క్రొత్త నిబంధనలో 370 సార్లు రెండవ రాకడను గూర్చి ఉన్నది. సంవత్సరమునకు 365 రోజులు. రోజుకునకు ఒక పాఠము చొప్పున చదివితే 12 నెలల 5 దినములలో మొత్తము రాకడ పాఠములను ముగించగలము. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంధము చివరివరకు చదువుచూ రాకడ వాక్యములు గుర్తించి, ధ్యానించగా రాకడ కాంతి జ్యోతివలె మీ హృదయము నిండి ప్రకాశించును. ఇట్లు 370 జ్యోతుల దీపావళిగా నుండును. ప్రభువు లూకా 21:34వ వచనములో మూడు మందలింపులను గూర్చి, రెండు వృత్తులను గూర్చి చెప్పెను. (1) తిండి, (2) మత్తు, (3) ఐహిక విచారములు, ఈ మూడున్నూ మందలింపులు, కొందరు తిండిమీద, త్రాగుమీద పడి పరలోక వినయములలో అశ్రద్ధగా ఉంటారు. అసలు మత్తు ఎందుకు వచ్చును? (1) తిండివల్ల మత్తు, (2) త్రాగుడు వల్ల మత్తు, (3) విస్తార పనినిబట్టి అలసటవలన మత్తు, (4) ప్రభువు వస్తాడని 40 లేక 50 సంవత్సరముల నుండి విశ్వాసులు చెప్పుచున్నారు గాని ఇప్పటికింకా రాలేదు గాన ఇప్పుడే రాడు అని అశ్రద్ధగా నుండే మత్తు. ఏ విధమైన మత్తయినా రాకడకు సిద్ధపడుటకు ఆటంకమే గనుక మత్తును రద్దుచేసికొనవలెను. ఉదా: అశ్రద్ధ మత్తు. అది, పది మంది కన్యకలలోని 5గురు బుద్ధిలేని కన్యకల స్థితికి సంబంధించిన మత్తు వంటిది. భోజనము చేయునపుడు మత్తును గూర్చి జ్ఞాపకముంచుకొనుట మంచిది. అజీర్తి రాకుండా డాక్టరుకూడా చెప్పుతారు కొంచెం తగ్గించి తినమని, అలాగుచేస్తే సాధారణముగా జబ్బులు రావు. అంటే ఆకలితో ఉండమని కాదు. డాక్టరు చెప్పేమాట ప్రభువు చెప్పిన దానికి సరిగా ఉన్నది. ఏ విధమైన తిండైనా, మత్తైనా రాకడకు ఆటంకమే. తిండి = అన్నము, నీళ్ళు పండ్లు మొదలైన తినుబండారములన్నీ, ఇది ప్రభువు ఎవరికి చెప్పెను? తన శిష్యులకే. లోకమునకు కాదు. ఇప్పుడు మనకే చెప్పుచున్నారు.
రాకడకు సిద్ధపడేవారికే ముఖ్యముగా ఐహిక విచారముల వలన చింత (1) చింత అనునది ముందుగా ఎక్కడ ఆరంభమగును? కుటుంబములోనే. ఈ లోక సంబంధమైన చింత, గృహములోనే ముందుగా ప్రవేశించును. భార్య, భర్తలలో వారి వారి జీవితముల ననుసరించి, ఇంకను అనేకమైన ఆయా విషయముల గురించి మనస్పర్ధలు వచ్చును. ఈ చింత ఇద్దరిలో ఎవరికి రాకూడదు. ఇది భూలోక చింత (2) భూలోక చింతలో పరలోక చింత. నా భార్యకు ఎప్పుడు మారుమనస్సు కలుగునా అని భర్తకు చింత; నా భర్తకు ఎప్పుడు మారుమనస్సు కలుగునా అని భార్యకు చింత. ఆ చింత అయిననూ రాకడకు సిద్ధపడుటకు ఆటంకమే. ఉదా:- పరిశుద్ధమైన మేఘ జలము ఈ భూమి మీద పడగానే మురికి, బురద, అయిపోయినట్లు, చింతలో పరిశుద్ధాత్మ తలంపు కళంకమైపోవును. చింతలోనికి పోవును. భర్త సిద్ధపడక పోయిన చింతను బట్టి, ఈమెయు సిద్ధపడక పోవును. గాన ఏ విధమైన చింతయైనను సరే, రాకడకు సిద్ధపడుటకు ఆటంకమే. (3) కుటుంబములో పిల్లలు మాట వినక పోవుటవల్ల చింత. అదియు ఉండకూడదు. వారికి చెప్ప వలెను గాని చింతించిన నీవును సిద్ధ పడకుండా చెడిపోవుదువు. యుక్తకాలమున ప్రభువు వారిని మార్చును. నీవు చేయవలసినవన్నీ నీవు చేసి ప్రభువునకు అప్పగించుట మంచిది. చింతించి, మీ ఎత్తు మూరె డెక్కువ చేసికొనలేరని ప్రభువు చెప్పెను. ఇప్పుడు కాకపోయిన తరువాత అయినా అనగా నీ వంతు అయిన పిదప ప్రభువు మార్చుకొనును.
చింతలు:- (1) లోకసంబంధమైన చింత, (2) భార్య భర్తలలో చింత, (3) బిడ్డలను గూర్చిన చింత, (4) సంఘములను గూర్చిన చింత, ఇంటిలో ఒకవేళ చింత లేక పోయినను, సంఘమును గూర్చిన చింతైనను ఉండును. “మీ చింత యావత్తు ప్రభువు మీద వేయుడి” (1పేతురు 5:7).
(1) మనవారిని గూర్చి ఉత్తరములు వ్రాయుట, ప్రార్ధించుట మానవద్దు. (ఎ) వినువారు స్థిరులు, వీరు ముప్పదంతల పంట. (బి) వ్రాయువారు మరింత స్థిరులు. వీరు అరువదంతల పంట. (సి) విని వ్రాసికొని చెప్పువారు మరింత గొప స్థిరులు. వీరు నూరంతల పంట. విశ్వాసముతో కూడిన క్రియ, క్రియతో కూడిన విశ్వాసము.
ఉదా:- ఒకనికి బట్టలు లేకపోవుట చూచి అయ్యో! బట్టలు లేవా! అనెను. గాని బట్టలు ఇవ్వలేదు. మరియొకడు బట్టలు లేకపోవుట చూచి అయ్యో! అని జాలిపడి బట్టలు ఇచ్చెను. మనకు టైము (సమయము) కావలెనా? మనకు కావలసినదే టైము. టైము కొరకు కనిపెట్టుచున్నాము, కన్యకలు టైము కొరకు కనిపెట్టనందున పెండ్లి కుమారుని ఎదుర్కొనలేక పోయిరి. ఆ దినమైనను, ఆ ఘడియైనను తెలియదని ప్రభువు చెప్పెను. పెండ్లి కుమార్తె, ఆ దినమేదో, ఆ ఘడియయేదో అని కనిపెట్టుచునే ఉండును. ఆ దినము కాదు, ఆ ఘడియ కాదు, రెప్పపాటు కాలము పరలోక గంట కొట్టగానే సంఘమునకు అది తెలియును. పాపములంటే తెలియును గాని ఈ మూడు తెలియవు. అనగా తిండి, మత్తు, చింత తెలియవు. ఈ మూడు అజాగ్రత్తలు అనగా పాపము చేయుట కాదు. అజాగ్రత్తగా యుండుట, లూకా, 21:34, సలహాలు రెండు. మందలింపులు మూడు. సలహాలు: లూకా:34-36 (1) ఎల్లప్పుడు ప్రార్ధన చేయుట, లూకా 18:1; (2) మెళకువగా నుండుట అనగా రాత్రులు నిద్రపోకుండా ఉండుట కాదు గాని ఆత్మలో ఉషారుగా ఉండుట.
ఉదా:- లూథర్ గారు రాత్రి పండుకొనునప్పుడు చేయు ప్రార్ధనలో చివరి మాట: నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. ఆ ప్రార్ధన అదివరకు ప్రభువు చేసిన ప్రార్ధనే. అదే లూథర్ కూడ వాడుకొనెను. ‘తండ్రీ! నా ఆత్మను నీ చేతులకు అప్పగించు చున్నాను ‘ అని నిద్రపోతే మెళకువగా నున్నట్లే, చాలా మంది భక్తులు నిద్రలో చనిపోతున్నారు. కొందరు, వారుసిగ్గుపడకుండ చనిపోయిరి అని అందురు. గాని వారు సిద్ధపడినారు. అదేమంటే వారుచేసిన ప్రార్ధనయే సిద్ధపడుటయై యున్నది. ఈ ప్రార్ధన రాకడ దూరముగా నున్న కాలములో సంఘము చేసిన ప్రార్ధన. రాకడ దగ్గరగానున్న కాలములోని పెండ్లి కుమార్తె ఒక ప్రార్ధన అందుకొనవలెను. అదేమంటే ప్రకటన 22:20లో ఆయన నేర్పిన ప్రార్ధనయే. ప్రభువైన యేసూ రమ్మూ! (1) తండ్రీ! నా ఆత్మను నీ చేతుల కప్పగించుచున్నాను. (2) ప్రభువైన యేసూ, రమ్ము అను ఈ రెండు ప్రార్ధనలు, ప్రార్ధన ముగింపులో చెప్పి, నిద్రపోయినను మెళుకువుగా నున్నట్లే ఇవి శ్రేష్టమైన ప్రార్ధనలు. ఇట్టివి మనము అల్లలేము గాని ఇదివరకు అల్లేయున్న ప్రార్ధనలను మనము వాడుకొందము.