క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. బైబిలు పండుగ...
  5. మార్టిన్ లూథర్ జీవితములోని మణులు

మార్టిన్ లూథర్ జీవితములోని మణులు

  1. లూథర్ యొక్క బాల్యము:- జర్మనీ దేశములో ఒక ఉపాధ్యాయుడు బడిలో ప్రవేశించి పిల్లలకు సలాము చేసెను. అప్పుడు పిల్లలు అయ్యా! మేము మీకు సలాము చేయవలెను. గాని మీరు మాకు చేయుదురేమి? అని అడిగిరి. అప్పుడు పంతులుగారు – నేనే ముందుగా చేయవలెను. ఎందుకనగా మీలో గురువులు, పండితులు, గొప్పవారు ఉన్నారు అని పలికెను. ఆ పిల్లలలో ఒకరు మార్టిన్ లూథర్ గనుక పంతులుగారు మాట కొంతవరకు నెరవేరినది.
  2. తల్లిదండ్రులు:- తండ్రి హాన్సు లూథర్. తల్లి మార్గరెట్ లిండిమన్, జర్మనీ దేశములోని సాగ్జని యందలి ఐస్ లెబన్ పట్టణమున, 1483వ సంవత్సరములో నవంబరు 10వ తేదీన మధ్యరాత్రి సమయంలో లూథర్ జన్మించెను. లూథర్ అను మాటకు నిర్మలమైన, ప్రసిద్ధమైన అను అర్ధము గలదు. అది నిజమే, ఆయన జీవితము నిర్మలము. ఆయన సిద్ధాంతములు ఎంతో ప్రసిద్ధమైయున్నవి.
  3. విద్య నభ్యసించుట:- పేదవాడగుట వలన ధనికుల ఇండ్లకు వెళ్ళి, పాటలు పాడి, చదువు కొరకు సొమ్ము సంపాదించుకొనెను. తరువాత ఉన్నత విద్య నభ్యసించి, తత్వ శాస్త్ర్రమును, మత శాస్త్ర్రమును చదివెను. బైబిలు గ్రంధములోని కీర్తనల గ్రంధము. రోమా పత్రిక లూథర్ నకు చాలా ఇష్టము. పరిశుద్ధుడైన అగష్టీన్ వ్రాతలు కూడ ఎక్కువ ఇష్టము. ఈయనను పాత నిబంధనలోని ఏలీం మా అనియు, క్రొత్త నిబంధనలోని పౌలు అనియు, సంఘ చరిత్రలోని అగస్టీన్ అనియు కొందరు పిలుచుచుండెడివారు.
  4. బైబిలు దొరికిన విధము:- ఎర్ ఫర్టు అను పట్టణమున నున్న పుస్తకశాలకు వెళ్ళి పుస్తకములు చదువు చుండెడివాడు. ఒకనాడు పుస్తకముల పుస్తకమగు (the book of books) బైబిలు దొరికెను. సంపూర్ణముగానున్న గ్రంధము దొరికినందున ఆ సమయమందు అతని సంతోషమునకు మితి లేదు. ఆ బైబిలు గ్రంధము నుండి ప్రార్ధనా పరులైన హన్న, సమూయేలు కథను చదివి ఆనందించి, సమూయేలువలె తనను ప్రభువునకు సమర్పించుకొనెను.
  5. వివాహము:- లూథర్ ఒంటరిగా నుండుట మంచిదికాదని తలంచి కాథరిన్ ఓన్ బోరా అను ఆమెను పెండ్లాడెను. వారి సంసారము దుఃఖ సముద్రము కాదు గాని భూలోక మోక్షమని చెప్పవచ్చును. ఒకానొకప్పుడు లూథర్ దిద్దుబాటు భారమున వంగి, క్రుంగి ఇది ఏమగునో అని చింత వలన బాధతో కూలబడి కూర్చుండెను. అతని భార్య గదిలోనికి వెళ్ళి దుఃఖమును తెలియజేయు నల్లని వస్త్ర్రములను, చెప్పులను, టోపీని ధరించి ఆయన ఎదుట నిలువబడెను. లూథర్ ఆమెను చూచి, ఎవరు చనిపోయిరి? ఎవరి సమాధి ఆరాధనకు వెళ్ళుచున్నావు? అని భార్యను అడిగెను. ఆమె వెంటనే – యేసుప్రభువు మరణించెను. ఆయన సమాధి ఆరాధనకు వెళ్ళుచున్నాను అనెను. యేసుప్రభువు మరణించుట ఏమి? ఆయన సమాధి ఆరాధనకు నీవు వెళ్ళుటేమి? అని ఆయన ప్రశ్నించెను. అప్పుడామె యేసుక్రీస్తు మరణింపనిచో నీకు దిగులు, విచారము ఎందుకు? ఎందుకు నీ విట్లు చింతతో కూలబడుచున్నావని చెప్పి లూథర్ ను ధైర్యపరచెను. లూథర్ చనిపోయినప్పుడు కాథరీనమ్మ ఇట్ల్లు వ్రాసెను. “నా భర్త ఒక పట్టణమునకైనను, ఒక ప్రదేశమునకైనను కాక ప్రపంచమంతటికిని పరిచారకుడు.” తన భర్తను గూర్చి ఇట్టి మాటలు వ్రాసిన ఈమె ఎట్టి ‘గుణవతి ‘! ఎట్టి ‘సాటియైన సహాయము ‘!
  6. ఆయనలో మార్పు:- లూథర్ న్యాయశాస్త్రము చదువుచున్నప్పుడు, తన స్నేహితుడయిన అలెక్సనుతో ప్రయాణము చేయుచు తుఫానులో చిక్కుకొనెను. ఉరుములు, మెరుపులు వచ్చెను. పిడుగు తన స్నేహితుడయిన అలెక్సను మీద పడగా అతడు వెంటనే మరణించెను. అప్పుడు లూథర్ ప్రయాణము మానుకొని, ఆ సాయంత్రము తన స్నేహితులకు విందు చేసి, సన్యాస మఠములో చేరి మన శ్శాంతి పొందవలెనని కోరెను. ఒకరి బాధ మరొకరికి బోధ ఆయెను. పిడుగు లూథర్ హృదయమును కదిలించెను. అప్పుడు లూథర్ లోకమునే కదిలించెను.
  7. ‘యేసు రక్తమువలననే పాపక్షమ’ అను విశ్వాసము:- లూథర్ పాదిరి పట్టా పొంది అన్ని ఆచారములు బహుశ్రద్ధతో చేయుచుండినను మనశాంతి దొరకలేదు. అప్పుడు గురువులలో ఒకరు “నీ పాప క్షమాపణ క్రీస్తు రక్తము వలననే” అని అనెను. పిమ్మట ఆయన తన పాపములు ఒప్పుకొని మనశ్శాంతి పొందెను. తరువాత – ఎవరైనను నా హృదయపు తలుపు తట్టి ఎవరు ఉన్నారని ప్రశ్నించిన యెడల, ఇదివరకైతే “నా హృదయములో క్రీస్తు మాత్రమే నివసించుచున్నాడని నొక్కి చెప్పగలను” అని ఆయన చెప్పెను.
  8. రక్షణ క్రియల వలన కాదని తెలిసికొనుట:- లూథర్ రోమా పట్టణమునకు మహా సంతోషముతో వెళ్ళెను. అచ్చట పరిశుద్ధ జాన్ దేవాలయము గలదు. దాని మెట్లు, యేసు ప్రభువు పిలాతునొద్దకు తీర్పుపొందుటకు ఎక్కి వెళ్ళిన మెట్లు అను ప్రసిద్ధి గలదు. మరియు ఒక మెట్టు మోకాళ్ళపై ఎక్కిన, 9 సంవత్సరముల పాపము పోవునను మూఢ నమ్మిక గలదు. లూథర్ భయముతో, భక్తితో ప్రార్ధనా పూర్వకముగా ఆ మెట్లను మోకాళ్ళపై ఎక్కుచుండెను. అప్పుడొక స్వరము “నీతిమంతుడు విశ్వాసము వలననే జీవించునని” వినబడెను. వెంటనే దిగివచ్చి, క్రీస్తును నమ్మిన యెడలనే, ఆయన కృప వలనే రక్షణ గాని క్రియల వలన కాదని తెలిసికొనెను.
  9. తప్పు సిద్ధాంత ఖండన:- లూథర్ రోము పట్టణము నుండి వచ్చు సరికి, పోపుచే పంపబడిన జాన్ టెట్ జెల్ అనునతడు జర్మనీలో ప్రవేశించి, సొమ్ము ఇచ్చి పాప క్షమాపణ పొందవచ్చునని, పాపక్షమాపణ పత్రికలు అమ్ముచుండెను. లూథర్ ఇది దేవ ద్రోహమనియు, దయ్యపు చెడ్డ వ్యాపారమనియు, వాటిని ఖండించుచు 95 సూత్రములు బైబిలు ననుసరించి వ్రాసి, విటిన్ బర్గు పట్టణములో నున్న “సమస్త పరిశుద్ధుల” దేవాలయపు తలుపులకు, అక్టోబరు 31వ తేదీ 1517 సంవత్సరమున అంటించెను. ఇదే దిద్దుబాటు దినము. ఈ సూత్రములు జర్మనీ దేశమంతటను, ప్రపంచమంతటను త్వరలో వ్యాపించెను.
  10. సిం హపు గుండె వంటి ధైర్యము:- జర్మనీ చక్రవర్తి తన సర్వసైన్యముతో నీ మీద పడిన ఏమి చేయుదువని లూథర్ ను అడుగగా, పరలోకమందో లేక పరలోకము క్రిందోనో ఉందునని సామెత చెప్పెను. ఒకరు లూథర్ శత్రువైన జార్జి ప్రభువును గురించి మాట్లాడగా, ఆ పట్టణమున నాకు పని ఉన్న యెడల అటువంటి జార్జి ప్రభువులు అనేకులు. పది దినములు కుంభవర్షము వలె నాపై బడినను నేను అక్కడికి వెళ్ళక మాననని చెప్పెను. ఆయన స్నేహితులు “వర్ము సు పట్టణమునకు వెళ్ళవద్దు. జాన్ హస్ అను భక్తుని కాల్చి చంపిరి కదా! అన్నప్పుడు లూథర్ – అవును, వారతనిని కాల్చిరి, కాని అతడు కనుపరచిన సత్యములను కాల్చలేదు కదా!” అనెను. ఇంకను ఆయన స్నేహితులు ఆ పట్టణమునకు వెళ్ళుట ప్రాణహాని అని చెప్పిరి. “ఆ పట్టణములో ఇండ్లన్నిటి పైన ఎన్ని పెంకులున్నవో అన్ని దయ్యములు అక్కడ ఉన్నను, ప్రభువైన యేసు నామములో అక్కడికి వెళ్ళక మానను” అని లూథర్ చెప్పెను”. ఇది దేవుని కార్యమగు నెడల ఎవరు దీనిని ఆపగలరని మాటిమాటికి చెప్పుచుండువాడు. లూథర్ గుండె అతని తల అంత పెద్దది అని ఒకరు చెప్పిరి. లూథర్ ఏకాకి, కాని దేవునితో ఏకాకిగా నుండుట ఎంత గొప్ప విషయము:
  11. నెరవేర్పుగల ప్రార్ధన:- 5వ ఛార్లెస్ చక్రవర్తి ఆజ్ఞ ప్రకారము మహాసభకు హాజరు కావలసి వచ్చినప్పుడు – రేపు ఉదయమున విమర్శ సభ జరుగును. గనుక తాను కొన్ని గంటలైనను ప్రార్ధింపవలెనని ‘ తీర్మానించుకొనెను. పని ఎక్కువైన ప్రార్ధన ఇంకా ఎక్కువ కావలెను. అని అతడు అత్యాసక్తితో ప్రార్ధించి, బయటికి వచ్చి, మనకు మహావిజయమని బిగ్గరగా చెప్పెను.
  12. పొందిన జయము:- పైన చెప్పబడిన సభలో, పెద్ద సామ్రాజ్యము ఒక్కనికి విరోధముగా నిలువబడెను ఆ సభలో లూథర్ మాట్లాడి “నా మనస్సాక్షిని దేవుని వాక్యమునకు అప్పగించితిని. నేను దానిని విడువను. ఇదే నా నిర్ధారణ. వేరేమియు నేను చేయలేను. దేవుడు నాకు తోడ్పడును గాక. ఆమెన్” అనెను. వారు లూథర్ ను చీల్చి వేయవలెనని చూచిరి. ఆయనను వెలివేసిరి, దేశద్రోహిగా నెంచిరి కాని లూథర్ దేశద్రోహికాడు కదా!
  13. లూథర్ గ్రంధములు దహింపబడుట:- ఆ సభయందే లూథర్ పుస్తకములన్నిటిని ఉంచి, “నీవు వ్రాసిన ఈ వ్రాతలు మత విరుద్దములని ఒప్పుకొందువా?” అని డాక్టర్ జాన్ ఎక్ అడిగెను. అందుకు లూథర్ “నేను వ్రాసిని విషయములు బైబిలునకు విరుద్ధమని మీరు ఋజువు చేయని యెడల అట్లు ఒప్పుకొనగలను?” అని జవాబిచ్చెను. తరువాత చక్రవర్తి లూథర్ గ్రంధములన్నిటిని కాల్చివేయవలెననియు; వాటిని అచ్చు వేయకూడదనియు, అమ్మకూడదనియు శాసించెను. అతని గ్రంధములు కాల్చబడినప్పుడు “నా సిద్ధాంతములు ఆ పుస్తకములలోనే వ్రాయబడినవని అనుకొను చున్నారా! మీరు కాల్చుటకు అందుబాటు గాని జనాంగముల యొక్క హృదయములలో, బంగారు అక్షరములతో, అవి వ్రాయబడి యున్నవి” అని లూథర్ చెప్పెను.
  14. అపవాదిపై జయము:- ఒకప్పుడు సాతాను మారు రూపముతో లూథర్ దగ్గరకు వచ్చి, ‘నీవు మహాపాపివి, నీకు నాశనమనీ చెప్పెను. అందుకాయన – ఆగు! ఆగు! నేను పాపిని అది నిజమే. ఆ తరువాత ఏమిటి? అని అడిగెను. అప్పుడు సాతాను, ఆ తర్వాత నీకు నాశనమే అని చెప్పెను. అప్పుడు లూథర్ నీ మాట అబద్ధము. “పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనుమాట నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. గనుక సందేహము లేకుండ నేను రక్షింపబడియున్నానని” చెప్పగా వాడు సిగ్గుపడి వెళ్ళిపోయెను.
  15. మరియొకప్పుడు లూథర్ ధ్యానములో నుండగా, అపవాది మారు వేషముతో వచ్చెను. ‘నీవెవడవు?’ అని లూథర్ అడుగగా, ‘నీ రక్షకుడైన క్రీస్తును ‘ అనెను. అయితే ‘నీ ఐదు గాయములు చూపించుము ‘ అని లూథర్ అడుగగా అపవాది దబదబ పారిపోవుచుండెను. “ఓరీ! అపవాది! పారిపోవుచున్నావా” అని లూథర్ సిరాబుడ్డిని వాడిపై విసరెను. ఆ బుడ్డి గోడకు తగిలి పగిలిపోయెను. ఆ సిరా మరక ఇప్పటికి ఉన్నదని చెప్పుదురు .
  16. దేవుడే ఆశ్రయము:- లూథర్ ను చీల్చి వేయకుండ కాపాడుటకు దేవుడు శాగ్జని రాజైన ఫెడరిక్కును సహాయముగా నిచ్చెను. ఇతడు లూథర్ ను దాచియుంచెను. ఆ రీతిగా దాచబడిన కాలమందు బైబిలును తర్జుమా చేసెను. ఆ తరువాత అతని అనుచరులకు అనేక కష్టములు కలిగి కొందరు తిరిగిపోగా, అప్పుడు లూథర్ ఇట్లు పలికెను. “నేను నక్షత్రములను మరియు దేవుడు వాటికేర్పర్చిన ఆకాశమును చూచితిని. ఆధారము లేకుండ అవి నిలిచియున్నవి. మరియు మేఘములు ఆకాశములో పరుగులెత్తుచున్నవి. వాటికి కూడా ఆధారము లేదు. మన నెత్తిమీద అవి పడకుండుట మహా అద్భుతము. అది గ్రహించిన యెడల, క్రీస్తులో మనము నిలిచియుండుటకు మనకు ఇది ఒక గొప్ప పాఠము” అని చెప్పెను.
  17. పాటలు:- “సంగీతమును ప్రేమింపని వానిని నేను ప్రేమింపలేనని” లూథర్ చెప్పెను. భావములతో కూడిన 36 కీర్తనలను రచించెను. ఆయన రచించిన “మా కర్త గట్టి దుర్గము” అను పాటను దిద్దుబాటు దినమున ప్రపంచమంతట పాడుదురు. సంఘములలో సంగీత వాయిద్యములు ఉపయోగించుట ఈయన మొదటిగా ప్రారంభించెను. ఈయనే క్రైస్తవ సంఘమునకు “మహారాజ కవియగు దావీదు” అని శత్రువులు, మిత్రులు కూడ ఒప్పుకొనెదరు.
  18. చిన్న పిట్ట పాఠము:- లూథర్ వ్రాసిన ఒక చిన్న పిట్ట పాఠము: “నా చిన్న పిట్ట లోకములోని బోధకులందరి కంటె నాకు ఎంతో ఇష్టము. దానికాహారము నా కిటికిలో ఉంచెడివాడను, దానికి ఆకలి అయినప్పుడు వచ్చి, తిని సమీపమందున్న చెట్టు మీదికి పోయి, దేవునికి స్తోత్రము చేయుచు పాటలు పాడి పాడి, తన చిన్ని తలను తన రెక్కల క్రింద పెట్టుకొని మైమరచి నిద్రపోవును. దిన దినము నాకు అది చక్కని ఉపదేశము చేయుచున్నది. అదే నా ఉత్తమ బోధకురాలు.”
  19. ముఖ్య స్నేహితుడు:- ఫిలిప్ మిలాంగ్జన్ గారు లూథరన్ కు ముఖ్య స్నేహితుడు. లూథర్ నిప్పు వంటివాడు, మిలాంగ్జన్ నీళ్ళ వంటివాడు. వీరు సేవలో మోషే యెహోషువల వంటివారు స్నేహము నందు దావీదు, యోనాతానుల వంటివారు. ఒకప్పుడు మిలాంగ్జన్ మరణ స్థితిలో నున్నట్లు లూథర్ నకు వార్త వచ్చెను. లూథర్ వెళ్ళి మిలాంగ్జన్ మంచము దగ్గర మోకరించి, దైవగ్రంధము నందున్న వాగ్ధనములన్నియు ఎత్తి ప్రార్ధించెను. “ఈ వాగ్ధానములు సూదులవలె దేవుని చెవిని ముట్టడించి గ్రుచ్చినవని” వ్రాయబడెను. లూథర్ ప్రార్ధన నుండి లేచి, ‘మిలాంగ్జన్! నీవు చావవు. బ్రతుకుదువు ‘ అని విశ్వాసపు పలుకు పలికి వెళ్ళిపోయెను. మిలాంగ్జన్ స్వస్థపడెను.
  20. నిత్య జీవమందు ప్రవేశించుట:- లూథర్ చాల కాలము వ్యాధితో నుండి, ప్రభువునందు నిద్రించెను. త్వరలో నా ప్రియులతో పరలోకములోనుండెదవని పలికెను. వ్యాధి, బాధ క్రమముగా హెచ్చెను. కుమారులు అతని దగ్గర నిలచి నీవు నేర్చిన సిద్ధాంతములు సత్యములని నమ్మకముతో మరణింతువా! అని అడుగగా “ఔను” అని జవాబిచ్చెను. 1546వ సంవత్సరము ఫిబ్రవరి 18వ తేదీ తెల్లవారుఝామున 4 గంటలకు, ‘నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ‘ అని పలికి నిద్రించెను. ఈయన శరీరము మహా ఘనముగా విటెన్ బర్గు దేవాలయమున సమాధి చేయబడెను. లూథర్ వంటి మార్పును, విశ్వాస నిశ్చయతను, ధైర్యమును, దేవునిపై ఆధారపడుటయును, ఫలితముతో కూడిన ప్రార్ధనా జీవితమును, సైతానునెదిరించు బలమును కలిగి యుండునట్లు దేవుడు చదువరులను దీవించును గాక! (ఈ కథలు సంఘములలో ఒక్కొక్కరిచేత చెప్పించ వచ్చును లేక చదివించ వచ్చును. ఈ అంశములు ఆయా గ్రంధముల నుండి సేకరించబడినవి.)
Please follow and like us:

How can we help?

Leave a Reply