“వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను” (లూకా 2:6,7). “అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను” (గలతీ 4:4).
ప్రార్ధన:- ఓ పరిశుద్ధుడవైన శిశువా! మా ప్రభువా! నీవు లోకమునకు రానైయున్న సంగతి నాలుగు వేల సంవత్సరములకు ముందుగానే తండ్రి తెలియపర్చినందుకు అనేక స్తోత్రములు. మా యేసుప్రభువా! నీవు తండ్రివలన పంపబడినావు గనుక నీ కనేక వందనములు. ఇప్పటివరకు ఉండి కాలము సంపూర్ణమైనప్పుడు జన్మించినావు. నీవు జన్మించినప్పుడు భూమిమీదనున్న కొద్ది మందికి ఎటువంటి సంతోషము కలిగించినావో అట్టి సంతోషము మాకును కలిగించుమని వేడుకొనుచున్నాము.
ప్రసంగము:- క్రిష్ట్మసు పండుగ వాస్తవ్వులారా! మీకు క్రిష్ట్మసు ఆనందము కలుగునుగాక. క్రిష్ట్మసు పండుగ మరల వచ్చినది. ఇది హడావుడి పండుగ. ఇండ్లు అలుకుకొనుట, వెల్లవేయుట, పిండివంటలు తయారుచేసికొనుట, క్రొత్త బట్టలు ధరించుకొనుట, కాగితములు అంటించుట, కార్డులు అచ్చువేసి ఇతరులకు పంపుట, మొదలగుపనులు చేయుచు, అందరు హడావుడిగా నుందురు. ఆ విధముగానే బేత్లెహేములో శిశువు పుట్టగానే ఆకాశములో హడావుడి, భూలోకములో హడావుడి అన్నిటిలో హడావుడిగా నుండెను. పండుగ నాచరించు మనకు హడావుడి. ఇతరులకు పండుగలో నున్న సంతోషము చూచుటకు హడావుడి. ఈ హడావుడి పరలోకములో, భూలోకములో, మాత్రమేకాదు. దేవలోకములోని తండ్రికిని కుమారునికిని, పరిశుద్ధాత్మకును కూడ గలదు. 1. తండ్రియైన దేవునికి ఏమని హడావుడి? నేను నా కుమారుని భూలోకమునకు ఎప్పుడు పంపవలెను? ఎప్పుడు? ఎప్పుడు? అను హడావుడి దేవునికి కలదు. 2. యేసుప్రభువునకు ఏమని హడావుడి? నేనెప్పుడు మనిషిగా పుట్టుదునా? ఎప్పుడు? ఎప్పుడు? అను హడావుడి కుమారునికి గలదు. 3. పరిశుద్ధాత్మకు ఏమని హడావుడి? ఈ కార్యమంతయు ఎప్పుడు జరిగించవలయును? ఎప్పుడు? ఎప్పుడు? అను హడావుడి పరిశుద్ధాత్మ తండ్రికి గలదు. 4. ఈ హడావుడి పాత నిబంధన భక్తులకు కూడ కలదు. వారందరు ఎప్పుడు మనిషిగా జన్మించును? ఎప్పుడు ఆయన మనిషి అగుటచూతుము? అనే హడావుడి వారికి గలదు. ఆ భక్త్తులందరు హడావుడి పడుచునే పరలోకమునకు వెళ్ళిపోయిరి. అక్కడి నుండి వారు ప్రభువు జన్మించినపుడు తొంగిచూడవలెను. 5. ఈ హడావుడి పరలోకములోని దూతలకు కూడ గలదు. వారు పరలోకములో ఈ కథ వినుచూ, వినుచూ ఎప్పుడు దేవుడు మనుష్యుడగును? ఎప్పుడు చూతుము? ఎప్పుడు? ఎప్పుడు? అనుచు హడావుడిగా నున్నారు గాని సమయము రాలేదు.
అప్పుడు గలతీ 4:4లో నున్న ముఖ్యమైన మాట నెరవేరెను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు జన్మించెను. ఇది కూడ క్రిష్ట్మసు వాక్యము (లూకా 2:11)లో మరియొక వర్తమానము “నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు” అదే కాలము సంపూర్ణము. క్రీస్తు ప్రభువు రానైయున్నాడు. అని పాత నిబంధనలో గలదు. గనుక ఒక కార్యక్రమము జరుగవలెను. అది జరుపుటకు దేవుడు ఆలస్యము చేసెను. తన కుమారుని ఈ లోకమునకు పంపుటకు ముందు నాలుగు వేల సంవత్సరములు ఆలస్యము చేసెను. కడకు నాలుగు వందల సంవత్సరములు నిశ్శబ్ధముగా నుండెను. దానికే నిశ్శబ్ధకాలమని పేరు. ఈ కాలములో దేవుడు మాట్లాడలేదు, వాగ్ధానములు లేవు. అన్ని ఆగిపోయెను. ఎందుకనగా రానైయున్నాడు అనే వర్తమానము వ్రాయించుట ముగిసెను. చెప్పవలసినవి కూడ అయిపోయెను. తరువాత కాలచక్రము గబాగబా తిరుగవలెను. కాబట్టి దేవుడు కబురు పంపెను. జన్మకార్యములు, శుభవార్తలు, వివాహకార్యములు, ఉత్సవకార్యములు జరిగినప్పుడు మనము ఏలాగు కబురుపంపుదుమో ఆ ప్రకారముగానే దేవుడు తన కుమారుని జన్మవార్త పంపుటకు ఆరంభించి త్వరగా చెప్పివేసెను. నాలుగు వేల సంవత్సరములు ఆలస్యము చేసిన ఆయనకు ఏమి హడావుడి వచ్చినది అన్నట్లు త్వరగా చెప్పివేసెను. జెకర్యాకు, ఎలీసబెతునకు మరియమ్మకు, గొల్లలకు, హన్నకు, సుమెయోనుకు కబురు పంపెను. మనము ఇన్నాళ్ళు ఆలస్యము చేసిచేసి అనగా పదకొండు నెలలు ఆలస్యము చేసి పన్నెండవ నెలలో హడావుడిగా పండుగకు సిద్ధపడుచున్నాము, అలాగే దేవుడును చేసెను. 1. నీకు కుమారుడు కలుగుననియు అతడు సిద్ధపడనివారిని సిద్ధపరచుమనియు జెకర్యాకు గుడిలో చెప్పించెను. 2. జెకర్యా మూగతనముతో ఇంటికి వెళ్ళి పుట్టబోవు శిశువునకు యోహాను అను పేరు పెట్టవలెనని పలకమీద వ్రాసి తన భార్యకు చూపించి యుండవచ్చును. గనుక ఎలీసబెతునకు కూడ కబురు అందెను. 3. నేడు కుమారుడు జన్మించును అనియు ఆయనకు “యేసు” అను పేరు పెట్టుదుమ ననియు తరువాత కన్య మరియాంబకు కబురులందెను. ఆమె లేచి ఎలీసబెతు దగ్గరకు వెళ్ళెను. వారు కబురునకు కబురు అందించుకొనిరి. 4. ఇంతలో ఎక్కడనో లోకములో ప్రధాన పట్టణములో సిం హాసనము మీద నున్న ఔగుస్తు చక్రవర్తికి కబురు వెళ్ళెను. ఆయనకు తెలియకుండా వెళ్ళెను. తక్కినవారికి తెలిసి వెళ్ళెను. చక్రవర్తికి తెలియదు. ఎందుకనగా హడావుడిగా అంతయు జరుగవలెను. ఇంకను ఎందుకనగా కన్యక గర్భవతియై బేత్లేహేమునకు వెళ్ళవలెను. గనుక లోకమంతటికి జనసంఖ్య వ్రాయింపవలెనని లోకమంతయును అతనిచేతిలో గలదు గనుక ప్రజా సంఖ్య వ్రాయింపవలెనని తెలియపర్చెను. జన సంఖ్య వ్రాయించని యెడల యోసేపు తన గోత్ర జనులున్న బేత్లేహేము వెళ్ళుట అవసరము. స్త్రీలు వెళ్ళుట యూదుల పద్ధతి కాదు. అయినను ఆమె నిండు మనిషియైనను దైవనియామక భర్తతో వెళ్ళవలెనని కోరినది. ప్రభువే ఆమెకాకోరిక పుట్టించి ఉండును. ఇంటియొద్ద నున్నయెడల అందరును నిందింతురేమో, ఆమె బేత్లేహేము వెళ్ళని యెడల మీకా ప్రవచనము ఎట్లు నెరవేరగలదు? (మీకా 5:2). దేవుని ఏర్పాటుగనుక వారు సిగ్గుపడి యుండరు, భయపడి యుండరు. లూకా 2:6లో వారక్కడ నున్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను అని గలదు. అదే గలతీ 4:4లో నున్నట్లు కాలము సంపూర్ణమగుటయై యున్నది. జెకర్యా కథలో ఆయనకు యాజకధర్మము జరిపించుటకు వంతువచ్చెనని గలదు. అది పైకి మాత్రమే గాని లోకరక్షకుడు జన్మించుననే వాక్కు వినబడు వంతువచ్చెను. అదే కాలము సంపూర్ణము. ఆమె బేత్లేహేములో ప్రసవించినప్పుడు కాలము సంపూర్ణమాయెను. ఒక కార్యక్రమము ముగిసెను.అది ఆయన పుట్టుట. దేవుని సిం హాసనము వద్ద మూడు కార్యక్రమములు గలవు. 1) పాత నిబంధన కాలములో జరుగవలసినది. 1) కాలము పరిపూర్ణమైనప్పుడు జెకర్యాతో ఆరంభమై ప్రభువు జన్మించువరకు జరుగవలసినది. 3) కుమారుని కనిన తర్వాత జరుగవలసిన కార్యక్రమము: 1) పొత్తి గుడ్డలతో శిశువును చుట్టుట. 2) పశువుల తొట్టిలో శిశువును పరుండబెట్టుట. 3) పరలోకమునుండి ఒక దేవదూత వెళ్ళి గొల్లలకు వార్త చెప్పుట. 4) పరలోక దూతల సైన్యము దేవుని స్తుతించుట. ఆ స్తుతి పాడిన యెడల ఏ రాగచ్చాయతో పాడిరో మనకు తెలియదు. 5) గొల్లలలు చూచుట, పూజించుట, నమస్కారము చేయుట. – మూడవకార్యక్రమము ముగింపులో చివర ఏమున్నది? నేను ఐగుప్తులోనుండి నా కుమారుడా రమ్ము అని పిలిచితిని అని కలదు. హోషేయ 11:1 దానినిబట్టి చూడగా పరలోకపు తండ్రి ఐగుప్తులో ఉండవలెను. కుమారుడా అక్కడికి రమ్ము అనెను. అప్పుడు మరియమ్మ, యేసేపులు శిశువును ఐగుప్తునకు తీసికొని వెళ్ళిరి. కొన్నాళ్ళయిన తర్వాత ఆయన తన కుమారుని నజరేతునకు నడిపించెను. ఇది కార్యక్రమమునకు చివరి వృత్తాంతము. పై లోకములోని దేవదూతలకు కూడ హడావుడి ఉన్నది. శిశువు పుట్టగానే పై లోకములోని దేవదూతలు శిశువును చూడవెళ్ళుటకు తండ్రిని సెలవడిగి యుందురు. సెలవియ్యగానే బిలబిలమనుచు భూమి మీదికి వచ్చిరి. నేను సండే స్కూలులోని చిన్నపిల్లలకు పాఠము చెప్పుచుండగా ప్రక్కబడి కొందరు డప్పులు వాయించుచు వెళ్ళుచున్నప్పుడు పిల్లలు నన్ను అడుగకుండగనే చూచుటకు లేచిరి,. నేను ఆపలేక వెళ్ళండి అని అన్నాను చూచివచ్చినారు. అలాగే శిశువు పుట్టగానే దూతలు అక్కడ ఉండలేక పోయినారు. ముగింపు:- రేపు ఇంకొక హడావుడి కలుగును. ఇప్పుడు తొట్టిలో పరుండిన ఆయన రాకడలో దూతలతో వచ్చినప్పుడు ఇంకా హడావుడిగా నుండును. మమ్మును ఎప్పుడు తీసికొని వెళ్ళుదువు? అని వధువు సంఘస్థులు ప్రభువును హడవుడిగా అడుగుచున్నారు. ఈ హడావుడి నీలోనున్నదా? ఇటువంటి హడావుడి కలిగి ఈ కాలములో సంతోషముగా నుందుముగాక!