రాకడను గురించి ఎవరికైనా, ఏమైన ప్రశ్నలు ఉంటే ప్రభువును అడిగి తెలుసుకొనండి. రాకడకు సిద్ధపడవలెనంటే ఈ క్రింది విషయములను జాగ్రత్తగా పరీక్షించి ఆచరణలో పెట్టవలెను.
యం. దేవదాసు అయ్యగారు వ్రాసిన ‘ప్రార్ధనమెట్లు ‘ అను పుస్తకము ప్రకారము అనుదినము ప్రార్ధించవలెను. ‘సైతానును ఎదిరించుట ‘ అను సూత్రములలోని కొన్ని సూత్రములతో సైతానును ఎదిరించవలెను. బైబిలు గ్రంధములో రాకడను గురించి ఎక్కడెక్కడ వ్రాయబడియున్నదో వాటిని చదువుకొనుటవల్ల సిద్ధపడగలము. ప్రతి సువార్తలోను చివరి అధ్యాయములలో రాకడను గురించి ఉన్నది. అలాగే పత్రికలలో రాకడను గురించి యున్నది. ప్రకటన గ్రంధమంతయు మొదటినుండి చివరివరకు చదువవలెను. బైబిలు గ్రంధములోని ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు, రాకడ పేరుమీద గల వచనములను దినమునకు ఒక్కసారియైననూ, రాకడలో ఎత్తబడుదుననే తలంపుతో చదువవలెను. ఓ రాకడా! నేను బైబిలు ముగించలేదనే తలంపుతోనూ, పూర్తిగా చదువవలయుననే తలంపుతో చదువలెను. అయ్యగారు రాకడను గురించి ఎన్ని పత్రికలు వ్రాసినారో అవన్నియు చదివితీరవలెను. రాకడ అంత త్వరగా రాదనే తలంపు రోజునకు పది పర్యాయములైనా వచ్చి తీరును. వాటిని ఎదిరించండి. ఓ సాతానా! అని అట్టి తలంపులను ఎదిరించవలెను. తలంపు లోనే ఓ సాతానా! ‘ వెళ్ళిపో’ అని అనవలెను. వానిని కాళ్ళ క్రింద వేసి త్రొక్కవలెను. నేను రాకడకు సిద్ధమగుదును. అనగా సిద్ధముగానున్నానని అర్ధము కాదు. కాబట్టి వెళ్ళుట అనునది నిశ్చయము కాదు. ఇట్టి తలంపు పుట్టక మానదు. ఇది పిశాచి పని, గనుక శరీరమంతటితో పిశాచిని త్రొక్కివేయవలెను. ఈ పాఠములు ఇతరులకు చెప్పుటవల్ల సిద్ధపడగలరు. ప్రభువా! నేను రాకడకు సిద్ధముగా ఉన్నానని చెప్పుట వలన కూడా రాకడకు సిద్ధపడగలరు. ఓ సాతానా! ఓ లోకమా! ఓ శరీరమా! మీరు ముగ్గురూ, మాకు శత్రువులు, మీ దగ్గరనుండి సెలవు తీసికొనుచున్నాము అని ఈ రీతిగా చెప్పగలిగినట్లయితే సిద్ధపడగలరు. ఇట్టి ప్రార్ధన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చనిపోవు తరుణములో చేసినారు. ఓ లోకమా! నీవు విసుగుకొన్నావు. నేను విసుగుకొన్నాను. ఇంకా నీతో నాకు పని లేదు. అని చెప్పి నిద్రించినారు. ఈ మాట అయ్యగారికి వినబడి చాలాకాలమైనది. అదేమనగా “ఓ లోకమా! నన్ను చూచి నీవు విసుగుకొన్నావు నిన్ను చూచి నేనునూ విసుగుకొన్నాను. అయితే ఇప్పుడు సమయము అయిపోయినది. నేను దేవుని యొద్దకు వెళ్ళిపోవుచున్నాను. ఇంకా మనము ఇరువురము విసుగుకొననక్కరలేదు అని ఆయన మరణ సమయములో చెప్పిరి.” బైబిలు గ్రంధములో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయనకు ఎవరికి లేనన్ని ప్రత్యక్షతలు ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు.ఆయనకు ఎవరికి లేనన్ని ప్రత్యక్షతలు ఉన్నవి. పౌలు వెళ్ళిపోయి 1500 సంవత్సరములు అయినది. ఆ తరువాత వచ్చిన మార్టిన్ లూథర్ గారికి పౌలుగారివలె ప్రత్యక్షతలు ఉన్నవి. ఆ మధ్యకాలములో వచ్చినవారికి ఇట్టి ప్రత్యక్షతలు లేవు. ఆ పిదప వచ్చిన అయ్యగారికి అట్టి ప్రత్యక్షతలు ఉన్నవి. 4 వందల యేండ్ల పిమ్మట క్రొత్తగా బైబిలు మిషను వచ్చినది. పౌలు గారికి అనేక ప్రత్యక్షతలు అనుగ్రహింపబడెను గనుక ఆయన పరదైసునకు కూడా వెళ్ళెను. యేసుప్రభువు శిష్యులకు కూడా అట్టి ప్రత్యక్షతలు ఉండవలసినది, గాని లేవు. వారి తరువాత 1500 సంవత్సరములకు వచ్చిన లూథర్ గారికి అపోస్తలుడైన పౌలువలె అనేక ప్రత్యక్షతలు ఉన్నవి. ప్రత్యక్షత లేనిదే మార్టిన్ లూథర్ గారు ఏ పనియు చేయలేదు. ఇది ఆశ్చర్యము. 5000 మంది ప్రజల ఎదుట లూథర్ గారు తన బోధలను వినిపించెను. విరోధులు చంపుటకు సిద్ధముగానున్నను వారి ఎదుట ధైర్యముగా నిలబడి బోధించెను. ఆయన చనిపోయిన నాలుగు వందల సంవత్సరాలకు, 1958 వ సంవత్సరము జనవరి నెలలో ప్రత్యక్షత ద్వారా ఆయనను గూర్చి బయలు పరచబడెను. ఆ కాలములో జెకోస్లేవేకియాలో మార్టిన్ లూథర్ గారి వంశములో నుండి వచ్చిన, జాన్ మార్టిన్ అను ఆయన బైబిళ్ళు అమ్ముచున్నారని తెలియబడెను. పరిశుద్ధ దూతలారా! పరలోకమందున్న పరిశుద్ధులారా! నేను రాకడకు సిద్ధమగుచున్నాను. గనుక మీరు కూడ నన్ను గూర్చి ప్రార్ధన చేయుడి. అని అడుగుట వల్ల మనము రాకడకు సిద్ధపడగలము. ఎప్పుడైన శరీర బలహీనతలో, ఆత్మ బలహీనతలో పడిపోయినప్పుడు వెంటనే ఎక్కువగా ప్రార్ధించవలెను. యుద్ధములో ఎవరైన బాంబు వేసిన, వారిమీద తిరిగి వేయుదుము. అలాగే పిశాచి మనమీద బాంబులు వేసినప్పుడు వెంటనే పిశాచిమీద తిరిగి బాంబులు వేయవలెను. అట్లు చేసిన ఎడల రాకడకు సిద్ధపడగలము. బలహీనతలో పడిపోయినామని విచార పడకూడదు. తెలిసి, పాపములో పడితిని; సైతానును ఎలాగు నెదిరించవలెనని అనుకొనకూడదు. అట్లు తలంచక, ఏమిఎరుగనట్లు, దయ్యములను ఎదిరించవలెను. మనము ఎప్పుడైన శరీర బలహీనతలో గాని, ఆత్మ బలహీనతలో గాని; తెలివి తక్కువవల్ల గాని, పొరపాట్లవల్ల గాని పడిపోయిన యెడల, నేను సాతానును ఏ రీతిగా ఎదిరించగలను? ప్రభువును ఏ రీతిగా క్షమాపణ అడుగ గలను? అని తలంచ కూడదు. తప్పులేమియు లేని వానివలె, దిట్టముగా నిలువబడి సైతానును ఎదిరించవలెను. ప్రభువును క్షమాపణ కోరవలెను. అప్పుడు ఒక వేళ సైతాను మనలను అడిగినట్లయితే, ఓ సైతానా! నీవు పడవేస్తే నేను పడినాను గాని నా అంతట నేను పడలేదు. ఆ పొరబాటు నీ ముఖము మీద విసిరివేయుచున్నానని కొట్టవలెను. పాపమును గూర్చి నేనెరుగను, అది నీవు తెచ్చి పెట్టినదే అని దాని ముఖము మీద వేసి కొట్టవలెను. సైతాను మీద దేవునికి రిపోర్టు చెయ్యాలి. ఓ సైతానా! నీవు పడవేస్తే నేను పడ్డాను గాని నా అంతట నేను పడలేదు. గనుక ఆ పొరబాటు నీదే గాని అని సాతానుతో చెప్పవలెను. స్త్రీలు గోడకు పేడ కొట్టినట్లు, నీ పొరబాట్లు నీ మీదనే కొట్టివేయుచున్నాము అని సాతానుతో చెప్పవలెను. అప్పుడు ప్రభువు మన చెయ్యి పట్టుకొని ‘నీవు పరిశుద్ధుడవే ‘ అని అందురు. నేను పాపినని ఎవరును అనుకొనకూడదు. అది సైతానుకు లోకువ. అయితే ప్రభువు దగ్గరకు వెళ్ళి, సైతానుకు కనబడకుండా నేను పాపిని అని ప్రభువు యొద్ద అనిన యెడల ‘నీవు పాపివని నీకెవరు చెప్పినారు? అని ప్రభువు అడుగును. ఏదేను తోటలో ఆదాము – నేను దిగంబరిగా ఉన్నానని దేవునితో చెప్పెను. అందుకు దేవుడు -దిగంబరిగా ఉన్నావని నీకెవరు చెప్పిరి?, అని అడిగెను. గనుక ప్రభువు యొద్దకు వెళ్ళి నేను పాపిని, అని నీవు అన్నప్పుడు పాపివని నీకెవరు చెప్పినారు? అని ప్రభువు అడుగును.