ప్రార్ధన:- దయగల తండ్రీ! నీ శ్రమలను ధ్యానించుటకై నీ సంఘమును ఏర్పర్చుకొన్నావు. నీ శ్రమల ధ్యాన ప్రారంభ దినమున మమ్మును చేర్చినందుకు నీకనేక స్తోత్రములు. మా జీవిత కాలమంతా, నీ జీవిత కాలము యొక్క శ్రమలను ధ్యానించుట వల్ల మాకు ఉపయోగము. అయినప్పటికిని సంఘము ప్రత్యేక సమయము నియమించుకొన్నది. మా ప్రభువా! ఈ మండల కాలములో మేము నీ శ్రమచరిత్ర ప్రతి ఆదివారము, బుధవారము లేక శుక్రవారములు మాత్రమే గాక, మా గృహములలో ప్రతిదినము ధ్యానించిన యెడల మాకెంతో మేలు. కాబట్టి మేమట్లు ఈ దినము నుండి ప్రతిదినము నీ సిలువను ఎట్లు ధ్యానించవలెనో మా ఆత్మకు శక్తి అనుగ్రహించుము. నేడు మేము నీ చరిత్ర యొక్క ముఖద్వారము నొద్ద నిలువబడి యున్నాము. మాకు గడిచిన కాలములో, రాబోయే కాలములో వ్రాయబడిన వ్రాతల మూలముగా శ్రమచరిత్ర కనబడుచున్నది. గనుక ఆ నీ శ్రమల ధ్యానముతో మా హృదయములను నింపుకొనునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మాకు కావలసిన వర్తమానములను ఈ దినమునను, ప్రతిసమయములోను అనుగ్రహించు చుండుము.
భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగ ఆచరించు చున్నారో వారికికూడ నీ వర్తమానమును అందించుము. సంఘము, బలపడే నిమిత్తమైన నీ శ్రమల యొక్క ధ్యాన ఆసక్తిని మాకు దయచేసి, నీ వాక్యమునకు లోబడి, నీ శ్రమ చరిత్రలోకి వెళ్ళునట్లు నీయాత్మననుగ్రహించుము. పరలోకపు తండ్రీ1 నీ కుమారుని ద్వారా చరిత్ర జరిగించి, అది మాకు వ్రాసిపెట్టి ఉంచినందుకు నీకనేక వందనములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు నిత్యము స్తోత్రమని చెప్పు విశ్వాసులకు, శ్రమలు ఆనందకరముగా చేయుమని శ్రమగుడారములో ప్రవేశించిన యేసుప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.
ప్రసంగము (వివరము)
ప్రియులారా! మనము ప్రభువు యొక్క శ్రాకాల గుడారములో ప్రవేశించినాము. నలుబది దినములలో ఎక్కడైనను కుడిప్రక్కను గాని, ఎడమప్రక్కను గాని, శ్రమయే కనపడును. మనము యేసుప్రభువు శ్రమల యెదుట మన శ్రమలనుంచినా, అవి చిన్న ఆవగింజంత మాత్రమే కనబడుచున్నవి. యేసుప్రభువు తన శ్రమలను జయముతో ముగించిరి.
భక్తులైనవారు పూర్వకాలమందు ప్రభువు చరిత్ర పరీక్షించినారు. అందులో అనగా ఆయన చరిత్రలో క్రిస్మస్ పండుగ అనగా ఆయన జన్మకాల చరిత్ర, ఆయన బోధ, ఆయన అద్భుత క్రియలు, శ్రమలు, సిలువ మరణము, పునరుత్థానము, ఆరోహణము, రాకడ ఈ మొదలైనవన్ని ఉన్నవని గ్రహించినారు. గాని, క్రిస్మస్ కంటే, ఆరోహణము కంటే, ప్రభువు యొక్క శ్రమలే, ఆయన సిలువమరణమే ముఖ్యమని అనుకొని మన పూర్వికులు, పెద్దలు ఈ నలుబది దినముల ధ్యానములు ఏర్పర్చినారు. గనుక ఈ మండల దినములలో ప్రభువుయొక్క శ్రమలే ధ్యానించవలెను. క్రిస్మస్ ధ్యానించుటకు ఒక్కరోజే, ఆరోహణ ధ్యానం ఒక్కరోజే, అట్లే తక్కిన పండుగలన్నీ ఒక్కొక్క రోజే గాని ప్రభువు యొక్క శ్రమకాల చరిత్ర ధ్యానించుటకు ఎక్కువ సమయము కావలెనని పెద్దలు అనుకొని 40 దినములు ఏర్పర్చినారు. అది ధ్యానించుటకు ఇన్ని దినములెందుకని అనవచ్చును. మనము ధ్యానించగలిగితే అట్లు ధ్యానించుటకు శ్రమకాల ధ్యానవాక్యములు బైబిలులో అనేక వాక్యములున్నవి. అవన్నీ ఇక్కడ వివరించక వాటివాటి అన్వయ వాక్యములు చెప్పెదను. మీరు ఇంటిదగ్గర చదువుకొనండి, (1పేతురు 1:19, 20,21 వచనములని చెప్పెను. మొదటి అధ్యాయమంటాను. అప్పుడు అధ్యాయమంతా చదివెను.)
1. నిజమైన విశ్వాసి ఈ మొదటి రోజున ప్రభువు యొక్క సన్నిధానమునకు వెళ్ళి మహావినయముతో ప్రభువా! నేను బూడిదనై యున్నాను, ధూళినై యున్నాను అని చెప్పగలుగును. అందరు చెప్పలేరు. గుడిలో మాత్రమే కాదు., మీటింగులో మాత్రమే కాదు, ఇండ్లలో మాత్రమే కాదు అబ్రాహామువలె హృదయములో చెప్పవలెను అబ్రహాము విశ్వాసులకు జనకుడైనను, నేను ధూళిని అని అంటే, మనము ఏమనగలము? నేను ధూళికంటె ధూళిని, బూడిద కంటె బూడిదను అనవలెనుగదా! అలాగు ఎవరంటారో వారే శ్రమకాలపు గుడారములోనికి చేరగలరు. యోబు కూడా ఆలాగే చెప్పెను. 1. నేను పాపిని. 2. నేను అయోగ్యుడను, 3. నేను అశక్తుడనైయున్నాను. మీరు ఈ మూడు ఒప్పుకొంటే శ్రమకాలచరిత్ర ధ్యానములో ప్రవేశింతురు. మీరు ఇంటివద్ద కూడుకొనిన యెడల ఎక్కువగా ధ్యానించగలరు, చదువగలరు. నేను పాపినైయున్నాను, అక్రమకారుడను అని అంటే, నాలో ఇంకా ఏమైనా పాపముంటే మంచి శుక్రవారము వరకు ఒప్పుకొనుచుండవలెను. శ్రమకాల చరిత్ర రెండువైపుల కనబడుచుండగా తండ్రీ! నేను పాపినై యున్నాను. అయినప్పటికిని నా కొరకు నీవు, పాపి కంటె ఎక్కువ శిక్ష అనుభవించినావు అని అనండి.
2. అయోగ్యుడను:- ఒకవేళ పూర్తిగా క్షమింపబడినవారు, పూర్తిగా పాపములు విడచినవారు ఉండవచ్చును. అయోగ్యుడను అంటే నేను పాపిననికాదు, గానీ నీ శ్రమ ద్వారా అందించు దీవెనను అందుకొనలేదు అని అర్ధము. ఆహా! నా అయోగ్యత ఎంత చెడ్డది ప్రభువా! అయినప్పటికిని, నీ శ్రమకాలధ్యాన కృప ఇచ్చినావు.
3. నేను అశక్తుడను:- అనగా, నీ శ్రమ చరిత్రవల్ల ఎన్నెన్ని దీవెనలు ఇస్తావో అని అందుకునే శక్తి నాకు లేదు, నీవైతే ఇస్తావు. నీవుపడ్డ శ్రమచూస్తే, ఒక్క శ్రమకాదు. అనేక శ్రమలు, నా కొరకు భరించి అనేక దీవెనలు సంపాదించినావు. ఐదువేలమందికి ఆహారము పెట్టగా 12 గంపల రొట్టెముక్కలు మిగులును అని నీకు తెలిసినప్పటికిని మిగిలిపోయేటట్లు నీవు అద్భుతము చేసినావుకదా! అలాగే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చే దీవెనలన్నీ మేము అందుకొనలేమని తెలిసినప్పటికిని మా కొరకు నీవు శ్రమలు పొందినావు. నీకనేక స్తోత్రములు.
పాపచరిత్ర, అయోగ్యచరిత్ర, ఆశక్తి చరిత్ర చెప్పితిని. పాపచరిత్ర తెలిసికొని వందనములు చెల్లించితే అది ఎంతో మంచిది. అయోగ్య చరిత్ర తెలిసికొని వందనములు చెల్లించితే అదియు ఎంతో మంచిది. అశక్తుడను ప్రభువా! నా మీద నీకెంత ప్రేమ! అని అంటే అది ఎంతో మేలు. అట్టి చరిత్ర ధ్యానించుటకు ప్రభువు ఆత్మ కూడ మీకు తోడైయుండును. ప్రభువు శ్రమచరిత్ర మనకు తెలిసినదే కాని అందులోని భాగములు చెప్పుతాను.
శ్రమచరిత్ర మొదటిభాగము ప్రవచనభాగము, రెండవ భాగము చరిత్రభాగము, మూడవది జ్ఞాపకము తెచ్చుకొనే భాగము. నాలుగవది రాబోయే రాకడ సమయమందు ఉదహరింపబడిన భాగము (ప్రకటన). ఈ నాల్గు భాగములు ఎక్కడెక్కడ ఉన్నవో మీరు వ్రాసికొని, ఈ 40 దినములు ధ్యానించండి. ప్రతిరోజు భస్మ బుధవారమే మంచి శుక్రవారమే, పరిశుద్ద వారమే అని అనుకొంటూ ఎవరైతే ధ్యానించగలరో వారే పరిశుద్ధులు. ఎందుకంటే పాపము. అయోగ్యత, అశక్తిని శుభ్రము చేసికొన్నారు గనుక వారే ధ్యానపరులు. మరియు వారే దఃఖిస్తూ ఉన్న రక్షకుని సంతోషపరచగలరు.
- ప్రవచన భాగము:- దీనిలో ఆది. 3వ అధ్యాయము ఉన్నది. ఇందులో యేసుప్రభువు లోకమునకు వచ్చి సైతానువల్ల శ్రమపడునని ఉన్నది. ఉదా:- అబ్రాహాము దేవునితో అన్నమాట. ‘నేను ధూళిని, బూడిదను, కొంతమంది మారుమనస్సు పొందితే రక్షింపవా’ అని ఆది 8వ అధ్యాయములో ఉన్నది.
యోబు 30వ అధ్యాయములో, నేను ధూళినై ఉన్నానని అబ్రాహామువలె యోబు తగ్గించుకొన్నాడు.
దా.కీ. 22వ అధ్యాయము, ఇదంతా సిలువ మరణమును గురించియే. ‘నాదేవా! నాదేవా! నన్నెందుకు చేయి విడిచితివి అని మొదటే ఉంది. ఆ మాటలే ప్రభువు సిలువమీద పలికినాడు. ఎంతశ్రమ లేకపోతే అట్లనును? నా తండ్రీ! నా తండ్రీ! అని అనలేదు. నా దేవా!, నా దేవా! అని అన్నాడు. ఎందుకు చెయ్యి విడిచినావని మనిషి అంటాడు గాని, ఇంకొకరనరు గదా! వారు నా బట్టలు తీసుకొని చీట్లు వేసికొన్నారని ఈ కీర్తనలో ఉన్నది. ప్రభుని మరణ సమయములో రాణువవారు అట్లుచేసిరి. నా పాదములు, నా చేతులు వారు పొడిచినారు. ఈ ప్రవచనములే మీకు ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాను, ఇవన్నీ మీరు తరువాత వివరముగా చదువుకొనండి.
యెషయా 53వ అధ్యాయము, అందులో మీరెరిగిన మూడు అంశములున్నవి. 1. ప్రభువు మన శ్రమలు తన మీద వేసికొన్నాడు. 2. మన వ్యాధులు తన మీద వేసికొన్నాడు. 3. మన శిక్షలు తన మీద వేసికొన్నాడు. ఆయన మనమీదకు వచ్చు శాములన్నీ తనమీద వేసికొన్నాడు. ఇవన్నీ కంఠత చేస్తే మంచిది.
ఆ తరువాత విలాపవాక్యములు యిర్మియా వ్రాసినాడు. ఒక భక్తుడు ఉన్నాడని ఆయనకు గొప్ప శ్రమలనియు, ఆయనెంత ప్రార్ధన చేసినను వినలేదనియు, ఈటె తీసికొని పొడవబడినాడనియు అందులో వ్రాయబడియున్నది. ఆ 5అధ్యాయములు బాగుగా చదువుకొనండి. యేసుప్రభువు గెత్సెమనే తోటలో ఏమన్నాడు? ఈ శ్రమలగిన్నె నాయొద్దనుండి తొలగించుము అంటే తండ్రి విన్నాడా? వినలేదు (విలాప 3:8).
2. సువార్త భాగము:- మత్తయి 16,17,20 అధ్యాయములలో ప్రవచనములు ఉన్నవి. (మరణ చరిత్ర) ఈ ప్రవచనములలో ప్రభువు, తన చరిత్ర తానే చెప్పుకొన్నాడు. ‘ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్యకుమారుడు పాపుల చేతులకు అప్పగింపబడి, శ్రమలపాలై మరణమును పొందునని, మూడు ప్రవచనములు చెప్పెను. శిష్యులందరు ఆ ప్రవచనములు విని దుఃఖపడిరి. దీని అర్ధము కూడా వారికి తెలియుటలేదు. ‘ఈయన దేవుడు అని అనుకొంటున్నాము అని చెప్పినా చివరకు పేతురు ప్రభువును గద్దించెను. అయితే ప్రభువు పేతురును, సైతానా అని గద్దించెను. తరువాత శ్రమచరిత్ర జరిగినది. అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను చివరి అధ్యాయములో అసలు చరిత్ర ఉన్నది.
3. పత్రిక భాగము:- ఆరోహణమై వెళ్ళిన తరువాత భక్తులు అయిపోయినది తలంచుకొన్నారు. మనము అట్లే అయిపోయిన దానిని భస్మ బుధవారము మొదలుకొని మంచి శుక్రవారము వరకు ధ్యానించుదము. 1పేతురు 1అధ్యాయములో ఆయన జగత్తుపునాది వేయబడక మునుపే నియమింపబడినారు. అని, రెండవ అధ్యాయములో ఆయనను బాధపెట్టారు అనియు, అదికూడ అయిపోయినది అనియు వ్రాసినాడు. పౌలు ఏమి వ్రాస్తున్నాడు? ఆయన సిలువబాధ నొందినది శ్రమకాదు. ఆయన బ్రతుకంతా శ్రమచరిత్ర అనియు, రోదనతో ఆయన కాలము గడిపెననియు అన్నాడు. అనగా ఎప్పుడూ ఏడుస్తునే ఉన్నాడని అన్నాడు. సంఘ చరిత్ర భక్తులు, యేసుప్రభువును గురించి ఏమన్నారంటే దుఃఖముఖముతో ఉండేవాడనియు, కష్టములలో ఉన్నవారిని ఎవరినైనా చూస్తే జాలిపడేవాడని అన్నారు. హెబ్రి 5వ అధ్యాయములో రోదనతో గడిపెనని ఉన్నది.
ప్రవచన భాగము 2. సువార్త భాగము 3. పత్రిక భాగము 4వ భాగము:- రాకడ: ఎవరైతే ప్రభువును పొడిచినారో వారు ఆయనను చూచి ఏడ్చెదరని జకర్యా 12వ అధ్యాయములో ఉన్నది. ప్రకటన 4అధ్యాయములో ఒకాయన సిం హాసనము మీద కూర్చున్నారు. ఆయన ముందు వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నది. ఇది మనము ఎత్తబడితే చూస్తాము.
ఇవన్నీ ఈ నలుబది దినములు మీరు తలంచుకొని, వ్రాసుకొని, ధ్యానించుకొను ధన్యత ఆయన మీకు దయచేయును గాక. ఆమెన్.