వేదపఠన:- జెక్ర్యా 9: 9,10; మత్తయి 21:1-11; ప్రకటన 7:9.
మట్టలాదివార మహోత్సవ వాస్తవ్వులారా! ఈ వేళ మనకు మట్టలాదివారపు పండుగ, (2) సేవకుని పండుగ, (3) రక్షకుని పండుగ, (4) దేవుని పండుగ. ఈ దినమున యేసుప్రభువు గార్ధభాసీనుడైయున్న శ్రమల ననుభవించుటకు ఆయన వెళ్ళుచుండెను. ప్రభువు వచ్చుచున్నాడని పట్టణ వాస్తవ్వులు, మట్టలను చేత పట్టుకొని వచ్చిరి. ముందు, వెనుక ప్రజలున్నారు: వారి మధ్యన ప్రభువు ఉన్నారు. ఆయన చుట్టు పండ్రెండుమంది శిష్యులు మంత్రులవలె యున్నారు. ప్రజలు జయము, జయమని జయధ్వనులు చేయుచున్నారు. ప్రభువు దృష్టిలో -ఆయన పొందనైయున్న శ్రమలు, గెత్సెమనే తోట, ఆయనను అప్పగించేవారు, అరెష్టు చేసేవారు. తీర్పు తీర్చేవారు, సిలువకు అప్పగించేవారు. అపహాస్యము చేసేవారు, దూషించేవారు, సిలువ వేసేవారు, సమాధి చేసేవారు. వీరందరు ఆయన యెదుట కనబడుచున్నారు. పునరుత్థానుడైన ప్రభువును చూచి ప్రజలు జయమనవలెను కానీ ఇప్పుడే జయధ్వనులు చేసికొంటూ బేతనియ నుండి యెరూషలేము పట్టణమునకు వెళ్ళుచున్నారు.
జెకర్యా ప్రవచనము:- “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా నుండుడి; నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై, గార్ధభమును, గార్ధపు పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు” (జెకర్యా 9:9) ఆయన మెస్సీయ అని తెలిసికొనుటకు అనేకమైన గురుతులున్నవి. శాస్త్రులు, పరిసయ్యులు ఈ ప్రవచనమును మరచిపోయిరి. ఈ గురుతును జ్ఞాపకము చేయుటకును, ప్రవచనము నెరవేర్చుటకును ప్రభువు ఈసారి గార్ధభము నెక్కి యెరూషలేమునకు వెళ్ళెను. ప్రవక్తలు, ఆయన రక్షకుడుగా గార్ధభాసీనుడై యెరూషలేము వెళ్ళునని ప్రవచించిన వ్రాతచిట్టా యూదులచేతిలోనే యున్నది. వారి చేతిలోయున్న గ్రంధములోని ప్రవచనమును బట్టి, వారు ఆయనను చూడగానే జెకర్యా ప్రవచనమునకు నెరవేర్పు ఈయనేయని చెప్పవలసినది గాని చెప్పలేదు.
పండితులైనవారు పాత నిబంధన గ్రంధమును తెచ్చి, చదివి వినిపించ వలసినది కానీ వినిపించ లేదు. జెకర్యా గ్రంధములోనున్నట్లు ఈయనే మెస్సీయ అని గంతులు వేయుచు, కేకలు వేసి స్తుతించవలసినది కానీ అలాగున చేయలేదు. యేసుప్రభువు పుట్టినప్పుడు, ఈయన (మెస్సీయ) యెక్కడ పుట్టినాడని హెరోదు రాజు అడిగినప్పుడు, శాస్త్రులు వేదములిప్పి ఫలానచోట పుట్టెనని చదివి చెప్పిరి. అలాగే ఇప్పుడు యేసుప్రభువు గార్ధభాసీనుడై వచ్చుట చూచి వేదములు చదివి, ఈయనే మెస్సీయ అని చెప్పవలసినది కానీ చెప్పలేదు. రాజు మాటను బట్టి మెస్సీయ జన్మించినాడని తెలిసినది. ఈ రాజే యూదులకు రాజు. జెకర్యా ప్రవచనమును వారు తప్పక నమ్మవలసినది కానీ వారు నమ్మలేదు. ఈ ప్రవచనము ఈయనలోనే నెరవేరినదని నమ్మవలసినది కానీ నమ్మలేదు. ఈ ప్రవచనములో నాలుగు ప్రాముఖ్యాంశములు గలవు. (1) రాజు, (2) దీనుడు, (3) రక్షకుడు, (4) నీతిపరుడని యున్నది. నలుగురు సువార్తికులు నెరవేర్పుల గ్రంధములైన తమ సువార్తలలో వ్రాసిన పై వాటిని ధ్యానించుకొందము.