(ఏ మతమునుగాని ఏ మనుష్యుని గాని – వానిలో తప్పులున్నను మంచి కూడ ఉండును గనుక తుంచనాడకూడదు. సలహాలీయవచ్చును. తెలియనివి దేవునినడిగి తెలిసికొనవలెను)
ప్రశ్న: ఈ వేళ మనము ఎందుకు పండుగ చేస్తున్నాము?
జవాబు: దేవునికి కృతాజ్ఞతాస్తుతులు చెల్లించుటకు చేస్తున్నాము.
ప్రశ్న: దేవుని విషయమైన కృతజ్ఞత
జవాబు: నాలుగు వందల సంవత్సరముల క్రిందట దేవుడు బైబిలును బయలు పరచిన సంగతిని తలంచుకొని కృతాజ్ఞతా స్తులు చెల్లింతుము.
ప్రశ్న: అలాగైతే ఈ పండుగకు ఏమని పేరు?
జవాబు: కొంతమంది ‘మతోద్ధారణ పండుగ ‘ అంటున్నారు. కొంతమంది ‘దిద్దుబాటు పండుగ ‘ అంటున్నారు. అమెరికాలో కొందరు కొన్ని సంవత్సరముల నుంచి దీనికి Children’s day అనగా పిల్లల పండుగ అనుపేరు పెట్టి ఆచరించుచున్నారు.
ప్రశ్న: ఎందుచేత “Children’s day” అని పెట్టుకొన్నారు?
జవాబు: ఈ దినమందు గుడిలో చేయవలసిన పనులన్నీ చిన్నపిల్లల చేత చేయిస్తారు. పెద్దవారు వింటారు. ఈ పండుగ 31వ తారీఖున ఆచరించక అమెరికాలో దాని తర్వాత వచ్చే ఆదివారమున ఆచరిస్తారు.
ప్రశ్న: మనము ఈ పండుగను ఏమని పిలుచుచున్నాము?
జవాబు: ‘బైబిలు పండుగ ‘ అని పిలుచుచున్నాము.
ప్రశ్న: ఈ పండుగను అన్ని మిషనులవారు చేస్తున్నారా?
జవాబు: లేదు. లూథరన్ మిషనువారునూ, మనమునూ (బైబిలుమిషనువారు) చేయుచున్నాము.
బైబిలు ఎందుకు గొప్ప గ్రంధము?
జవాబు: 1. ఆది దేవుడు వ్రాయించిన గ్రంధము గనుక గొప్ప గ్రంధము.
- బైబిలులో దేవుడు నరులకు చెప్పవలసిన మాటలున్నవి. కాబట్టి గొప్ప గ్రంధము.
- బైబిలు ద్వారా దేవుడు చదువరులతో మాట్లాడుచున్నాడు. అందుచేత గొప్పది.
- బైబిలును నాశనము చేయవలెనని శత్రువులు అనేక ప్రయత్నములు చేసినప్పటికిని, అది నేటివరకును భద్రముచేయబడి యున్నది. ఆ హేతువుచేత గొప్పది.
- బైబిలులో పాపులకు, రోగులకు, బీదలకు, ఆపదలోనున్న వారికి, విచారగ్రస్తులకు, అనిశ్చయపరులకు, నాస్తికులకు, అవిశ్వాసులకు కావలసిన వర్తమానపు మాటలున్నవి. అందుకే గొప్పది.
- ఈ గ్రంధములో విద్యార్ధులకు, ఉద్యోగస్థులకు, రాజులకు, సైన్యాధిపతులకు, వ్యవసాయదారులకు, అన్ని వృత్తులవారికి, అవసరమైన సలహాలున్నవి. ఆ కారణము చేత ఇది గొప్పది.
- దీనిలో పండితులకు అనగా లోక సంబంధమైన పండితులకు, వేదాంతులకు, విశ్వాసులకు, తీరిక గలవారికి, అదునుమీద నున్న (అవసరతలో నున్న) వారికి పనికివచ్చు మాటలున్నవి గాన గొప్పది.
- ఈ గ్రంధము ఒకరి సహాయము లేకుండార్ధము చేసికొనగల నీతి బోధలు, రమ్యమైన కథలు ఉన్న కథల పుస్తకము. అందువలన గొప్పది.