క్రిష్ట్మస్ పండుగ చేయువారికిని, అభిమానులకును “మహా సంతోషకరమైన సువర్తమానము” అను వచనమును క్రిష్ట్మస్ సందేశముగా గైకొనండి (లూకా 2:10).
ఆరోగ్యానందము, సంతానానందము, స్వజనానందము, సంపాధ్యానానందము, విధ్యానందము, నైసర్గిక సద్గుణానందము …..ఈ మొదలైన ఆనంద స్థితులు మానవులకు కలవు. ఈ సంతోషములు మంచివే, ఉండవలసినవే. నేటివర్తమానములో మహాసంతోషమని ఉన్నది. కనుక ఇది పైన ఉదహరించిన సంతోషములకు మించిన సంతోషము ఎందుచేత? దేవుడు మనకొరకు మనుష్యుడుగా మన భూమి మీద వెలసినాడు. అందుచేత ఈ చరిత్ర మహాసంతోషకరమైన మొదటి చరిత్ర. ఇది ఎంత గొప్ప సంతోషకరమైన సంతోషమో! దేవదూతకు తెలుసును గనుక మహా అనుమాట ఉపయోగించినాడు.
1. ప్రభువుయొక్క జన్మమునకు పూర్వమందున్న భక్తులు ప్రవచనములను బట్టి నిరీక్షించుట వలన క్రిష్ట్మస్ పండుగను ఆచరించిరి. “ఆలకించండి. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను (యెషయా 7;14;9:6; మీకా 5:2).
2. జన్మ కాలమున పరలోక వాస్తవ్వులగు దేవదూతలు జన్మమును చూచుటవలన క్రిష్ట్మస్ నాచరించిరి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన కిష్టిలైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక (లూకా 2:14).
3. జన్మ కాలమున గొర్రెల కాపరులు ప్రభువును దర్శించుట వలన క్రిష్ట్మస్ నాచరించిరి. “ఆ దూతలు తమ యొద్దనుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెలకాపరులు – జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. (లూకా 2:15-17)”.
4. సుమెయోను అను వృద్ధ భక్తుడు బాల ప్రభువును ఎత్తుకొని దేవుని స్తుతించుటవలన క్రిష్ట్మస్ పండుగను ఆచరించెను. “నాధా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని” (లూకా 2:29-32)
5. బహుదూరమునుండి వచ్చి ఆ బాలరక్షకుని చూచి కానుకలు అర్పించుట వలన తూర్పుజ్ఞానులు క్రిష్ట్మస్ పండుగ నాచరించిరి. “వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలువిప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.” (మత్తయి2: 10:11)
6. నేడు విశ్వాసులందరు ఆ బాల రక్షకుని జన్మ వృత్తాంతము తలంచుకొని క్రిష్ట్మస్ పండుగను ఆచరించుచున్నారు. చదువరీ! నీవు నేడు ఆచరించుచున్నటువంటి క్రిష్ట్మస్ ఎటువంటి క్రిష్ట్మస్? పూర్వకాల భక్తులు, దేవదూతలు, కాపరులు, సుమెయోను, జ్ఞానులు, గతకాల విశ్వాసులు మెచ్చుకొనగల క్రిష్ట్మస్ నీవు ఆచరించుచున్నవా?
క్రిష్ట్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. గనుక ఆయనను ఆరాధించుట యందు దృష్టినుంచక, ఆచారములయందే దృష్టియుంచుట క్రిష్ట్మస్ కాదు. దేవదూతలు దేవుని మహిమపరచిరి. మనము అట్లు చేయని యెడల మన పండుగ పండుగ కాదు. నూతన సంవత్సరపు దీవెనలు, క్రిష్ట్మస్ పండుగ దీవెనలు చదువరులందరిమీద సూర్య కిరణములవలె పడును గాక! (కిరణములను ఎవరు తప్పించుకొనగరు?)