క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. శ్రమకాల ధ్యానములు...
  5. భస్మ బుధవారము – 7

భస్మ బుధవారము – 7

మత్తయి 20:17-19;మార్కు 10:32-34;లూకా 18:31-34

“ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము” అని యేసుప్రభువు తన శిష్యులతో చెప్పెను. యెరూషలేమునకు నది దాటి, బేతనియ దాటి వెళ్ళవలెను. ప్రభువునకు కలుగబోవు శ్రమలు ఆయనకు ముందుగనే తెలిసెను. ఇది ఆయన శ్రమలకు ప్రారంభము గనుక ఈ మండల దినములలో (శ్రమకాలములో) ఈ వాక్యము మొదలుకొని ప్రభువు మరణము వరకు ఉన్న వాక్యములు చదివి ధ్యానింతురు. యూదులు ప్రభువును అన్యులకు అప్పగింతురు అని ఆయనకు తెలిసినది. యూదులు, అన్యులు కలిసి ఆయనను హింసింతురని తెలిసియుండికూడ యెరూషలేముతట్టు తన ముఖ ము త్రిప్పుకొనెను. ఆయనను అపహసింతురు. కొరడాలతో కొట్టుదురు, ఉమ్మి వేయుదురు, అవమాన పరచుదురు, అన్యుల కప్పగింతురు, సిలువవేసి చంపుదురు అని తెలిసినప్పటికిని ఆయన వెళ్ళెను. యెరూషలేములో ఆయన పొందవలసిన శ్రమల జాబితా చాల ఉన్నది. గెత్సెమనే వేదన, యూదా ముద్దుపెట్టుకొనుట, ముద్దాయివలె కోర్టులకు వెళ్ళుట, సిలువ వేయబడుట, మేకులు కొట్టబడుట ఇవన్ని ముందుగా ఆయన ఎరిగినప్పటికిని ఆయన వెనుకాడక యెరూషలేమునకు వెళ్ళెను. నది ఇవతలనున్నప్పుడే ఆయనకు ఇవన్ని తెలియును. అయినను వెళ్ళుట మానలేదు. ఆ దారిలో యెరూషలేము పండుగకు వెళ్ళువారు గలరు. యేసుప్రభువు తన శిష్యులను ఏకాంతముగ పిలిచి ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నామనియు, అక్కడ ఆయనకు జరుగబోవు శ్రమలనుగూర్చియు చెప్పెను. ఇది దారిలో ప్రత్యేకముగా తన శిష్యులకే చెప్పెను, అయితే ప్రభువు యొక్క మాటలు శిష్యులు గ్రహించలేదు. ఒక మనిషికి ఉరిశిక్ష అని చెప్పినప్పటినుండి ఉరే! యేసుప్రభువునకు శ్రమ అని తెలిసినప్పటినుండి శ్రమయే! ఈ శ్రమలకాల జాబితాలోని ఏడుమాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న ప్రసంగమే. ప్రభువు తన శిష్యులకు రహస్యములు చెప్పవలసి వచ్చినప్పుడు వారిని జన సమూహము నుండి వేరుచేయుట గలదు. జనసమూహమున్నప్పుడు చేసిన ప్రసంగములు ధర్మప్రసంగములు. అయితే శిష్యులకు ఆయన చెప్పినవి మర్మప్రసంగములు. శిష్యులు గ్రహించకపోయినను ఆయన వారికి మర్మములు చెప్పెను. గ్రహింపుకాకపోయినను శిష్యులు ఆ మర్మములు విన్నారు. వారికి అది అప్పుడు మరుగుచేయబడెను. అనగా సమయము వచ్చువరకు మరుగుచేయబడెను. అవన్ని నెరవేరినప్పుడు ఇవి ప్రభువు చెప్పిన మాటల యొక్క నెరవేర్పని వారు గ్రహించిరి. దారిలో యేసుప్రభువు శిష్యులకు ఈ సంగతి ఎందుకు చెప్పెననగా- ముందే వారికి చెప్పియున్న యెడల యేసు ప్రభువును వారు యొర్ధానునది దాటనివ్వరు. పేతురు ఒకప్రక్క, ఆంద్రెయ ఒకప్రక్క పట్టుకొని, హింసించేవారి దగ్గరకు ఎందుకు వెళ్ళుచున్నావు అని ఆయనను వెనుకకు లాగుదురు. ఎప్పుడూ యెరూషలేము వెళ్ళుచున్నావు గదా, ఇప్పుడెందుకు ఈలాగు అనుచున్నావని ఆయన శిష్యులు అడుగవలసినది, గాని వారి జ్ఞానము మూయబడినది, సంఘము స్థిరపడుటకు శ్రమలు వచ్చును. తర్వాత సంఘము ఎత్తబడును. ప్రభువు యొక్క ‘శిష్యులకు ఆయన శ్రమలు ఎట్లు మరుగుచేయబడినవో, అట్లే ఆయన త్వరగా వస్తానను మాటయొక్క అర్ధము సంఘమునకు మరుగుచేయబడెను. జరిగినప్పుడు చూచి, శిష్యులు ఎట్లు ప్రభువుయొక్క మాటలు గ్రహించినారో ఆలాగే గురుతులను చూచి ఇప్పటి సంఘము “త్వరగా” వస్తానని ప్రభువు చెప్పిన మాట యొక్క అర్ధము గ్రహింప గలుగుచున్నారు. ఆయన తన శిష్యులకే మరుగుచేసినప్పుడు మనకెందుకు మరుగుచేయడు. పంతులుగారు తన పద్ధతి ప్రకారము పిల్లలకు పాఠము చెప్పును గాని పిల్లల పద్ధతిలో తాను పాఠము చెప్పడు. మర్మముగా చెప్పకపోయిన యెడల విశ్వాసులే ప్రభువును ఆపుచేయుదురు. తమ్మునుతామే ఆపుచేసికొందురు. ప్రవచనమును కూడ ఆపుచేయుదురు. గనుక మర్మముగా చెప్పుట దేవుని పద్ధతులలోనున్నది. మరియు మనలను నమ్మడానికి వీలులేదు. గనుక ప్రభువు అనేక సంగతులు మనకు చెప్పడు.

(1) కొందరు ఆ మాటలు విని గందరగోళములో పడిపోవుదురు. (2) ఆ మాటలు అందరికి చెప్పి కొందరు దెబ్బలు తిందురు. (3) కొందరికి పిచ్చి ఎత్తును. (4) కొందరు మనసులో కృశించిపోవుదురు. (5) కొందరు ఆ మాటలు విని అన్ని పనులు మాని ముడుచుకొని ఉందురు. (6) కొందరు విందురు, గాని నమ్మరు. ఈ లక్షణములు గలవారు పెండ్లికుమార్తె వరుసలోని వారుకారు. ప్రభువు ఎప్పుడును కొన్ని సంగతులు మరుగుగా నుంచును. మన మేలుకొరకు, మనము సిద్ధపడుటకు అట్లు చేయును. శాశ్వత కాలము యొక్కయు, అంతములేని కాలము యొక్కయు, అనంత కాలము యొక్కయు మహిమకు సిద్ధపడవలెనంటే ఎప్పుడు సిద్ధముగా నుండవలెను. పెండ్లికుమార్తె సంఘములో చేరుటకు ఎప్పుడూ సిద్ధముగా నుండవలెను. ఉదా:- ఒక కూలివాడు పది దినములు పనిచేసిన పది దినముల కూలివచ్చును. ఒక రోజు వెళ్ళకపోయిన ఆ దినపు కూలి దొరకదు. మరుసటిరోజు వెళ్ళినను ఆ తరుగు తరుగే గదా! ఆలాగే ఒక్క లోటు ఉన్నను పెండ్లికుమార్తె కిరీటము దొరుకదు. ఎత్తబడలేము. (7) పదియాజ్ఞల ఒప్పుదల చేసి క్షమాపణ పొందవలెను. పై ఆరును లేకుండ చేసికొని దీనినికూడ నెరవేర్చిన యెడల ఎత్తబడగలరు. పైవి మన మనస్సులోనికి చేరకూడదు, వాటి దగ్గరకు మన మనస్సు వెళ్ళకూడదు. చెట్టుదగ్గరకు వెళ్ళరాదు, వెళ్ళిన పాపము ఎదురు వచ్చును. యేసుప్రభువునకు శ్రమలు వచ్చునని తెలిసినప్పటికిని చొరవచేసికొని, తెగించి వెళ్ళెను. ఆయన విజయము పొందెను. గనుక శ్రమలున్నను మన పని మనము చేసికొనుచు వెళ్ళవలెను. అప్పుడు ఆయనవలె మనమును జయము పొందుదుము. ఎన్ని శ్రమలున్నాను పెండ్లికుమార్తెగా సిద్ధపడవలెను. యేసుప్రభువు దేవుడైయున్నాడు, మనిషైయున్నాడు. మరియు దేవుడును, మనిషి కూడ అయియున్నాడు. ఆయన దేవుడైయున్నప్పుడు శ్రమపడలేదు. ఆయన మనిషై యుండెను గాని ఆయనలో పాపము లేదు. అయినను ఆయనకు శ్రమ, దుఃఖము ఉండెను. ఆయన భూలోకమునకు వచ్చిన తరువాత శ్రమయే, రాకముందు కూడ ఆయనకు శ్రమయే. ఆయన ఎంత గొప్ప శ్రమ పడినాడో మనకు తెలియదు. ఆయన శ్రమల యొక్క వివరము పూర్తిగా తెలిసిన యెడల విశ్వాసి చనిపోవును. సజీవుల గుంపులోనుండరు. గనుక ఆయన శ్రమ తెలియపర్చక మరుగుపర్చుట ఆయన యొక్క కృప.

Please follow and like us:

How can we help?

Leave a Reply