ధ్యానపరులైన విశ్వాసులారా! భస్మబుధవారముయొక్క ఆశీర్వాదము మీకు కలుగును గాక! వారములోనున్న ఏడుదినములు ఏడుదీవెనలు, ఆదివారము ప్రత్యేక పండుగ, దీవెనలదినము. ఆలాగే భస్మబుధవారము ప్రత్యేక దీవెన దినము. ఎవరు ఈ ప్రత్యేక దీవెన కోరుదురో వారికే భస్మబుధవార దీవెన. ఈదినము మొదలు మంచి శుక్రవారము వరకు 40 దినములు. వీటికి లెంటుకాలమనిపేరు. ఈవేళ మొదటి మెట్టు, మంచిశుక్రవారము కడవరిమెట్టు. ఎవరు ఈ 40 దినములు సిలువ ధ్యానము చేయుదురో వారు ఒక దినముకంటే మరియొక దినమున గొప్ప అంతస్థు పొందుదురు. ఈ 40దినములు ధ్యానించి, 40మెట్లు ఎక్కునప్పటికి 40 అంతస్థులు చూతురు. శ్రమచరిత్ర వచనములున్న కాగితములో దినమునకు ఒక పాఠముగలదు. అవి చదివి ధ్యానించండి. ఒక్కొక్క పాఠము ఒక్కొక్క అంతస్థునకు మిమ్మును నడిపించును.
అయితే ఈ దినమున ఏమి ఆలోచించవలెను. అబ్రాహాము దేవుని సన్నిధికి వచ్చినపుడు ప్రభువా నేను ధూళిని, బూడిదను అని తగ్గించుకొనెను. విశ్వాసులకు తండ్రి అని బిరుదుపొందిన భక్తుడు తన కాలిక్రింది ధూళికి తనను పోల్చుకొనెను. పొయిలో ఉండు బూడిదకు పోల్చుకొనెను. ఆయన విశ్వాసి, విశ్వాస సమూహమునకు జనకుడు అయినను, తన అయోగ్యతనుబట్టి, దేవుని కృపయెదుట బూడిదను, ధూళిని, ఎందుకు పనికిరానివాడను, అని తగ్గించుకొనెను. ఈ వేళ మనము కూడ తగ్గించుకొనవలెను. ఎందుకనగా మనము పాపులము, అవిశ్వాసులము, కష్టాలలో విసుగుకొనువారము, దైవమర్మములను, దేవుని కృపను గ్రహించలేనివారము గనుక మనము ప్రభువుయెదుట తగ్గించుకొని ధ్యానము చేయవలెను. ఈ దినమునకు మరియొక పేరు పశ్చాత్తాప దినము. నేను పాపిని, నీకృపను పొందుటకు యోగ్యుడనుకాను అని పాపముల విషయములో, బలహీనతల విషయములో దుఃఖించు పశ్చాత్తాపదినము.
ఈ లెంటు దినములలో పాపములొప్పుకొనవలెను. తరువాత ప్రభువా! నా శరీరము నా ఆత్మ, నా ఆస్తి, నా ఆయుష్కాలము. ఏమైన మంచి నాలోనున్న అదికూడ నీకు సమర్పణ చేయుచున్నాను అని 40 దినములు చేసినట్లయితే 40మెట్లు ఎక్కగలము. సాయంత్రము 7 గంటలనుండి 10 గంటలవరకు ధ్యానములోనుండి తరువాత ఆహారము తీసికొనవచ్చును. ఇట్టి ధ్యానములో ప్రభువు ప్రత్యక్షమై మాట్లాడుట, పాపములు క్షమించుట, నూతనబలము ఇచ్చుట మొదలగు పనులు జరుగును. ప్రభువునకు ఒక్కదినమే పునరుత్థానము గాని మనకు ఈ 40 దినములు పునరుత్థానమే. పూర్వము సంఘస్థులను గుడి అల్టరు దగ్గర మోకరింపజేసి బూడిదను నెత్తిమీద బోధకుడు వేయుచుండగా అయ్యో, పాపినని సంఘస్థులు ఒప్పుకొనేవారు. మట్టలాదివారమున తెచ్చిన కొమ్మలు బూడిదచేసి భస్మ బుధవారమున ఆబూడిద నెత్తిమీద వేసేవారు. ఇప్పుడు నాగరికతవల్ల బట్టలు పాడగుననియు, హృదయములో పశ్చాత్తాపము లేకుండ తలమీద బుడిదపోసిన లాభమేమి అని ఆ పద్ధతి మానివేసిరి.
మోషే 40 దినములు ఉపవాసముండెను. అవి చాలక మరల 40 దినములు చేసెను. ఆయనకు నిద్రలేదు, నీరు త్రాగలేదు, భయమురాలేదు, చిక్కలేదు, తూలలేదు, ప్రభువు ధ్యానములోని తలంపువలన బలము వచ్చెను. ఆ తలంపు వలన విశ్రాంతి గలదు, భోజనము గలదు, నిద్ర గలదు, స్నానము గలదు, ఈలాగున మోషే బలము తగ్గలేదు. చివరికి 120వ సంవత్సరమునకు వచ్చినను ఆయనబలము తగ్గలేదు, చూపు తగ్గలేదు, చావు స్థితి రాలేదు.
తరువాత వచ్చిన ఏలీయా, దూత చూపించిన రొట్టె తిని, నీళ్ళు త్రాగి 40 దినములు ప్రయాణము చేసెను. ఈ ప్రయాణములో ఆయన అర ణ్యములను గాని, భయంకర అడవిగాని, ఎండనుగాని, మృగములనుగాని, చూడక దేవుని తలంపే కలిగియుండెను. ఏలియా కండ్లు యెహోవామీదనే గలవు. అన్నము, నీరు, నిద్ర, విశ్రాంతి, పగలు, రాత్రి అనిలేదు. ప్రయాణము చేయుట కష్టము అయినను వారి బలము తగ్గలేదు.
తరువాత కొన్నివందల సంవత్సరములకు యేసుప్రభువు అరణ్యములో 40 దినములు ఉపవాసము చేసెను. ఆయన ఉపవాసము చేసిన కొండ సైతాను రూపములోనే ఉండెనట. ఒక పండితుడు ఆ కొండెక్క మొదలుపెట్టగానే పిచ్చిపిచ్చి తలంపులు రాగానే యేసుప్రభువు ఎక్కినకొండ ఇదేనని దిగివచ్చెను.
పై మూడు తరగతుల ఉపవాసము మనకు కుదరకపోయినా, 7నుండి 10గంటల వరకు ఈ 40 దినములు ఉపవాసము చేసిన మేలుపొందగలరు. బూడిద నెత్తిమీద వేసికొను ఆచారము లేకపోయినను, భస్మబుధవారము వాడుక గలదు.మోషే ఏలీయాల వలె 40 దినములు పూర్తి ఉపవాసము చేసిన నీరసము మతిచాంచల్యమునకు మార్గమగును. మూఢత్వముతో, చాదస్తముతో చేయకండి. క్రమము ప్రకారము సుఖ ఉపవాసము చేసి, దేవుని నామమునకు ఘనత కలుగునట్లు చేయండి. ప్రభువు శ్రమల ధ్యాన దీవెనలు మీకు కలుగునుగాక!