యోవేలు 2: 28,29; కార్య,. 2అధ్యా, రోమా. 9:26.
ఈ దినము పరిశుద్ధాత్మ పండుగ దినము. క్రిస్ట్మస్, పునరుత్థాన పండుగల వంటిదే ఈ పరిశుద్ధాత్మ పండుగ. ఈ పండుగను పరిశుద్ధాత్మ, విశ్వాసి ఇద్దరు కలిసి చేయవలెను. అదే పండుగ. ఈ దినమున నూత ఇరువది మంది, పరిశుద్ధాత్మను పొందవలెననేమో మేడగదిలో కూడుకొనిరి. వారు సిద్ధము కాగా ఆత్మ లోపలికి వచ్చెను. అట్లు వచ్చుటే అసలు పండుగ. ఇద్దరు అనునది జ్ఞాపకముంచుకొనవలెను. ఎందుకనగా అనేక విషయములలో ఇద్దరు కనిపింతురు. బాప్తిస్మ కార్యక్రమంలో బాప్తిస్మము పొందువారు, బోధకుడు ఇద్దరు పాల్గొందురు. పరిశుద్ధాత్మను పొందుటకు ఆశపడుచున్న విశ్వాసికి కూడా ఇద్దరుండవలెను. ప్రభు రాత్రి భోజనము ఇచ్చువారు మరియు పుచ్చుకొనువారు కూడా ఉండవలెను. పై వాటిలో ఒక్కరున్న యెడల పని జరుగదు.
ఆత్మను పొందుటకు సిద్ధపడుట అనగానేమి? కార్యములు 2వ అధ్యాయములో బయటనున్నవారు బోద వినిరి, గ్రహించిరి. పశ్చాతాప పడిరి. తప్పు ఒప్పుకొనిరి, నీళ్ళ బాప్తిస్మము పొందిరి. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుదురని చెప్పెను (2:38), యేసుప్రభువు మరియొక క్రమమును ఆఖరు ఆజ్ఞలో చెప్పెను. అదేమనగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి (మార్కు 16:15). ఆ ఆజ్ఞ ప్రకారము బోధింపబడుచున్న వాక్యమును విన్నవారు నమ్మవలెను. పిమ్మట బాప్తిస్మము పొందవలెను. తర్వాత రక్షణ కలుగును. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలెను. యోహాను -నేను నీళ్ళతో బాప్తిస్మమిచ్చుచున్నాను, నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చుననెను. ఆత్మ బాప్తిస్మము రక్షణ తర్వాత పొందవలెను. యేసు ప్రభువు ఆదరణకర్తను పంపింతునని చెప్పెను. ఈ విషయమును గూర్చిన తండ్రి వాగ్ధానము యోవేలు గ్రంధములో నున్నది. ఈ విషయమును గూర్చి, బాప్తీస్మమిచ్చు యోహాను మరియు యేసు ప్రభువు కూడ చెప్పెను. పరిశుద్ధాత్మ బాప్తీస్మము పొందుదురని పేతురు ద్వారా కూడా పరిశుద్ధాత్మ తెల్పుట పైన పేర్కొనబడినది. గనుక త్రిత్వము ఆత్మ బాప్తీస్మమును గురించి చెప్పిరి. నీళ్ళ బాప్తీస్మము పొందినవారు, ఆత్మను పొంది మహిమకు సిద్దపడవలెను. రక్షణ కలిగించు నీళ్ళ బాప్తీస్మములో త్రిత్వ నామ మున్నది. అలాగే ఆత్మ బాప్తీస్మ విషయములో కూడ ముగ్గురి పలుకులు ఉన్నవి గనుక ఆత్మ బాప్తీస్మము కూడ పొందవలెను. నీళ్ళ బాప్తీస్మము పాదిరిగారు, ఆత్మ బాప్తీస్మము యేసుక్రీస్తు ప్రభువు ఇవ్వవలసి ఉన్నది.
యేసు ప్రభువునకు యోహాను, బాప్తీస్మము ఇవ్వగానే, తండ్రియైన దేవుడు అత్మను కుమ్మరించెను. అక్కడ ప్రభువు దేవుడుగా లేడు గాని మనకు బదులుగా వచ్చిన అసలైన మనిషిగా నుండెను. అందువలన రెండు బాప్తీస్మములు ఒక స్థలములోనే ఒకే సమయమున పొందెను. ప్రభువునకు మాత్రమే ఆలాగు జరిగెను. యేసు ప్రభువు ఆరోహణణుడైన తర్వాత ఆత్మ (ఆదరణకర్త) వచ్చెను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పొందినవారే, ప్రభువు ఊదగా ఆత్మను పొందిరి. (యోహాను 20:22). ప్రభువు ఇచ్చిన ప్రభురాత్రి భోజనము పుచ్చుకొన్నవారే తర్వాత ఆత్మకొరకు కనిపెట్టిరి. ఆత్మను పొందవలెనన్న ఆశ అనేకులకు ఉన్నది గనుక సిద్ధపడుచున్నారు గాని వారిలో అనేక లోపములు ఉన్నవి. వాటిని దిద్దుకొనవలెను. ప్రయత్నముచేసి పొందుట అవసరము. యోవేలు గ్రంధములో సర్వజనుల మీద ఆత్మ కుమ్మరింతునని చెప్పెను. 120 మంది సర్వజనులు కారు. వారు యూదా జనాంగ ప్రతినిధులు మాత్రమే. మనము కూడ ఆత్మను పొందిన యెడల “సర్వ జనులు” అను మాట నెరవేరును. 120 మంది 10 దినములు ఆత్మను పొందవలెనని కనిపెట్టినారు. ఆలస్యమగునని తొందరపదవద్దు, ఆ అనుభవము ద్వారా వారికి క్రొత్త బలము, క్రొత్త అనుభవము, క్రొత్త సాక్ష్యము కలిగెను. ఆత్మ బాప్తిస్మమును గూర్చి వాక్యములో నున్న వచనములన్ని చదివిన, ఆత్మ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత తెలియును. శోధనలో పడకుండ ఉండుటకు ఆత్మ బాప్తిస్మము అవసరము. ఏదో ఒక బలహీనతలో పడిన వారికి, మరల బలము పొందుటకు ఆత్మ అవసరము. ఒక్క సారి ఆత్మను పొందిన తర్వాత, కొలత లేకుండ ఎన్ని పర్యాయములైన పరిశుద్ధాత్మను పొందవచ్చును.
పేతురు లేడివలె నీళ్ళపై నడచి, మునిగి పోవుదునని భయపడి మునిగిపోవుచుండగా, రెక్కపట్టి ప్రభువు అతనిని పైకిలాగెను. అట్లే ఆత్మను పొందిన తర్వాత ఏదైన బలహీనత వల్ల తగ్గిపోవునప్పుడు, ఆత్మ తండ్రి పైకి లాగును. పేతురు మునుగుటకు ముందు ప్రభువును కలిగియున్నాడు గనుక ఆ సమయమున ప్రభువు లేవనెత్తెను. అలాగే ముందుగానే ఆత్మను కలిగియున్న యెడల, బలహీనతలో మునుగుచున్నప్పుడు ఆత్మ పైకి లేవనెత్తెను. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్ధానము ఇంకను నిలిచియున్నది. ఆత్మను పొందుటకు అనేక పేర్లు గలవు. అవి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకము. ఆత్మను గురించి యోవేలు, యెషయా, స్నానికుడైన యోహాను, పౌలు, పేతురు మొదలైనవారు చెప్పినవన్ని కలిపిన, గొప్ప గ్రంధమగును. ఆదికాండము మొదటి అధ్యాయములోనే “ఆత్మ అల్లాడుచుండె” నని గలదు. చివరి గ్రంధమగు ప్రకటన వరకు ఆత్మను గురించిన వచనములు, ఎర్రసిరాతో గుర్తుపెట్టండి. ఓ పాపి! నీ పాపాలు నీవు తెలిసికొనలేదు, ఒప్పుకొనలేదు, బోధ నీకు వద్దు, వాక్యము నీకు వద్దు. వీటిని విడచి నీవు ప్రభువు చెంతకు చేరినట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీకు ఇవ్వబడును. నీవు కోరినట్లయితే నీళ్ళ బాప్తిస్మమునకు ముందే ఆత్మ బాప్తిస్మము ఇవ్వబడును. కైసరయ పట్టణములో కొర్నేలీ అట్లు పొందెను. మీరు ఈలాగున ప్రార్ధించండి. ఓ ప్రభువా! నాకైతే ఆత్మ బాప్తిస్మము నందు నమ్మకము లేదు గాని ఒక బోధకుడు ఈలాగు చెప్పెను.
ఓ పరిశుద్ధాత్మ తండ్రీ! నీవు ఇచ్చు అనుభవమంతయును అనుభవింపగలిగిన శక్తి నాకు దయచేయుము. ఆమేన్.