వాక్య పఠన: మత్తయి. 24అధ్యా; మార్కు. 13అధ్యా; లూకా. 21అధ్యా, యోహాను, 14అధ్యా,
1కొరింధి. 15అధ్యా; కీర్తన:45వ అధ్యాయము.
ప్రార్ధన:- త్రియేక దేవుడవైన తండ్రీ! ప్రభువా! సర్వాధికారీ! సమస్త సృష్టికి కర్తవైన ఓ తండ్రీ! నీ మహా గొప్ప మహిమ యెదుట పాపులమైన మేము ఈ దినమందు కూర్చుండి, మా ప్రభువు యొక్క రెండవ రాకడ ధ్యానము చేయగోరుతూ నిన్ను స్తుతించుచున్నాము.
ఓ త్రియేక దేవుడవైన తండ్రీ! ప్రభువా! సర్వాధికారీ! సమస్త సృష్టికి కర్తవైన ఓ తండ్రీ! నీ మహా గొప్ప మహిమ యెదుట పాపులమైన మేము ఈ దినమందు కూర్చుండి, మా ప్రభువుయొక్క రెండవ రాకడ ధ్యానము చేయగోరుతూ నిన్ను స్తుతించుచున్నాము.
ఓ దేవా! నీవు కలుగజేసిన సూర్య, చంద్ర, నక్షత్రములను, వధువు సంఘము చూచినప్పుడు; ఇవే ఇంత కాంతిగా ఉంటే నా తండ్రి ఇంకా ఎంత కాంతిగా ఉండునో అని తలంచే తలంపు వధువు సంఘమునకు దయచేయుము. పరలోకము లోనికి వెళ్ళి ఆయన మహిమ కాంతిలో, జ్యోతివలె ప్రకాశించి ఆనందించే కృప వధువు సంఘమునకు దయచేయుము. ఈ విధంగా ఆ రాబోయే మహిమ కాంతిని జ్ఞాపకము చేస్తున్నందుకు వందనములు వాటికి స్వరము లేకపోయిననూ (1) బోధకులకంటే, (2) గ్రంధముల కంటే మాకు ముందుగా నీ మహిమను తెలియజేయు జ్యోతులనుబట్టి నీకు వందనములు.
2. నీవు మాకు దాచిపెట్టి ఉంచిన మేఘజలమును చూడగా, మేము పరలోకములోనికి వచ్చి చూడబోయే, సుకారు బావియొద్ద సమరయ స్త్రీతో నీవు చెప్పిన ఆ జీవజలమును జ్ఞాపకము చేసికొనే కృప వధువు సంఘమునకు దయచేయుము.
3. మరలా క్రిందికి రాగా మా కంటే తక్కువగా నిన్ను గూర్చి తెలిసియున్న పక్ష్యాదుల యొక్క ఉదయకాల గానములు చూడగా, పరలోకానికి వెళ్ళి ఆ గని స్తుతి గానము., మేమెరుగని స్తుతి గానము, దూతల స్తుతి గానము. భక్తుల స్తుతి గానము గ్రహించు కృప వధువు సంఘమునకు దయచేయుము.
4. ఇంకా క్రిందికి రాగా పాపము చేయు మానవులకు ఇట్టి పండ్లు, పువ్వులు, ఆనందము కలిగించుకొనుచుండగా, మాకు పరలోకములో జీవవృక్ష పండ్లు, ఆనంద పుష్పములు, వస్తువులు దయచేయుదువని తలంచే కృప వధువు సంఘమునకు దయచేయుము.
5. పాపము వలన చెడిపోయిన ఈ సృష్టే ఇంత రమ్యముగా నున్నది. ఇంతకంటే పరలోకము ఎంత రమ్యముగా ఉండునో! అని ఎదురు చూచే కృప వధువు సంఘమునకు దయచేయుము.
6. పాపలోకములో నుండియే; మా తండ్రి కొంతమంది విశ్వాసులను ఏర్పర్చి వారికి బోధించే బోధకులను ఇచ్చిన ఈ క్రమము చూస్తుండగా, ఇక్కడి బోధకుల వలెననే ఇట్టి మహిమ బోధలు వివరింపబడుచున్నవి. పాపములేని పరలోకములో పరిశుద్ధులు వివరించే బోధలు ఇంకెంత వినసొంపుగా నుండునో అని తలంచే తలంపు, జ్ఞాపకము చేసికొనే భాగ్యము వధువు సంఘమున కిమ్ము.
7. ఇక్కడ ధ్యానము చేసేవారి సమాజము కొద్దిమందే, అక్కడ సమావేశమయ్యే గుంపు దీని కంటే పెద్దదే గాని వీటన్నిటికంటే ఎక్కువైన సమావేశము అక్కడున్నది. అందులో మా స్నేహితులు, బంధువులు, క్రొత్త నిబంధన వారు, పాత నిబంధన వారు, సంఘ చరిత్ర వారు, మా మిషను వారు పరమ భక్తులుగా ఉన్నారని అనుకొనగల వధువు సంఘ తలంపు దయచేయుదువని వందనము అర్పిస్తున్నాము.
8. కొందరు దర్శనములు చూస్తున్నారు గాని అంత సంతోషము లేదు. అక్కడ అందర్నీ చూస్తాము. ఈ పాడు లోకము, పాడుచెత్త , పాడైనవన్నీ ఇక్కడే చూస్తున్నాము. అక్కడ ఇట్టి పాడు ఉండదు గనుక నిన్ను, నీ మహిమను ముఖాముఖిగా చూచే వధువు సంఘ కృప దయచేయుము.
9. త్వరగా వస్తానన్నా ప్రభువు త్వరగా వస్తుంటే, త్వరగా మేము సిద్ధపడి, ‘ప్రభువా! నీవు ఒక్కడవే కాదు ‘ మేము కూడా త్వరగా వస్తున్నాము. అని చెప్పగలిగే కృప వధువు సంఘమునకు దయచేయుము.
10. పాపుల మధ్యను, సుంకరుల మధ్యను కూర్చుండియున్న మా ప్రభువు వలె, పాపులు, సుంకరుల మధ్య నేడు ఉన్న వధువు సంఘము యొక్క నిరీక్షణ, సమావేశము, బోధలు, గానములు మా చుట్టూనున్న వారు చూస్తుండగా వారికిని ప్రేరేపణ కలిగి వధువు సంఘములోనికి వచ్చేటట్లు చేయగలవని నమ్మి, ‘ఇన్నాళ్ళకు మీరు కూడా వధువు సంఘములోనికి వచ్చినారా!’ అని హస్త పరిచర్య చేసుకొనే వధువు సంఘ కృప దయచేయుము.
తండ్రీ! విశేషముగా మేము నీ సన్నిధిలో ఉండగలిగే కృప దయచేయుము. నీ కృపగల వర్తమానము అందించుమనియు, రావలసినవారిని రప్పించుమనియు వేడుకొంటున్నాము. ఆమెన్.