క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. మట్టలాదివారము...
  5. మట్టలాదివారము 1

మట్టలాదివారము 1

(జెకర్యా 9:9;మత్తయి 21:19; మార్కు 11:1-11; లూకా 19:29-40; యొహాను 12:12-17)

యేసుప్రభువు గార్ధభాసీనుడై జయోత్సవముతో యెరూషలేము ప్రవేశించుట, ఈ కథలో రెండు సంగతులు జ్ఞాపకము చేయుదును. మొదటిది, జయముగల క్రియలు. రెండవది, జయము అనే మాటలున్న వాక్యము. 1. జయముగల క్రియలు: 1. మీరు గార్ధభమును తోలుకొని రమ్మని శిష్యులతో ప్రభువు చెప్పినప్పుడు వారు అట్లు చేసిరి. ఇది జయముగల క్రియ. ఆయన ఆజ్ఞాపించినట్లు వారు చేసిరి. వారు ఎదురు చెప్పలేదు, వెళ్ళము అని అనలేదు. గార్ధభమెందుకు? అని అడుగలేదు. అలాగే ప్రభువు ఈ కాలములోను జ్ఞానము ద్వారా, మనస్సాక్షి ద్వారా, వాక్యము ద్వారా, ఆయన స్వయముగా చెప్పినట్లు ఎవరు చేయుదురో ఎవరు చేయుదురో వారే శిష్యులు, సేవకులు, దాసులు, ఇచ్చట శిష్యులు మనకు నేర్పిన పాఠము ‘చెప్పినట్లు చేయుట.’ ప్రభువు చెప్పినట్లు చేయువారు, ఎట్టి అద్భుతమైన చేయగలరు. 2. యజమానులు తోలిపెట్టిరి. ఇది జయము గల మరియొక క్రియ. ఈయన యేసుప్రభువు దగ్గరనున్న శిష్యుడుకాదు గాని ఆయనను ఎరిగినవాడు గనుక అభిమానము, విధేయత చూపించెను. శిష్యులు, ప్రభువు చెప్పినట్లు చేసిరి. యజమానుడు, శిష్యులు చెప్పినట్లు చేసెను. గనుక ప్రభువు సేవకులు చెప్పినట్లు మనముకూడ చేయవలెను ప్రభువు చెప్పలేదు అనకూడదు. 3. గార్ధభము మీద వారు బట్టలు పరచిరి. ఇదియును జయము గల క్రియ. ప్రభువును గౌరవించుటకు వారు బట్టలు వేసియున్నారు. కష్టము లేకుండ కూర్చుండుటకు వేసియున్నారు. బట్టలువేసి శిష్యులు ఆయనను గౌరవించినారు. మొదటి క్రియలో వారు చెప్పినట్లు చేసిరి. అది విధేయత. రెండవ క్రియలో యజమానుడు తోలిపంపెను. అది విధేయత. మూడవ క్రియలో బట్టలు వేయుటలో వారు ప్రభువును గౌరవించినారు. మనమును ప్రభువునకు విధేయులమై యుండవలెను. ఆయనను గౌరవించవలెను. ఎవరు బట్టలు వేసినారు? శిష్యులు, గార్ధభము మీద బట్టలు పరచినారు. జనసమూహము దారిపొడుగున బట్టలు పరచినారు. శిష్యులు వేసిన బట్టలపై ప్రభువు కూర్చుండెను. దారిపొడుగున వేసిన బట్టలపై గార్ధభము నడిచెను. బట్టలు వేయుట ప్రభువునకు గౌరవము. ప్రభువును బట్టి గార్ధభమునకు గౌరవము, అలాగే పాపులమైన మనకు ఆయన ఉన్నపుడే గౌరవము, గాని ఆయన లేకపోతే గౌరవము లేదు. కొయ్యకు కట్టివేయబడిన గాడిదకు గౌరవము లేదు. మొదట శిష్యులవలన అనగా సేవకుల వలన ఆయనకు గౌరవము, గాని ఆయన లేకపోతే గౌరవము లేదు. కొయ్యకు కట్టివేయబడిన గాడిదకు గౌరవము లేదు. మొదట శిష్యులవలన అనగా సేవకుల వలన ఆయనకు గౌరవము. తర్వాత జనసమూహము వలన గౌరవము అనగా సంఘములోనికి వచ్చినవారి వలన గౌరవము. 4. గార్ధభము వచ్చిన లాభమేమి? దాని మీద బట్టలు వేసిన లాభమేమి? ప్రభువు దాని మీద కూర్చున్నప్పుడు కార్యసిద్ధి; ఇది జయముగల మరియొక క్రియ. యేసుప్రభువును శిష్యులు కూర్చుండబెట్టి గౌరవపరచిరి. కూర్చుండబెట్టుట ద్వారా వారు ప్రభువును గౌరవపరచిరి. కూర్చుండుట ద్వారా ప్రభువు శిష్యులను గౌరవపరచెను. ఆలాగే గార్ధభమును కూడ గౌరవపరచెను. 5. కొందరు దారి పొడుగున బట్టలు పరచిరి. ఆయనను గౌరవించుటకు ఆలాగు చేసిరి. ఇదికూడ జయముగల క్రియ. 6. కొందరు కొమ్మలు పరచినారు. ఇది కూడ గౌరవార్ధము చేసినదే. ఇది జయము గల మరియొక క్రియ. 7. కొందరు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదురుగా వచ్చిరి. ఇదియు గౌరవార్ధమే. ఇదియు జయముగల మరియొక క్రియ. ఖర్జూరపు మట్టలు జయమునకు, గౌరవమునకు గుర్తు. ప్రభువునకు మనవలన విధేయత, గౌరవము, జయము రావలెను. కథలోని వారివలన అవి ప్రభువునకు కలిగెను. కథలో పైన చెప్పిన ఏడును జయముగల క్రియలే. గౌరవముగల క్రియలే. గనుక చెప్పినట్లు చేసిన యెడల జయము. ‘జయము ‘ అనుమాట లేకపోయినను జయము గలదు. తోలి పంపుట జయము. బట్టలు వేయుట జయము. ప్రభువు కూర్చుండుట జయము. దారి పొడుగున బట్టలు వేయుట జయము. కొమ్మలు వేయుట జయము. ఖర్జూరపు మట్టలతో ఎదుర్కొనుట జయము. జయమను మాట లేకపోయినను, క్రియలలో ఆయనకు జయము గలదు. క్రైస్తవ సంఘములో కూడ కొన్ని క్రియలలో జయము పైకి కనబడదు. గాని జయమున్నది. శిష్యులు ప్రభువును బట్టి వెళ్ళిరి. ప్రభువును బట్టి వారు తోలి పంపిరి. బట్టలు వేయుట ప్రభువును బట్టి జరిగినది. ఆలాగుననే కొమ్మలు వేయుట ప్రభువును బట్టియే జరిగినది. అన్నిటిలో ప్రభువును బట్టియే జయము కలిగినది. ఆయన కూర్చుండుట కూడ ఆయనను బట్టియే. అనగా జెకర్య 9:9 నెరవేర్చుటకు “యేసును దాని మీద ఎక్కించిరి” అనిగలదు, “ఆయన ఎక్కిరి” అనికూడ గలదు. రెండుక్రియలు నిజమే. వారు కూర్చుండుమనిరి, ఆయన కూర్చుండెను, ఉదా:- రాజుగారిని సిం హాసనముపై ప్రజలు కూర్చుండ బెట్టుట నిజమే. రాజుగారు కూర్చుండుట కూడ నిజమే.

||. జయము అను మాటలున్న వాక్యము. “దావీదు కుమారునికి జయము;”, ఇందులో జయము అను మాటగలదు. పై ఏడింటిలో ఆ మాటలేదు గాని క్రియ గలదు. ముందు నడుచువారు, వెనుక వచ్చువారు జయమనిరి. గనుక ఆయనకు క్రియలలో జయమున్నది. మాటలలో కూడ జయమున్నది. క్రియలు అనేక రకములుగాని జయము ఒక్కటే. 1914 నుండి 1918 సం|| వరకు జరిగిన యుద్ధములో, ఇటలీదేశపు పటాలము ఇంగ్లీషువారి పక్షముగా యుద్ధమునకు పట్టణము, పల్లెలు దాటిపోవుచుండిరి. పిల్లలు అది తెలిసికొని పువ్వులు తెచ్చి, పటాలపు దారిలో నిలువబడిరి. సిపాయిలు వంగినప్పుడు పిల్లలు వారి జేబులో పువ్వులు పెట్టిరి. కొందరు గ్రుచ్చిరి. ఇది జయమునకు గుర్తుగా జ్ఞాపకము వచ్చుచున్నది. వీరిలో అనేకులు యుద్ధములో చనిపోవుదురు. అయినను జయమునకు గుర్తుగా పిల్లలు ఆలాగు చేసిరి. ఆలాగే ప్రభువునకు అవమానము, సిలువ ఎదురుగా కనబడుచున్నను ముందే జయముగల క్రియలు, మాటలు జరిగెను. మత్తయి 21:15లో పిల్లలుకూడ కేకలువేసి జయము చెప్పిరి. అప్పుడే పరిసయ్యులకు డోసులు వచ్చెను. లూకా 24:19 లో ప్రభువు “క్రియలలోను, వాక్యములోను, శక్తిగల ప్రవక్త” అని ఉన్నది. ఈ కథలో కూడ క్రియలలోను, మాటలలోను జయము కనబడుచున్నది. ఉదా:- ఇంగ్లాండు దేశపు రాజుగారు సైన్యమును యుద్ధమునకు పంపుచు, ఈ మాట పలికెను” “come home cheerfully!” అనగా సంతోషముతో తిరిగి రండని పలికెను. యుద్ధములో అనేకులు చనిపోవుదురు. అయినను జయము ఆయన కోరికలో యుండెను. ప్రభువునకు ఎదురుగా కోర్టు, సిలువ, మరణము, సమాధి కనబడుచున్నవి. ఈ ఆదివారము నాడే ప్రభువునకు శుక్రవారము కనబడుచున్నది. అన్ని అపజయములే కనబడుచుండెను. దేవుడై యుండి కోర్టునకు పోవలెనా, దేవుడై యుండి సిలువకు పోవలెనా, దేవుడై యుండి మరణము కావలెనా, దేవుడై యుండి సమాధికి పోవలెనా!!! ఇవన్ని కనబడుచుంటే పిల్లలు జయము అని కేకలు వేసిరి. ఈ దినము పల్లెటూరు నుండి పట్టణము వరకు జయము కనబడుచుండెను. గాని శుక్రవారము సిలువ వేయుము అను శబ్ధము వినబడుచుండెను. అయితే ఆయనకు అన్నిటి మీదా జయమే. పునరుత్థాన ఆదివారము ఒకటే జయము. కోర్టు, సిలువ, మరణము, సమాధి- ఈ నాలుగు విషయములలో ఆయన సహించుకున్నాడు, అదే జయము. విసుగుకొనలేదు. రక్షించకపోతే నాకేమని అనలేదు. అదే జయము. ఈష్టరు ఆదివారమున లేచుట వలన బహిరంగ జయము గలదు. ఈ రెండు జయములు సంఘమునకు గలవు. శ్రమ సహించుట వలన జయము. తర్వాత శ్రమలు పోయినప్పుడు జయము. ఈ పాఠములోని జయములు 1. వాగ్ధాన జయము (గార్ధభాసీనుడుగా వెళ్ళినప్పుడు), 2. సహింపు జయము (కోర్టు, సిలువ, మరణము, సమాధి), 3.పునరుత్థాన జయము (లేచుట).

ప్రభువుయొక్క ఈ మూడు జయములు మీ అందరకును అందును గాక, ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply