వాక్య భాగములు:- లేవీ. 26:1-13; ద్వితీ. 26:15-19; కీర్తన. 46వ అధ్యాయము; మత్తయి. 21:12-13; రోమా. 12:1-2; ఎఫెసి.5:5.
(దిద్దుబాటు పండుగ – 1లో దేవుడు మార్టిన్ లూథర్ నకు కొన్ని వరములిచ్చి వాడుకొనెనని వ్రాసియున్నాము. ఈ వర్తమానములో ఆయనలోని మరికొన్ని వరములను వివరిచుచున్నాము)
నీతిమంతుడు ఆహారము వలన కాదుగాని విశ్వాసము వలన జీవించునని హబక్కూకు వ్రాసెను (2:4). అదే విషయమును అపోస్తలుడైన పౌలు, డాక్టర్ మార్టిన్ లూథర్ కూడ ఎత్తుకొనెను. ముగ్గురు ఎత్తుకొన్నది ఒకే వాక్యము (హబక్కూకు 2:4). ఎవనికి విశ్వాసముండునో వాడే నీతిమంతుడు. విశ్వాసము వలన పాపి జీవించలేడు, గాని విశ్వాసి మాత్రము జీవించును. మన జీవితము రెండు లోకములలో గలదు. భూలోకములో కొంతభాగము మాత్రమే; అది కూడ కష్టాలతో, లోపములతో, పాప శోధనలతో గడుపుట జరుగుచున్నది. ఆయినను విశ్వాసి చావడు, యుగయుగములు జీవించును. మన జీవితము సంపూర్తిగా పరలోకములోనే ఉండును. యేసుప్రభువు రక్తము వలన మాత్రమే మానవుడు నీతిమంతుడాయెను. గొప్ప బోధకులందరు బోధించిన గొప్ప బోధ ఇదే. మతోద్ధారకుని మూలవాక్యము కూడ ఇదే. ప్రభువు యొక్క నీతి వలన మనము నీతిమంతులముగా తీర్చబడితిమి గత వర్తమానములో నీతిమంతుడు విశ్వాసము వలన తన హృదయమును దిద్దుకొని, సంఘాన్ని దిద్ది, జీవ వాక్యము ప్రజలకందించినట్లు చూచియున్నాము.
5వ వరము:- ఈయన గొప్ప ప్రసంగీకుడు. తాను మారి, సంఘము మారునట్లు జేసెను. ఆ మార్పు సంఘములో కడవరకు నిలిచియుండుటకు, బైబిలు గ్రంధమును కూడా తర్జుమా జేసెను. మారుమనస్సు లేనిదే, వాక్యము చదువనిదే, ప్రార్ధ న జీవితము లేనిదే బోధించుట చాలా కష్టము. గనుక లూథర్ గారు వాక్యమును దిట్టముగా చదివి, వరుసగా, క్రమముగా బోధించిరి. గుడిలో, పెద్ద సమాజములలో, పండితులతో వాదించి గెలిచెను. ఆయన బోధించుటకు ఆధారము వాక్యమే. వాక్యము చెప్పు ప్రేరేపణను వాక్యమే ఆయనకు అనుగ్రహించెను. ఆదివారము గుడిలో ప్రసంగించువారు క్రిందటి సోమవారము నుండియే సిద్ధపడవలెను. సంఘమును గురించి, ప్రతి కుటుంబమును గురించి, ఒక్కొక్కరిని గురించి, వారమంతా ప్రార్ధించినపుడు, ఆదివారము కొద్దిగా ప్రసంగించినను, విన్న వారిలో లూథర్ నకు ఎక్కువగా పనిచేయును. లూథర్ నకు ప్రార్ధించి ప్రసంగము చేసెడి అలవాటు కలదు గనుక ఆయన గొప్ప ప్రసంగీకుడయ్యెను.
6వ వరము:- ధైర్యశాలి, దేవుని వాక్యము ఎంత బాగుగా తెలిసిననూ, కొందరికి బోధించు ధైర్యము ఉండదు. లూథర్ నకు సిం హము వంటి ధైర్యము గలదు. ఫుల్ పిట్ మీద ఆయన పులువలె నగుపించెడివాడు. బొమ్మలో సిం హమువలె నగుపించెను. పండితులతో వాదించి, వారి నెదిరించుటలో గొప్ప ధైర్యము చూపించెను. వాక్యము తెలియకపోతే ధైర్యము ఉండదు. వాక్యము బాగుగా తెలిసికొన్నందున ఇతరులలోని తప్పులను వాక్య జ్ఞానముతో ఖండించెడివాడు. వాక్యము బాగుగా చెప్పువారిని మెచ్చుకొనెడివాడు. సంఘములో తెలియని వారికి, తప్పు సిద్ధాంత పరులకు, ఎదిరించువారికి చెప్పుటలో, ఆయన గుండె ధైర్యము గలవాడు. వర్ముసు పట్టణములో పెద్ద సభలో సామాన్య ప్రజలు, పండితులు, విరోధులు, సంఘస్థులు, శత్రువులు గలరు. వారి యెదుట నిలువబడి తన బోధ నిజమని స్థిరపరచగలిగెను. ఆ సమయమందు లూథర్ గుండె దడదడ కొట్టుకొనెను. అది మాంసపు గుండె, అయినను లెక్కచేయక బోధించెను.
7వ వరము:- గొప్ప గ్రంధ కర్త. సహజముగా ఉపన్యాసకుడు తన మాటలను గాలిలో విడిచిపెట్టును. గ్రంధకర్త వాటిని స్థిరపర్చుటకు కాగితముపై వ్రాయును. బైబిలును ఆయన వివరించెను. ఆయన పుస్తకములు కూడ బైబిలు గ్రంధమును వివరించెను. ఆయన గ్రంధములన్నీ ఒక రైటరున కిచ్చి వ్రాయుమని చెప్పగా, అతడు ఒక్క రోజు మానకుండ వ్రాసిన యెడల 25 సంవత్సరములు పట్టునని అంచనా వేసి చెప్పెను. లూథర్ అన్ని పుస్తకములను వ్రాసెను గనుక ఆయన గొప్పగ్రంధకర్త.
8వ వరము:- గొప్ప కవీశ్వరుడు గనుక కీర్తనలు వ్రాసెను. ఆయన విచారముతో నుండువాడు వాగ్వాదములతో, గందరగోళముతో నుండి ఎట్లు కీత్రనలు వ్రాసెనో తెలియదు. ధనికుడు కాదు పేదవాడు. “మాకర్త గట్టి దుర్గము” అను కీర్తన వ్ర్రాసినప్పుడు ఆయన హృదయము నిండ, నోటి నిండ, కలము నిండ పౌరుషము ఉన్నది. అపుడు సైతాను, ఆ క్రూర సర్పము ఏమి చేయగలడు? అని మనస్సులో నున్నది.మన కీర్తనల పుస్తకములో “పరమదేవుండే నా పక్షమై యుండగ” అనునది కూడ దానికి సంబంధించినదే. లూథర్ కట్టిన కీర్తనలను ఇంగ్లండులో గొప్ప కవీశ్వరుడైన షేక్స్ పియర్ చూచి, నెమ్మదిగా నున్న కాలములో, బెదురు, గందర గోళము, వాదాలు, ఇబ్బందిలేని కాలములో వ్రాసియున్నాడు అని అనుకొనెను. అయితే లూథర్ అనేక కష్టములలోను, ఎన్నో ఆటంకములలోను ఉండి వ్రాసెను. గనుక ఈయన కవిత్వమే మించిన కవిత్వమని ఆయన చెప్పెను. లూథర్ ఎక్కువ కీర్తనలు వ్రాయలేదు గాని అంతము వరకు ఆయన చేసిన పని మాత్రము గొప్పది. లూథర్ దృష్టి సంఘము మీద, బైబిలు తర్జుమా మీద ఉన్నది. ఆత్మ ప్రేరేపణ వలననే కవిత్వము చేయగలిగెను.
డాక్టర్ మార్టిన్ లూథర్ కున్న ధైర్యము, వరములు, ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రభువు నందు జీవించు కృప చదువు వారందరికీ కలుగును గాక! ఆమెన్