క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. శ్రమకాల ధ్యానములు...
  5. అంతరంగ సిలువ

అంతరంగ సిలువ

(యెషయా 53:4,5)

సిలువ యొక్క అంతరంగ చరిత్ర:- (1) ప్రభువు సిలువ వేయబడినప్పుడున్న స్త్రీలకు, శిష్యులకు, యోహానుకు సిలువయొక్క బహిరంగ చరిత్ర తెలియును గాని అంతరంగ చరిత్ర తెలియదు. వీరు విశ్వాసుల జాబితాలోనున్నను అంతరంగ చరిత్ర తెలియదు. వీరు విశ్వాసుల జాబితాలోనున్నను అంతరంగ చరిత్ర తెలియదు. అపుడు అవిశ్వాసుల జాబితాలోని వారెవరనగా రాణువ వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రభువును అపహాస్యము చేసినవారు. వీరికికూడ ప్రభువు సిలువ యొక్క బహిరంగ చరిత్ర తెలియును, గాని అంతరంగ చరిత్ర తెలియదు. బహిరంగ చరిత్ర కనబడేది; వినబడేది. అంతరంగ చరిత్ర కనబడదు, వినబడదు.

(2) వారు శరీర నేత్రములతో చూచిన బహిరంగ చరిత్ర ఏమనగా – తోటలో ప్రభువును పట్టుకొనుట, కోర్టులకు తీసికొనుట, భుజము మీద సిలువ ఎత్తుట, వీధులగుండ కల్వరికొండకు నడిపించుకొనిపోవుట, గుద్దుట, ఉమ్మివేయుట, కొరడాతో కొట్టుట, సిలువపై పరుండబెట్టుట, మేకులు కొట్టుట, సిలువ నిలబెట్టుట మొదలగునదంతయు సిలువయొక్క బహిరంగ చరిత్ర.

(3) (ఇక్కడ ఒక అబ్బాయిని సిలువవలె రెండుచేతులు చాపి నిలువ బెట్టవలెను. మరికొందరు పిల్లలను ఒకరిని కుడిప్రక్క, ఒకరిని ఎడమప్రక్క, మరియొకరిని ముందు నిలువబెట్టవలెను ఈ ముగ్గురికి మూడు పేర్లు: పాపము, వ్యాధి, శిక్ష, అని చెప్పించవలెను.) యెషయా 53:4,5 వచనములలో ఈ పైన తెల్పిన విషయము గలదు. పాపము, వ్యాధి, శిక్ష, ప్రజలందరికి ఉన్నవి. వీటిని ప్రభువు తనపై వేసికొనుటయే సిలువ యొక్క అంతరంగ చరిత్ర. మానవునియొక్క జీవిత చరిత్రలో ఈ మూడును గలవు.

(4) మొదటి మానవుడు పాపము చేసినాడు. అతని సంతానమైన తరువాత వారందరిలోను పాపము గలదు. ఈ మూడింటిని తీసివేయుటకు దేవుడు ఒక సూత్రము కల్పించెను. ఇవి మానవుని అంటుకొని లోపలనున్నవి. పాపము మానవునిలో గలదు,వ్యాధి శరీరములో గలదు. శిక్ష శరీరము లోపల, వెలుపట గలదు. దొంగతనము చేసిన జైలుశిక్ష వచ్చును. చంపినందుకు ఉరిశిక్ష. ఇవి పైకి కనబడు శిక్షలు. వ్యాధి మందుల ద్వారా కొంతవరకు పోవచ్చును గాని పాపఫలితమైన శిక్ష అనగా మరణము తర్వాత వచ్చు శిక్ష పోదు.

(5) పాపము అనగా దేవుని ఆజ్ఞకు వేరుగా నుండుట, చూపులో, తలంపులో, మాటలో, క్రియలో, దేవునికి ఉన్నవి. వీటికి ఫలితముగా చివర శరీర మరణము గలదు. ఒకరు పాపము చేసి మారుమనస్సు పొందకుండ ఆ పాపములోనే చనిపోయిన యెడల అతడు నరమునకు పోవలసియుండును. ఇది పెద్దమరణము (నరకము). శరీర మరణమునకు మరణమున్నదా? అనగా మనిషి చనిపోయిన తర్వాత మరల 70 దినములకు లేక 100 దినములకు మరల మరణము వచ్చిన యెడల, మరణము బ్రతికి ఉన్న దన్న మాటయే. మనిషి చనిపోవును, మరణము కూడ చనిపోవును. మరణము ఎల్లప్పుడూ బ్రతికి ఉండదు. పాపము చేసిన యెడల నరకము ఉన్నది. ఇది ఆత్మ మరణము, అసలైన మరణము. శరీర మరణము అంత ఘోరమైనదికాదు, అయితే నరక మరణము భయంకరము. ఈ నరక మరణము జీవించి బాధించును. ఈ నరక మరణమునకు చావులేదు. అనగా నరకశిక్ష పొందినవారు జీవించిఉండి బాధపడుదురు.

(6) గనుక యేసుప్రభువు పాపము, వ్యాధి, శిక్ష, ఆత్మమరణము, నరకమును తీసివేయుటకు సిలువ ఎక్కెను. యూదులు మేమే యేసును సిలువ ఎక్కించినామని అనుకొన్నారు. ఇది బహిరంగ చరిత్ర. సిలువయొక్క అంతరంగ చరిత్ర ఏమనగా పాపము, వ్యాధి, శిక్ష పరిహరించుటకు ప్రభువే సిలువనెక్కెను. యూదులు అనుకొన్నది, చేసినది బహిరంగకథ. ప్రభువు ఎక్కిన సిలువ అంతరంగ కథ. గెత్సెమనే తోటలో ప్రభువును పట్టుకొనుటకు వచ్చినప్పుడు ప్రభువు తన్ను తానే వారికి బయల్పరచుకున్నపుడు వారు వెనుకకు పడిరి. అట్టివారు ఆయననేమి పట్టుకొనగలరు, సిలువ వేయగలరు. ఆయన పట్టుకొననిచ్చినాడు గనుక వారు పట్టుకొనగలిగిరి. కట్టనిచ్చినాడు గనుక ఆయనను కట్టిరి. సిలువ కర్ర మోయుటకు ఒప్పుకొన్నాడు గనుక వారు ఆయన భుజములపై మోప గలిగిరి. మేకులు ఆయనే కొట్టనిచ్చినాడు గనుక వారు ఆయన చేతులలో, కాళ్ళలో కొట్టగలిగిరి. చంపనిచ్చినాడు గనుక వారు ఆయనను చంపగలిగిరి. ఇదంతయు చేయనిచ్చుట సిలువయొక్క అంతరంగ చరిత్ర.

(7) ప్రభువు సిలువ మీద వేసికొన్న వరుసలు, ఏవనగా:- (ఎ) అన్ని పాపములు, అన్ని వ్యాధులు, అన్ని శిక్షలు వేసికొనెను. హేడెస్, నరక శిక్షనుకూడ ఆయన ఆయన తన సిలువపై వేసికొనెను. (బి) అనేక పాపములు, అనేక వ్యాధులు, అనేక శిక్షలు వేసికొనెను. అందుచేత ప్రభువు సిలువనెక్కెను. (సి) అందరి పాపములు, అందరి వ్యాధులు, అందరి శిక్షలు వేసికొనెను. ఈ అంతరంగ సిలువ చరిత్ర ప్రజలకు తెలియదు. సిలువమోత, సిలువవేత ప్రజలు ఎరుగుదురు, అది బహిరంగ చరిత్ర. (డి) నాలుగవ వరుస: నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు, ఆయన తనపై వేసికొనెను. ఈ నాలుగవ వరుస లేనిదే పై మూడు వరుసల వలన లాభము లేదు. ఎవరి పాపము, వ్యాధులు శిక్షలు ప్రభువు మోసెనో వారే చెప్పగలరు. ఇక్కడ ‘రక్షకా నా వందనాలు” అను కీర్తనలోని

(i ) పాప భారమెల్ల మోసి -బరువు దించి వేసినావు||

(ii ) వ్యాధి భారమెల్ల మోసి-వ్యాధి దించి వేసినావు||

(iii ) శిక్ష భారమెల్ల మోసి -శిక్ష దించి వేసినావు|| అను మూడు చరణములు మనోనిదానముతోను, ప్రభువు మోసినాడను విశ్వాసము కలిగించుకొనుచు పాడవలెను.

ఎవరికైన ఏదైన బాధ ఉన్న యెడల కన్నీరు వచ్చును. ఇంకొక రకపు కన్నీరు, కృతజ్ఞతా కన్నీరు. ఉదా:- అబ్బాయి రంగూను పారిపోయినాడు. ఎన్ని ఉత్తరాలు వ్రాసిన జవాబులేదు. అయితే 10 సంవత్సరములకు వచ్చెను. అప్పుడు సంతోషమును బట్టి కన్నీరు వచ్చును. ఆలాగే పై మూడు చరణములు అనుభవముతో పాడిన యెడల కృతజ్ఞతా కన్నీరు వచ్చును.

(8) యేసుప్రభువు సిలువపై ఈ మూడును వేసికొనెను గనుక చేసిన పాపములు చెరువులో నున్నవా, నీ ఇంటిలో నున్నవా, నీ హృదయములో నున్నవా? ప్రభువు యొక్క సిలువపై నున్నవి. ఆలాగే వ్యాధులు నా శరీరము పై లేవు గాని సిలువమీద నున్నవి. అవి నా మీద లేవు అని చెప్పిన తరువాత కూడ మరల తలంపులోనికి, జ్ఞప్తిలోనికి మానవుడు తెచ్చుకొన్నాడు. ప్రసంగము విన్నప్పుడు సిలువలో ఈ మూడు ఉన్నవని అనుకొని, అటువెళ్ళిన తర్వాత నా పాపములు మోసినాడా? నా వ్యాధి ఆయనపై వేసికొన్నాడా? నా శిక్ష వేసికొన్నాడా? అని మనస్సులో అవిశ్వాసపడెను. అట్లు మరల జ్ఞాపకము చేసికొని అవిశ్వాసపడిన యెడల శిక్ష ఉన్నది.

(9) హెబ్రీ 8:12 లో “నేను వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొనను” అని దేవుడే చెప్పుచున్నాడు. ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకొననప్పుడు మనుష్యుడెందుకు జ్ఞాపకము చేసికొనవలెను. ఈ వాక్యము బైబిలులో గలదు గాని హృదయములో నుండదు. మరణ సమయములో సైతాను వచ్చి నీ పాపములు ప్రభువు క్షమించలేదన్నప్పుడు, జీవితకాలమంతయు నమ్మి మరణమప్పుడు అవిశ్వాసపడిన యెడల శిక్ష వచ్చును. పాపము, వ్యాధి, శిక్షలేవనుకున్న లేవు. ఉన్నవనుకొన్న ఉండును.

(10) వ్యాధిలో, శిక్షలో కృప ఉన్నది గాని పాపములో కృప లేదు. ఒకరికి జబ్బువచ్చినది. ఆ బాధలో పాపములు ఒప్పుకొని రక్షింపబడెను. జబ్బు పిశాచి పని, పాఠము నేర్పుట ప్రభువు పని గనుక వ్యాధిలో కృప ఉన్నది. భక్తులు మరణము పొందగానే పరలోకము వెళ్ళుదురు. మరణము శిక్షయైనను, పరలోకమునకు ఆ మరణము ద్వారమగుట కృపయే, గనుక వ్యాధిలోను, శిక్షలోను కృప ఉన్నది. వ్యాధి, శిక్ష అను సైతాను యొక్క కార్యములను ప్రభువు కృపలో వాడుకొనును గనుక “విశ్వసించువాడు కలవరపడడు”. వ్యాధి, శిక్ష ఉన్నను కలవరపడడు.

(11) ప్రపంచములో ఈమూడే ఉన్నవా, ఈ మూడింటిని దాటిపోయినవి ఇంకేమైన ఉన్నావా? అట్లున్నయెడల ప్రభువు యొక్క సిలువ కార్యము సంపూర్ణము కాదు. ఈ మూడింటిని దాటిపోయినవి మరేవియులేవు ప్రభువు అన్నిటిని పరిహరించెను. నరకము వరకున్న సమస్తమును పరిహరించెను. అయితే మనబలహీనతను బట్టి పాపము, వ్యాధి, శిక్ష పూర్తిగా మనలను విడుచుటలేదు, గాని ఒక దినమందు పూర్తిగా అవి విడువబడును.

(12) భక్తుడు పాపములో పడునా? పడును. సౌలు ఆత్మను పొంది మరల దావీదును చంపుటకు వెళ్ళెను. హెబ్రీ 6:4లో వెలిగింపబడి, రుచిచూచి, ఆత్మను పొంది పడిపోవుదురు. అట్టివారు నూతన పరచబడుట అసాధ్యము అనిగలదు. అయితే ప్రభువు వచ్చి పెండ్లికుమార్తెను తీసికొని వెళ్ళునప్పుడు ఈ మూడును ఉండవు. ఇప్పుడు భక్తులు పడుట, లేచుట ఉండును, వ్యాధులు వచ్చుట, పోవుట ఉండును. శిక్ష రావడము, పోవడము ఉండును. పరమునందు పాపము, వ్యాధి, శిక్ష అనగా ఏమిటి అని అడుగుదురు. మహిమలోనికి వెళ్ళేకొలది ఇవన్ని తెలియవు. అట్టి మహిమకాలము ఆయన త్వరలో ఇవ్వనైయున్నాడు. ప్రభువు తన సిలువ మీద వేసికొన్న పాపము. వ్యాధి, శిక్ష, పూర్తిగాతీసివేయు దినము సమీపించినది. మనము పూర్తిగా నమ్మిన యెడల అవన్నీ పూర్తిగా పోవును.

(13) ఆదాము, అవ్వ, అబ్రాహాము! మీరు ఈ మూడు తీసివేయండి అనినయెడల మేము పాపములో నున్నవారము, తీసివేయలేమని అందురు. ఏ పాపము చేయని యోసేపు నడిగిన నాకు శక్తిలేదని అనును. దేవదూతలకు పాపము, వ్యాధి, శిక్ష తెలియదు గనుక తీసివేయలేరు. సంఘమును మీరు పరిశుద్ధముగా నున్నారా? అని అడిగిన ‘లేదు ‘ అని జవాబు చెప్పుదురు. ప్రభువు వచ్చినప్పుడు పాపము, వ్యాధి, శిక్ష, శరీరము తీసివేయును గనుక ఇక పాపము చేయరు. ఇది రెండవ రాకడలో జరుగును. నీతివస్త్రము ధరించు క్రొత్త శరీరము వచ్చును. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. చేయజాలడు అనునది అప్పుడు జరుగును.

(14) ప్రభువు సిలువమీద చేసిన రెండు పనులు ఏవనగా:- (1) అవస్థలు తీసివేసెను. (2) పరలోక భాగ్యమిచ్చెను. తీసివేసినది ఎక్కువా? గడించినది ఎక్కువా? ఉదా: డాక్టరు గారు రోగితో మూడు నెలల వరకు వ్యాధిపోదని చెప్పి ఆలాగే బాగుచేసెను. పూర్తిగా రొగము పోయినట్లు రోగికి తెలుసు. డాక్టరునకు తెలుసు. అయితే మూడు వారముల తర్వాత రోగి చనిపోయెను. సత్యము చెప్పలేదు గనుక చనిపోయెను. అట్లే పాపము తీసివేసి పరలోక భాగ్యమివ్వక పోయిన యెడల మరల పాపమే చేయుదురు. అప్పుడు రెండు శిక్షలు మనిషికి వచ్చును. గనుక ప్రభువు చేసిన రెండు భాగ్యములు అనుభవించు దీవెన అందరికిని కలుగును గాక! ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply