(నిర్గమ 15:16) ధవళేశ్వరములో ఒక పేట యొక్క పేరు ‘గట్టు.’ నిర్గమకాండము 14,15 అధ్యాయములలో ఒక గట్టు ఉన్నది. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రము దాటి అవతల గట్టు ఎక్కిరి. సముద్రములో నడిచివెళ్ళి గట్టు ఎక్కిరి. సామాన్యముగా గడిచి గట్టెక్కినామని చెప్పుకొనుటకు మనకు పాత సంవత్సరము ఇవతల గట్టు. క్రొత్త సంవత్సరము ఆరంభ గట్టు. అవతలి గట్టు ఎక్కునప్పుడు వెనుకకు తిరిగి చూచిన ఏమి కనబడును? వారెక్కడ నుండి ప్రయాణము చేసిరో అక్కడ నుండి, వారు నిలుచున్న స్థలము వరకు కనబడును. ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యము దాటి, సముద్రము దాటి గట్టు ఎక్కియున్నారు. గనుక సముద్రముయొక్క పాయకూడ కనబడును. నీలగిరి కొండలకు రైలులో వెళ్ళునప్పుడు కూడ పైకి వెళ్ళిన తర్వాత క్రిందికి చూచిన చాల భయంకరముగా నుండును. అలాగే వారు ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూచిన ఎంత భయంకరము. గతించిన జనవరి నెల 1వ తారీఖు నుండి డిశంబరు 31వ తారీఖు వరకు పన్నెండు నెలలు దాటి వచ్చిన్నాము. తుదకు నూతన సంవత్సరములో ప్రవేశించినాము. వెనుకకు తిరిగి చూచిన ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు దాటి వచ్చినది తెలిసికొనగ్గలము. ఇశ్రాయేలీయులు గట్టు ఎక్కిరి. పాట పాడిరి. స్తుతించిరి. కీర్తన కట్టుకొని పాడిరి. ఆ కీర్తన కట్టిన వారు మోషే. పాడినవారు మోషే అక్క. చెలికత్తెలు స్తుతికీర్తన పాడిరి. ఐగుప్తులో ఒక గండము, రెండవ గండము, మూడవ గండము, తరువాత సముద్రము దగ్గర గొప్ప గండము అవన్నీఇ దాటుకొని వచ్చినారు గనుక దేవుని స్తుతించిరి. (1) వారు ఐగుప్తులో 400 సంవత్సరములు బానిసత్వములో నుండిరి. స్వదేశమునకు రాలేదు. ఫరోయొక్క చేతిలోనున్నారు. ఐగుప్తు బానిసత్వము నుండియు, ఫరోచేతి నుండియు తప్పించినందులకు దేవుని స్తుతించిరి. గండము తప్పించిన దేవునికి దండము పెట్టిరి. (2) మోషే అహరోనులు మిద్యాను దేశమునుండి వచ్చి, ఫరో రాజుతో మాట్లాడిరి. ఫరో దర్భారునకు వెళ్ళి మా దేవుని పూజించుటకు ఇశ్రాయేలీయులకు సెలవిమ్మనగా రాజునకు కోపము వచ్చెను. అతడు మోషే అహరోనులను చూచి మీరు వచ్చిన తర్వాత వీరు బద్దకస్థులైరి. ‘పని చేయుము అనుచున్నారు ‘ అని చెప్పెను. అప్పటి నుండి రెట్టింపుపని చేయవలసినదని ఇశ్రాయేలీయులకు రాజు ఆజ్ఞాపించెను. వారందరు మోషే అహరోనులను తిట్టినారు. తుదకు వీరి వలన వచ్చిన గండము కూడ దాటి గట్టెక్కినందున దేవుని స్తుతించిరి. (3) ఇశ్రాయేలీయుల యొక్క మగ పిల్లలనందరిని చంపవలెనని రాజు మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చెను. తరువాత మగ పిల్లలను నదిలో పడవేయవలెనని ఆజ్ఞాపించెను. ప్రభువు జన్మించినపుడు “రామాలోని అంగలార్పు” వలె అంగలార్పు కలిగెను. రేపు వీరు ఎదిగి మా మీదికి యుద్ధమునకు లేతురు గనుక పిల్లలను చంపి ఉన్న వారితో ఇంకా కొంత కాలము పని చేయించుకొనవచ్చునని రాజు తలంచెను. ఇశ్రాయేలీయుల మగ పిల్లలను చంపి, ఆడపిల్లలను ఐగుప్తీయులకు ఇచ్చుట వలన ఇశ్రాయేలీయుల సంతతి గతించిపోవును అని రాజు తలంచెను. ఎంత గొప్ప గండము! అది తప్పెను గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు. (4) వారు ఐగుప్తు దాటి బయలుదేరి వచ్చుచుండగా ఫరో తన సైన్యమును పంపి వారిని పట్టుకొని తీసికొనిరండని చెప్పెను. ఆరులక్షల జనమును కొద్దిమంది తీసికొని రాగలరా? ఆయుధములున్నవి గనుక చేయవచ్చును. వారికి ముందు సముద్రమున్నది. వెనుక ఐగుప్తు సైన్యమున్నది. ఎట్లు ఈ గండము దాటుట? ఆడవారు, మగవారు, పిల్లలు, పశువులు ఆఖరికి పిండి పిసికే తొట్లుకూడ తీసికొని వెళ్ళుచున్నారు. ఇశ్రాయేలీయులు మోషే మీద మూల్గుకొన్నారు. మొదట గోషేను దేశములో, తరువాత సముద్రము దగ్గర మూల్గుకొన్నారు. సముద్రగండము తప్పినది గాని వెనుక శత్రువులు వస్తున్నారు. వారి రథముల సీలలు ఊడిపోవుచున్నవి. అవి వారు సర్దుకొనుచుండగా ఇశ్రాయేలీయులు దాటిపోయి గట్టెక్కినారు. ఐగుప్తు సైనికులకు విశ్వాసము కలిగినది. ఇశ్రాయేలీయులు వెళ్ళగలిగిరి గనుక మనమెందుకు వెళ్ళలేము. తప్పకుండ వెళ్ళగలమని ముందుకు పోయిరి. ముందు ఒక రథమును తర్వాత ఒక రథమును లోనికి దింపిరి. వారు పాయను బట్టి విశ్వసించిరి. లోపలికి వచ్చిరి. ఇంతలో ఇశ్రాయేలీయులు ఆవలిగట్టునకు చేరినారు. దేవుడు మోషేతో నీ కర్ర మరల సముద్రము వైపు చాపుమనగా, ఐగుప్తు పటాలము సీసపుగుండు నీటిలోవేసిన ఎంత త్వరగా మునిగిపోవునో అంత త్వరగా వారు మునిగిపోయిరి. వారు వట్టి పాయమీదనే విశ్వాసముంచిరి గనుక రక్షణ కలుగలేదు.
ఈ లోకములోని సంఘమునందు నామకార్ధక్రైస్తవులున్నారు. వారికి లోక సంబంధమైన వాటిమీద విశ్వాసము గాని దేవునిమీద, దైవభక్తులమీద విశ్వాసముండదు. ప్రకటన గ్రంధములో కొందరు ‘మామీద పడుడని కొండలను ‘ ప్రార్ధింతురు. విశ్వాసముతో ప్రార్ధింతురు, అయినా ఆ ప్రార్ధన కొండలకు వినబడుతుందా? వినబడదు. ఐగుప్తీయులకు సృష్టి మీద నమ్మకమున్నది గాని దేవుని మీద విశ్వాసములేదు గనుక నశించిరి. దేవుని నమ్మిన రక్షణ కలిగియుండెడిది. ఇశ్రాయేలీయులు అన్ని గండములు దాటి దేవుని స్తుతించిరి.
పాత సంవత్సరములోని గండములన్నిటిని తప్పించి నూతన సంవత్సరములో చేర్చిన తండ్రిని స్తుతించు కృప మీ అందరికిని కలుగునుగాక! ఆమెన్.