“ఆయన మనుష్యుల పోలికగా పుట్టెను” ఫిలిప్పి 2:7.
1. మిత్రుడా నాకు క్రిష్ట్మస్ కథ కంఠత పాఠమే గాని నాకొకటి అర్ధమగుటలేదు. దేవుడెట్లు నరుడు కాగలడు?
2. నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా? అని దేవుడే అడుగుచున్నాడు. (యిర్మియా 32:27) దేవుడు అనాది నుండి శక్తిమంతుడు; అనంత శక్తిమంతుడు, గనుక మేర కనబడని ఆకాశ మండలముమును ఇంత పెద్ద భూగోళమును కలుగజేసినవాడు నరుడుగా అవతరింపలేడా?
1. ఆయన సర్వశక్తి గలవాడే గాని మనుష్యుడు కాగలడా? కాలేడు.
2. కాలేడనియన్న యెడల ఆయన శక్తిలేనివాడనియన్నట్టే.
1. నాకు అర్ధమగుటలేదు. దేవుడాద్యంత రహితుడు, నరుడు ఆద్యంతములు గలవాడు.
2. దేవుడు చేసిన ఏ కార్యము మనకు పూర్తిగా అర్ధమగుచున్నది? ఎర్రని పదార్ధము లేమియు తిననప్పుడు మన శరీరమున ఎర్రని రక్తమెట్లూరుచున్నదో చెప్పగలమా?
1. ఇంకనూ గ్రాహ్యమగుట లేదు.
2. నీవు గ్రహింపలేక పోవుచున్నావు. నేను వివరించలేక పోవుచున్నాను. ఇందువలన మన జ్ఞానమునకు గల ఆ శక్తి బైలుపడుచున్నది. దేవుని శక్తి కనబడుచున్నది. నేను సమస్తమును గ్రహింప గలిగిన ఎడల నేను దేవుడను, దేవునికన్న ఎక్కువైనవాడను.
1. కొద్దిగా బోధపడినది గాని,
2. మానవ శరీరయంత్రమున దేవుడు రెండుశక్తులను అమర్చియున్నాడు. జ్ఞానశక్తి, విశ్వాసశక్తి, ఒకటి చేయలేని పని మరొకటి చేయును. దేవుడు నరుడైన సంగతి జ్ఞానము గ్రహింపనప్పుడు విశ్వాసము గ్రహించును. నమ్ముటవలననే దేవుని సర్వకార్య మర్మములను గ్రహించి ఆయనను స్తుతింపగలము.
1. “నమ్ముట నీవలన కావలసినపని నమ్మువారికి సమస్తమును సాధ్యమే” అని క్రీస్తుప్రభువు చెప్పినమాటకు ఇదేనా అర్ధము?
2. అవును లోకమున పాపము ప్రవేశించిన తరువాతనే గ్రహింపలేక పోవుటయు సంభవించినది.
1. సర్వ శరీరధారియగుటకు మహా పవిత్రుడగు దేవునికెట్లు మనసొప్పినదో?
2. పాపులమగు మనమీద గల ప్రేమయే. ఆయన చేత ఈ కార్యము చేయించినది. చెడిపోయిన కుమారుని ఎందుకు ప్రేమించుచున్నావు తండ్రి అని అడుగుదువా? అడుగవు. ఇదియు అడుగకుము, నమ్ముము.
1. ఏది క్రిష్ట్మసు కథ ఇంకొకమారు చెప్పుము.
2. పరిశుద్ధుడగు దేవుడు నరులను పరిశుద్ధులనుగా కలుగజేసినను వారు పాపులుగా మారినందున నరులందరిని రక్షించుటకు దేవుడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమాయెను. ఆయన ఒక కన్యక గర్భమున అవతరించి జన్మించిన వార్తను దేవలోక దూత గొల్లలకు ప్రకటించెను. ఆ వార్తయిది. “భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” గొల్లలది విన్నపిమ్మట దేవదూతల సైన్యమొక స్తుతిగానము చేసెను. అటు తరువాత గొల్లలా శిశువును దర్శించి అందరకు ప్రకటించిరి.
ఈ పావన వృత్తాంతము నమ్మువారికి దైవ సహవాసము ప్రాప్తించును. ఇది “ప్రజలందరికి” అని ఉన్నట్లు ఈ వార్తనేటికి అన్ని దేశముల వారికి అందినది.