దేవదాసు అయ్యగారు ముద్రించిన పత్రిక
ప్రసంగ పాఠము : యోహాను 8:31,32
మనదేశమునకు స్వతంత్రము వచ్చి 10 సంవత్సరములకు(ఈ పత్రిక అచ్చువేయించినప్పటికి) పైగా అయినది గాని యింకా సంపూర్ణ స్వతంత్రత కలిగినట్లు కనిపించదు. గనుక స్వతంత్రత అనగానేమి తెలుసుకొందాము. ఒకరు మనసులో పదిపనులు చేయవలెనని యున్నదిగాని ఎన్ని ప్రయత్నములు చేసినా అన్నియు జరుగుటలేదు. కొన్ని మాత్రమే జరుగుచున్నవి. అన్నీ జరిగిన యెడల అన్నీ చేయుటకు నాకు స్వతంత్రత ఉన్నది అనవచ్చు. గాని కొన్ని మాత్రమే జరుగుచున్నందున స్వతంత్రత లేదు.
స్త్రీలకు, పిల్లలకు, ఉద్యోగస్థులకు స్వతంత్రత కావలెను. బైబిలులో ప్రభువు మొదటి రాకకుముందు స్త్రీలకు స్వతంత్రతలేదు. ప్రపంచము పుట్టిన తరువాత 1900 ఏండ్లకు అబ్రహాము, శారాలు వచ్చిరి. పరలోక దేవదూతలు వీరియొద్ద భోజనము చేసిరి. శారా వడ్డించును గాని బైటకు రాలేదు. శారా యివన్నియు చేసి డేరా చాటున దాగినది. అనగా ఘోషా, వారి సంతతిలోనే హాగరు ఉన్నది. ఈమె కొడుకు ఇష్మాయేలు. అతని సంతానమే మహమ్మదీయులు. వీరు ఇప్పటికీ ఘోషా ముసుగుతోనే బైటకు వస్తారు,
కలకత్తాలో కండ్లకు గంతలు కట్టుకొని ఇద్దరు స్త్రీలు పాటలు పాడుచు వచ్చుచుండిరి. గంతతీసినా, మగవారు కనిపించి వారిని చూచెదరని అని అలా కట్టుకున్నారు. అంత ఘోషా ఉన్నది వారికి, రంగూనుకు దేవదాసు అయ్యగారు వెళ్ళినపుడు ఒక స్త్రీ కుంటుచూ వెళ్ళుచున్నది. ఆమె చైనా దేశపు స్త్రీ అని చెప్పిరి. వారి దేశములో ఆడ పిల్లలు పుట్టగానే వారి కాలికి ఇనుపజోడువేసి పెద్దవారైపోకుండ, వారు పెద్దవారైన పిదప పారిపోకుండ బిగించి వేయుదురు. పరాయివారు గాని, ఆదేశపువారు గాని శోధించిన యెడల వారు వెళ్ళిపోకుండ ఆలాగుచేయుదురు. చైనా దేశమున క్రైస్తవ మతము వచ్చిన పిదప అట్టి ఆచారములు కొంతవరకు మారిపోయినవి.
ప్రభువు ఒకప్పుడు నేనే సత్యమునై ఉన్నానని, ఇంకొకసారి సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అనియు చెప్పిరి. ఇప్పుడు మనదేశములో, ఇతర దేశములలో కొంతవరకు పండితులు లేచి ప్రభువు పుట్టలేదనియు, ఆయన పెరుగుట, సిలువ వేయబడుట, చనిపోయి సమాధి చేయబడుట, తిరిగిలేచుట, పైకి వెళ్ళిపోవుట, తిరిగి వచ్చుట, అంతయు అసత్యము అని అనుచున్నారు. మనదేశములోనే ఈ ప్రచారము ముమ్మరముగా జరుగుచున్నది. 50 సంవత్సరముల క్రితమే ఇవన్నియు వట్టివని ఆర్యసమాజ నాయకులు బోధించిరి. వారు భలే కోపముతో చెప్పినారు. అప్పుడు వారికి సంబంధించిన వారందరు చాలా సంతోషించిరి. అంతా అసత్యమే అనగా యేసుక్రీస్తు కల్పనాపురుషుడే గాని చరిత్రపురుషుడు కాడనుచున్నారు. చివరకు 'స్వతంత్రత' అనునది మతము వచ్చిన పిదప ఉన్నదిగాని ఇదివరకు లేదు. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అని క్రీస్తు చెప్పినది నిజమైనప్పుడు, క్రీస్తు రావడము నిజము కాదా? నిజమే కనుక క్రీస్తువలననే స్వతంత్రత రావలెను. మనదేశములో 'స్వతంత్రత' గురించి చాటించిరి. అది వచ్చినది గాని ఈ దండకము మానలేదు అనగా క్రీస్తుమతము, బైబిలు మాకు వద్దనుట మానలేదు.
బైబిలు, క్రీస్తుమతము మాకు వద్దన్నయెడల 'స్వతంత్రత' పోయి ఘోషావచ్చును. అది శారా, డేరాచాటున దాగినట్టి ఘోషా.
మనదేశములో అధికముగా కులము పాతుకొని పోయినది. దానిని తీసివేయుట కష్టము గాన క్రీస్తుమతము వచ్చిన పిదప నిష్ట కొంత తగ్గినది. ఐరోపాలో, అమెరికాలో క్రైస్తవులు ఉన్నారు. వారు మనదేశములో మతము స్థాపించిరి. మన దేశములోని వారికి కుల నిష్ట ఎంతగా ఉందంటే, వేరే ఊరుపోతే కులము పోవునని ఏదేశము వెళ్ళలేదు గాని, ఇతర దేశస్థులు మన దేశమునకు వచ్చారు. క్రీస్తుమతము వచ్చిన పిదప ఏదేశమైనా వెళ్ళివస్తున్నారు. మనదేశ హిందువులు ఇతర దేశములు వెళ్ళి, కలసిమెలసి ఉంటున్నారు. షేక్ హేండ్ ఇచ్చుకొనుచున్నారు. ఇది మతము వల్ల వచ్చినది. ఆ మతము క్రీస్తువలన వచ్చెను. క్రీస్తువలన సత్యము, సత్యము వలన స్వతంత్రత వచ్చెను గనుక నేనే సత్యమన్నమాట నెరవేరినది.
బి.బి. చంద్రపాల్ అనే ఆయన ఒకప్పుడు రాజమండ్రి వచ్చి టౌన్ హాల్ మైదానమంతా నిండియున్న ప్రజలమధ్య దేశానికి రావలసిన స్వతంత్రతను గురించి మాటలాడెను. ఇటు అటు తిరుగుటకు మనకు స్వతంత్రతలేదు గనుక అది సంపాదించవలెను అనెను. కులము వలననే మనకు స్వతంత్రత రాలేదనిరి. ఆ ఉపన్యాసము వినుటకు నేనును(యం.దేవదాసు అయ్యగారు). బెంజమెనుగారును వెళ్ళితిమి. ఒక పశ్నవేయుచున్నాను. జవాబు చెప్పండి అని ఆయన అన్నారు. మనదేశములో ఉండే కులాన్ని పూర్తిగా తీసివేయవలెను, ఇష్టమున్నవారు చేతులు పైకెత్తండి అని అనగా అందరు పైకెత్తిరి. బ్రాహ్మణులు , వైశ్యులు మొదలగు అన్ని జాతులవారు చేతులెత్తిరి గాని కులము తీసివేయగలిగినారా? లేదు.
ఇండియాలో క్రీస్తు ప్రభువును ఎప్పుడు పెక్కుమంది అంగీకరింతురో, అప్పుడు కులము పోవును. మమ్మును అంటుకొనవద్దని మీరెవ్వరిని అనవద్దని ఆయన అన్నారు. తక్కువ, ఎక్కువలు లేవుకదా? నన్ను ఎవ్వరు అంటుకొనవద్దు అని గాంధీజీ బోధించలేదు. కులము పూర్తిగా పోలేదు గాని అక్కడక్కడ పోయినది. కులాంతర వివాహముల ద్వారా కులము తక్కువైపోవుచున్నది. అచ్చటచ్చట ప్రేమించుకొనుటను బట్టి వివాహములు జరుగుచున్నవి గాని కుల నిర్మూలనలో అవి లెక్కలోనికి రాలేదు.
తూర్పుగోదావరి జిల్లాలో ఒక బ్రహ్మణ అబ్బాయి పంచముల అమ్మాయిని పెండ్లి చేసుకొనెను. పిల్లవాని తండ్రి హెడ్మాస్టరు. కులము వద్దని బోధించినాడాయన. అయితే ఇపుడు ఆయన గొప్ప క్షోభతో ఉన్నాడు. క్రైస్తవుల అమ్మాయినైనా చేసికొనక, మా అబ్బాయి పంచముల అమ్మాయిని చేసికొన్నాడు అని, క్రైస్తవులన్న కులము చెప్పనక్కరలేదు అన్నారు. గనుక క్రీస్తువలననే కులముపోవాలి.
మనదేశ చట్టములలో ఒకటి మతస్వాతంత్ర్యము. ఎవరి మతమును వారు చెప్పుకొనవచ్చును గాని అడ్డుపోకూడదు. మంచిదే. మనదేశములో యూదులు, హిందువులు, బౌద్ధులు, మహ్మదీయులు, క్రైస్తవులు మొదలగు మతస్థులు ఉన్నారు ఈ మతములవారు వారివారి మతమును చెప్పుకొనవచ్చును.
కొందరు పెద్దలు మాకు హిందూమతము ఉండగా ఈమతమెందుకని అనుచున్నారు. గనుక ఎవరి ప్రేరేపణ వల్లనో క్రైస్తవులైనారు గనుక తిరిగి ఈ మతములోనికి రండి, లేనిచో ఈ దేశమునైనా వదలిపోవాలని అనుచున్నారు. దేశాధికారులిచ్చిన స్వతంత్రత అధికారులలో కొందరివలన నెరవేరుటలేదు. 'స్వాతంత్ర్యమని' బైబిలులో ఉన్నది. అయితే సంపూర్ణ స్వాతంత్ర్యము కొరకు బైబిలు బాగుగా చదువవలెను. క్రైస్తవమతము వలన స్వతంత్రత వచ్చినది. గవర్నమెంటువారి వలన అది అంగీకారమైనది. కొందరివలన ఆటంకమైనను ఆగనే ఆగలేదు. రెండువేల సంవత్సరములైనను సాగుచునే వచ్చినది. ఇక ముందునకు కూడ సాగుచునేవచ్చును. దానిముందు ఆగినట్లైన అన్ని విధాల స్వతంత్రతపోవును. దేవుడు దేవదూతలకు, మనుష్యులకు స్వతంత్ర్యత ఇచ్చెను గాని అంగీకరించుటలో చిక్కు ఉన్నది. ఈ స్వతంత్రత జాబితా అంతయు క్రీస్తు మతము వలననే వచ్చినది. దేని వలన వచ్చినదో అది అక్కరలేదు గాని స్వతంత్రత అయితే కావాలి అనుచున్నారు. స్వతంత్రత ఎవరివలన వచ్చినదో ఆయనను వద్దనుచున్నారు. ఆయన వలన వచ్చిన స్వతంత్రతను వద్దు అనుచున్నారు. మన దేశానికి పూర్ణ స్వతంత్రత వచ్చునట్లు ప్రార్ధించండి. తప్పు చేసినవారు తప్పునకు బానిస అవుదురు. తప్పుకు లోబడకపోయినవారు రాజులాంటివారు. ఏ తప్పైనా సరే చేసినవాడు దానికి బానిసే.
ఏ తప్పూ చేయని క్రీస్తు యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యము చదువులకు లభించును గాక! ఆమెన్.
Extra References
- కీర్తన: యేసు నన్ను విడిపించినావు: యేసు సర్వకష్టములనుండి విడిపించును
- పద్యములు: (తే.గీ.)
పాపముల్ మాన్పించు | భక్తులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
మతవైరమునుతీర్చు | మాన్యులు లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
కులమును పోగొట్టు | కోవిదుల్ లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
శత్రుత్వమును నాపు | సాధువుల్లేచిన
స్వాతంత్ర్యముండును | ప్రజలకెపుడు
సృష్టిపూజను మాన్పించి - స్రష్టపూజ
నేర్పు నిపుణులులేచిన - నిండుస్వేచ్చ
కలుగగా దేశమునకు సు - ఖము లభించు
స్రష్టపూజయే భాగ్యాల - సాధనంబు
మూడునొక్కటై పనిచేయ - ముప్పుపోవు
దైవభక్తి నాగరికత - ధర్మగుణము
విద్యమున్నగువానికి - వెలుగువచ్చు
అపుడు సంపూర్ణ స్వాతంత్ర్య - మబ్బు మనకు