క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. నూతన సంవత్సరము...
  5. నూతన సంవత్సరము

నూతన సంవత్సరము

[2వ రాజులు 5:1-19. ఇందున్న వర్తమానము సువార్తికులకు, రోగులకు, క్రొత్త సంవత్సరము ఆచరించువారికి.]

(1) ఒకప్రక్క పాలస్తీనా దేశము. దాని ముఖ్యపట్టణము షోమ్రోను, అందున్న దైవజనుడైన ఎలీషా ప్రవక్త. అది దైవజనులుండు దేశము.

(2) మరియొక ప్రక్క ఆరాము దేశము. దాని ముఖ్యపట్టణము దమస్కు. సైన్యాధిపతి నయమాను,. ఇది అన్యదేశము.

(3) నయమాను యుద్ధములో జయశాలి, ఘనుడు, దైర్యశాలి. రాజుయొక్క గౌరవము పొందినవాడు. సజ్జనుడు. దేవునియొక్కయు, రాజుయొక్కయు కటాక్షము పొందినవాడు. ప్రజలవల్ల మెప్పు పొందినవాడు. పనిలో పరాక్రమశాలి.

(4) ఎలీషా-దైవజనుడు. అనగా దేవుని వర్తమానము అందుకొని దాని ప్రకారము నడిచేవాడు. అందరికి వర్తమానము అందించేవాడు. ఇద్దరూ గొప్పవారే గాని దైవజనుడు ఇంకా గొప్పవాడు. నయమాను ఎంత గొప్పవాడైనను శరీర ఆరోగ్యము లేదు. ఇతడు పాలెస్తీనా దేశముపై దండెత్తి, దానిని జయించి, అక్కడనున్న ఒక అమ్మాయిని తన భార్యకు పరిచర్య చేయుటకు తీసికొని వచ్చెను. ఆ అమ్మాయి దేవుని సంఘములోని అమ్మాయి.

(5) నయమాను ఎంత గొప్పవాడైనను అతనికి మనసులో నెమ్మది లేదు. పై మెప్పులన్నిటి వలన అతని మనసునకు నెమ్మది కలుగవలసినది గాని అతనికి నెమ్మది కలుగలేదు. ఆలాగే విశ్వాసులలో నెమ్మదిలేని వారుందురు. అయితే వారికి దేవుని వాక్యమున్నది. గనుక నెమ్మది కలుగును. అయితే నయమానుకు ఆ వాక్యము లేదు గనుక నెమ్మదిలేదు.

(6) ఇశ్రాయేలీయుల దేశములోనుండి తాను తెచ్చిన బాలిక, ప్రవక్తను గూర్చిన వర్తమానము వినిపించెను. ఈ వర్తమానము నాలుగు స్టేషనులకు వెళ్ళినది. బాలిక నుండి నయమాను భార్యకు, భార్య నుండి నయమానుకు, అతనినుండి రాజు దగ్గరకు వెళ్ళెను. స్వత్షత కూటములు శర్రే బాగుకొరకు, ఆదివారము ఆరాధన ఆత్మ బాగు కొరకు ఉపయోగపడును.

(7) ఆ బాలిక వర్తమానము డాక్టర్లు ఇవ్వవలసిన వర్తమానము. నేను బాగుచేస్తాను, నీవు చావవు అని డాక్టరు చెప్పిన యెడల రోగికి సంతోషముగా నుండును. ఆలాగే బాలిక వర్తమానము వలన నయమానుకు సంతోషము కలిగెను. ఈ వర్తమానము, భార్య నమ్మెను. రాజు కూడ నమ్మెను గనుక ఇశ్రాయేలీయుల రాజునకు ఉత్తరము వ్రాసి ఇచ్చెను.

(8) నయమాను రథములను సిద్ధపరచుకొను, యొర్ధాను నది దాటి ఇశ్రాయేలీయుల దేశములో నున్న షోమ్రోను నందుగల ప్రవక్తయైన ఎలీషా బంగళా దగ్గర రథములను ఆపు చేసెను. ప్రవక్త నయమాను సంగతి తెలిసికొని తన సేవకునితో కబురు పంపెను. ఆ కబురు ఏమనగా యొర్ధాను నదిలో ఏడు పర్యాయములు స్నానము చేసిన యెడల రుగ్మత పోవును అని ఆ సేవకుడు వచ్చి చెప్పెను.

(9) నయమానుకు వెంటనే కోపము వచ్చెను. పాలెస్తీనా దేశములోని నదిలో మునుగుటా? యొర్ధాను నదిలో మునిగిన కుష్టు పోవునా? నీళ్ళకు కుష్టు రోగము పోవునా? ఈ దేశపు నదులు గొప్పవా? ప్రవక్త దగ్గరకు వచ్చి చెయ్యి ఆడిస్తే పోవుననుకున్నాడు. ప్రవక్త యొక్క రెండు నేరములు. 1. ముఖము చూపించలేదు. 2. బయటకు రాలేదు. నయమాను మనసులో శాంతి లేదు గనుక దేవుడే శాంతి పరచవలెను. “మతిని శాంతి పరచియున్న-నేడు మతిని శాంతి పరచుచున్న”

(10) నయమాను దైవజనుని మాట నమ్మలేదు. ఆయన చెప్పినట్లు నీళ్ళలో మునిగిన వ్యాధి పోవునని నమ్మలేదు. సైన్యాధిపతికి ఆరాము దేశములో బయలుదేరినప్పుడు నమ్మకమున్నది. ప్రయాణమంతటిలో నమ్మకమున్నది. ఎలీషా గుమ్మము దగ్గరకు వచ్చువరకు నమ్మకము కలదు గాని ప్రవక్త మాటలు వినగానే కోపము వచ్చెను. హృదయములో కోపమున్నది. శరీరములో రోగమున్నది. తలంపులో ఇంటికి పోవలెనని ఉన్నది. వెంటనే రథము వెనుకకు త్రిప్పించెను. అలాగే కొందరికి శోధనలు రాగానే ఉద్రేకము పెరిగి విశ్వాసము, నెమ్మది అన్నియు ఎగిరిపోవును. బాలికమాట విన్నప్పుడు నయమానుకు నమ్మిక గలదు. భార్య చెప్పినప్పుడు, రాజు సెలవిచ్చినప్పుడు, బయలుదేరినప్పుడు, ప్రయాణమంతటిలో, ప్రవక్త బంగళా దగ్గరకూడ నమ్మకము గలదు గాని దైవజనుని మాట వినగానే అన్ని ఎగిరిపోయినవి. క్రైస్తవులు శోధనలలో, ఉన్నపుడు తమ విశ్వాసము, నెమ్మది అన్నియు పోగొట్టుకొందురు. జాగ్రత్త! నయమానుకు అన్ని స్థలములలోను ఉన్న నెమ్మది ఇప్పుడు పోయెను. ప్రయాణములో ఖర్చు అయిపోయినది. పదిమంది కన్యకల చరిత్రలో కూడ పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని వినబడగానే బుద్ధిలేని అయిదుగురిలో నున్న మొత్తము విశ్వాసమంత ఖర్చు అయిపోయెను. అలాగే నయమానుకు ఖర్చైపోయినది. అలాగు నమ్మిక పోవుటకు ప్రవక్తయొక్క మాటయే కారణము. అంతకు ముందు రథము నిండ కానుకలున్నవి. హృదయము నిండ సంతోషమున్నది. గాని దైవజనుని మాట వినగానే సంతోషము ఎక్కువ కావలసినది. గాని తగ్గిపోయినది. “తగ్గును గాక” అని అనకపోయినను కన్యకల సిద్దెలలోని నూనె తగ్గెను. ఏలాగైనను శోధన రాగానే ఆది విశ్వాసము, ఆది సంతోషము, ఆదినున్న శాంతి తగ్గును. ఆలాగు తగ్గినయెడల బుద్ధిలేని కన్యకలవలె నగుదురు. అనేకులు రాకడ సువార్తలోనికి, రాకడ గుంపులోనికి వెళ్తారుగాని ఎత్తబడరు. ఆరాము దేశపు రథమువలె, అయిదుగురు కన్యకలు నూనె కొనుక్కొనుటకు రధము త్రిప్పిరి. జాగ్రత్త! అరాము దేశపు రథము యొక్క కథవలె రాకడలో నుండును. దీపాలు ఆరిపోయే కథ. లోనికి వెళ్ళని కథ, నూనె కొనుక్కొనవలెనని నేర్పిన కథ. తలుపు మూయబడిన కథ జరుగును. అప్పుడు మురుపు ఉండదు. అరుపు ఉండును. అయ్యో! నేను వెళ్ళలేదు అనేది ఉండును. తర్వాత కొనుక్కొని వచ్చిన లాభము లేదు.

(11) బాలిక సువార్త నయమాను భార్యకు, ఆమెనుండి నయమానుకు, నయమానునుండి రాజునకు, ఇవి వర్తమానము ప్రయాణము చేసిన స్టేషనులు. ఇప్పుడు ప్రవక్త యొక్క వర్తమానము దేవునినుండి ప్రవక్తలోనికి వచ్చెను. ఆ వాక్కు దైవజనుని సేవకునిలోనికి, అక్కడనుండి నయమానుకు వచ్చెను.

(12) నయమాను రథమును అరాము దేశమునకు త్రిప్పించెను. ఇప్పుడు దాసుడు సలహానిచ్చెను. ప్రవక్త ఇంత సుళువైన పని చెప్పినప్పుడు ఎందుకు చేయకూడదు? కష్టమైన పని చెప్పిన యెడల మానివేస్తే బాగుండును.కష్టమైన పని అయిన యెడల చేస్తారు గదా! సుళువైనది ఎందుకు చేయకూడదు? అని చెప్పెను. అప్పుడు నయమాను మరల తన రథమును పాలెస్తీనా దేశములోనున్న యొర్దాను నదికి నడిపించెను. ప్రవక్త చెప్పినట్లు ఏడుమార్లు మునుగగా స్వస్థత కలిగెను.

(13) శరీరముపై వ్యాధి లేదు, బాధలేదు, వాపులేదు, ఇంకా ఉన్నదే అనే అనుమానము కూడ లేదు. వ్యాధి నివారణకు బైబిలులో “విమోచన” అని వ్రాయబడియున్నది. నయమాను కుష్టురోగపు పట్టులోనున్నాడు. అయితే దైవజనుని మాట వలన ఆ పట్టునుండి విమోచన కలిగెను. మనసులోని గందరగోళమంతయు పోయెను. ఆలాగే వాక్య ప్రకారము చేసిన యెడల అన్ని ఉపకారములు కలుగును. నయమానుకు పసిపిల్లల శరీరము వంటి శరీరము వచ్చెను. ఇది రక్షణ భాగ్యము, ఇది విమోచన. వ్యాధులులేని తలిదండ్రుల యొక్క పసిపిల్లలు ఏలాగుందురో అట్టి శరీరము నయమానుకు వచ్చెను. అరాములో అతనికి ఎల్లప్పుడూ కుష్టు కనబడేది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అదిలేదు.

(14) దేవుడిచ్చిన రక్షణ భాగ్యము మనమునూ అందుకొనవలెను. జబ్బు పోయిన తర్వాత రోగి మంచి ఆహారము తీసికొనునట్లు రక్షణభాగ్యము మనిషి అనుభవించవలెను. వ్యాధిపోయిన తరువాత నయమానుకు మనసులో నెమ్మది, సంతోషము వచ్చినది. ఇప్పుడు మరల వచ్చి ప్రవక్తతో సంభాషించెను. ‘యెహోవాయంతటి దేవుడు లేడు ‘ అని సాక్ష్యమిచ్చెను.

(15) సైన్యాధిపతి తెచ్చిన కానుకలు మూడు రకములు. ఇరువది మణుగుల వెండి, లక్ష ఇరువైవేల రూపాయల ఖరీదుగల బంగారము, పది దుస్తుల వస్త్రములు. (అంతబంగారము, అంత వెండి ఎవరైనా ఇచ్చినారా? అట్లు ఇస్తే దేవుని సేవ ఎంత జయకరముగా జరుగును అని అనుకొందూ.) అయితే ఎలీషా తీసికొనలేదు. ఆయనకు అక్కరలేదు. ఆయన దాచుకోలేదు. ఆయనకు దేవుడు అనుదినము ఇచ్చుచున్నాడు గనుక అవన్నీ ఎందుకు? అసలు పుచ్చుకొనే మనసే కనబర్చలేదు. నయమాను యొక్క మనసులో క్రొత్త విచారము కలిగెను. బహుమానము తీసికొనలేదనే విచారము. ఇది వరకు కలిగిన కోపమునకు బదులు ఇప్పుడు మనసులోనికి విచారము వచ్చెను. దీవించలేదని కాదు. బహుమానము పుచ్చుకొనలేదని విచారము నదినుండి వచ్చేటప్పుడు , బాగుపడినప్పుడు , రెండవమారు ప్రవక్త బంగళాదగ్గరకు వచ్చినపుడు సంతోషమే గాని ఒక మారు సంతోషము, ఒకమారు విచారము ఉండును.

(16) నయమాను బోధకులు: 1. బాలిక 2. భార్య 3. రాజు. వీరంతా వెళ్ళుము అని సెలవిచ్చిరి. ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప? అరాము రాజు అన్యుడైనను ప్రవక్త దగ్గరకు పోవుటకు సెలవిచ్చెను. 4. తిరిగి తన దేశమునకు వెళ్ళక ముందే సలహానిచ్చిన సేవకుడు. 5. ఎలీషా 6. ఎలీషా సేవకుడు వీరందరు-బోధకులు

(17) క్రొత్త సంవత్సరము వర్తమానము వలన నయమానుకు నూతన శరీరము వచ్చెను. ఆయనకు పాత సంవత్సరము, వ్యాధి, రోగము, కుష్టువ్యాధి ఉన్న కాలము. ఇప్పుడు నయమానుకు క్రొత్త సంవత్సరము అనగా క్రొత్త శరీర ఆరోగ్యము, క్రొత్త సంతోషము, క్రొత్త వార్త, క్రొత్త నెమ్మది కలిగెను. నయమానుకు ఎలీషా యొక్క ఆఖరి వర్తమానము “నెమ్మది కలిగి పొమ్ము”. అది అతనికికెంతో సంతోషము. పాపాత్మురాలైన స్త్రీతో కూడ యేసుప్రభువు అదేమాట చెప్పెను.

(18) యేడుమారులకు బదులు ఆరుసార్లు మునిగిన సరిపోవునా? అది విధేయత కాదు. దేవుని ఆజ్ఞ ఎట్లుంటే అట్లే విధేయులము కావలెను. మొదట నయమానుకు అవిధేయత, రెండవమారు విధేయత కలిగెను. 1. ఎలీషా నుండి వచ్చిన దైవవాక్కు గొప్పదా? 2. నయమాను విశ్వాసము గొప్పదా? 3. నది నీళ్ళు గొప్పవా? వాక్యము గొప్పది గాని నమ్మిక లేకపోతే విన్నా లాభము లేదు.

(19) నయమాను కథలోని వ్యక్తులలో ఎవరియొక్క ఉద్యోగము మీకు కావలెను? కథలోని అమ్మాయి యొక్క పేరు లేదు గాని, ఆ అమ్మాయి పనివల్ల ఆమెకు మంచిపేరు గలదు. ఈ లోకములో కూడ ఆ అమ్మాయివలె పేరులేని వారుందురు. రేపు పరలోకమునకు వెళ్ళిన తర్వాత నీవింత పనిచేసినావా? అని అడుగుదుము.

(20) స్నానము చేయకముందు నయమానుకు కళంకము కలదు, స్నానము చేసిన తర్వాత కళంకము పోయి కళ వచ్చినది. ప్రభువు యొద్దకు వచ్చువారందరికీ కళంకము పోయి కళ వచ్చును.

(21) నయమానుకు శరీర శుద్ధి, ఆత్మశుద్ధి రెండును వచ్చినవి. ఆత్మలో విశ్వాసము, విధేయత, సంతోషము, నెమ్మది, విమోచన, సాక్ష్యము కలిగెను. యెహోవా వంటివారు ఎవరును లేరు అని చెప్పగలిగెను. ప్రభువును తెలిసికొనువారందరు అలాగే చెప్పవలెను.

నూతన సంవత్సరములో నయమానుకు కలిగిన వార్త, విశ్వాసము, విధేయత, విమోచన, స్వస్థత, కళంకము పోవుట, కళ వచ్చుట; ఈ నూతనమైన సంవత్సరములో ఈ మేళ్ళు అన్ని మీకు కలుగును గాక!

Please follow and like us:

How can we help?

Leave a Reply