానములు తలచుకొని దేవుని యెడల కృతజ్ఞత కలిగి ఇస్తారో వారే ఈ పండుగ చేసేవారు. ఐదవది, ఆరవది అందరూ ఆలోచన చేయండి హింస మన దగ్గరకు రాలేదు. గాని ఎదురు చూచుచున్నది. గనుక ఇపుడు మన ముందున్న కానుక ఆరోహణ కానుక ఇది ఎవరి కానుక? సంఘము యొక్క కానుక. ఎవరు రెండవ రాకడకు సిద్ధపడుచున్నారో వారు మాత్రమే పొందే కానుక. యేసుక్రీస్తు పరలోకములో నుండి మధ్య ఆకాశమునకు వస్తారు. సిద్ధపడిన వారిని గాలిలో మధ్య ఆకాశమునకు ఆకర్షించెదరు. ఇది వరకు ఐదు కానుకలు అందుకొన్నవారిలో ఆఖరు కానుక అందుకొనే వారుంటే ఉంటారు. లేకుంటే లేదు. గనుక ఈ ఆరవ కానుక అందుకొనుట చాలా కష్టము. అనగా రాకడలో ప్రభువుతో వెళ్ళుట చాలా కష్టము. దానికి సిద్ధపడుట చాలా కష్టము. చనిపోయినవారు మోక్షమునకు వెళ్ళుదురు గదా!

ఈ ఆరోహణ కానుక దేవుడిచ్చే వరకు, వారు ఉండలేక చనిపోయి వెళ్ళిపోయినారు. గనుక ఈ ఐదు కానుకలు సంపాదించిన వారు ఆరోహణ కానుక కూడ అందుకొనుటకు త్వరగా సిద్ధపడండి. సిద్ధపడే వారు లేకపోరు., వారితోపాటు మనము కూడ చేరవలెను. త్వరగా వస్తాడా? అనే ఈ సందేహము ఉంటే తయారు కాలేరు. ఇది చాలా ఆటంకము. త్వరగా వస్తానన్నాడు, రాలేదు అనే మాట నాకెందుకు అని ఎవరైతే అనుకుంటారో, వారే రాకడకు సిద్ధపడుదురు. మొదటి ఐదు కానుకలు ఇవ్వడము అనేది నిజమైతే ఈ ఆరవ కానుక ఎందుకు నిజముకాదు? ఇప్పుడు నేను ఎన్ని కానుకలు చెప్పాను? వీటి అన్నిటిని మించిన కానుక మీరు ఇవ్వగలరా? ఇవ్వలేము. ఇవ్వడానికి లేనే లేవు. ఉన్నవి గాని ఇవ్వలేమంటే ఎలా? స్తుతి చేసే కానుక ఉన్నది. ఇది వాటితో సమానమైన కానుకయై యున్నది. గనుక మీతో చెప్పిన ప్రకారముగ కానుకలు మీరు ఇవ్వండి. ఊ ఆరవ కానుక మనకు ఒకవేళ లేకపోయిన సరే ఉన్నట్లు ఈ దినము కానుక ఇస్తే దేవునికి సంతోషము. ప్రత్యేకమైన దీవెన. ఈ దీవెన మనలను రాకడ వరకు వెంటాడును. ఆయన తప్పక వస్తాడు. గనుక ఈ కానుకలు మాత్రమే, కాక రాకడ ద్వారా ఆయన ఇచ్చే దీవెన పొందుటకై మీ కానుకలు చెల్లించండి. అట్లు చెల్లించుటకు దేవుడు మీకు కృప దయచేయును గాక! ఆమెన్!

Please follow and like us:

How can we help?

Leave a Reply