యోవేలు 2:28-30; మత్తయి 3:11,12; కార్య 2వ అధ్యా.
జరిగిపోయిన పెంతెకొస్తు పండుగను మరియొక మారు ఆచరించుటకు వచ్చిన వారలారా! మీకు పరిశుద్ధాత్మ యొక్క విషయములు బోధపడును గాక! ఒక మిషనెరీ గారు తన ప్రసంగములో క్రైస్తవులకు క్రీస్తు ప్రభువునవు గురించి బాగుగా తెలియును గాని పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా తెలియదని చెప్పెను. పరిశుద్ధాత్మను గురించి బైబిలులోనున్న వాక్యములన్ని చదువుటయే ఒక ప్రసంగము. ఆత్మను గురించి ముగ్గురు ప్రవక్తలు ప్రవచింరి. మొదట యోవేలు అను ప్రవక్త ప్రవచించెను. తర్వాత కొన్ని వందల ఏండ్లకు యోహాను ప్రవచించెను. ఈ కాలములోనే క్రీస్తు ప్రభువు కూడ ఆత్మను గురించి ప్రవచించెను. వీరు ఒకే ఆత్మను గురించి ప్రవచించిరి గాని యోవేలు ఒక రీతిగాను , యోహాను వెరే రీతిగాను, యేసుప్రభువు మరియొక రీతిగాను చెప్పెను. యోవేలు ఆత్మ కుమ్మరింపబడునని, యోహాను ఆత్మ బాప్తిస్మమని చెప్పెను. క్రీస్తు ప్రభువు మూడు మాటలలో ఆత్మ చేయు మూడు పనులను గురించి చెప్పెను. అవి (1) ఆత్మ మీ యొద్ద నివశించును, (2) మీలో నివసించును, (3) మిమ్మును ఆదరించును. ఈ మూడు మాటలు ప్రసంగమునకు ఆధారము. ఇంకా ఆత్మ పనులు చాల గలవు. గాని ఈ మూడింటిని గురించి వివరించెదను.
(1) ఆత్మ మీ యొద్ద నివసించును:- సూర్యుడు ఆకాశములో కొన్ని వేలమైళ్ళ దూరములో నున్నాడు. సూర్యుడు భూమి మీదికి రావడము లేదు, గానిసూర్యుని కిరణములు వచ్చుచున్నవి. అనగా ఎండ, వెలుగు భూమి మీదికి వచ్చుచున్నవి. సూర్యుడు భూమి మీదికి రాకపోయినను, కొన్ని వేల మైళ్ళ దూరములో నున్నను మనకు కనబడుచున్నాడు. అనగా సూర్యుడు మన దగ్గరనే దూరములో నున్నను మనకు కనబడుచున్నాడు. అనగా సూర్యుడు మన దగ్గ్రనే ఉన్నాడు. అయితే ఎండనుబట్టి వెలుగునుబట్టి దూరముగా కూడా నున్నాడు. మనకు కనబడుచున్నాడు గనుక మన దగ్గ్రరే ఉన్నాడు. అద్ధమునకు మసిరాసి చూచిన సూర్యుడు పూర్తిగా మనకు కనబడును. అలాగే ఆత్మ పరలోకములో నున్నాడు గాని మన దగ్గరకూడ ఉన్నట్టే. ఆత్మ మన యొద్ద సూర్యునివలె నున్నాడు. మనము బయటికి వెళ్ళిన సూర్యకిరణములు మనలోనికి ప్రసరించినట్లు, ఆత్మ దూరముగా, పరలోకములో నున్నను మన దగ్గర నున్నట్లే. ఆయన కిరణములు మనలో నున్నట్లు, ఆయన పని లోపల జరుగును గనుక ఆత్మ మన దగ్గర, మన లోపల ఉన్నాడు. కొందరి విషయములో దగ్గర ఉన్నాడు. మరి కొందరి విషయములో లోపల ఉన్నాడు.
మనము ఇప్పుడు నీడలో నున్నాము. ఒకరు ఎండలో నున్నారు. ఆ ఎండలో నున్న వానిలో సూర్యుడు ఉన్నట్టే: నీడలోనున్న వారివలె కాక ఎండలో నున్నవానిలో సూర్యుడు ఎక్కువగా ఉండును. అలాగే ఆత్మకూడా కొందరి దగ్గర ఉండును, కొందరి భక్తులలో ఉండును. ఎండలోనున్నా, నీడనున్నా సూర్యుని యొక్క వేడి, వెలుగు, కిరణములు తగిలినట్లు ఆత్మ యొక్క వేడి, వెలుగు, కిరణములు మనకు తగులును. ఎండలో నున్నవారికి ఎక్కువగాను, నీడనున్న వారికి తక్కువగాను ఆత్మయొక్క వేడి తగులును. వేసవిలో నీడనున్నను ఎండ తగిలి చెమట పుట్టుచున్నది కదా! అలాగే ఆత్మ మన దగ్గర నున్న యెడల ఆత్మ యొక్క మహిమ మనకు తగులుచుండును. గాని దగ్గర ఉండుటకు, లోపల ఉండుటకు తేడా గలదు. ఆత్మకు మన దగ్గర ఉండుటకు చాలా ఇష్టము; లోపల ఉండుటకు ఎంతో ఇష్టము. ఆత్మ దగ్గర ఉన్నప్పుడు చేయు పనికిని, ఆత్మలోపల నున్నపుడు చేయు పనికిని తేడా గలదు. ఈ తేడా గ్రహించుట చాల కష్టము దేవుని సన్నిధిలో నుండు వారికి ఈ తేడా తెలియును. ఎవరైనను దైవ సన్నిధిలో నుండి, ఆత్మ తమ దగ్గర నున్నాడో లేక లోపల ఉన్నాడో ఆలోచించిన బాగుగా గ్రహించగలరు.
ఒకరు వీధిలో తీవ్రముగా బోధించుచుండిరి. విన్నవారికి ఆయన బోధ చాలా బాగుంది. విన్నవారిలో ఒక వ్యక్తి మీరు విన్నారా? అని మరొకరిని అడిగెను. అప్పుడు ఆ వ్యక్తి ఏమీ ఆలోచించకుండ ‘చాలా బాగుంది ‘ అని వెంటనే సమాధానము చెప్పెను. ఎంతో మంచి, లోతైన, చక్కటి ప్రసంగము గనుక శ్రద్ధగా విని, గ్రహించుకొనెను. అట్టి గ్రహింపుగలవారు మాత్రమే, చాలా బాగుంది అని చెప్పగలరు. గనుక ఆ రీతిగా లోతైన ప్రసంగము చేయుటలోను, వేరొకరి ప్రసంగము చక్కగా గ్రహించుకొనుటలోను, చక్కటి అనుభవము నేటి బోధకులలో నుండవలెను. ప్రసంగించుటలో లోతైన అనుభవము లేకపోయిన సంఘమునకు బలమైన వర్తమానము అందించలేము. సుమారు 50 సంవత్సరముల క్రితమునుండే, ఆత్మ తండ్రి ప్రతి రోజూ కనబడుచు, మాట్లాడుచుండు అలవాటు (యం. దేవదాసు అయ్యగార్కి) గలదు. ఎప్పుడో ఒక దినము కనబడక పోయిన, నెలలో 29 దినములు కనబడును. కనబడుమని అడిగిన యెడల కాదు, ప్రయత్నము చేసిన కాదు గాని నిత్యమూ మాట్లాడుచుండును. దినదినము కనబడి మాట్లాడుట అయ్యగార్కి అలవాటయిపోయినది. ఒక దినము కనబడకపోయిన లేక త్వరగా కనబడకపోయిన ప్రార్ధనకు పురి పెట్టగా కనబడును. కనబడి వెళ్ళిపోవుట కాదు దగ్గరనే యుండును. అయితే ఎల్లప్పుడు దీక్షగా కనబడినా, ప్రతి దినము కనబడినా, మామూలై గౌరవము తగ్గును. గనుక కొన్ని పర్యాయములు కనబడినపుడు సంతోషించునట్లు, కనబడనప్పుడు సంతోషించునో లేదో అని పరిశోధించుటకు ప్రభువు మరుగుగా నుండును. కనబడుట మానిన యెడల స్వరమును వినిపించును. మరుగుగా నుండి స్వరము వినిపించుట మాత్రమే కాక వ్రాత కూడా వ్రాయుచున్నారు. ఆ వ్రేళ్ళు 1938లో వ్రాసిన వ్రాత, చక్కని వ్రాత పట్టపగలు శానిటోరియం (రాజమండ్రి) లో గదిలో కనబడెను. “బైబిలు మిషను” అని చక్కగా వ్రాయబడెను. ముందు స్వరము వినబడెను. తరువాత వ్రాత వ్రాసి చూపించెను. మరియు ఒక్కొక్కప్పుడు వ్రాత, మరియొకప్పుడు స్వరము వినబడును. బోధలు విని, కామెంటరీలు చదివి చెప్పుట లేదు. ఆత్మ అందించినవి అనుభవించి, చెప్పుచున్నారు అని అనేకులు అందురు. ఎవరైన ప్రశ్న వేయవచ్చును. ఈ దినము ఉదయము ఆత్మ తండ్రి ఏమి చెప్పిరి? అని అడుగవచ్చును. ఈ దిన వర్తమానములో నీ యొద్ద, నీలో నుందును. నిన్ను ఆదరిస్తాను, అని చెప్పిరి. ఒకవేళ బైబిలులోనివి జ్ఞాపకమునకు వచ్చినట్లయితే, బైబిలులోనివి జ్ఞాపకమునకు వచ్చినవి అని అనవచ్చును. ఈ వేళ మంచము మీద ఉండగనే “ఈ వేళ నేను నీకు నూతన శైలి ఇస్తాను” అని చెప్పిరి.
నీ యొద్ద, నీలో నుండెదను, ఆదరించెదను అనుమాటలు అయ్యగారి మనస్సులో నున్నవి, అవే బైబిలులో కూడ గలవు. ఈ దినమున గుడికి వెళ్ళవలెనని అయ్యగారు అనుకొనలేదు గాని “నూతన శైలి ఇస్తాను” అని స్వరము వినబడుటతోనే లేచి గుడిలో ప్రసంగము చేయుటకు నిశ్చయించుకొనిరి. సూర్యుని గురించి చెప్పినది నూతన శైలి కాదా? ఆత్మ 50 సంవత్సరముల నుండి మాట్లాడుచున్న అనుభవము చెప్పుట నూతన శైలి కాదా? సూర్యానుభవము నూతన శైలి కాదా? వినిపించిన స్వరమునకు, వర్తమానమునకు సరిపోయినది. పై మూడు మాటలలో ఆదరిస్తాడు అనేది చెప్పలేదా? అయితే ప్రభువు ఎక్కువ చెప్పిరి. ఇప్పుడు ప్రశ్నవేసి ముగించ వచ్చును. పరిశుద్ధాత్మ తండ్రి మీ యొద్దనున్నారా? లేక మీలో నివసిస్తున్నారా? ఎంత కాలమునుండి పరిశుద్ధాత్మ మీకు కనబడుట, మీతో మాట్లాడుట కలదు? ఈ అనుభవము ఉన్న యెడల సంతోషించి, దేవుని స్తుతించండి. ఇదే నూతన శైలి. పెంతెకొస్తు పండుగ కృప మీకు కలుగును గాక!