క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. బైబిలు పండుగ...
  5. బైబిలు పండుగ – III

బైబిలు పండుగ – III

ఎఫెసి. 5:15-16; కొలస్సి. 4:5; ||కొరింథి. 6:2; కార్య. 12:5-10;14:25,26.

ప్రార్ధన:- ఓ ప్రభువా! వాక్య వర్తమానము అందించుము. వర్ష కాలమందు ధారలుగా పడు నీళ్ళక్రింద పిల్లలు శుభ్రమగునట్లు, మా ఆత్మీయ జీవితమును దిద్దుబాటు చేయుము. వర్తమానము అంగీకరించు కృప వినివారందరికి దయచేయుము. ఆమెన్.

వర్తమానము నమ్ముట వలన ఒక అనుభవము, దాని ప్రకారము నడచుట వలన మరియొక అనుభవము, ప్రకటించుటవలన ఇంకొక అనుభవము వచ్చును. మోషే ప్రసంగములో శాపములు, దీవెనలు రెండునూ వినిపించెను. ఆయన వాటిని లేవీయ కాండము, ద్వితీయోపదేశ కాండములలో వినిపించెను. మోషే మరణమును గురించి చివరి అధ్యాయములో గలదు. దేవుడు మోషే ద్వారా ఆ పని చేయించెను. జర్మనీ దేశములో లూథర్ ను దేవుడు లేపి, బైబిలును బైటకు తీయించెను. లూథర్ బైబిలులోని వాక్య ప్రసంగములను కూడ వినిపించెను. బైబిలును బైటకు తీయుట గొప్పపని. బైబిలులోని వర్తమానములను తీయుట ఇంకా గొప్ప పని. మూడీ మొదలగు గొప్ప బోధకులు, బైబిల్లోని వర్తమానములను తీసి వ్రాసియున్నారు. 14 దినములలో లూథర్ గురించి ఐరోపా అంతయు వినబడెను. ఇప్పుడు రేడియో ద్వారా ఎప్పటి ప్రసంగము అప్పుడే, అన్ని దేశముల వారు వినవచ్చును. ఈ దినము మతోద్ధారణ పండుగ. దేవుడు మోషేకు, ప్రవర్తలకు, శిష్యులకు, యోహానుకు, కాలక్రమమున విషయములు బైలుపరచెను. తుదకు ఇప్పుడు బైబిలు మిషనును బైలుపరచెను. రాకడ ముందు ఇంకను అనేక సంగతులు బైలుపరచును. వెయ్యేండ్లలో ఇంకను ఎక్కువ బైలుపరచును.

లూథరు 16వ శతాబ్ధములో బైబిలును బైటకు తీసెను. దానిని ‘ఇప్పుడు అనేకులు ఆచరించుచూ దేవుని స్తుతించుచున్నారు. లూథర్ నకు ఇంతవరకు వచ్చునని తెలియదు. ఆయన బైబిలును పైకెత్తి చూపించగానే శత్రువులు చెలరేగినారు. దీపము వెలిగించగానే పురుగులు లేచును. ఆలాగే అప్పుడు ఆయన చుట్టూ శత్రువులు మూగినారు. లూథర్ ను “ద్రాక్షతోట పాడుచేయు పంది అనియు, త్రాగుబోతు” అనియు దూషించినారు. లూథర్ 67వ సంవత్సరమున, తన వ్రాతలు వ్రాసి వ్రాసి గుండె నొప్పి చేత చనిపోయెను. అయినప్పటికిని ఆయన వ్రాతలున్నవి. అవి అనేకులకు ఎంతో ఉపయోగకరమైనవి. ఆటంకములు, నిందలు ఎన్ని ఉన్నను, దేవుని వ్యాప్తి నిమిత్తము ముందుకు సాగవలెను. లూథర్ ధైర్యముగా దేవుని కొరకు పని చేసెను. ఆయన చుట్టూశత్రువులుండిరి. అయితే రాజులైన స్నేహితులు కూడా ఆయన దగ్గరనే ఉన్నారు. వ్రాయుటలో మిలాంగ్టన్ అను స్నేహితుడు కలడు. శత్రువులున్నను స్నేహితులు కూడా ఉన్నారు గనుక పని సాగించెను. వర్ముసు పట్టణములో ఆయన యొక్క బోధలు పరిశీలించుటకు మతాధికారులు పిలిచిరి. అప్పుడు స్నేహితులు వెళ్ళవద్దని సలహాలనిచ్చిరి. గాని లూథర్ ‘నేనున్న స్థలమునుండి వర్ముసు పట్టణము వరకు అగ్ని మండుచున్నను, దయ్యములు చుట్టుకొన్నను వాటిమధ్య నుండి వెళ్ళెదనని ‘ చెప్పెను. ఒక నాటి కలలో రోమా పట్టణములో సిం హమున్నది. జర్మను దేశములోనుండి ఉత్తరము వ్రాయగా, ఆ సిం హము చెవికి కలము గ్రుచ్చుకొని అరచెను. అనగా లూథర్ యొక్క వ్రాతలు పోపునకు అంత బాధ కలిగించెను. లూథర్ కెన్ని శ్రమలు వచ్చినను పని మానలేదు. గాని ఒకసారి నిరాశ పడెను. పేదవాడు గనుక బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు సొమ్ము లేదు. బైబిలు తర్జుమా చేసి అనేకులకు అందించుటకు తగినంత సొమ్ము లేదు. అప్పుడు లూథర్ చాలా నిరాశ పడెను. గొప్పపనివాడు, బోధకుడు నిరాశతో కృంగియున్నాడు. అప్పుడు ఆయన భార్య, తన భర్త నిరాశలో నున్న సంగతి గ్రహించి, నల్లని దుస్తులు ధరించి ఆయనదురుగా వచ్చెను. అప్పుడు లూథర్ మీ బంధువులలో ఎవరైన మరణించినారా? ఎందుకు నల్లని దుస్తులు వేసినావు? అని ప్రశ్నించెను. ఆమె యేసుప్రభువు చనిపోయాడని చెప్పెను. వెర్రిదానా! ప్రభువు చావలేదు అని లూథర్ చెప్పగా, అయితే నీవెందుకు చింతించుచున్నావని చెప్పి లూథర్ ను నిరాశనుండి మేలుకొలిపెను.

ఎఫెసీ. 5:15, 16 లో ఉన్న “దినములు చెడ్డవి” అను వాక్యమును బయటకు తీసి బోధించగానే దినములు చెడ్డవైనవా! అన్నట్లు వర్ముసు పట్టణములో సభ ముగిసిన తరువాత లూథర్ ను ఖైదులో వేసిరి. ఆయన వ్రాసిన వ్ర్రతలు అచ్చువేయుటకు సొమ్ములేదు. గనుక దినములు చెడ్డవి కావా? సమయమును వాడుకొనవలెను. ఆ సభలో ఒక శత్రువు లూథర్ బోధలను గురించి కోపముతో పలికిన మాటలు. “-మన బోధలు బైబిలునకు వెలుపల నున్నవి, లూథర్ బోధలు బైబిలులో నున్నవని చెప్పెను” తరువాత లూథర్ ను చంపవలెనని చెప్పెను. అప్పుడు జార్జి అను మారు పేరుతో లూథర్ ను ఒక రహస్య స్థలమందు దాచి పెట్టిరి. లూథర్ అచ్చట క్రొత్త నిబంధనను తర్జుమా చేయుట జరిగినది. పిమ్మట అచ్చుయంత్రము కనిపెట్టబడినది. వెంటనే బైబిలు అచ్చుపడి బయటికి వచ్చెను. సమయమును సద్వినియోగ పరచుట వలన దినములు చెడ్డవైనను మంచిపని జరిగెను. పౌలు, సీల అనువారు చెరసాలలో విచారపడవలసినదే, గాని పాటలు పాడి, ప్రార్ధించి, చెడ్డ దినములను మంచి దినములుగా వాడుకొనిరి. సంకెళ్ళు తలుపులు విడిపోయెను. చెఱసాల నాయకుని యొక్క కుటుంబము బాప్తిస్మము పొందెను. పేతురునకు చెఱసాల ఉండెను. రేపటి దినము మరణము, చెడ్డదినము అయినను లెక్కలేనట్టు నిదురపోయెను. పేతురు పాటలు పాడి, ప్రార్ధించకపోయినను ఖైదు అనినా, తీర్పు అనినా, మరణము అనినా, లెక్కచేయలేదు. అన్నిటిని దాటి ప్రార్ధ నా స్థలమునకు వచ్చెను. అదే సద్వినియోగ పరచు కొనుట. క్రైస్తవులకు శ్రమలు రాగానే లెక్కలేనితనము చూపించవలెను. ఆది సంఘములో అనేకులను కత్తితో చంపిరి. చంపు వారు ఇక చంపలేమన్నారు. చావు అనిన, లెక్కలేని తనమును విశ్వాసులు చూపించవలెను. ఒకవైపు ప్రభువు శ్రమపడుచు దొంగను రక్షించెను. కష్టములు రానిచ్చి సద్వినియోగము చేసికొనుట అనేది శిష్యులకు ప్రభువు చూపిన మార్గమైయున్నది. ఆ మార్గంలో నడచిన లూథర్ వ్రాసిన పుస్తకములు బీరువా నిండ గలవు. అవి కష్టసమయములలో వ్రాసినవి. లూథర్ ఆత్మపూర్ణుడు గనుక భాషలు మాట్లాడెను. బైబిలు బైటకు వచ్చినట్లు, భక్తులు వ్రాసిన పుస్తకములు కూడ బైటకు వచ్చును. కష్టకాలము రాకమానదు గాని ఉపయోగము చేసికొనండి. పాము వచ్చిన చంపుటకు ప్రయత్నింతుము. ఇల్లు కాలుచున్న ఆర్పుటకు ప్రయత్నము చేయుదుము. అట్లే అపాయము, వ్యాధులు, కష్టములు, కరువులు మొదలగునవి వచ్చునప్పుడు వాటిని విడదీసికొని ఉపాయము కలిగించుకొనవలెను. బద్దకము, అజ్ఞానమునలకు, చోటియ్యక పాము వలె వివేకులుగా, పావురము వలె నిష్కపటులుగా నుండు కృప ప్రభువు మీకు అనుగ్రహించును గాక!

Please follow and like us:

How can we help?

Leave a Reply