మత్తయి 20:17-19;మార్కు 10:32-34;లూకా 18:31-34
క్రీస్తుప్రభువు యొక్క శ్రమకాలము మనకు ఆనందకాలము, ఎందుకనగా ఆయన శ్రమలవలన మన శ్రమలు గతించి పోయినవి. అయినను ఆయన శ్రమలు తలంచుకొన్నప్పుడు వేదన, దుఃఖము రాకమానదు.
(1) రావలసిన దీవెన రానప్పుడు ఏశావు చాల ఏడ్చెను. వచ్చునని ఎంతో ఆశతో నిరీక్షించిన దీవెన పోయినది గనుక ఏడ్చెను. అది ఒక రకమైన దుఃఖము. మనము ప్రార్ధించినప్పుడు మనకు రావలసిన ఫలితము రాని యెడల దుఃఖము కలుగును. కాబట్టి ఇక్కడ నున్న వారిలో ఎవరి కోర్కె నెరవేరలేదో వారు దుఃఖించుట న్యాయమే. అయినను దుఃఖించకూడదు. ఎందుకనగా అది (ఏశావునకు) తనకు రావలసిన దీవెన కాదు, తన తమ్మునికి రావలసిన దీవెన. ప్రభువుయొక్క సిలువ వేదనవల్ల మనకు ఒక దీవెన, క్రిస్మసు రోజున ఒక దీవెన, పునరుత్థాన దినమున ఒక దీవెన, ఆరోహణ దినమున ఒక దీవెన రావలెను. ప్రతి ఆదివారము ఒక రకపు దీవెన రావలెను. ప్రతి భస్మబుధవార దినమున ఏదో ఒక క్రొత్త దీవెన రావలెను. మనము ఆ దీవెన అందుకొంటే సంతోషము. దీవెన రాకపోతే విచారమే.
(2) బైబిలులో మరియొకచోట ఇష్మాయేలు తల్లియైన హాగరు, అరణ్యములో నీరు దొరకనందున కుమారుని విడిచిపెట్టి దూరముగా పోయి ఏడ్చుచుండెను. అప్పుడు దేవదూత వచ్చి నీ ఏడ్పు విన్నాను అని చెప్పలేదు గాని ఆ చిన్న వాని మొర వినబడినదని చెప్పి నీరున్నచోటు చూపించెను. గనుక ఆదరణ దొరికెను. ఏశావు యొక్క ఏడ్పువలన కోరిన దీవెన దొరకలేదు గాని కొంత కాలము గడచిన పిమ్మట, ‘నీవు నీ సహోదరుని కాడి తొలగించుకొంటావు ‘ అనే దీవెన కలిగినది. అది రాజుల కాలములో జరిగినది. అతడు ఏడ్చినందుకు ఆ కొంచెము దీవెనైనా తన సంతానమునకు దొరికినది. ఆలాగే మన విషయములోకూడ మనకు దీవెన రాకపోయినను మన తర్వాత వారికైనా దీవెన వచ్చును.
(3) నోవాహు కుమారులలో హాము శపించబడవలసినది. ఆలాగు జరుగలేదు గాని కనాను శపింపబడెను. శాపము అప్పుడు రాకపోయినను హాము యొక్క సంతానములో ఒకరికి వచ్చెను. గనుక మీలో ఎవరైన ఒక చెడు కార్యము చేసిన దాని ఫలితము మీకు రాకపోయినా, మీ తరువాత వచ్చే వారికైనా వచ్చి తీరును. ఆలాగే దీవెన కూడ వెంటనే రాకపోయినా తర్వాత వచ్చు వారికైనా లభించును. ఆలాగే ఈ లెంటు కాలములో సిలువధ్యానము చేసిన దీవెనైనా, మీ తరువాత వారికైనా వచ్చితీరును. గనుక నిరాశపడవద్దు.
(4) హిజ్కియాకు మరణము దగ్గర పడినదని వినబడినప్పుడు వెంటనే అతడు గోడతట్టు తిరిగి కన్నీటి ప్రార్ధన చేసెను. గనుక తనకు రావలసిన దీవెన వచ్చినది. ఆ రాజు యొక్క ఆయుష్కాలము పొడిగించబడినది. వెంటనే ఫలితము లభించినది. సిలువ ధ్యానము చేసినప్పుడు కొందరికి వెంటనే దీవెన వచ్చును. ఈ ప్రకారము జరుగునని బైబిలు చరిత్రవలన తెలిసికొనుచున్నాము.
(5) బైబిలులో ఇంకొక కథ ఉన్నది. ఒక స్త్రీ యేసుప్రభువుకు కాళ్ళు కడిగి దుఃఖించినది. వెంటనే ప్రభువు పాపక్షమాపణ గురించి తెల్పెను. కొందరు పాపముల నిమిత్తము విలపించినపుడు వెంటనే క్షమాపణ లభించును. ఆలాగుననే సిలువ ధ్యానము చేయునప్పుడు, దేవా నా పాపముల నిమిత్తమై నీవు శ్రమపడినావు అని దుఃఖించిన వెంటనే దీవెన ఆదరణ కలుగును. పాపి దుఃఖించిన తప్పక ప్రభువు అంగీకరించును. గాని కొంతమందికి క్షమాపణ వచ్చినట్టు తెలియదు. ఎందుకనగా కనిపెట్టనందువలన తెలియదు, ఏ ప్రార్ధనకైనా దేవుడు జనాబివ్వక పోవచ్చును గాని పశ్చాత్తాప ప్రార్ధనకు జవాబియ్యనియెడల, పాపి నిరాశలో పడిపోయి దేవుని దూషించి మరింత గొప్పపాపము చేసి నశించును. గనుక వెంటనే జవాబిచ్చును. అట్టివారు బైబిలులోని క్షమాపణ వాక్యములు చదువుకొనిన యెడల, వారికి ప్రభువు ఆదరణ కలిగించును.
(6) మరియొక సంగతి ఏమనగా మనిషి పాపము చేసినందువలన శిక్ష వచ్చును. గాని మనిషి శిక్షను గురించి ఏడ్చెను గాని, పాపమును గురించి ఏడ్వడు. అట్టివారు కొందరున్నారు. గనుక పాపమును గురించిఏడ్వవలెను గాని శిక్షను గురించి ఏడ్వరాదు. యేసుప్రభువు మనకు బదులుగా శిక్ష అనుభవించెను గాని ఆయన ఏడ్వలేదు. ఆ శిక్ష అనుభవములో నేను లోకము నిమిత్తము అనుభవించుచున్నానని ఆనందించెను.
(7) సిలువ ధ్యానకాలమందు కొందరు స్త్రీలు ఆయన బాధ చూచి ఏడ్చినారు. ప్రభువు ఒప్పుకొనలేదు. ఎందుకనగా వారియొక్కయు, వారి పిల్లల యొక్కయు పాపములను గురించి వారు ఏడువలేదు. గాని వారి పాపములు ఎవరు సిలువ మీద మోయుచున్నారో ఆయనను గురించి వారు ఏడ్చిరి. గనుక అది నిష్ఫలము. ఎందుకనగా వారి పాపఫలితము ఆయనమీద పడినది, అందు వలన వారు సంతోషించవలెను గాని సంతోషించలేదు. అందువలన వారి పాపములు ఆయన మోయుట వారి విషయములో నిష్ఫలమైనది. ఇంత కష్టపడి మీ పాపములు నేను భరిస్తే మీరు ఆనందించవలెనా? దుఃఖపడవలెనా? ఉదా: ఒకరు కట్టెల మోపు నెత్తిమీద పెట్టుకొని వచ్చుచుండగా తల, మెడ నొచ్చుచుండెను. ఒకరు వచ్చి ఆ బరువు ఎత్తుకొన్న యెడల ఏడ్చునా? సంతోషించునా? వందనము అంటాడు. ఆలాగే యేసుప్రభువు మన పాపములు, పాపఫలితములు ఆయనమీద వేసికొని భరించుచుండగా కృతజ్ఞతా వందనములు చెప్పవలెను.
ఈ 40 దినములు మన పాపములను గురించి దుఃఖించుచుండవలెను. ఒక దరి నుండి స్తుతించుచుండవలెను. ఈ రెండు పనులు మంచి శుక్రవారము వరకు చేయవలెను. సిలువ ధ్యానములో సిలువ ఉండకూడదు గాని సిలువవలన వచ్చిన జయము ఉండవలెను. దేవుడు తన కుమారుని మరణమున కప్పగించి, ఆ మరణముద్వారా మోక్షమున చేర్చుటకు మనిషి కొరకు ఈ కార్యము చేసెను. ఆ మరణము ద్వారా జీవమిచ్చుటకు, ఆ జీవముద్వారా తప్పిపోయిన మనిషిని మోక్షమునకు చేర్చుటకుమనిషికొరకు ఈ కార్యము చేసెను. అది సంపూర్ణముగా రేపు రాకడలో జరుగును. రాకడలో భూమిమీదనున్న భక్తులు వెళ్ళిపోవుదురు వారికి చావు లేదు. శిక్ష లేదు, పాపఫలితము లేదు. మనకు బదులుగా ప్రభువు బదిలీయై, మన పాపము, పాపఫలితమైన శిక్ష ఆయనపై వేసికొని మరణమైనాడు. గనుక మరణము మనకు లేదు అని రాకడలో తెలిసికొందురు. అప్పటివరకు మనము సిలువ ధ్యానమువలన ఆదరణ పొందవలెను. మన తప్పిదములు సిలువలో చూడగలము. మన హృదయములో లేవు. ఈ సంగతి జ్ఞాపకముంచుకొని సిలువ ధ్యానము చేసి మేలు పొందుదురు. గాక! ఆమెన్.