యెషయా 9:6; లూకా 2:11.
మనకు – మనకొరకు; మీకు – మీకొరకు
క్రీస్తుప్రభుని జన్మమును పండుగగా భావించుచున్న విశ్వాసులారా! మీకు రక్షకుని జన్మానంద భాగ్యము లభించునుగాక!
క్రైస్తవులకు క్రిష్ట్మసు పండుగ కాక, మరియొక మొదటి గొప్పపండుగ గలదా? దేవుడు మానవులకు పూర్తిగా బైలుపడిన వ్యక్తి క్రీస్తుప్రభువే. మన భూమిమీద మన నరజాతిలో క్రీస్తుప్రభువు పుట్టినాడు గనుక మన కొరకే అని ఎందరు అనగలరో ఆ అందరి కొరకే ఆయన. ఆయన జన్మమునకు పూర్వము కొన్ని వందలయేండ్ల క్రిందట ఈ వృత్తాంతము యెషయా అను ప్రవక్తకు దర్శనమందు కనబడెను. అందుచేతనే ఆప్రవక్త మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను” అని వ్రాయుచున్నాడు (యెషయా 9:6). మనకు అనగా మనకొరకు మన ఉపయోగము నిమిత్తము, మనకు అని చెప్పుటలో యెషయా ఎవరికి చెప్పుచున్నాడో ఆ ప్రజలలో తన పేరుకూడ కలిపి మాటలాడుచున్నాడు. “మనకు” అను మాటలో ఆయన ఉన్నట్టు మనమును ఉన్న యెడల ఈ రక్షకుడు మనకే అని సంతోషముతో చెప్పగలము. మనకొరకు అనుమాట బహువచనము గనుక దానిలో విశ్వాసుల సంఘమున్నది. మనకొరకు శిశువు పుట్టెను శిశువు గనుక అందరును వెళ్ళి చూడవచ్చును., ముట్టుకొనవచ్చును, ఎత్తుకొనవచ్చును, ముద్దుపెట్టుకొనవచ్చును. శిశువును చూచినవారు ఎవరును భయపడరు. దేవుడు నిరాకారుడైన దేవుడు తన ప్రభావముతో భూమి మీదికి వచ్చిన యెడల ఎవరును చూడవెళ్ళరు, భయపడి పారిపోవుదురు. ఆ దేవుడే శిశువుగా వచ్చినందువలన గొర్రెల కాపరులును, తూర్పుదేశ జ్ఞానులును చూడవెళ్ళిరి. నిర్భయముగా సమీపించిరి. పూజించిరి. క్రీస్తువలన దేవుడు అందరికిని చనువైన దేవుడైనాడు. అందరును ఎంతధన్యులు! యేసుప్రభువును తల్లిదండ్రులు దేవాలయమునకు తీసికొని వెళ్ళినప్పుడు సుమెయోను అను ఒక వృద్ధుడు ఆ శిశువును చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించెను, మరియు ఆ గడియలోనే అన్న అను ప్రవక్తి లోపలికి వచ్చి శిశువును దర్శించెను. జన్మసమయము మొదలుకొని ఆరోహణ సమయము వరకు మనుష్యులు ఆయనను చూచుచునే యుండిరి.
1. శిశువు అనుమాట మహా విశాలమైన మాటయై యున్నది. ఎట్లనగా విశ్వాసులును, అవిశ్వాసులును అనగా లోక వాస్తవ్వులందరును చూచుటకు వీలుపడిన వ్యక్తి. శిశువు స్వకీయులైన యూదులు ఒక జనాంగముగా క్రీస్తును అంగీకరింపలేదు. లోకమునకు ఆయన వచ్చినను వారు ఆయనను తెలిసికొనలేదు. ప్రభువు వీధులలోను, మార్గములలోను, పండుగ స్థలములలోను, బహిరంగముగా కనబడినపుడు ప్రజలు ఆయనను చూచిరే గాని దేవుడనియు, లోకైక రక్షకుడనియు గ్రహింపలేదు (యోహాను సువార్త మొదటి అధ్యాయము).
2. “మనకు కుమారుడు అనుగ్రహింపబడెను”- ఈ మాట కేవలము విశ్వాసులకే అన్వయించును. దేవుని కుమారుని అంగీకరించు విశ్వాసులు ఆయన మూలముగా దేవునికి వారసులై యున్నారు. వారికి కుమార వారసత్వము కలుగును. వీరు ధన్యులు. శిశువును చూచినా కొందరు ధన్యులు కారు అయితే అంగీకరించిన వారందరును ధన్యులే ఎందుకనగా చూచిరి, తెలిసికొనిరి, అంగీకరించిరి. అనేకులు చూడలేకపోయినను తెలిసికొనిరి, నమ్మిరి, అంగీకరించిరి. వారు కూడ ధన్యులే. మరియొక సంగతి, మనుష్యుని కుమారుడు మనుష్యుడే గాని పక్షిగాడు. అలాగే దేవుని కుమారుడు దేవుడే. దేవుడే మనకు అనుగ్రహింపబడినాడు. ఆయన బలవంతుడైన దేవుడు అనియు, నిత్యుడైనతండ్రి అనియు చెప్పుచు యెషయా తన ప్రవచనమును కొనసాగించుచున్నాడు. శిశువు కుమారుడు దేవుడు తండ్రి అయియున్న క్రీస్తు మనకు క్రిస్ట్మసు కాలమందు దొరికినాడు. ఇది నమ్మిన యెడల మనము ఎంత సుఖజీవుల మగుదుము! ఇంకొక సంగతి వినండి, క్రీస్తు జన్మించినాడు, దేవదూత కాపరులకు వినిపించిన వర్తమానములో ఈ మాటలున్నవి “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11). చూచితిరా యెషయా ఎవరిని శిశువు అని ఉదహరించెనో ఆ శిశువును ఇక్కడ దేవదూత రక్షకుడనియు, ప్రభువైన క్రీస్తు అనియు చెప్పుచున్నాడు. తుదకు ఆ శిశువు క్రీస్తు అని ఇక్కడ తేలినది. ఈ క్రీస్తు ఎవరికొరకు పుట్టినాడని యెషయా చెప్పినాడో ఆ ప్రజలు కొందరు ఇక్కడ ఉన్నారు. వారు విశ్వాసులైన కాపరులు, అక్కడ మనకు అని ఉన్నది. ఇక్కడ మీకు అని వ్రాయబడి యున్నది. మీకు అనగా మీ కొరకు ఆయన పుట్టియున్నాడు. ఈ వాక్కు ఎవరు చదువుదురో, ఎవరు విందురో వారికే అన్వయించును. పిమ్మట ఎవరు నమ్ముదురో వారికి మరింత ఎక్కువగా అనయించును. దేవుడు ఎంత గొప్పవాడైనను మన దేవుడు కాని యెడల ప్రయోజనమేమి? మనము ఆయనను మనవానిగా స్వీకరించుకొన్నప్పుడు మనము యెషయాతోను ఆయన ఎవరికి చెప్పెనో వారితోను, ఈ కాపరులతోను, ప్రాగ్ధేశజ్ఞానులతోను, తదనంతరము వచ్చిన విశ్వాసులందరితోను సమాన భాగులమై యుందుము. క్రీస్తుపుట్టుకకు ముందే పుట్టినాడని యెషయా వ్రాసెను. ఎందుకనగా క్రీస్తు ఆయనకు కనబడెను. మనమైన యెడల క్రీస్తు పుట్టనైయున్నాడు అని వ్రాసియుందుము. భావికాలము యెషయాకు వర్తమాన కాలముగా కనబడెను. దేవదూత ఏమన్నాడు? పుట్టి యున్నాడు అని యెషయా చెప్పినది కేవలము గత కాలార్ధమున భావికాల ప్రవచనము, దూత చెప్పునది కేవలము గత కాలార్ధమున ప్రస్తుత కాల వర్తమానకాలము యెషయా వ్రాసిన శిశువు అనుమాట దేవుని దూతకూడ వాడుచున్నాడు. దూత పలికిన మాటలన్నియు చేర్చిచదువగా ఒకచిన్న క్రిష్ట్మసు ఉపన్యాసమగును. బోధకులు ఈ ప్రసంగమంతటిని వివరింపవలెను. దీనిలో చాలా ముఖ్యాంశములు గలవు. “భయపడకుడి….మీరు చూచెదరు” ఈ మాటలకు మధ్యనున్న దంతయు ఒక దివ్య ప్రసంగము ఎన్ని మాటలో లెక్కపెట్టి చూడండి, అవి ఎంత ముఖ్యములైన మాటలో! మీ కొరకు పుట్టియున్నాడను మాటలతో ముగింపక దేవదూత తన వర్తమానమును పొడిగించుచు దానికిదే మీకానవాలు; అని వివరము చెప్పెను. క్రీస్తుయొక్క ఈ మొదటి రాకడ ధ్యానసందర్భమున రెండవరాకడను గురించి కూడ మీరు ధ్యానింతురు గాక!
సీ|| మన నిమిత్తమే గదా – తనకు శిశువురూపు
మన నిమిత్తమే గదా – తనకు తల్లి
మన నిమిత్త మేగదా – తనకు దిగువచోటు
మన నిమిత్త మేగదా – తనకు పాక
మన నిమిత్తమే గదా = తనకు పేలిక బట్ట
మన నిమిత్తమేగదా – తనకు తొట్టి
మన నిత్త మే గదా – తనకు శత్రుజనము
మన నిమిత్త మేగదా – తనకు నింద తే|| గీ||
మనకు రావలసిన కీడు = తనకు వచ్చె
మనము చేయు పనులవంతు – తనకు చేరె
మనకువచ్చు దుర్మరణము – తనకుమూగె
మనకు ఈ క్రీస్తు నెరిగించు – పనులు దొరికె
క్రిష్ట్మసు వచనములు
యోహాను 1అధ్యా.; ఎఫెసీ 1:4-12; ఫిలిప్పీ 2:4-7; ఆది 3: 15; ఆది 9:26; 12: 1-13; 49:9,10; సంఖ్యా 24: 16,17; ద్వితీ 18:16-22; కీర్తన 72: 16-18; యెషయా 7:14; మీకా 5:2; లూకా 1: 26-56; మత్తయి 1: 18-25; లూకా 2: 1-20; లూకా 2: 21-38; మత్తయి 2అధ్యా.; గలతీ 4:4,5; రోమా 1:2-9; హెబ్రీ 1:1-5.
మీ హృదయములకు క్రిష్త్మసు మహా సంతోషకరమైన వార్త అందును గాక అను శుభవచనముతో పాటు నూతన సంవత్సరానంద జీవితము వర్ధిల్లుగాక అను శుభవచనముతో పాటు నూతన సంవత్సరానంద జీవితము వర్ధిల్లుగాక అను శుభవచనముకూడ ప్రతిపాదించుచున్నాము.