“ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి
ఇమ్మానుయేలను పేరు పెట్టును” (యెషయా 7:14).
ప్రియులారా! ఇది క్రిష్ట్మసు నెల కనుక పై వాక్యమును ధ్యాన వాక్యముగ గైకొనండి. వరుస:- తమ్ముడును అన్నయును చాలా కాలమునకు ఒకచోట సమావేశమైనప్పుడు “వీరు నీకేమి కావలెను? అని అన్న అడిగెను. (=వీరు నీకు ఏమగుదురు?) “వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే” అని యాకోబు ఏశావునకు జవాబు చెప్పెను (ఆది 33:5) తల్లిదండ్రులు దూర ప్రదేశమునుండి ఒక యవ్వనస్తురాలిని తీసికొనివచ్చి కుమారునికి పెండ్లిచేసినయెడల, వారి బంధువులు ఈ అమ్మాయి నాకు ఏమగును? నీకు ఏమగును? అని మాటలాడుకొందురు గదా! ఈమె నాకు చెల్లెలు అని ఒకరు, నాకు అక్క అని మరియొకరు, నాకు చిన్నమ్మ అని ఇంకొకరు చెప్పుకొందురు. అట్లే పెండ్లి కుమారుడు నాకు ఏమగును, అని పెండ్లికుమార్తె స్వజనులు ప్రశ్నించుకొందురు గదా దేవుడు నరుడై పుట్టి క్రీస్తుగా ప్రసిద్ధిలోనికి వచ్చినపుడు ఈయన నాకు ఏమగునని అందురు.అన్ని విధములుగా ప్రశ్నించుకొని యుందురు. ఇట్లు కొత్తవరుసలు కట్టుకొను వాడుక అందరిలోను గలదు. బంధుత్వమును బట్టి ఒక వరుస, పిలుపునుబట్టి మరియొక వరుస. పిలుపునుబట్టి వరుస కట్టుకొనువారు స్నేహభావము గలవారే గాని బంధువులు కారు.అయినను ఆ పిలుపు వరుస స్థిరమైన వరుసయే.
1. తల్లులు:- ప్రభువు తల్లియైన మరియమ్మకు పూర్వమందున్న భక్తురాండ్రు ప్రభువు జన్మించిన వరుసలోనివారే కాబట్టి వారు ప్రభువునకు ఏమగుదురు? పెత్తల్లులగుదురని చెప్పుచున్నాను. యేసుప్రభువు దావీదునకు సొంతకుమారుడు కాకపోయినను, వంశమును బట్టి కుమారుడని బైబిలులో నున్నది (మత్తయి22:42). కాబట్టి దావీదు ప్రభువునకు తండ్రి వరుసగదా. అట్లే ఆ వరుసలోని భక్తురాండ్రు యేసు ప్రభువునకు తల్లులగుదురు అనుట సరియేగదా! వారెవరో? ఏమగుదురో? కొద్దిగా ఆలోచించవలెను.
1. మొదటి తల్లి హవ్వ:- ఈమె సంగతిలో క్రీస్తు పుట్టినను వాగ్ధానము పాప ప్రవేశకాల మందే చూచాయగ బైలుపడెను. గనుక ఈమె ప్రభువునకు పెత్తల్లి దేవునికి అంగీకారమైన కానుక అర్పించిన సజ్జనత్వమునుబట్టి తన సహోదరునివలన హతుడైన హేబెలు మొదటి హతసాక్షి. తన సహోదరులైన యూదులవలన హతుడైన క్రీస్తునకు హేబెలు ముంగుర్తు. అతనిని కనినందువలన హవ్వ క్రీస్తునకు వరుసకు పెత్తల్లి.
2. రెండవ తల్లి శారా:- ఈమె కుమారుడైన ఇస్సాకు కొండమీద యజ్ఞవేదికపైన గొర్రెపిల్లగ యజ్ఞమరణ మొందుటకు సమ్మతించెను. తండ్రి విధి ప్రకారము కుమారుని చంప యత్నించెను. దేవుడాపుచేసెను. మనస్సులో చంపినట్లే, ఇస్సాకు తన మనస్సును బట్టి మరణించినట్లే అంతరంగముగ ఇస్సాకు చనిపోయి లేచినట్లే హెబ్రీ11:17-19. క్రీస్తు ప్రభువు కల్వరికొండమీద సిలువపైగ మహాయజ్ఞమై మరణించి లేచెను. ఈయనంకు ముంగుర్తైన ఇస్సాకును కనినందున శారా పెత్తల్లి ఆయెను.
3. మూడవ తల్లి రిబ్కా:- ఈమె ‘వేలవేలమందికి తల్లీ అను బిరుదుపొందెను (ఆది 24: 60). ఎవరు క్రీస్తు ప్రభువునకు పెత్తల్లి కానైయున్నారో ఆ లేయా భర్తయగు యాకోబును కనిన రిబ్కాకూడ ప్రభువునకు పెత్తల్లి అని చెప్పవచ్చును.
4. నాల్గవ తల్లి లేయా:- ఈమె రిబ్కా కనిన యాకోబుయొక్క భార్య. ఈమె కొదమ సిమ్హ మని బిరుదు పొందిన యూదాను కనెను (ఆది 49:9). ఈయన గోత్రములో యుదాగోత్ర సిం హమను పేరు పొందిన క్రీస్తు ప్రభువు జన్మించెను. (ప్రకటన 5:5) గనుక యూదా క్రీస్తునకు ముంగుర్తు. తన తమ్ముని విడిపించుటకు ఐగుప్తు యువరాజు దగ్గర తీవ్రమైన విజ్ఞాపన ప్రార్ధన చేసిని యూదా (ఆది 44:16-34) మన కొరకు తండ్రియొద్ద నేడు విజ్ఞాపన చేయుచున్న ప్రభువునకు ముంగుర్తు. ఇట్టి కుమారుని కనినందున లేయా ప్రభువునకు పెత్తల్లి.
5. ఐదవ తల్లి రూతు:- ఈమె అన్యురాలు గాని యూదా గోత్రీకుడైన బోయజునకు భార్యయాయెను. ఈమె దావీదు వరుసలో పుట్టెను. దావీదు వంశములో నుండి యూదులకును అన్యులకును రక్షకుడైన క్రీస్తు పుట్టెను. అందువలన రూతు క్రీస్తునకు పెత్తల్లి (రూతు 4:18-21).
2. మరియొక విధమైన వరుసలు;-
1. ఎలీసబెతునకు క్రీస్తు ప్రభువు ఏమగును? ఆమె మరియమ్మను చూచి “నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? అని పలికెను. గనుక ఆమెకు క్రీస్తు ప్రభువగును (లూకా 1:43).
2. కాపరులకు క్రీస్తు ప్రభువు ఏమగును? దేవదూత వారికి ప్రత్యక్షమై “నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు” అని చెప్పెను. గనుక వారికి క్రీస్తు రక్షకుడు (లూకా 2:11).
3. తూర్పు జ్ఞానులకు యేసుప్రభువు ఏమగును? క్రీస్తును పూజింప వచ్చితిమని వారు చెప్పిన మాటను బట్టి చూడగా వారికి క్రీస్తు ప్రభువు పూజనీయుడగును (మత్త 2:2).
4. ఫిలిప్పునకు ప్రభువు ఏమగును? “నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు” అని ప్రభువు ఫిలిప్పునకు చెప్పెను (యోహాను 14:9). గనుక ప్రభువు ఫిలిప్పునకు తండ్రియగును.
5. క్రీస్తునకు యూదా ఇస్కరియోతు ఏమగును? యేసు చెలికాడా! అని అతనిని పలుకరించి నీవు చేయవలసినది చేయుమని చెప్పెను. గనుక అతడు క్రీస్తునకు చెలికాడా! గాని క్రీస్తు అతనికి చెలికాడు కాడు. ఇది మిగుల దుఃఖకరమైన సంగతి. నేడు ఆయన శిష్యులలో ఇట్టివారెందరున్నారో!
6. ప్రభువు సువార్తికుడైన యోహానుకు ఏమగును? సిలువమీద నుండి ప్రభువు తల్లిని చూచి అమ్మా! ఇదిగో నీ కుమారుడని యోహాను గురించి చెప్పెను. యోహానును చూచి ఇదిగో నీ తల్లియని మరియమ్మను గురించి చెప్పెను గనుక యోహాను క్రీస్తునకు సహోదరుడు (యోహాను 19:26).
7. తోమాకు ప్రభువు ఏమగును? ప్రభువును చూచి అతడు “నా దేవా” అని సంబోధించెను. (యోహాను 20:28). కనుక క్రీస్తు తోమా కు దేవుడు.
3. చదువరులారా! మీరు మీ ఆత్మీయ స్థితినిబట్టి క్రీస్తునకు ఏమగుదురు? క్రీస్తు మీకు ఏమగును? ఇది క్రిష్ట్మసు కాలమందు ఆలోచించవలసిన ఒక ముఖ్యాంశము. ఈ ప్రశ్నకు సరియైన జవాబు చెప్పగలవారే క్రిష్ట్మసు పండుగ సరియైన రీతిగా ఆచరింపగలవారు. కాపరులకు క్రీస్తు రక్షకుడు. కాపరులు క్రీస్తునకు రక్షణ పొందిన రక్షితులు. మీ మాట ఏమి? భక్తురాండ్రు ప్రభువునకు తల్లులు ప్రభువు వారికి కుమారుడు. నిరీక్షణ రక్షకుడు. చదువుచున్న వారలారా! మీ వరుస ఎట్లున్నది?
4. ఆ మొదటనున్న హవ్వ అను స్త్రీ వలన లోకమునకు పాపము వచ్చెను. ఇది గొప్ప అపకీర్తి. ఈ కడనున్న మరియమ్మ అను మరియొక స్త్రీ వలన పాపము పరిహరింపగల రక్షకుడు వచ్చెను. ఇది గొప్పకీర్తి. చదువరులారా! మీ ప్రవర్తన వలన మీకు కీర్తి రాగలదా? ప్రభువునకు ఘనత రాగలదా? ఇతరులకు మంచి మాదిరి కనబడగలదా? ఆలోచించండి.
5. గతకాలమందు రక్షకుని కొరకు ఎదురుచూచిన తల్లులను, జన్మకాలమందు పరిశుద్ధ శిశువును దర్శించిన కాపరులను, దూరమునుండి వచ్చి బాలుని పూజించిన జ్ఞానులను తలంచుకొని మీరెట్లు క్రిష్ట్మస్ ఆచరింతురో! మీ అందరకు క్రీస్తు చరిత్ర భాగ్యము కలుగునుగాక! ధ్యానము వలన మీకు క్రొత్త విషయములు అగుపడునట్లు మీ జ్ఞానమునకు క్రిష్ట్మసు వెలుగు కలుగునుగాక!