ఈ వేళ ఏమి పండుగ? అని మమ్ములను చూచినవారు అడుగుచున్నారు. ఏమి సమాధానము చెప్పవలెను?
యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన సంగతి తలంచుకొని, క్రిష్ట్మస్ పండుగ చేయుచున్నాము.
యేసుప్రభువు మన నిమిత్తము సిలువ మీద చనిపోయిన సంగతి తలంచుకొని, శుక్రవారము నాడు పండుగ చేయుచున్నాము.
యేసుక్రీస్తు వారు చనిపోయి, బ్రతికి వచ్చిన సంగతి తలంచుకొని, ఈష్టరు పండుగ చేయుచున్నాము.
యేసుప్రభువు శరీరముతో మోక్షలోకమునకు వెళ్ళిన సంగతి తలంచుకొని, ఆరోహణ పండుగ చేయుచున్నాము.
యేసుక్రీస్తు ప్రభువు పరమునకు వెళ్ళి, తన శిష్యులలోనికి దైవాత్మను పంపించిన సంగతి తలంచుకొని, పెంతెకొస్తు పండుగ చేయుచున్నాము.
ఆయన ఈ లోకమునుండి వెళ్ళకముందు ఒకమాట చెప్పిరి. అదేమనగా ‘నేను తిరిగివస్తాను ‘ ఇది తలంచుకొని, బైబిలు మిషను వారమైన మేము రాకడ పండుగ ఏర్పర్చుకొన్నాము. ఈ పండుగ తక్కిన మిషనుల వారికి లేదు. మేమే క్రొత్తగా పెట్టినాము.
యేసుప్రభువు మన నిమిత్తమై పుట్టినారని నమ్మి, మన నిమిత్తమై మోక్షలోకమునకు వెళ్ళినారని నమ్మి, మన నిమిత్తమై తన ఆత్మను పంపినారని నమ్మి; మనలను మోక్షలోకమునకు తీసికొనివెళ్ళు నిమిత్తమై తిరిగి వచ్చునని నమ్మక పోయిన యెడల అన్నియు నమ్మిననూ ప్రయోజనమేమి?
అవును, మరి ఆయన రెండవసారి వచ్చునని నమ్మకపోయిన యెడల, ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీదనే ఉండిపోవుదురు . మోక్షమునకు వెళ్ళరు.
ఆయన తిరిగివచ్చునని బైబిలులో నున్నది గనుక నమ్ముచున్నాము. తిరిగివస్తారని ఆయనే చెప్పినారు గనుక నమ్ముచున్నాము. నేటికాలమందు అనేకులకు దర్శనములలో చెప్పుచున్నారు గనుక నమ్ముచున్నాము.
నమ్ముచున్నాము, తిరిగివస్తారని నమ్ముచున్నాము, మమ్మును తీసుకొని వెళ్ళుటకు వచ్చుచున్నారని నమ్ముచున్నాము. గనుక రాకడ పండుగ చేయుచున్నాము. నమ్ముట మాత్రమే కాదు, ఎదురుచూస్తున్నాము, సంతోషిస్తున్నాము గనుక రాకడ పండుగ చేయుచున్నాము.
నమ్మని వారికి ఈ రాకడ పండుగలో పాలు పంపులు లేవు. మేము చేయుచున్న ఈ రాకడ పండుగను చూచి ఆనందించు వారికి పాలున్నది.
యేసుక్రీస్తు వారి చరిత్రలోనున్న పుట్టుకకు, మరణమునకు, పునరుత్థానమునకు ఆరోహణమునకు ఈ రాకడ కథ చేర్చకపోయిన యెడల యేసుక్రీస్తు వారి కథ సంపూర్ణమైయుండ నేరదు.
యేసుక్రీస్తువారు తిరిగి వస్తారని చెప్పుటకు గురుతులేమైనా ఉన్నవా?
చాలా ఉన్నవి. చాలా ముఖ్యమైనది ఒకటున్నది.అదేమనగా యూదులు పాలస్తీన దేశము చేరుట. ఈ యూదులలోనే యేసుక్రీస్తు వారు జన్మించినారు గదా? ఈ యూదులే ఆయనను చంపినారు గదా? ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరముల తరువాత, ఈ యూదులు అన్ని దేశములకు చెదిరిపోయినారు. చెదిరిపోయి ఇప్పటికి 1900ల సంవత్శరములు అయినది. ఆయన రెండవ రాకడకు ముందు వీరు తమ దేశము చేరుకొందురని బైబిలులో నున్నది. అది ఇప్పుడు నెరవేరుచున్నది. గనుక ఆయన రెండవ రాకడ దగ్గరపడినదని గ్రహించుకొనుచున్నాము.
ఇంకా రుజువులేమైనా వున్నవా?
వున్నవి. బస్సులు, విమానములు, యుద్ధములు, భూకంపములు, మత వివాదములు ఈ మొదలైనవి.
ఇంత భక్తి సంపాదించుకొని ఆయన వచ్చినప్పుడు, ఆయతో కూడ వెళ్ళకపొయిన యెడల, భక్తి చేయుట అనగా ఈ బైబిలు పఠనలు, ఈ ప్రార్ధనలు ఈ బోధలు, ఈ కానుకలు పట్టుట, కీర్తనలు పాడుట ఇవన్నీ ఎందుకు వచ్చినవి?
ఆయన ఇంకా రానిదే ఎందుకు వచ్చిన పండుగ? అని కొందరు అనుచున్నారు.
ఆయన వచ్చినారనే నమ్మికతోపాటు,రెండవసారి వస్తారనే నమ్మిక లేకపోయిన, ఆ నమ్మిక ఎందుకు?
విశ్వాసమనగా నేమి?
చూడనిది నమ్ముటయే విశ్వాసము. విశ్వాసము వలననే మానవులు ధన్యులగుచున్నారు.
ఓ ప్రజలారా! ఓ దేశీయులారా! యేసు క్రీస్తువారి జన్మ భాగ్యము మీకు కలుగును గాక! యేసుక్రీస్తువారి మహాయజ్ఞ భాగ్యము మీకు కలుగును గాక! ఆయన పునరుత్థాన భాగ్యము మీకు కలుగును గాక! ఆయన ఆరోహణ భాగ్యము మీకు కలుగును గాక! యేసుక్రీస్తు వారి రెండవ రాకడ భాగ్యము మీకు కూడ కలుగును గాక. అనాది దేవుడు, అనంత దేవుడు మిమ్ములను, మీ బంధవర్గమును దీవించును గాక. తథాస్తు!