వాక్యభాగము: మత్తయి 20:17;మార్కు 10:32; లూకా 18:31.
ఈ దినము మొదలు మంచి శుక్రవారము వరకు 40 దినములు. ఈ దినములకు లెంటుకాలము, మండల దినములు, శ్రమకాలము మొదలగు పేర్లు గలవు. ఎవరు ఈ 40 దినములు సిలువధ్యానము చేయుదురో వారికి గొప్ప అంతస్తు. శ్రమచరిత్ర వచనములున్న కాగితములో దినమునకు ఒక పాఠము గలదు. ఆ ప్రకారమే చదివి ధ్యానించండి.
యేసుప్రభువు యొక్క జీవితమంతయు శ్రమకాలమే గాని ప్రత్యేకమైన శ్రమకాలము కూడ గలదు. ఈ శ్రమలను క్రైస్తవులు ధ్యానించు చున్నారు. యేసుప్రభువు పాలస్తీనా ఉత్తరభాగములో సర్కీటు చేయుచు యెరూషలేము వెళ్ళనైయుండి, శిష్యులను వేరుగా ఈ మాటలు చెప్పెను. “ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము” అని చెప్పెను. ఇదే శ్రమకాల ఆరంభము. ఈ శ్రమ ప్రభువు సిలువ మీద చనిపోవుటతో ముగిసెను. పూర్వకాలపు దైవభక్తులు ఈ శ్రమలను తలంచుకొనుటకు 40 దినములు ఏర్పాటు చేసిరి. యేసుప్రభువు పరలోకమునుండి వచ్చినది మొదలుకొని, తిరిగి పరలోకమునకు చేరువరకు ఉన్నఅన్ని అంశములు, ముఖ్యమైనవి. అవన్నియు మనకొరకే. ప్రభువు చరిత్రలోని అన్ని అంశములు సంవత్సరములోని 52వారములకు పంచిపెట్టినారు. అవికాక ఇంకా కొన్ని అంశములున్నవి. అవి పండుగ అంశములు. క్రిష్ట్మసు, ఈష్టరు, మొదలగునవి.
మనకున్న పాప శ్రమ, వ్యాధి శ్రమ, శిక్ష శ్రమ తీసివేయుటకు ప్రభువు యొక్క శ్రమకాలమే ముఖ్యమైనది (యెషయా 53:4,5). మన శిక్ష ఆయన మీద పడెను. ఈ శ్రమకాలములోనే పైమూడు శిక్షలు ప్రభువు భరించి, తీసివేసెను గనుక శ్రమకాల చరిత్ర ధ్యానించుటకు 40దినములు ఏర్పాటు చేసిరి. చివరిరోజులు అనగా పరిశుద్ధ వారములో ఎక్కువగా ధ్యానింతురు. మోషే ఏలీయా, యేసుప్రభువు 40 దినములు ఉపవాసము చేసిరి. గనుక సంఘము ఈ దినములు ఉపవాస దినములుగా ఏర్పాటు చేసికొనెను. దేవా! నీ శ్రమల వలన నా శ్రమలు పోగొట్టినావు గనుక నీకు వందనములని స్తుతించవలెను. అయితే శ్రమల ధ్యానము మొదలు పెట్టక ముందు భస్మ బుధవారము గురించి మనము తలంచవలెను. మన దురవస్థ, పాపస్థితిని గురించి దుఖించవలెను. మన నేరములు ప్రభువు దగ్గర చెప్పుకొనవలెను, మన హృదయ పాపచరిత్ర ఒప్పుకొనవలెను. నా తలంపులోని పాపము, చూపులోని పాపము, నైజము వలన పాపము; ఇవన్ని నీకు శ్రమ కలిగించినవని దుఃఖించుటకు భస్మ బుధవారము ఏర్పాటు చేయబడెను. ఈ దినమున శుద్ధిచేసికొని, తక్కిన దినములు స్తుతించుటకు ఏర్పాటుచేయబడెను. మన దోషములను దేవుని సన్నిధానములో ధారపోసి ఆయన శ్రమలను ధ్యానించవలెను.
భస్మ బుధవారము యొక్క అర్ధము:- ఆది 18:27 లో అబ్రాహాము దేవునితో మాట్లాడుచు నేను బూడిదవంటి వాడను, ధూళివంటివాడను అని చెప్పెను. విశ్వాసులకు తండ్రి అని పేరుపొందిన అబ్రాహాము అట్లనిన, మనము ఏమని అనవలెను. కాలుట వలన బూడిద ఏర్పడుచున్నది. భూమి మీద ధూళి ఉన్నది. పారవేయబడుటకును, త్రొక్కబడుటకును మన జనకుడైన అబ్రాహాము దేవుని ఎదుట తన్నుతాను తగ్గించుకొనినట్లు, భస్మ బుధవారము మనమును దేవుని ఎదుట ‘నేను బూడిదవంటివాడను, నేను ధూళివంటివాడను, పారవేయబడుటకును, త్రొక్కబడుటకును తగినవాడనని ‘ చెప్పుచు దేవుని యొద్దకు చేరవలెను. ఈ దినమునకు మరియొక అర్ధము కలదు. మట్టల ఆదివారము తెచ్చిన మట్టలను కాల్చి, బూడిద చేసి, ఆ బూడిద ఈ దినము అందరకు ఇచ్చుట ఆచారము. అనగా దుః ఖమునకు ముంగుర్తుగా బూడిద అందరికి ఇచ్చెదరు.
ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నామని ప్రభువు చెప్పెను. ఇప్పుడు ప్రభువు దృష్టి యెరూషలేము తట్టు ఉన్నది. మన దృష్టి ఎల్లప్పుడు లోకము తట్టును, శరీరసౌఖ్యములవైపును ఉంచు చున్నాము. క్రిష్ట్మసు కాలమున గొల్లల దృష్టి ప్రభువు వైపు త్రిప్పుటకు, “మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు.” అని దూత వర్తమానము చెప్పెను. మన దృష్టి ప్రభువు తట్టు, ఆయన మాటల తట్టు త్రిప్పవలెను. ఉదయమున లేచిన వెంటనే కండ్లు విప్పకముందు, మన దృష్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తట్టు త్రిప్పవలెను. కండ్లు తెరచి వాక్యమువైపు చూడవలెను.
ప్రభువు ‘ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము ‘ అనగానే శిష్యులు ప్రభువువైపు చూచినారు. అక్కడ యూదులు, యాజకులు, శాస్త్రులు ఆయనను అన్యులకు అనగా రోమీయులకు అప్పగింతురు అని చెప్పెను. యెరూషలేములో జరుగవలసినవి.
1. అప్పగించుట 2. అపహసించుట 3. ఉమ్మివేయుట 4. కొరడాలతో కొట్టుట. 5. మరణశిక్ష విధించుట 6. చంపుట ఇవి సంభవించును. ఈ 6 శ్రమలు ప్రభువు మనకొరకు భరించవలెను. ఇవన్నియు ప్రవక్తలు ముందుగా చెప్పినవి. అన్నియు ప్రభువుయొక్క మనసులోనున్నవి. ప్రభువు బలికి ముంగుర్తుగా నున్న గొర్రెలను బలియిచ్చు యాజకులు, శాస్త్రులు, ప్రవచనములు ఎరిగిన వారైనప్పటికినీ, తన్ను అప్పగించనై యున్నారని ప్రభువు తెలిపెను. యెరూషలేములో శ్రమ ఉన్నను ప్రభువు దృష్టి ఆ పట్టణము మీద గలదు. మన దృష్టి లోకము తట్టును, శరీర సౌఖ్యముల తట్టును ఉండును. శ్రమలు ఎదుటనున్నను ప్రభువు జడియలేదు. ఆలాగు శ్రమలకు ఎదురువెళ్ళు కృప మీకు కలుగును గాక! ఆమేన్.