క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. మంచి శుక్రవారము...
  5. మంచి శుక్రవారము 5

మంచి శుక్రవారము 5

మంచి శుక్రవారము క్రైస్తవులకు పండుగ దినము. సంవత్సరమున కొకమారు వారు క్రీస్తుప్రభుని శ్రమను, మరణమును స్మరించ్దురు. మానవులు చేయలేని పనులు, వారికి బదులుగా చేసిపెట్టుటకు యేసుప్రభువు పూనుకొన్నందున శ్రమ పడవలసి వచ్చెను. ఆయన మన పాపమును, వ్యాధులను, శిక్షను, తన మీద వేసికొనెను. ఇట్టి ఉపకారమెవరును చేయజాలరు. ఈ మూడు భారములు ఒక్కరే ఎత్తుకొన్నట్టయిన నశించిపోదురు. నశించినవారు నరులను ఎట్లు రక్షింపగలరు? ఆయన దేవుడును, మనుష్యుడునైయున్నాడు గనుక అవి భరింప గలిగెను. నరుడైనాడు గనుక మరణింపగలిగినాడు. దేవుడు గనుక మరణము నుండి లేవగలిగినాడు. అందుచేత ఆయన ఉపకారము మిగుల గొప్పది. నరులు విధించిన శిక్ష, వారు చూపిన శత్రుత్వము, వారు శరీరమునకు కలిగించిన బాధ, మరణము; ఇట్టివి ప్రభువు సహించిన కార్యములే. ఇవి ఆయన విజయ కార్యములే.

మన పాపములను ఆయన లెక్కించిన యెడల మన పాపమెట్లు పోవునని కొందరందురు. ఒక ధర్మాధికారి ఒక బీదవాని అప్పు తీర్చిన యెడల అతని మీద ఇంకను అప్పు ఉండునా? ఉండదు గదా! నా అప్పు ఆయనెందుకు తీర్చవలెను. నేను తీర్చవలెను అని ఆ ఋణ బాధితుడు అనునా? ఆయనకు నా యెడల కటాక్షము కలిగెనని చెప్పి నమస్కరించును గదా! ఎవడు చేసికొన్న పాపము వాడే అనుభవింప వలెను. మన భారము ఎందుకాయన ఎత్తుకొనవలెను? మన నరక శిక్ష ఎందుకాయన అనుభవింపవలెను? మన మోక్ష సంపాదనార్ధమైన పనులు ఎందుకాయన చేసిపెట్టవలెను? అనికొందరందురు. ఈ ప్రశ్నలేల? పద్దు పత్రము లేకుండా ఉచితార్ధముగా ధర్మకర్త డబ్భిచ్చునపుడు ఋణబాధితుడిట్టి ప్ర్శ్నలు వేయునా? సంతోషముతో అంగీకరించును గదా! దేవునికి మన యందు కనికరము ఉండబట్టి, ఇవన్నియు చేసిపెట్టుచుండగా మనము ఆనందింపవలసినదే గాని ప్రశ్నింపవలసిన అగత్యములేదు. ఆయన చేసిన ధర్మకార్యములు నమ్ముట వలననే మనకు నరము తప్పును, మోక్షభాగ్యము లభించును. నమ్ముటయే మన లక్షణమై యుండవలెను. నమ్ముటయే మన విద్యయై యుండవలెను. నమ్ముటయే మన వృత్తియై యుండవలెను. నమ్ముటయే మన హృదయకార్యమై యుండవలెను. మన స్థానములో క్రీస్తు ప్రభువు అనుభవించినది శ్రమ. అందువలన మనము అనుభవింపవలసినది, ఆనందము.

ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంధములో 53వ అధ్యాయము చదివిన యెడల ఈ సంగతులు విశదమగును. క్రీస్తు శ్రమచరిత్ర అన్నయెడల స్వాభావికముగా విచారము కలుగకపోదు. అయినను ‘నా నిమిత్తమే గదా! నా నిత్యావస్థ తప్పించుటకే గదా! ఇట్లాయన శ్రమపడుట ‘ అని తెలిసికొన్న యెడల ఆదరణయును, కృతజ్ఞతా స్వభావమును కలుగకపోదు, ఆయనకు కలిగినది కీడైయుండగా, మనకు కలిగినది మంచి గనుక నేడు మంచి శుక్రవారమే. ఈ పండుగ చరిత్ర ధ్యానము వలన మీకు విమోచనా దీవెన కలుగును గాక! ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply