హెబ్రీ 6:4-6. పోయినసారి ఈ వాక్యములో విడిచిన సంగతి చెప్పుచున్నాను. ఈ వాక్యము అవిశ్వాసుల గురించి కాదు, కేవలము విశ్వాసులను గురించి మాత్రమే. బాప్తిస్మము పొందిన క్రైస్తవులలోను, అంతరంగ విశ్వాసులలోను పొరపాట్లు ఉన్నవి. ఈ వాక్యములో తప్పిపోయిన వారిని గురించి ఉన్నది. ఒకరు రైలు బద్దెమీద నడచి నడచి, కొంత దూరము వెళ్ళిన తర్వాత బద్దెమీదనుండి తొలగి కాలిబాటను నడచును. అప్పుడతడు బద్దెమీదనుండి తప్పుకొని నడచుచున్నాడందుము. ఆలాగే విశ్వాస మార్గములో, భక్తిలో నడచి నడచి దేవుని వాక్యములో నుండి తప్పిపోతే బద్దె తప్పి నడిచిన వానివలె ఉండును. ఆ తప్పిపోవుట ఒక పాపము చేయుట కంటే ఎక్కువ పాపము. ఎందుకనగా తప్పుచేసినను బద్దెపై ఉన్నయెడల దిద్దుకొనవచ్చును. బద్దె తప్పినయెడల అంతా తప్పినట్టే. కొందరు భక్తిలో ఉండి ఉండి బైబిలు చదువుట, ప్రార్ధించుట, సువార్త చెప్పుట, సత్యముగా నడచుటలో తప్పిపొవుదురు. శోధనల వలన, గొప్ప కష్టముల వలన, కొన్ని ప్రార్ధనలు సఫలముకాక పోవుటవలన తప్పిపోవుట జరుగును. తప్పిపోయిన కుమారుని అన్నగారు అన్ని భాగ్యములు అనుభవించుచు, తండ్రి పిలువగా లోపలికి రాకుండ తప్పిపోయెను. ఈ తప్పిపోవుట చిన్న కుమారుడు చేసిన పాపముకన్న ఎక్కువ పాపము, ఎక్కువ దోషము. ఆ కాలములో క్రైస్తవులుకూడ ఆలాగే ఉండిరి. గనుక పౌలు ఈ వాక్యము వ్రాసెను. పౌలు ఈ కలములో వచ్చిన యెడల ఆ కాలములోనే కాదు. ఈ కాలములో కూడ తప్పిపోయిన వారున్నారని చెప్పును. తప్పిపోయినవారు మరల తిరిగిరారు అని అనలేదు గాని అసాధ్యము అని వ్రాసెను. అనగా చాల కష్టము. మనుష్యులలో 4 రకముల వారు గలరు.
(1) వీరు పాపము చేసినప్పుడు దుఃఖిస్తారు. పాపము చేసినప్పుడు ఎవ్వరును చూడకపోయినను నాది దోషము అని దుఃఖిస్తారు. ఇట్టివారు మారగలరు. ఒకరి బోధవలన కాదు. తన మనస్సాక్షివలన నేను చేసినది తప్పు అని గ్రహించి కంట నీరు పెట్టుకొని దుఃఖించును. ఇతడు మారగలడు, దేవుని యెదుట మంచి పేరు పొందును.
(2) ఈ రకమువారు చాల కష్టముల పాలైనందున మూలను కూర్చుని కంట నీరు పెట్టుకొందురు. పైనున్న వ్యక్తి, ఈ వ్యక్తి ఇద్దరు సిలువ ధ్యానములోనే యున్నారు. మొదటి వ్యక్తి పాప జ్ఞప్తివలన అనగా ప్రభువునకు విరోధముగా పాపము చేసితినని గది లోపలికిపోయి ఏడ్చును. ఇట్టి కన్నీరు ప్రభువు మెచ్చుకొనును. ఈ రెండవ వ్యక్తి కష్టాల వలన ఏడ్చును. గనుక ప్రభువు మెచ్చుకొనడు.
(3) ఈ మూడవ వ్యక్తి తన అయోగ్యతనుబట్టి కన్నీరు రాల్చును. మొదటి వ్యక్తి ప్రభువా! నేను పాపము చేసినానని కంట నీరు పెట్టును. ఇతడు ప్రభువా! నీవు నాకెన్నో మేళ్ళు చేసినావు, వాటిని పొందుటకు నేను తగను. అట్లు నేను తగక పోయినను నీవు మేళ్ళు చేస్తూనే యున్నావు. ఇతడు తన పాపములను జ్ఞాపకము చేసికొనడు గాని తన అయోగ్య స్థితిని తలంచుకొని కన్నీరు రాల్చును. తండ్రీ నీ ఉపకారములకు నేను తగను, అయినను ఉపకారములు చేయుచునే యున్నావని అనును.
(4) నాల్గవ వ్యక్తి పాపాల సంగతి యెత్తడు, కష్టాల సంగతి యెత్తడు, అయోగ్యతను గూర్చి తలంచడు గాని కృతజ్ఞతతో తన హృదయము నింపుకొనును. తండ్రీ! నీ దయ, నీ కృప ఎంత గొప్పది. ఎంత దయగలవాడవు. నా యెడల ఎంత మంచిగానున్నావు అని ఆయనను స్తుతించును.