క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. శ్రమకాల ధ్యానములు...
  5. భస్మ బుధవారము – 3

భస్మ బుధవారము – 3

(ఆది 18:27)

ధ్యాన పరులైన విశ్వాసులారా! సిలువ ధ్యాన భాగ్యము మీకు కలుగునుగాక! 1వ వరుస: (a) రెండు భస్మములు, (b) రెండు సిలువలు, (c) రెండు కన్నీళ్ళు 2వ వరుస: 40 దినముల ఉపవాస ప్రార్ధన. 3వ వరుస: బైబిలులో ఉన్న మూడు ప్రవచనములు, మత్తయి 16:21; మార్కు 10:33-34; లూకా 9:22. (a) భస్మములు రెండు: బూడిద, ధూళి. సొదొమ గొమొఱ్ఱా పట్టణములు నాశనము చేయుటకు దేవదూతలు వెళ్ళిన తర్వాత, మైదానములో యెహోవాకును అబ్రాహామునకును జరిగిన సంభాషణలొ ఈ మాటలున్నవి. అబ్రాహాము నేను బూడిదను, ధూళిని అని అనెను. బూడిద అనగా కర్రలు, కట్టెలు కాల్చిన తరువాత ఏర్పడినది. మనిషి చనిపోయిన తర్వాత దహనముచేయగా బూడిదయగును. ఆబూడిదకు అబ్రాహాము పోల్చుకొని, వినయము కనబర్చినాడు. ఈ శ్రమకాల దినములలో మనకు అట్టి తగ్గింపు ఉన్నప్పుడే మన ధ్యానమునకు విలువ.

ధూళి:- నేలమీద నడచినందువలన ధూళి ఏర్పడును. అరికాలి క్రిందనున్న ధూళి వంటివాడను అని తగ్గించుకొనెను. అవి రెండు భస్మములే. విశ్వాసులకు తండ్రి అనిపించుకొన్న అబ్రాహాము అంతగా తగ్గించుకొన్నాడు. మనము ఎంతవరకు తగ్గించు కొనవలెను! ఎవరియొక్క వంశముద్వారా భూలోకములోని వంశములన్నిటికి దీవెన వచ్చెనో, అట్టివాడైన అబ్రాహాము రెండు భస్మములకు సమానుడని చెప్పుకొనెను. ఎంత తగ్గింపు!

భస్మ బుధవారమున ఈ సంగతి జ్ఞాపకము తెచ్చుకొనవలెను. క్రీస్తుశకములోని భక్తులు సిలువ ధ్యానము కలిగియుండుటకు ఈ దినములు ఏర్పరచుకొనిరి. ప్రభువు మనకొరకు చేసిన ప్రాణత్యాగము అన్నిటికంటె గొప్పది గనుక దాని యెదుట మనము నిలువబడి మనలను తగ్గించుకొనవలెను. (b) సిలువలు రెండు:- మొదటి సిలువ ప్రభువు మన నిమిత్తమై వహించిన సిలువ. రెండవ సిలువ మనము ప్రభువు సిలువను ధ్యానించునపుడు మన అనుభవములోని సిలువ, అనగా శ్రమ, ఈ శ్రమ ప్రభువు శ్రమకన్న గొప్పది కాదు. ఆయన యొక్క శ్రమ మనకు ఆదరణ కలిగించి, శ్రమను నివారణ చేయుచున్నది. 2వ వరుస:- ఈ 40 దినములు రాత్రులు అన్నము మాని, మీ ఇష్టము వచ్చినంత సేపు సిలువ ధ్యానములో నున్న యెడల ధన్యులగుదురు. పూట అన్నము మానుటవలన చిక్కరుగాని, ఆత్మకు బలము, పూర్వము మోషే సీనాయి కొండమీద 40 రాత్రిమగళ్ళు ఉపవాసము చేసి, చిక్కిపోలేదు గాని ప్రకాశమానమైన మానవుడాయెను. ఏలియా 40 దినములు ఉపవాసము చేసినను చిక్కిపోలేదు. యేసుప్రభువు 40 దినములు ఉపవాసము అరణ్యములో చేసెను. అందువలన సైతానును జయింప గల బలము పొందెను. ఈ మూడు ఉపవాసములను బట్టి సిలువ ధ్యానము ఏర్పర్చియున్నారు. (c) రెండు కన్నీళ్ళు: ఈ 40 దినాలలో సిలువ ధ్యాన పరులు తమ పాపములను తలంచి, పశ్చాత్తాపపడి, దుఃఖించి, కన్నీరు రాల్చుదురు. ‘పాపినైన నా కొరకు ప్రభువు సిలువ మీద శ్రమ అనుభవింప వలసి వచ్చెను కదా!’ అని తమ పాపములను బట్టి దుఃఖించుట మొదటి కన్నీరు. పాపపరిహారము పొందినవారు ఆ పాపములున్నవని కాదు గాని తమ్మును చూచి దుఃఖించు కొనుట క్షేమము, యోబు యొక్క శ్రమలన్ని తీరిన తరువాత, బలమైన శరీరముగలవాడైన పిమ్మట స్వజనులు వచ్చి, ఎంత శ్రమ అనుభవించినావని దుఃఖించి, ఓదార్చిరి. శ్రమ అయిన తర్వాత ఎందుకు తలంచవలెను? మన క్షేమము, మన సంతోషము నిమిత్తమే. 3వ వరుస: మత్తయి 16:21 లో యేసుప్రభువు తన యొక్క శ్రమలు ఆయనే తలంచుకొన్నారు. గతించిన శ్రమలుకాదు. ఇక ముందుకు రాబోవు శ్రమలు తలంచి, తనలో ఉంచుకొనక శిష్యులకు చెప్పెను. ఆ చెప్పుటయే ప్రవచనము. ఆయన మనుష్యుడుగానే యున్నాడు గనుక బాధ. కేవలము దేవుడుగా ఉండిన బాధ లేదు. జరుగబోవు శ్రమలు తలంచినప్పుడు ఎక్కువ బాధా? లేక సిలువపై నున్నప్పుడు ఎక్కువ బాధా? నేరస్థుడా, నీకు ఉరి అని తీర్మానించిన రోజునా బాధ లేక ఉరితీయు దినమునా బాధ? ఉరి సంగతి విన్నప్పుడు కన్నీళ్ళే. ఉరి మెడకు వచ్చినప్పుడు కన్నీళ్ళే. మత్తయిలో ప్రభువు మొదట తన శ్రమలను గూర్చి చెప్పినప్పుడు బాధలేకపోలేదు. అది దుఃఖ సమయమే. అలాగే మనము మన పాపములను ఒప్పుకొన్నప్ప్పుడు అది మనకు దుఃఖ సమయమే. యేసుప్రభువునకు ఆయన పాపమును బట్టికాదు గాని, మన పాపములను బట్టి ఆయనకు దుఃఖము వచ్చినది. మనకు బదులుగా ఆయన దుఃఖించెను గనుక మనము సంతోషించవలెను.

ఒకడు తన స్నేహితునికి ఉరిశిక్ష అని తెలిసికొని, అధికారుల యొద్దకు వెళ్ళి’నా స్నేహితునికి బదులు నన్ను ఉరితీయండి ‘ అనెను. తప్పుచేసిన వానికి బదులుగా స్నేహితునికి శ్రమ, (దుఃఖము) వచ్చెను. నేరము చేసినవాడు బదిలీగా వచ్చిన తన స్నేహితుని చూచి కృతజ్ఞతతో కన్నీళ్ళు రాల్చును. అలాగే మనకు బదులుగా యేసుప్రభువు సిలువమీద ఉన్నారని ఆనంద భాష్పములు కార్చవలెను. ఈ రెండు రకముల కన్నీరు, వట్టి ధ్యానము. ఇట్టి ధ్యానము కాకుండ గట్టి ధ్యానము చేయగల ధన్యత ఈ భస్మ బుధవారము మొదలు, రాబోవు 40 దినములు మీకు కలుగును గాక!ఆమేన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply