క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. రాకడ పండుగ...
  5. రెండవ రాకడ

రెండవ రాకడ

“గగనము చీల్చుకొని నీవు వచ్చెదవు గాక.” యెషయా 64:1.

ఈ వాక్యములో యెషయా ప్రవక్త ప్రభువును ‘గగనము చీల్చుకొని రమ్ము” అని పిలుచుచున్నాడు. ఇది ప్రవచన వాక్యమైయున్నది.

యేసు ప్రభువు బాప్తిస్మ సమయమున గగనము చీల్చబడెను. (మార్కు 1:10). స్తెపను చనిపోయినప్పుడు ఆకాశము తెరువబడెను. ( అపొ.కా. 7:56). పేతురు పరవశుడైనప్పుడు ఆకాశము తెరువబడెను. (అపొ.కా. 10:11). యోహాను దర్శనములో తలుపు తెరువబడెను. (ప్రకటన 4:1). ఇప్పుడు మన కాలములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్న ఆఖరి వర్తమానము ప్రకటన 1:7 ; 22:12. 20లలో ముమ్మారు వ్రాయబడుటచే త్వరలో తప్పక జరుగునని అర్ధమగుచున్నది. నేను మీ కొరకే తిరిగి వత్తుననుమాట సత్య సంపూర్ణమును, అమూల్యమైయున్న యేసు యొక్క అంతిమ మాటలలోని యొకటి యోహాను 14:3నందున్నది. ఈ దివ్య వర్తమానమును మన మనస్సునందుంచుకొని అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యులవలె కనిపెట్టుకొని ఉందము. (మత్తయి 12:36). పాత నిబంధనలో సంఘము ‘త్వరపడి రమ్ము ‘ అని ప్రార్ధించుచున్నది. (పర. గీ. 8:14; ప్రకటన 22:20) ఈ మొదటి రాకడ ప్రార్ధనయు, రెండవ రాకడ ప్రార్ధనయు గొప్ప పొందిక గలవై యున్నవి. ఇదియే చివరి ప్రార్ధన. ఇక ప్రార్ధనలు లేవు. ఇంతకన్న మించిన ప్రార్ధన లేదు. సంఘ ప్రార్ధనయే దేవుని సమస్త దానములను, దీవెనలను తుదకు దేవునిని సంపూర్ణముగా అనుభవించుటకు సాధనయై యున్నది. ఇదియే పౌలు భక్తుడు వ్రాయుచున్న ప్రార్ధన: మరనాత అనగా ‘ప్రభువైన యేసూ రమ్ము ‘ అని అర్ధము. (1కొరింథీ 16:22) ఆది సంఘములు ఒకరి నొకరు కలుసుకొనినప్పుడు, ఉద్రేకముతో మెస్సీయా వస్తారని ‘మరనాత ‘ చెప్పుకొనుచూ బహుగా సంతోషించిరి. అపోస్తలులు గురుతులను చూచి ప్రభువు వస్తారని ‘మరనాత ‘ చెప్పుకొనుచు బహుగా సంతోషించిరి. ఆనాటి వారే ఆయన రాకకై సంతోష పడిన యెడల రాకడ సమీపములో నున్న మనము, ఆయన ద్వారము యొద్దనే యుండగా, మనమెంతగా రాకడ తలంపు కలిగియుండవలెను? మన కొరకు ప్రాణము బెట్టిన మన ప్రియ ప్రభువు వచ్చుచుండగా ‘ప్రభువైన యేసూ రమ్ము ‘ అని మనమెంతగా ఆయనను ఆహ్వానించవలెను? మరనాత అని అందరు చెప్పవలెను. మరనాత అనగా ఆదిమ భాషలో ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు ప్రవచనము. ప్రభువు వచ్చియున్నాడనేది నెరవేర్పు, ప్రభువైన యేసూ రమ్ము అనే ప్రార్ధన ఈ మరనాతలో గలవు. విశ్వాసి మరియొక విశ్వాసిని కలుసుకొనునపుడు సంతోషముతో, ప్రభువు వచ్చుచున్నారని ఒండొరులు (ఒకరితో ఒకరు) వందనముగా మరనాత యని చెప్పుకొనుట మహా ధన్యత. మరనాత యను ఈ శుద్ధ వాక్యమును విశ్వాసులు తమ హృదయములో భద్రపర్చుకొని, ఆయన రాకడను స్మరించుకొనుట ఎంత ధన్యత. మనము క్రీస్తు రక్తములో ప్రతి నిమిషము కడుగబడుచు కళంకము లేని వారమై పావురము వలె నిష్కపటులుగా ఆయనను ఎదుర్కొందము. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పర.గీ. 6:29 పావురము అనగా బాప్తిస్మ సమయమున ప్రభువు పై వ్రాలిన పావురముగా సిద్ధపర్చెను. పరిశుద్ధాత్మ పావుర స్వరమెరిగిన ఈ సంఘ వధువనబడు పావురము తన స్వరము వినిపింపజేయుచున్నది. ఆయా విధములైన అక్కరల కొరకు ప్రార్ధింపక, ప్రియుని మాత్రమే కోరి, అనగా ప్రభువా! నీవు వచ్చి నన్ను నీ వద్దనుండుటకు తీసికొని వెళ్ళుమని పలుకు స్వరము పావుర స్వరమే. మరనాత (1కొరింథీ 16:22) అనగా నరరూపిగా లోకమునకు వచ్చిన ప్రియుని స్తుతించుట. రెండవ మారు వచ్చుచున్న ప్రియుని ప్రకటించుచున్నది. ప్రభువైన యేసూ రమ్మని ప్రార్ధించుచున్నది. పరిశుద్ధాత్మ పావురమేమి పలుకునో, సంఘ వధువనబడు పావురమును అదే పలుకు పలుకును. (ప్రకటన22:17)

ప్రియులారా, మనము ఎల్లప్పుడు రాకడ తలంపు కలిగి ప్రభువును మరనాత అని పిలుచు అనుభవము కలిగి యుందము గాక! మరనాత.

Please follow and like us:

How can we help?

Leave a Reply