క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. మంచి శుక్రవారము...
  5. మంచి శుక్రవారము 2

మంచి శుక్రవారము 2

వాక్యభాగములు: మత్తయి 26:36-75;27అధ్యా||మార్కు 14:32-72; 15అధ్యా||లూకా. 22:39-71;23అధ్యా|| యోహాను 18,19 అధ్యా||లు)

(మంచి శుక్రవారమున యేసుప్రభువుయొక్కసిలువ చరిత్ర అంతయును తలంచుకొని, ధ్యానించి స్తుతించవలెను. ఆ ధ్యాన సమయములోనే సిలువమీద ప్రభువు పలికిన 7 మాటలుకూడ ధ్యానించవచ్చును. సంఘకాపరి ఈ ధ్యానమంతయు చదివి, సంఘమును ధ్యానములో ఈ రీతిగా నడిపించ వచ్చును.)

ధ్యానము: మనోనిదానము గలిగి మూడు సంగతులు తలంచుకొనవలెను. మనము చేసిన పాపములు- అందు విషయమై యేసుప్రభువు పొందిన శ్రమలు తలంచుకొని కృతజ్ఞత కలిగి యుండవలెను. కృతజ్ఞతతో మన హృదయము నిండిపోవలెను. కృతజ్ఞతతో మన హృదయము నిండిపోవలెను. నీళ్ళపంపు క్రిందనున్న బిందె నీటితో నిండినట్లు మన హృదయము ప్రభుని యెడల కృతజ్ఞతతో నింపబడవలెను. యేసుప్రభువుయొక్క సిలువ మార్గమును మన మనోదృష్టిలో వెంబడింపవలెను. పేతురు దూరమునుండి ప్రభువును వెంబడించెను (మత్తయి 26:58). యోహాను, ప్రభువుయొక్క తల్లి, కొందరు స్త్రీలు ప్రభువును దగ్గరగానే వెంబడించిరి. మనమును వారివలె ప్రభువును మనో దృష్టిలో వెంబడింపవలెను. ప్రభువును మనము సంతోషపెట్టుటకు మన హృదయము కృతజ్ఞతతో నింపుకొనవలెను. మన మనోనిదానము- గెత్సెమనెనుండి తోట వెలుపలికి, అక్కడి నుండి పట్టణమునకు, అక్కడి నుండి ప్రధాన యాజకుని ఇంటికి, అక్కడి నుండి పని మానివేసిన వాని యొద్దకు (యోహాను 18:12,13,14.), అక్కడి నుండి పిలాతు, హేరోదుల యొద్దకు, మరల పిలాతు దగ్గరకు, అక్కడ నుండి కల్వరి మార్గము గుండా కల్వరిగిరికి వెళ్ళవలెను.

గెత్సేమనె: ఎనమండుగురు శిష్యులు తోట గుమ్మము దగ్గర నుండిరి. ముగ్గురిని మాత్రము ప్రభువు తన దగ్గరకు తీసికొని వెళ్ళెను. వీరిని ప్రార్ధనలో నుండుమని చెప్పెనుగాని వారు నిద్రపోయిరి. ప్రభువువారికి 3సం||లు ట్రయినింగు (శిక్షణ) ఇచ్చినప్పటికిని నిద్రపోయిరి. వారు ప్రభువు యొక్క బోధలన్ని వినిరి. ఆయన చేసినవన్నీ చూచిరి. అయినను ప్రార్ధనలో ఉండలేక నిద్రపోయిరి. ఆయనకు ఎంత కష్టము! మనము కూడ నిద్రపోయిన యెడల శోధనలు జయింపలేము. ఆ తోటలో ప్రభువు “ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము” అని ప్రార్ధించెను. ఆయన మనుష్త్వము ఈ ప్రార్ధనలో కనబడుచున్నది. ప్రార్ధన: ఓ ప్రభువా! ఎంత బాధ ఉండబట్టి ఈ ప్రార్ధన చేసినావు! ఈ బాధ మా పాపములవలన నీకు కలిగినది. ఈ శ్రమ తొలగక పోయినప్పటికిని సహించుకొన్నావు. గనుక వందనములు. నీవు సృష్టికర్తవైనప్పటికిని, నీవు కలుగ జేసిన దేవదూత చేత బలపరచబడుటకు ఒప్పుకొన్నావు. అది నీకు అవమానము, శ్రమ, అయినను ఒప్పుకొన్నావు గనుక నీకు వందనములు, ఆమెన్.

యేసుప్రభువు దేహము నుండి చెమట వచ్చెను. అది రక్తపు చెమట. కష్టపడి పనిచేయునప్పుడు చెమట పుట్టును, అయితే ప్రభువునకు గొప్ప శ్రమ కలిగెను గనుక రక్తపు చెమట కారెను. అంతరంగములో శ్రమ, మనస్సులో శ్రమ శరీరములో శ్రమ: ఈ శ్రమ అంతా మన పాపముల వలననే ఆయనకు కలిగెను.

ప్రార్ధన:- ఓ తండ్రీ! అధిక శ్రమ నీకున్నది గనుక నీకు రక్తము చెమటగా వచ్చినది. నా నిమిత్తము ఇట్టి శ్రమ అనుహవించినావు గనుక నీకు స్తోత్రములు, ఆమెన్. తరువాత రౌడీల దండు కత్తులతోను మరియు త్రాళ్ళతోను వచ్చెను. వారితో యూదా కూడ వచ్చెను. యేసుప్రభుని గుర్తుపట్టుటకు యూదా ఆయనకు ముద్దిచ్చి వారికి అప్పగించెను. ఇది గొప్ప విచారము. శిష్యులు తోటలో నిద్రించిరి.. అదియు విచారమే. యూదా చేసిన పనిమరీవిచారకరమైనది.

ప్రార్ధన: ఓ ప్రభువా! యూదానిన్ను అప్పగించినను నీవు యూదాను శపింపలేదు. శపించిన యెడల అతడు భస్మమైపోవును. మాలో అతనివంటి వారెవరును లేకుండ నీ కృప చూపించుము. మేము లోకమును ప్రేమించి, నీకు విరోధమైన కార్యము లేమియు చేయకుండ కాపాడుము. ఆమెన్.

తోటలో పేతురు చాలా గొప్పనేరము చేసినాడు. శత్రువులు ప్రభువును విచారణచేసి, చంపవలెనని చూచిరిగాని పేతురు తోటలోనే వారిని చంపవలెనని చూచెను. పేతురు వారిలో ఒకని చెవి నరికెను, శత్రువులు ఊరుకొందురా? పేతురు యేసుప్రభువు యొక్క తల, యూదా ప్రభువు యొక్క పాదము వంటివారు, కాని ఈ ఇద్దరూ తప్పిపోయిరి. అందరూ పారిపోయిరి. ఎంత విచారము! యోహాను మాత్రమే ఉన్నాడు. చెవి నరుకుట అనునది పిశాచియొక్క పని. గనుక ప్రభువునకు చాల విచారము, ప్రభువు 3సం||లు శాంత బోధ చేసెను గాని ఇక్కడ పేతురు కత్తి బోధ చేసెను.

ప్రార్ధన: ఓ తండ్రీ! నీవు పేతురును శపింపలేదు. క్షమించి రోగిని స్వస్థపరచినావు.నీవు శాంత బోధ చేసినావు. నీ శిష్యుడు నరహంత బోధ చేసెను. మేమట్టివారము కాకుండా కృప చూపించుము, ఆమేన్. ఆయనను బోధించినవారు అన్న యొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. శిష్యులందరూ పారిపోయిరి. యోహాను మాత్రమున్నాడు. ప్రభువునకు ఎంత విచారము! యూదామత కోర్టు: సన్ హెడ్రిన్ సభ) తరువాత వారు ప్రభువును ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసికొనిపోయిరి. ప్రధాన యాజకులకు ప్రధాన యాజకుడైన యేసు కయప యెదుట నిలబడియుండెను. ఆయనముందు రేపు మనము నిలువబడవలెను. అట్టి తీర్పు మనకు లేకుండ చేయుటకు ఆయనే నిలువబడెను. ప్రభువునకు, ధర్మశాస్త్రము గల సంఘములో న్యాయము దొరుకలేదు. సంఘము, లోకము రెండును కలసి ఆయనను సిలువకు అప్పగించెను. ప్రార్ధన: ఓ తండ్రీ! మాకు బదులుగా నీవు కోర్టులో నిఉవబడినావు. మా తీర్పులన్ని నీవు భరించినావు గనుక నీకు స్తుతులు. నీ నామము ధరించిన మేము నిన్ను సిలువకప్పగింపకుండ నిన్ను గౌరవించగలుగు కృపదయచేయుము. ఆమెన్.

తరువాత ‘ఆయన ముఖము మీద ముసుగు వేసిరి ‘ అని ఉన్నది. మనము పాపము చేసినపుడు కూడాదేవుడు చూచుట లేదు ‘ అని అనుకొనుట వలన దేవునికి ముసుగు వేసినట్లే. దావీదు కీర్తనలలో రక్తాపరాధము అని ఉన్నది.మన రక్తాపరాధమునకు ప్రభువునకు శిక్ష వచ్చెను. మన రక్ష ఆయనకు శిక్ష. యేసుప్రభువు బేబిగా ఉన్నప్పుడు మొదటి పర్యాయము మన రక్తాపరాధము కొరకు సున్నతి పొందెను. రెండవ మారు గెత్సెమనేలో రక్తము కార్చెను. మూడవదిగా సిలువ మీద శరీరమంతా రక్తపుకొల్లు ఆయెను. మన రక్తపరాధమంతా తీరెను.

ప్రార్ధన:- ప్రభువా! మా రక్తాపరాధమునకు మమ్మును కొట్టవలసినది. మా రక్తము చిందవల్సినది. అయితే నీవు నాకు బదులుగా రక్తము కార్చినావు. గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు.

గవెర్నమెంట్ కోర్టు: ప్రధానయాజకుని ఇంటి నుండి రోమా గవర్నమెంటు జడ్జీయైన పిలాతుయొద్దకు ఆయనను తీసికొని వెళ్ళిరి. ఆయన యందు ఏ నేరము కనబడలేదు గాని ఒకమాట వినబడినది. గవర్నమెంటువారికి విరోధముగా, పన్నియ్యకూడదని చాటించు చున్నాడనునది. ఆయన గలిలయుడని విని, ఎలాగైన వదలించుకొనుటకు పిలాతు హేరోదు దగ్గరకు ఆయనను పంపెను. మనలో గవర్నమెంటుకు విరోధముగా తిరుగుబాటు చేయుచున్నారు. గౌక ఆ నేము ఆయన మీదకు వచ్చెను. అద్భుతము చేసినా హేరోదు ఆయనకు మ్రొక్కును గాని ఆయన చేయలేదు, అన్ని కోర్టులలో ఆయనకు హేళన కలిగినది. మానవులు ఒకరినొకరు హేళన చేసికొందురు. అదే ఆయన, తనమీద వేసికొనెను. కొందరు దేవుని హేళన చేయుదురు. ఆ నేరము కూడ ప్రభువు తన మీద వేసికొనెను. పిలాతునకు మనస్సులో ఏలాగైనను ప్రభువును విడిపింపవలెనని గలదు. జడ్జీగారు కొరడాలతో కొట్టించి, విడుదల చేతుననెనుగాని వారు సిలువ వేయుమని కేకలు వేసిరి. పిలాతు రేపు షికారునకు వెళ్ళునప్పుడు, యూదులు రాళ్ళు విసిరి చంపుదురని భయపడి మీ ఇష్టప్రకారము చేసికొనుడని సెలవిచ్చెను. యూదులు అన్యాయనుగా కొన్ని నేరములు ప్రభువుపై మోపిరి. పిలాతు ‘మీ మతమునకు అడ్డు రాను ‘ అన్నట్లు ఊరుకొనెను. యూదులు, రాణువవారు పగబట్టి, అన్యాయముగ ఆయనమీద నేరములు మోపిరి. పిలాతునకు ప్రేమ ఉన్నది గాని అన్యాయమునకు ఒడిగట్టుకొనెను. పిరికివాడై ప్రజలకు భయపడెను. మనలో క్రైస్తవుల మనిపించుకొనుటకు పిరికివారు, భయపడువారు ఉన్న యెడల వారు ఆయనకు ప్రక్కలో బల్లెపుపోటు వంటివారు. జాగ్రత్త! అట్టి పిరికివారి కొరకై ప్రభువు ఈ నేరము భరించెను. అంత్యతీర్పులో ప్రభువు గొప్ప జడ్జీ. అయితే ఈ పిలాతు దగ్గర ఆ జడ్జీ చేతులు కట్టుకొని నిలిచి ఉండెను. రాబోవు తీర్పు మనకు లేకుండ చేయుటకు ప్రభువు నిలువబడెను. ప్రార్ధన: ప్రభువా! రాబోవు తీర్పు మాకు లేకుండ జేయుటకు తీర్పుపొందిన మా ప్రభువా! నీకు అనంత స్తోత్రములు.

ప్రభువునకు శ్రమ ఎవరి వలన? ఆదికాండము 12వ అధ్యా||లో ‘నీ వంశమును బట్టి భూలోకములోని వంశములన్ని దీవింపబడునని ‘ గలదు. వీరి వంశములోనుండి వచ్చిన రక్షకుని అందరు తెలిసికొని ఆనందించవలసినది గాని వారే ప్రభువును సిలువవేసిరి (వీరు స్వజనులు). శిష్యులు కూడ యూదులే. రమ్మనిన వచ్చిరి గాని పారిపోయిరి (వీరు విశ్వాసులు). అధికారులు తప్పించవలసినదిగాని, ప్రజలకు భయపడిరి (వీరు పరజనులు). యేసుప్రభువునకు అందరివలన శ్రమ కలిగెను. స్వజనుల వలన, పరజనుల వలన, విశ్వాసుల వలన ఆయనకు సిలువయూదులలో సామాన్య ప్రజలు ప్రభువును అంగీకరించిరి. గురువులు ప్రభువును తృణీకరించిరి. ఇప్పుడు కూడ గురువులే ప్రభువునకు విరోధముగాప్రవర్తించుచున్నారు.

ప్రార్ధన:- ఓ తండ్రీ! నిన్ను సిలువ వేసిన పై గుంపులలో మేము లేకుండ నీ శ్రమను తగ్గించిన వారి యొక్క గుంపులోనుండు దీవెన దయచేయుము. ధర్మశాస్త్రము తెలిసిన గురువులే నిన్ను తృణీకరించినారు. మేము అట్టివారము కాకుండ కృప దయచేయుము. ఆమెన్.

సిలువ మోత:- పిలాతుయొక్క కోర్టునుండి, కల్వరిపై వరకు రోడ్డు మీద ప్రభువునకు కలిగిన శ్రమ: వారు సిలువను ప్రభువుపై మోపిరి. ఎందుకీ సిలువ మోత? మనము పది ఆజ్ఞలకు విరోధమైన పాపము చేసినప్పుడు, అది ఆయన మీదకు వెళ్ళును. అదే ఆయనకు ఎత్తబడిన సిలువ. అందరి పాపములు క్షమించుటకు ఆయన పూనుకొన్నాడు గనుక అవన్ని ఆయన మీద నుండెను. అందరి పాపములు కలసి ఏర్పడినసిలువ ఆయన ఎత్తుకొనెను. కర్రసిలువ మన పాపముల సిలువకు ముంగుర్తు. ఆ సిలువ మొయ్యలేని గొప్ప భారమైనది. మన పాపములు ఒక సిలువగా ఏర్పడక పోయిన యెడల ఆయన సిలువ ఎత్తికొనడు. బహిరంగముగా కనబడుటకు కర్రసిలువ ఏర్పాటు చేయబడెను. ఉదా: గాడిదపై 10 తట్టలమన్ను వేసి, చాలలేదని ఇంకా 10 తట్టలమన్ను వేయగా అణగిపోవును. అలాగే మన పాపములు మనమీద వేసినా, మనము హేడెస్సులోనికి, అంత్యతీర్పులోనికి అణగిపోయి యుందుము.

కల్వరి కొండమీది కథ:- ఈ శ్రమకు ముందు రోడ్డుమీద సిలువమోత శ్రమ. దీనికి ముందు కోర్టు శ్రమ, ఆ శ్రమ మన నిమిత్తమై ఆయన భరించెను. కొండ మీద దుర్జనులు, స్త్రీలు, యోహాను మొ||వారు గలరు. వీరితో ఇద్దరు దొంగలు కూడ ఉన్నారు. అవిశ్వాసులు, ‘ప్రభువుకన్నా ఎక్కువ శ్రమలు ఎవరూ పొందలేదా? అని అడుగుచున్నారు. ఇతరులు తమ ఒక్కరి నిమిత్తము పొందిరి గాని ప్రభువు అందరి నిమిత్తము పొందిరి. అట్టి శ్రమ ఎవరును పొందలేదు. పొందబోరు. గతించినవారి నిమిత్తము, రాబోవువారి నిమిత్తము కూడ ప్రభువు శ్రమపడెను. సిలువ చరిత్ర భక్తులకు గొప్ప చరిత్ర, దానికి మించిన చరిత్ర ఏదియు లేదు. మనలోని చెడును ఆయన తన మీద వేసికొనెను గనుక సిలువదగ్గర విశ్వాసికి హాయిగా నుండును.

నీలకంఠఘోరె అను ఆయన అన్ని గ్రంధములు చదివెను. గొప్ప పండితుడు, అన్నిటికన్న బైబిలులో ఏమి ఎక్కువ ఉన్నదనుకొనెను. నాలుగు సువార్తలలోని సిలువ చరిత్ర చదివి నేనింక చదువను, దేవు డే ఇంత శాంతము చూపగలడు, శ్రమలో నెమ్మది చూపించగలడని ప్రభువును అంగీకరించి బాప్తీస్మము పొందెను. గనుక మన మనోదృష్టిలో కొండమీదనున్న సిలువను కలిగి యుండవలెను. సిలువను నేలపై వేసిరి; దానిపై యేసుప్రభువును పరుండబెట్టి, మేకులుకొట్టి, సిలువను నిలబెట్టిరి. మేకులు కొట్టినప్పుడు, ఊటలోనుండి నీరు చిందినట్లు రక్తము చిందెనని వ్రాసిరి. మనము రెండు చేతులతో చేసిన పాపము నిమిత్తము యేసుప్రభువు చేతుల నుండి రక్తము చిందెను. వారి హృదయములు కరుగ లేదు. రెండు కాళ్ళ మీద రెండు మేకులు కొట్టుటకు వీలుండదు గనుక కాళ్ళు ఒకదానిమీద ఒకటి పెట్టి పెద్దమేకు కొట్టిరి. మనకు రావలసిన శిక్ష ఆయన పాదములకు వచ్చెను. ప్రభువు ఓర్చుకొని సంతోషించెను. ఆ శ్రమలో ప్రభువు మనలను తంచుకొనెను గనుక కదలలేదు, మెదలలేదు. సిలువను ఎత్తి గోతిలో నిలువబెట్టినప్పుడు, మేకులు ఆయనను లాగి పట్టును గనుక ఇంకా ఎక్కువ బాధ. తలపై నున్న ముండ్ల కిరీటము కదిలి ఎక్కువ నొప్పిగా నుండును. మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన సహించెను. నేటి కాలమున సిలువ చరిత్ర విన్నప్పటికిని, అనేకులు మారుట లేదు. రక్షింప బడువారికి సిలువ రక్షణార్ధమైన సువార్త. ప్రభువు శరీరము యావత్తు రక్తమయ మాయెను. అయినను వారికి ఇంకా పగ తీరలేదు. రాణువవాడు బల్లెముతో ప్రక్కలో పొడిచెను. అప్పుడు రక్తము కారెను. తల్లి ప్రక్కలో నుండుట పిల్లలకు ఎక్కువ ఇష్టముకదా! అలాగే ప్రభువు ప్రక్కలో ఉండుటకు విశ్వాసికి ఎంతో సంతోషము. కాని మనిషి సాతాను సహవాసములోనికి వెళ్ళుట జరుగుచున్నది. గనుక మన నిమిత్తమై ప్రభువు ఆ పోటు సహించెను. బల్లెముతో పొడిచినప్పుడు రక్తము ప్రవహించును, కాని నీరు ఎందుకు కారెను? నీరు ఎక్కడ నుండి వచ్చినది? ప్రభువు యొక్క హృదయము నిండ దుఃఖమున్నది. ఆ దుఃఖము గెత్సెమనెలో ప్రారంభమై, సిలువ మీద ఎక్కువైనది. భారము కూడా ఎక్కువగానే యున్నది. ఈ దుఃఖము తన బాధను గురించి కాదు గాని ‘ఎంత ప్రేమ చూపించినను ప్రజలు గ్రహింపకున్నారను ‘ దుఃఖము ప్రభువుకు ఉన్నది.

తోటలో సామాన్య కష్టమైనా, చెమట రావలెనుగానీ రక్తము రాకూడదు. పొడిచినప్పుడు రక్తము రావలెను గాని నీరు రాకూడదు. అక్కడ రాకూడని రక్తము వచ్చినది, ఇక్కడ రాకూడని నీరు వచ్చినది, ఎందుచేత? ప్రభువునకు మిక్కుటమైన దుఃఖము, మనోవిచారము ఎక్కువైనందున రక్తము కరిగి నీరైనది ఆ నీరు, పొడువగానే బయటికి వచ్చెను. నా గుండె నీరైపోయినదని అందుము గదా! పొందవలసిన శ్రమ అంతా ఆయన పొందినాడు గనుకనే లోకస్థులవలన కలిగిన దుఃఖము చేత అట్లు నీరు ప్రవహించెను. మనస్సులోభక్తితో, అంతరంగములో విశ్వాసముతో ఆయనకు నమస్కారము చేయవలెను. దర్శనవరము గలవారు ఆయన శ్రమను చూచి నమస్కరించ వచ్చును. ప్రభువు ఈ లోకములో జీవించిన కాలములో ఎల్లప్పుడు, మానవుని రక్షింపవలెనను తలంపును కలిగి యుండెను. ఆయన చెడు తలంపును ఎప్పుడును కలిగి యుండలేదు. ఆయన శిరస్సున ముండ్ల కిరీటము ఎందుకు పెట్టవలసివచ్చినది? ఎల్లప్పుడూ మనిషిని రక్షింపవలెననె తలముపును బట్టి పగలంతా బోధించుటలోను రాత్రి కాలమంతా ప్రార్ధించుటలోను గడిపినారు. మానవుని క్షేమము కొరకు ఇంతగా ప్రయాసపడిన ఆయనకు ముండ్లకిరీటము పెట్టుట, కొరడా దెబ్బలు కొట్టుట, సిలువ వేయుట, లోకమునకు ధర్మము కాదు. ఆయన చేతులు అనేకులను దీవించునవి, రోగులను బాగుచేసినవి, లోకమునకు ఎంతో మేలు చేసినవి. వాటిలో మేకులు ఎందుకు కొట్టిరి? ఆయన పాదములతో, దేవాలయమునకు, పండుగులకు, పాపాత్ముల ఇంటికి, విశ్వాసుల ఇంటికి నడిచి వెళ్ళెను. వాటితో ఆయన ఏ పాపము చేయలేదు. పాదములలో మేకులు కొట్టుట లోకమునకు ధర్మము కాదు. బల్లెముతో ప్రక్కలో పొడుచుటకు ఆయన ఏ పాపము చేసెను? ఆ పోటులో “నా యొద్దకు వచ్చు వానిని త్రోసివేయను” అను ఆహ్వానము, పిలుపు ఉన్నది. ఇది ప్రభువు తన ప్రక్కను వ్రాసెను. వచ్చిన వారందరిని చేర్చుకొందును అని ఆయన పలికెను. కాని లోకము అధర్మముగా నడిచెను. ఆయన ఉపకారము చేసెను గాని లోకమాయనకు అపకారము చేసెను.

Please follow and like us:

How can we help?

Leave a Reply