దేవ దేవ దేవ- దివినున్న దేవా = పావనస్తోత్రముల్ – పరలోక దేవా దేవా ||దేవ||
1) అన్ని లోకములకు-అవతలనున్న=ఉన్నతలోకాన-సన్నుతులు గొన్న దేవ ||దేవ||
2) మహిమ లోకంబున-మహిమ పూర్ణముగ=మహనీయముగనుండు-మానకుండగను దేవ ||దేవ||
3) నీకిష్టులైనట్టి-లోకవాసులకు=రాకమానదు శాంతిరంజిల్లు వరకు దేవ ||దేవ||
4) ధరణి మీదను సమాధానంబు కలుగు = నరులకు నీ దర్శనం బిచట కలుగు ||దేవ
షరా:- క్రీస్తుప్రభువుయొక్క జన్మదినానందముగల వారలారా! ఈ కీర్తన గృహములలోను, ప్రార్ధన స్థలములలోను, సంతలోను, నూతులయొద్దను, చెరువుల యొద్దను, కాలువల యొద్దను, నదులయొద్దను, బస్సులయొద్దను, రైల్వే స్టేషనులయొద్దను మీకు వీలైన అన్నిచోట్లను మీకు అనుకూల సమయములలో పాడగలరా! పాడుదురా! పాడుటకు ఇష్టమేనా!
స్తుతి:- “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక”.
“సర్వోన్నతమైన స్థలములు అనగా అన్ని లోకములకంటె మిక్కిలి పైగనున్న స్థలములు, మనము ఊహింపజాలని ఉన్నతమైన లోకము దేవలోకము. అక్కడ దేవుని సిం హాసనము గలదు. అక్కడనుండి ఆయన అన్ని లోకములను పరిపాలించుచున్నాడు. ఆయన సన్నిధిలో గొప్ప సైన్యము గలదు. ఆ సైన్యము యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన దినమున భక్తిపరులైన గొల్లల యొద్దకువచ్చి వారు వినుచుండగా దేవుని స్తుతించిరి. ఆ స్తుతిలో రెండు మాటలు ముఖ్యమైనవి. మొదటిది దేవునికి మహిమ అనగా కీర్తి.
రెండవది మనుష్యులకు సమాధానము అనగా శాంతి, ఆ సైనికుల స్తుతిలో ఈ రెండు గొప్ప అంశములు గలవు. దేవుడు సర్వమును కలుగజేసిన సృష్టికర్తయైయున్నాడు. మరియు ఆయన సర్వమును పాలించు రాజైయున్నాడు. రాజు గనుక ఆయనకు సేనకూడ ఉండవలెను గదా, ఆ సేన మనుష్యుల సేనకాదు, దేవదూతల సేన. దేవదూతలు పవిత్రులు. ఆకారము లేనివారు. మహాశక్తిగలవారు. దేవుని పనిని చూచుచు ఆనందించుచు ఆయనకు వందనములు ఆచరించువారు గనుక వారు చేయు స్తుతి మనము చేయు స్తుతికంటే మిగుల ఎక్కువైన స్తుతి దేవునికి మహిమ నరులకు సమాధానము అను ఈ రెండు విషయములను మనకు తెలిసిన విషయములే.
ఈ రెండును మనము ఉపయోగించిన యెడల దేవునికి సంతోషము. నా పనిని నరులు గ్రహించినారు గదా అని ఆయనకు సంతోషము. నేను కలుగజేసిన మనుష్యులకు నెమ్మది కలుగవలెను, అని స్తోత్రపరులు చెప్పుచున్నారు. అని ఆయన సంతోషించును. ఈ మొదటి రాకడ స్తుతికి తోడు రెండవ రాకడ స్తుతికూడ చేయండి.
ఆవిధముగా స్తుతింపగల దీవెన మీకు కలుగును గాక.