ప్రార్ధన:- ఓ ప్రభువా! గుడికి వచ్చిన వీరిని దీవించు. గుడికి రాకుండ ఇంటివద్ద నున్న వారిని కూడా దీవించుము. గుడికి వెళ్ళుటకు ఇష్టము లేని వారికి మారు మనస్సు దయచేయుము. ఆయా స్థలములలో బోధించువారికి వర్తమానమును దయచేయుము. ప్రసంగించు ధైర్యము బోధకులకు అనుగ్రహించుము. సంఘములకు నీ వర్తమానము వినగల చెవి దయచేయుము. ఆమెన్.
విశ్వాసులారా! ప్రియులారా! క్రీస్తు శిష్యులారా! ఆరాధనపరులారా! ప్రతి దినము హృదయమును దిద్దుబాటు చేసికొనే శ్రద్ధగలవారలారా! మీకు త్రియేక దేవుని నామమందు శుభము, బలము, దీవెన, కలుగును గాక! నాలుగు వందల యేండ్ల క్రిందట దేవుడు లూథర్ యొక్క చేతిలో బైబిలును పెట్టిన సంగతి ఈ అక్టోబరు నేలలో కొందరు తలంచుకొని దేవునిని స్తుతించుచున్నారు. మనము కూడ ఆలాగే స్తుతించవలెను. ఈ నెల 31వ తేదీన, డాక్టర్ మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతములను దేవాలయమునకు అంటించినాడు. అప్పటినుండి చాలాకాలము వరకు అక్టోబరు 31వ తేదీన ఈ దిద్దుబాటు పండుగ చేయుచున్నారు గాని కొన్ని సవత్సరముల నుండి ఆ తరువాత ఆదివారమునకు మార్చుకొన్నారు. అమెరికాలో లూథరన్ మిషను వారు ఈ పండుగకు “పిల్లల పండుగ” అని పేరు పెట్టి ఆచరించుచున్నారు. కొందరు ఈ పండుగను నవంబరు 10వ తేదీకి మార్చుకొన్నారు. ఎందుకనగా అది లూథర్ యొక్క జన్మదినము. ఏ దినమును జరుపుకొన్నను, దేవునికి స్తోత్రము చేయుటకే గాని లూథర్ ను పొగడుటకు మాత్రము కాదు. లూథర్ ను సిద్ధపరచిన దేవుని స్తుతించుటకు ఈ పండుగను చేయవలెను.
ముఖ్య విషయము:- లూథరన్ మిషనుకును, రోమన్ కేథలిక్కు వారికినీ ఈ దిద్దుబాటు సందర్భములో 100 సంవత్సరములు యుద్ధము జరిగెను. చివరి సారిగా ఆ యుద్ధములో లూథరన్ మిషను రాజు గారి గుండెకు దెబ్బతగిలి చనిపోయెను. ఈయన పేరు కింగ్ గస్టవస్ ఎడాల్ఫన్ (నార్వేరాజు). ఈయన చనిపోయిన తరువాత ఇక యుద్ధమే జరుగలేదు. చనిపోయిన ఈయనను స్వీడన్ దేశపు ముఖ్య పట్టణమైన స్టాక్ హోం నకు తీసికొని వచ్చి సమాధి చేసిరి. చనిపోకముందు బైబిల్, బైబిల్, బైబిల్ అని ముమ్మారు పలికి అతడు ప్రాణము విడిచెను.
మతోద్ధారకుడైన లూథర్ గారిలో గొప్ప స్వభావమేదనగా – ముందు తన యొక్క హృదయమును దిద్దుబాటు చేసికొనెను. అట్లు చేసికొనడము ముఖ్యమైన పని. మొదట తన హృదయమును శుద్ధిచేసికొనెను. కాబట్టే సంఘమును కూడా దిద్దుబాటు చేయగలిగెను. ఈ రెండు మాటలు అనగా (1) హృదయ శుద్ధి (2) సంఘ దిద్దుబాటు (సంఘ శుద్ధి). ఇవి రెండు ప్రసంగములు, రెండు బోధలు. రెండు సలహాలు, రెండు సువార్తలు, రెండు డోసులు అనగా రెండు గద్దింపులు. ఏలాగంటే, సువార్తను బోధించు ఓ బోధకుడా ప్రసంగములు చేస్తున్నావు గాని, నీ హృదయమునకు మంచి మంచి ప్రసంగములు చేసికొన్నావా? సంఘమును దిద్దుబాటు చేయుటకు మాట్లాడుచున్నావు గాని నిన్ను నీవు దిద్దుకొన్నావా? నిన్ను నీవు దిద్దుకొని సంఘమును దిద్దబోతే, అపుడు చూచుటకు, వినుటకు బాగుగా నుండును. నిన్ను నీవు దిద్దుకొనకుండ సంఘమును దిద్దబోతే, ఎక్కడో ఏ మైలురాయివద్దో పడిపోతావు జాగ్రత్త. బోధకులు కొంత మంది ఏడెస్సులో ఉన్నారు. ‘మారుమనస్సు పొందనందున ‘ అవి పరలోక వాస్తవ్వులు వారిని గురించి చెప్పుచున్నారు. అట్టివారు భూలోకములో సంఘమును దిద్దినారు గాని తమ్మును తాము దిద్దుకొనలేదు. సంఘమును దిద్దుట సుళువే గాని తమ్మును తాము దిద్దుకొనుట సుళువు కాదు. ఉదా: డాక్టరుగారు రోగి యొక్క వ్రణమును శస్త్రము చేయుటలో నేర్పరి. ఏడ్వవద్దు, సహించుకో అని అంటారు. తనకే శస్త్రకాలము వచ్చినప్పుడు భయపడును. నేను ఎరిగిన డాక్టరమ్మ పేషెంట్స్ కు (రోగులకు) సహాయము చేసింది. అయితే రోగులు ఏడ్చేటప్పుడు కోపపడి, గద్దించి, బలవంతముగా చేయవలసిన పని చేసింది గాని తన కుమారునికి ఒక డాక్టరు గారు శస్త్రము చేయుట ఆరంభించగానే చూడలేక పారిపోయింది. ఆలాగే బోధకుల యొక్క సంగతులుకూడా ఉన్నవి. తమకు కష్టము వచ్చినప్పుడు సహించలేరు గాని ఇతరుల కష్టములు తొలగించుటకు ప్రయత్నిస్తారు. అది నెరవేరుతుంది గాని స్వంత విషయము నెరవేరదు.
యేసుప్రభువు కూడ ఒక మాట అన్నారు. – ‘నీ కంటిలో నున్న దూలమును తీసివేసికో, అప్పుడు నీ యెదుట ఉన్న వాని కంటిలోని నలుసును తేటగా చూడగలవు ‘ ఇది బోధకులందరికి గొప్ప ఉపదేశము. బోధకులకే కాదు. క్రైస్తవులందరికిని మంచి ఉపదేశము. మార్టిన్ లూథర్ సంఘమునకు దిద్దుబాటు కలుగజేసి తన తప్పులు దిద్దుకొనకపోతే, తాను పరలోకమునకు వెళ్ళునా? వెళ్ళలేడు. హేడెస్సునకే వెళ్ళవలెను. తాను ఎంత గొప్పపని చేసినను, అది లెక్కలోనికి రానేరదు. తనను దిద్దుకొంటే, తన దిద్దుబాటు, సంఘములోని దిద్దుబాటు రెండునూ లెక్కలోనికి వచ్చును. దేవదాసు అయ్యగారు రాజమండ్రి మీటింగులో- విద్యార్ధులందరి అనుభవములు చెప్పండి అన్నారు. ఆప్పుడు బెంజిమన్ పాదిరి గారు ఒక మాటన్నారు. ‘ఒక పిల్లవాడు బూడిద మీద ఆడుకొంటున్నాడు. చేతులంతా బూడిదే. అతనిని అబ్బాయీ! నీ బుగ్గమీద ఉన్నది తుడిచివేసికో అన్నాను. తుడుచుకొన్నాడు. అప్పుడు ఏమైనది? ధూళి ఇంకా ఎక్కువైనది. గనుక శుద్ధి చేసికొనవలెనంటే మరింత ఎక్కువగా అశుభ్రమగుచున్నది. ఎందుకనగా బూడిద చెయ్యి కడుగుకొనలేదు. అయినప్పటికిని ముఖము శుభ్రము చేయుటకు ప్రయత్నించెను’.
అలాగే బోధకులు తాము శుద్ధిచేసికొనకుండ సంఘమును శుద్ధిచేయ ప్రయత్నించిన, బోధకులలో నున్న అశుభ్రత సంఘమునకు అంటుకొనును. కాబట్టి లూథర్ వలె బోధకులు, తమ స్వంత హృదయశుద్ధి ముందు చేసికొనవలెను. ఈ వేళ దిద్దుబాటు పండుగ. ఈ మీటింగులో నున్న వారిలో ఈ దినము – “నాలో ఏ చిన్న పొరపాటైనను లేదు అని పరిశుద్ధాత్మ ఎదుట ఎవరు చెప్పగలరో వారే ఈ పండుగ చేయగలరు.” ఈపండుగకు మేము పరలోక వాస్తవ్వులను పిలిచినాము. వారు మీ శరీరము తట్టు మాత్రముగాక, మీ హృదయముల తట్టుకూడ సుళువుగా చూడగలరు. ఏ మూల ఏ చెత్త, ఏ మురికి, ఏ దుర్వాసన ఉన్నదో వారికి తెలిసిపోవుచున్నది. హృదయములు శుద్ధిలేనిదే, మమ్మును పిలుచుట ఎందుకని, వారు ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోవుదురు. వారితోపాటు పండుగ కూడ దాటిపోవును. అయితే ఎవరు శుద్ధిగలవారో, వారి దగ్గర పండుగ ఆచరింపబడును. అట్టి పండుగ పరలోక వాస్తవ్వులకును, పరలోక తండ్రికిని మిగుల ఇష్టము. ఇట్టి ధన్యత మీకు కలుగును గాక! ఈ పండుగ మీకు దండుగై యుండక నిజమైన పండుగగా నుండును గాక! ఆమెన్.