బైబిలులో ఒకరు ఉన్నారు. ఆయనలో ఒక ఓడ ఉన్నది. ఆ ఓడలో ఒకాయన ఉన్నారు. బైబిలులో నున్న ఆయన సర్వశక్తిగల అధిపతియగు యెహోవా. ఆయనలో నున్నది ఒక ఓడ. ఈ ఓడలో సృష్టి అంతటి రక్షణ కొరకు ఒకాయన ఉన్నారు. ఆయన ఎవరు? ఆయనే దేవుని వాగ్దానము లందుకొనిన వ్యక్తియైన నోవాహు.
బైబిలు మిషనులో నొకరు ఉన్నారు. ఆయన దేవదాసు అయ్యగారు. ఓడలో ఉన్న ఆయనకు భయములేదు. ఓడ బయట ఉన్న వారికి భయమున్నది. ఎందుకు? వీరు ఓడలోనికి రాలేదు. వీరిలో ఓడ లేదు. ఓడలో లేనివారికి భయమున్నది. బాధ ఉన్నది. ఎందుకనగా వారికి ఓడలేదు, వారిలో ఓడ లేదు. ఓడలో వారు లేనందున, ఓడ వారిలో లేనందువలన విడిపోయారు, పడిపోయినారు. చనిపోయినారు. ఓడలో ఒకాయన ఉన్నారు. ఆయన ఏమయ్యారు? ఆయన విడిపోలేదు, పడిపోలేదు, చనిపోలేదు.
అయితే ఈ కథలో ఉన్నవి ఎన్ని గుంపులు? రెండు గుంపులు కదా! అవి 1) బ్రతికిన గుంపు 2)చనిపోయిన గుంపు. చదువుచున్న వారలారా! మీరే గుంపులో ఉన్నారు? చనిపోయే గుంపులో ఉన్నారా? సేవకులరా! ఏ గుంపులోనో చెప్పండి. బైబిలు మిషను అనే ఓడలో నున్నారా? అనగా ఓడలో ఉన్నను ఆయన ఇష్టములో ఉన్నారా? ఆయన ఇష్టము నెరవేర్చు వారిలో ఉన్నారా? ఆయన ఇష్టములో మీరు లేని ఎడల చచ్చిన వారేగాని బ్రతికిన వారు కారు. ఆ ఓడ బైబిలు మిషనే. ఆ ఓడలో నున్నది అయ్యగారే. వారు చెప్పిన మాటే ఇది. ఓడ బయట నున్నవారు విడిపోయినవారు. చనిపోయినవారు. బైబిలు మిషను యొక్క పద్ధతులలో నుండి పడిపోయిన వారు, చనిపోయిన వారితో సమానమే. అలాంటి వారు లోపలనున్ననూ, బ్రతికి ఉన్ననూ చచ్చినవారే. ఏలయనగా వారు తమ ఇష్టమును నెరవేర్చు కొనువారు గనుక వారు చచ్చినవారే.
అయితే మీరు విడిపోయినవారితో నుందురా? లేక పడిపోయిన వారితో ఉందురా? లేక చనిపోయినవారితో నుందురా? చెప్పండి.
1) రేపు చెప్పెదను అనవద్దు,
2) తరువాత చెప్పెదను అనవద్దు,
3) ఎప్పుడో చెప్పెదనులే అని అనవద్దు.
ఈ మూడు మాటలకు సంబంధము లేదు. గనుక సంబంధమున్న మాట మీరు చెప్పండి, ఏది ఐఖ్యతను చూపించుచున్నది? పై మూడు మాటలలో ఐఖ్యత, ఏకత్వము లేదు. “ఇప్పుడే” అనే మాటలో ఐఖ్యత ఉన్నది. గనుక ఇప్పుడే చెప్పండి మీరు ఎక్కడ ఉంటారో? సేవకులారా! ఇప్పుడే చెప్పండి. చెప్పినప్పుడే ఓడలో నున్నవారగుదురు.
ఓడలో ఎన్ని ఉన్నవి? 1. శరీరులు 2, జీవరాసులు (పక్షులు) 3. జంతువులు 4, పురుగులు. ఈ నాలుగు గుంపులు ఓడలో నున్నవి. నాలుగు రకాలైనవి ఒకే ఓడలో నున్నవి. భేదము లేకుండా నున్నవి. భేదము ఉన్న యెడల అవి కలసి ఉండవు. భేదము ఉంటే శరీరులు జంతువులను తోలివేయుదురు. జంతువులు, ప పక్షులను త్రొక్కివేయును. పక్షులు, పురుగులను తినివేయును. ఇట్టి భేదము ఓడలో లేదు.
అలాగే మీరు ఓడలోనుంటే ఇది కల్గియుందురు. ఓడలో లేని వారితో మీరుండవద్దు; విడిపోయిన వారితో ఉండవద్దు; పడిపోయిన వారితో నుండవద్దు; అనగా మిమ్మును లెక్కచేయని వారితో ఉండవద్దు; వారు ఓడను లెక్కచేయలేదు గనుక లోనికి రాలేదు. అందువలన చనిపోయినారు. ఓడ ఎక్కి ఉంటే బ్రతికేయుందురు గదా!
అలాగే బైబిలు మిషను అను ఓడ ఎక్కినవారు బ్రతుకుదురు. అనగా రేపు రాకడ తర్వాత వచ్చు ఏడేండ్ల శ్రమ అనే తుఫాను నుండి బ్రతుకుదురు. ఇదే బైబిలు మిషనుయొక్క ఉన్నతమైన స్థితి; పెండ్లి కుమార్తె స్థితి; పడిపోకుండా ఉండే స్థితి; పద్ధతి కల్గిన స్థితి; చనిపోకుండ బ్రతికి యుండే స్థితి. ఇట్టి స్థితి చదువు వారెల్లరికి కలుగును గాక, ఆమెన్.