(వాక్యభాగము:మత్తయి 21:1-17; మార్కు 11:1-17; లూకా 19:29-46; యోహాను 12:12-16.)
ప్రసంగము: ముందు, మట్టలాదివారము అను కథను చిన్న మాటలతో చెపుతాను. గార్ధభము మీద యేసుప్రభువు కూర్చుండెను. చుట్టునున్న ప్రజలు ‘జయము ‘ అని కేకలు వేసిరి. పట్టణమునకు వెళ్ళిన తర్వాత పండితులు, పాత నిబంధన తెలిసినవారు వచ్చి, ప్రజలను చూచి కోపపడిరి. వారికి ప్రభువు జవాబిచ్చెను. తరువాత ప్రభువు గుడిలోనికి వెళ్ళి వర్తకులను వెళ్ళగొట్టి, దేవాలయమును శుభ్రము చేసెను. అక్కడున్న్ రోగులను స్వస్థపరచెను. పండితులు మూడు కారణముల వలన ప్రభువుపై కోపించిరి. (1) జయము అన్నందున, (2) వర్తకులను వెళ్ళగొట్టినందున, (3) రోగులను బాగుచేసినందున, ఈ నేరముకాని నేరములే ఆయనను సిలువకు అప్పగించెను. ప్రజలు జయము అని కేకలు వేసిరి. గాని ఈ ఆదివారము తర్వాత ఆయనకు శ్రమ, గెత్సెమనేలో లక్ష్మి వారము బాధ, శుక్రవారము సిలువ కథ. వీరు జయము అనిరిగాని ఏమిలాభము, సిలువ తప్పలేదు. అసలు జయము అనుమాట ఈ దినమే ఆరంభమైనది. పల్లెటూరునుండి పట్టణము వరకు జయము. ఆయనకు అంత్యతీర్పు వరకు జయము గలదు. అయితే శుక్రవారము ప్రభువునకు జయము లేదు. సిలువశ్రమ ఉన్నది. ఆదివారము పునరుత్థానము గలదు. అది జయము, గాని ఈ దినము జయము అని కేకలు వేసిన వారికి, ఆదివారము కలుగబోవు పునరుత్థాన జయము తెలియదు. తెలియకుండనే వారు జయము పాడిరి. ఈయన రక్షకుడు, రాజు అని గ్రహించి పాడిరిగాని, వారికి సిలువ, చనిపోవుట, లేచుట తెలియనే తెలియదు. అలాగే మనము విశ్వాసముతో ముందే జయమని అనవలెను. అప్పుడు మార్గములో కష్టములున్నను చివరకు జయము కలుగును.
ఈలాగు క్రీస్తుప్రభువు సమాధానకర్తయైన రాజువలె వచ్చునని 800 ఏండ్ల క్రిందట భక్తులు వ్రాసిరి. యెరూషలేమా! ఆయన నీ దగ్గరకు వచ్చునని వ్రాసియున్నారు. ఈ సంగతి పండితులకు తెలియును గాని వారు వచ్చి ప్రభువునకు నమస్కరింపలేదు. అట్లు చేయుట వారికి చిన్న తనమనియు, ప్రజలందరు ఆయన దగ్గరకు పోవుదురనియు భయపడిరి. ధర్మశాస్త్రము చదివి బోధించిన వీరు, ప్రభువు దగ్గరకు రావలసినది గాని వచ్చుటకు బదులుగా ప్రభువును సాధించినారు. ఏమయ్యో, కేకలు వినబడుచున్నవా! అని సాధించిరి. వీరిలో పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. ఆయనను సిలువ వేసినవారు వీరే. ప్రభువు మెస్సీయా అని తెలుసుకొనుటకు కొన్ని గుర్తులు వారి గ్రంధములో గలవు. అవి గురువులకు తెలుసుగాని వారు ప్రభువు దగ్గరకు రాలేదు. అలాగే ఈ కాలములోని గురువులు కూడా తీరా ప్రభువు రెండవ సారి వచ్చుసరికి, ఈయన క్రీస్తు కాడు, ఈ మేఘము రాకడ మేఘము కాదు అందురు. గనుక జాగ్రత్త పడవలెను. మొదటి రాకడకు కొన్ని గుర్తులున్నవి. రెండవరాకడకు కూడా 100 గుర్తులున్నవి. ఈ కాలములోని, పాత నిబంధన గురుతులు వారు నమ్మలేదు. ఈ కాలములోని గురుతులు ఈ గురువులు కూడా నమ్మరు. ప్రభువు యొక్క మొదటి రాకడను గురించిన చివరి గురుతులలో ఒకటి ‘గార్ధభాసీనుడగుట ‘ ముందున్న గురుతులన్నియు నమ్మకపోయినను ఈ గురుతును బట్టియైనను వారు నమ్ముదురనుకొనెను. అది కూడ వారు నమ్మలేదు. అపుడు గార్ధభాసీనుడైన ప్రభువు రేపు మేఘాసీనుడై వచ్చును. అప్పుడాయనను నమ్మినవారు ఆయనను వెంబడించి జయమనిరి. ఇప్పుడు కూడ నమ్మినవారే మేఘములోనికి వెళ్ళుదురు.
యూదులు ప్రభువును గ్రహించుటకు, పాత నిబంధనలో కొన్ని గురుతులు చెప్పబడెను. (1) ఆయన దావీదు వంశస్తుడు. (2) కన్యక గర్భమందు జన్మించును.(34) బేత్లెహేములో పుట్టును.(4) రోగులను స్వస్థపరచును. (5) బీదలకు సువార్త ప్రకటించును. (6) ఆయన వచ్చినాడని చెప్పగల మహర్షి (యోహాను) వచ్చునని చెప్పబడెను. (7) ఆయన గార్ధభాసీనుడై యెరూషలేము వెళ్ళును. ఇన్ని గురుతులు పండితులకు తెలిసినను వారు ప్రభువును వెంబడింపలేదు. సామాన్యులు ఆయనను అంగీకరించిరిచిరి. ఈ కాలములో రెండవ రాకడ గురుతులు బైబిలులో అనేకములు గలవు. అనేకులు వాటిని నమ్మరు. బోధకులే నమ్ముట లేదు. నమ్మనివారు భూమి మీదనే ఉండిపోవుదురు. ప్రభువును వారు వెంబడించుటకు 7గుర్తులున్నవి. వాటిలో ఏ ఒకటి తగ్గిన ప్రభువును కాదనవచ్చును. ఉదా:- ఒక దొరసానమ్మగారు మా దొరగారు రైలు దిగగానే ఈ పనులు చేస్తారు. ఆయనే మా దొర, గుర్తు పట్టుము అని కొన్నిగుర్తులుచెప్పిరి.”స్టేషనులోనున్న ముసలివారిని, పిల్లలుగల వారిని, కుంటివారిని, గ్రుడ్డివారిని ఎవరు తీసికొని వస్తారో ఆయనే దొరగారు. మరియు వారు ఎత్తైన దొరగారు, ఇంకెవరికైనా సహాయము కావలెనా అని అడుగుదురు ‘ అని చెప్పెను. వచ్చిన ఆయన స్టేషనుకు వచ్చి చూచినాడు. ఆ దొర కూలి అక్కరలేకుండ, అనేకులకు సహాయము చేయుచుండెను. ఆయన చెప్పువరకు బండి కదలకూడదు. అతను దొర గారిని గుర్తుపట్టెను. అలాగే యుదా మత పండితులు యేసుప్రభువును, ఆయన చేసిన కార్యములనుబట్టి గుర్తుపట్టవలసినది గాని వారు అట్లు చేయలేదు. ఎవరు దావీదు వంశములో పుట్టునో, ఎవరు కన్యక గర్భమందు పుట్టునో; అలాగే పై 7గుర్తులు ఎవరియందు నెరవేరునా అని వారు పరీక్షించ వలసినది గాని వారు పరీక్షింపక పొరబడినారు. పండితులు, శాస్త్రులు పొరబడవచ్చునా? ఆఖరుగా ప్రభువు గార్ధభముపై కూర్చుండుట. ఇది అయినను వారు తెలిసికొనవలసినది. ఆయన గుర్రముపై స్వారి చేసిన యెడల ఈయన క్రీస్తుకాడు అనవచ్చును. పై గుర్తులను ప్రవక్తలు వ్రాసిరి. ప్రభువు వాటిని తన జీవితములో నెరవేర్చిరి. కొందరు నమ్మినారు, కొందరు నమ్మలేదు. అలాగే ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు ప్రభువును, “విన్నావా”, “ఎందుకా కేకలు” అన్నట్లు ఆక్షేపణ చేయువారుందురు. ఆ కాలములో గుర్తులు చదివి, బోధించినవారే ఆయనను అన్నారు. నేటి కాలములో కూడా సామాన్యులే నమ్మి వెళ్ళిపోవుదురు. బోధకులు ఉండిపోదురు. (అందరు బోధకులు కాదు కొందరే అట్టి స్థితిలో నుందురు) ఆయనను నమ్మిన వారు మేఘములోనికి వెళ్ళి, మళ్ళుదురు. అనగా వెయ్యేండ్లలో రాజ్యము చేయుటకు మళ్ళీవస్తారు. అయితే నమ్మనివారు ఉండి, శ్రమలలో మండిపోవుదురు. అనగా వారు భూమి మీదనే ఉండిపోవుదురు. ఏడేండ్ల శ్రమ కాలములో శ్రమల మంటలలో మండుదురు. గనుక ప్రభువు రాకడను నమ్మి మేఘములో చేరగల భాగ్యము అందరికిని కలుగునుగాక!