దేవదాసు అయ్యగారు ముద్రించిన పత్రిక



“అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” యోహాను 8:32.
  • 1. దేశీయులారా! ప్రియులారా! దేశాభిమానులారా! మీకు శుభము కలుగును గాక! స్వాతంత్ర శుభము కలుగును గాక!

    మన సృష్టికర్తయు, తండ్రియు, రక్షకుడునైన దేవుడు స్వతంత్రుడు: అనగా తనకు తానే యెవరి సలహా పుచ్చుకొననవసరము లేకుండ సర్వకార్యములు చక్కబెట్టుకొను స్వతంత్రుడు. ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి ఈ మొదలైన పావన లక్షణములలో ఒక లక్షణము స్వతంత్రత. ఇది ఆయన నరులందరికిని జన్మమునందే అనుగ్రహించినాడు. తక్కిన లక్షములతో సమానముగ యిది కూడ మనకు దయచేసిన తండ్రిని యిప్పుడే స్తుతించండి.

    దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన లక్షణములన్నియు పరిశుద్ధ లక్షణములే.

  • 2. మనము స్వతంత్రులమే. అయినను మన స్వతంత్రత దేవునిపై ఆధారపడ వలసియున్నది. గనుక మనము పరతంత్రులమై కూడ వర్ధిల్లుచున్నాము. పరతంత్రులము కాని యెడల మన స్వతంత్రత దుస్థితిలోనికి వెళ్ళును. బిడ్డ తల్లి చేయి పట్టుకొనకుండ ముందునకు గబగబ నడిచి వెళ్ళిన యెడల కొంత దూరము వెళ్ళి పడిపోవును. ఎందుచేత? తల్లి మీద ఆధారపడనందున. అలాగే మనము దేవుని మీద ఆధారపడకుండ జీవనయాత్ర సాగించుకొన యత్నించిన యెడల ఎప్పుడో ఒకప్పుడు పాపములో పడిపోదుము.

    మనము స్వతంత్రులము. పరతంత్రులము గనుక మహా ధన్యులము.

  • 3. మనలో సద్భుద్ధి దుర్బుద్ధి రెండును ఉన్నవి. వీటిని సరియైన మార్గమున నడిపించుటకు స్వతంత్రత ఒక గొప్ప సాధనమైయున్నది. దుర్బుద్ధి పుట్టినప్పుడు దానిని అణచివేయుటకు సద్బుద్ధియును, స్వతంత్రతయును పనిచేయును. దుర్బుద్ధి తన యెదుటనున్న పాపాకర్హణ వలన యెక్కువైన యెడల పై రెండును ఆగిపోవును. అప్పుడు నరుడు తన దుర్బుద్ధిని బట్టి దుష్కార్యము చేయును. అందు వలన అతనికి హాని, శిక్ష సంభవించును. సద్బుద్ధి పుటినప్పుడు స్వతంత్రత సహాయము చేయును. దుర్బుద్ధి లేచుచునే యుండును. కాని ఆ రెంటి బలము యెక్కువగుట వలన దుర్బుద్ధి ఆగిపోవును. సద్బుద్ధి సత్కార్యములు చేయును.

    అందువలన నరునికి మేలు, మెప్పు, సద్బుద్ధి, స్వతంత్రత దేవుని యొద్ద నుండి వచ్చినవి. ఆయనలో దుర్బుద్ధి లేదు. గనుక అదివేరొకచోట నుండి వచ్చినది. దైవప్రార్ధన వలన సద్బుద్ధికిని, స్వతంత్రతకును బలము కలుగగా దుర్బుద్ధి అంతరించును.

  • 4. సద్బుద్ధిని బట్టి నడుచు జ్ఞాని స్వతంత్రుడు. దుర్బుద్దిని బట్టి నడుచువాడు దుర్బుద్ధికి బానిసవాడు. స్వతంత్రుడు రాజు. చదువరీ! నీ వెవరవు? దుర్బుద్ధి ఎక్కడనుండి వచ్చినదని ప్రశ్నింపవద్దు, అది మర్మము, దానిని తొలగించుకొనుట మన పని కాని ప్రశ్నించుట మన పని కాదు. అది ఉన్నది అని మనకు తెలుసు. అంతే చాలును. యెక్కువ అదే విధముగా ఆలోచించిన యెడల మన మనస్సునకు నీరసము కలుగును.

  • 5. పరిశుద్ధ దేవదూతల లోకములోని యొక ప్రధాన దూతతో దుర్బుద్ధి కలిగిననందున అతడును, అతని అనుచరులును క్రిందికి వచ్చివేయవలసి వచ్చెను. అతనికి సైతాను అను పేరు కలిగినది (యెషయా 4అధ్యాయము). అతనిలోని స్వాతంత్ర లక్షణమును వాడుకొన నందున దుర్బుద్ధి ఏర్పడినది. అంత పరిశుద్ధ స్థితియందు దుర్బుద్ధి యెట్లు యేర్పడినదని ప్రశ్నింతుము. ఇది మర్మము. తెల్లని సున్నము, పసుపు కలిపిన యెడలఎరుపురంగుయెట్లుయేర్పడినదో చెప్పలేము. అసలులో రెండు ఉండగా మూడవది ఎక్కడ నుండి వచ్చినది? అలాగే పరిశుద్ధదూతలోనికి అపరిశుద్ధ గుణము వచ్చినది. అతడును, అతని అనుచరులును తమ దుర్గుణమును ఒప్పుకొని ప్రార్ధించిన యెడల దేవుడు క్షమించియుండును. అట్లు చేయవలెనను బుద్ధి వారికి కలుగనేలేదు. నేటి వరకు అదే వారి స్థితి. చూచితిరా! స్వాతంత్రము వాడనందు వలన కలుగు క్షోభ యెంత గొప్పదో! మనము మన స్వాతంత్రమును సరిగా సద్విషయములయందు వాడుకొందుము గాక! తెలియని విషయములు ఉన్న యెడల అవి దేవుడే చూచుకొనునని మనము ఊరకుండుట క్షేమము.

  • 6. దేవుడు మొదట దేవదూతలను కలుగజేసెను. (యోబు 38:7). తరువాత ఆకాశమును, భూమిని కలుగజేసెను. తుదకు ఆదాము, హవ్వ అను ఆదిదంపతులను అనగా నరవంశమంతటికి తల్లిదండ్రులైన వారిని కలుగజేసెను. అప్పుడు సమస్తమునకును, వారికిని మహా పరిశుద్ధత కలిగియుండెను. కాని పడిపోయిన సాతాను సర్పరూపము ధరించి, వారిని తన మాటల వలన పాపములో పడవేసెను. ఏలాగనగా తినవద్దని దేవుడు చెప్పిన పండ్లు తినవచ్చునని బోధించెను. వారు తిన్నందు వలన దైవాజ్ఞను మీరిరి.

    తత్పూర్వము దేవుడు వారితో, ఈ చెట్ల పండ్లన్నియు నిరభ్యంతరముగా తినవచ్చుననియు, ఒక చెట్టు పండ్లు తినకూడదనియు, తిన్న యెడల మరణమనియు స్పష్టముగ చెప్పినను వారు సాతాను మాట విన్నారు. తమలోని స్వాతంత్రమును వాడలేదు. మా తండ్రి తినవద్దన్నాడు. మేము తినము అని అన్నయెడల తమ స్వాతంత్రము వాడుకొన్నట్టే. “నిరభ్యంతరముగా” అను మాట గుర్తించండి అనగా నాలుగు పండ్లు తిన్న యెడల ఎందుకు తక్కువ తిన్నారని దేవుడు అనడు. ఎనిమిది పండ్లు తిన్న యెడల ఎందుకు ఎక్కువ తిన్నారు అని ఆయన అడుగడు. తినవలసిన వాటిని వారి యిష్టమునకు అప్పగించినాడు. వారు తినుచుండగా ఎందుకు తినుచున్నారని ఆటంక పెట్టిన యెడల ఆయన వారికి స్వాతంత్రమును యిచ్చిన ప్రయోజనమేమి? వారు దేవదూత వలె కాక క్షమాపణ కోరు స్థితిలో ఉన్నందున వారికి క్షమాపణ కలిగినది. వారిని ఆ తోటలో ఉంచిన యెడల మరల ఆ పండ్లు తిందురని దేవుడు వారిని వెలుపలికి తీసికొని వచ్చెను. ఇది ఆయన దయ.

  • 7. వారి పాపేచ్చ నరవంశమంతటిలోనికి ప్రవేశించి మనవరకు వచ్చియున్నది. వారైతే ఒక్క పాపమే చేసిరి గాని నరులు అనేక పాపములు చేయుచున్నారు. వారి పాపము వృద్ధిలోనికి వచ్చినది. పాపమెప్పుడును ఒంటరిగా నుండదు. తప్పు చేసిన వానిని అడిగిన యెడల చేయలేదని అబద్ధమాడును. అప్పుడు పాపములు రెండైనవి గదా! దేవుడిచ్చిన స్వతంత్రత వలన వచ్చిన పాపమును అణచివేయవలెను. అందుకు దేవుడు శక్తిననుగ్రహించును.

  • 8. 1947 ఆగష్టు 15 వ తేదీన మన ఇండియాకు స్వతంత్రత వచ్చినది. దేవునికి స్తోత్రము. మనము మత విషయములోను, కులనిష్ట విషయములోను, ఆచార విషయములోను, పరిపాలన విషయములోను, అన్ని విధములైన దిద్దుబాటుల విషయములోను స్వాతంత్రమును వాడుకొనుటలోను రణవాదములు పెట్టుకొన్న యెడల ద్వేషము, దూషణ, పోట్లాడుట సంభవించును గనుక అట్టి వాటిని మానుకొనుటలో మన స్వాతంత్రత శక్తిని ఉపయోగింపవలెను. ఎట్టి కలహములు లేకుండ చూచుట ప్రభుత్వము వారి పనియే కాని వారికి తోడ్పడుట మన పని. ఏది చెడుగో, యేది మంచిదో తెలియని వారు ఉండరు గనుక అందరును చెడుగును యెదిరించుటకు స్వతంత్రులై యున్నారు. యెదిరింపవలెననిన యెదిరింపగలరు. చెడుగు మానవలెననిన మానగలరు. ఒకవేళ చేసిన దిద్దుకొనగలరు. దేశీయ ప్రభుత్వము వారు మనకు మత స్వాతంత్రతమును కూడ ఇచ్చిరి. ఇది గొప్ప సంగతి. కనుక యెవరి మతమును వారు స్వేచ్చగా ప్రకటించుకొనుటకు స్వతంత్రులు. మతమనునది దైవారాధనకు సంబంధించినది. కనుక యే మతమును దూషింపరాదు. కాని యెవరికి తోచిన సలహాలు వారు ఇయ్యవచ్చును. దేవుడన్నియు ఇచ్చి స్వతంత్రత ఇయ్యని యెడల వాటిని వాడ వీలులేదు. స్వతంత్రత ఇచ్చుటలో దేవుని గొప్పతనము అగుపడుచున్నది.

సద్విషయములు అంగీకరించుటలోను, దుర్విషయములు విసర్జించుటలోను మన స్వాతంత్ర శక్తిని ఉపయోగింపగల కృప దేవుడు మనకందరకు అనుగ్రహించును గాక! ఆమెన్.


Extra References



పత్రికలు: రక్షణ వార్తావళి