1.క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనేవారు అబద్ధ ప్రవక్తలై యున్నారు. వారు ఒక రకపు అబద్ధ ప్రవక్తలై యుంటారు. అలాగు అనని వారిని చూచి కొందరు బోధకులు వీరే అబద్ధ ప్రవక్తలని చెప్పుచున్నారు. ఇట్లు ఇతరులను అబద్ధ బోధకులను వారే అబద్ధ ప్రవక్తలు. మార్కు సువార్త మరియు ప్రతి సువార్త చివరి అధ్యాయములో రాకడను గూర్చిన వాక్యములున్నవి.
చివరి రోజులలో అపహాసకులు వచ్చి సృష్ట్యాది మొదలు సృష్ట్యాంతము ఇట్లే యున్నది. గనుక ఆ దినము ఇప్పుడని ఎట్లనగలము? అని కొందరు అందురు. వీరొక రకపు అబద్ధ ప్రవక్తలు.
రాకడ సమీపముగా లేదని గురుతులు అయిపోయిన తరువాత కూడ ఎవరందురో వారే అబద్ధ ప్రవక్తలు.
ఎవరు రాకడను గూర్చి బోధించుచున్నారో వారిది తప్పు అని బోధించేవారు అబద్ధ ప్రవక్తలు. కృపను లోకువ కట్టుట అనగానేమి? నాకు సిద్ధపడుట చాల ఇష్టము. అయితే అనేక ఆటంకములున్నవి గనుక ప్రభువే నా ఆటంకములు తొలగించి నన్ను తీసికొని వెళ్ళునని కొందరందురు. దేవుడు తన కృప చొప్పున చేర్చుకొన్నను, న్యాయమునుబట్టి శిక్ష వచ్చును. రాకడకు ముందు మనిషి కృపా కాలములో ఉండును. ప్రభువు అనేకమైన గడువులు ఇచ్చును. ఈ గడువులు త్రోసివేసినట్లయితే న్యాయము దగ్గరకు వెళ్ళవలసి యుండును. న్యాయము ఖచ్చితముగా తన పని జరిగించుకొనెను. అయితే కృపలో మహిమ ఇవ్వబడినది. ఆ గడువును మనము వాడుకొనకపోతే, న్యాయము వచ్చి మహిమను తీసివేయును. ముద్రలు, బూరల శ్రమలు అయిన తరువాత కలిగే భయంకర పాత్రల శ్రమలకు ముందుగానే దేవుడు గొప్ప స్వరముతో “నా ప్రజలారా! నా తట్టు తిరగండి” అని హెచ్చరిక చేయగా అనేకమంది ఆయన తట్టు తిరుగుదురు. అయితే ఆయనను ఎరిగినవారే కృపను లోకువ కట్టుదురు. కృపను ద్వేషించువారు, మారుమనస్సులేనివారుకారు. తల్లి దండ్రులను లోకువ కట్టువారు తమ పిల్లలే, బయటివారు కాదు. ఇతరులైతే ఎదిరించెదరు. ఆలాగే దేవుని సంగతులు ఎరిగినవారే దేవునిని లోకువ కట్టుదురు. నోవాహు ఓడ మూయబడుట అనగా ‘కృప ఆగిపోవుటయే’. దావీదు కీర్తన 23వ అధ్యాయములో సేద దీర్చుట అని వ్రాయబడి యున్నది. అనగా ప్రతి దినము మనలో ఉండే బలహీనతలను ఒప్పుకుంటేదేవుడు క్షమించివేస్తాడు. ఇది నిజమే గాని ఇది విన్న విశ్వాసి దేవుని కృపను లోకువకట్టి, తన ఇష్టప్రకారము నడుచుకొన్న యెడల కృప యొక్క భాగ్యమును పోగొట్టుకొనును. న్యాయము తప్పక జరుగును. దేవుడెప్పుడును వాగ్ధానము తప్పడు. మనము తప్పినట్లయితే ఏమి జరుగును? ఉదాహరణకు, రోడ్డు కోరుకొండ వెళ్ళక తప్పదు. గాని మనిషి మార్గము తప్పితే లేక మనిషి సరిగా వెళ్ళలేకపోతే తన గమ్యము చేరుకోలేడు. అలాగే మనిషి సరిగా లేకపోతే తన పట్ల నెరవేరవలసిన వాగ్ధానము నెరవేరదు. తప్పిపోయిన కుమారుడు ఈ రెండింటి కొరకు వెళ్ళెను. అవి కృప + న్యాయము. ఇతడు తండ్రి దగ్గరకు దాసుడుగా వెళ్ళుటకు ఇష్టపడెను గాని, కుమారుడుగా వెళ్ళుటకు ఇష్టపడలేదు. దీనిలో అతడు న్యాయము కూడ కోరుకొన్నట్లు తెలియుచున్నది. కుమారత్వం మాని కూలివానిగా నుండుటకు కోరుకొనెను. ఆలాగే చాలమంది క్రైస్తవులు పెండ్లి కుమార్తె వరుస కోరుకొనక మోక్షములో ఏదో ఒక మూల కోరుకొంటున్నారు. తండ్రి కుమారునితో చూచినదేమంటే పంది పిల్లను చంకబెట్టుకొని వచ్చినాడా! అని చూడగా ఆ వెనుకటివి తన కుమారునిలో లేవు. అందుచేత తండ్రి కుమారుని కుమారుడుగానే చేర్చుకొన్నాడు. కుమారునికి లోతు భార్యవలె వెనుక చూపు లేదు. 1. తండ్రి దగ్గరకు వచ్చివేయుట, 2. పాత స్థితిని విడిచి పెట్టుట, ఈ రెండును తండ్రి కోరుకొనెను. వేరొక చోటకు పోకుండా తండ్రి దగ్గరకే వచ్చెను. అలాగే పెద్ద కొడుకు వరుసలోని వారు పాతవన్ని విడువవలెను. తండ్రి దగ్గరకు వెళ్ళవలయును, చిన్న కుమారుడు విడిచిపెట్టవలసినవన్ని, విడిచిపెట్టి రావలసిన స్థలమునకు వచ్చినాడు గనుక కుమారత్వం దొరికినది.
తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర క్షమాపణ కోరుకొన్నాడు. ఇతడు విడిచిపెట్టవలసినవి పూర్తిగా విడిచిపెట్టినాడు. పూర్తిగా రావడమనునది కుమారత్వమునకు సంబంధించినది. గనుక తండ్రి కుమారుడుగానే చేర్చుకొన్నాడు గాని దాసునిగా చేర్చుకొనలేదు. తయారైన తరువాత నేను అయోగ్యుడనంటే బాగున్నది గాని తయారు కాకముందే ఆలాగు అనుట బాగోలేదు.
తయారైన తరువాత అయోగ్యత ఒప్పుకొనుట మేలు. తయారుకానిదే అయోగ్యత ఒప్పుకొనుట మంచిదికాదు. ఓ తండ్రీ! నీవు లోకమునకు త్వరగా వస్తున్నావు. నేటి దినమందు ఆత్మ వర్షము అనుగ్రహించినావు. గనుక నీకు చాల వందనములు. ఈ దినము మేము విశ్లేషముగా తర్కించుకొనుచు, బోధించుకొనుచు ఉన్న విషయములు నీ సన్నిధిని పెట్టుచున్నాము. మా ప్రభుయేసు రాకకు మమ్మును సిద్ధపర్చుము. ఈ దినము సందర్ధము వచ్చునట్లు చేసినందుకు వందనములు. ఆమెన్.