(దేవుడు మనకు తోడైయున్నాడు)
గ్రంథకర్త: Father M. Devadasu
మొదటి ప్రసంగము
యేసుక్రీస్తు ప్రభువు సర్వలోక రక్షకుడుగా జన్మించినాడు గనుక ఆయన వార్త సర్వలోకస్థులు వినతగినదే. యేసుక్రీస్తు ప్రభువునకుగల
నామధేయములలో ఒక నామధేయము “ఇమ్మానుయేలు” ఇది హెబ్రీ భాషా పదము. దేవుడు మనకు తోడైయున్నాడని దీనియర్ధము. మనము ఒంటరిగా నుండుట
మనకు ఇష్టముండదు. ఇంటనున్నను, బైటకు వెళ్ళినను మనకు ఎవరో ఒకరు తోడుండవలెను. ఇది మనుష్యుని కోరిక. ఎవరైన మనకు జతగా నుండుట
మన
కోరిక. జతగా పెంపుడు జంతువు మనదగ్గరనున్నయెడల అది జతయేగాని మనుష్యుని జతవంటి జతకాదు. అయితే “ఇమ్మానుయేలు” అను మాటకు
మనుష్యుడు మనకు తోడు అని అర్ధముకాదు. దేవదూత మనకు తోడైయున్నాడని అర్ధముకాదు. గాని బారుగా దేవుడే మనకు తోడైయున్నాడని
“ఇమ్మానుయేలు” అను మాటలో నున్నది. జంతువు తోడైయున్న కొంచెము సంతోషమే! మనుష్యుడు తోడైయున్న అంతకన్న ఎక్కువ సంతోషము.
“దేవుడు” తోడై యున్నయెడల అన్నిటికంటే గొప్ప సంతోషము. “ఇమ్మానుయేలు” అను “క్రీస్తు" అను నామములో దేవుడు తోడైయున్నాడని
వ్రాయబడియున్నది. గాన ఆ మాట ఎవరికి ఇష్టమైయుండదు. ఆ మాట అర్ధముగల “క్రీస్తు” పేరు ఎవరికి ఇష్టముండదు. అంతగొప్ప అర్ధముగల
“క్రీస్తు నామమే ఇష్టములేకున్న మరి ఏ పేరు ఇష్టమై యుండగలదు? “క్రీస్తు” నామము మీకు స్మరణ నిమిత్తమై మేమందించినయెడల దేవుడు
మీకు తోడై యున్నాడు అని మిమ్మును మేము దీవించినట్టే. మేము ఇంత గొప్ప నామముతో ఇంత గొప్ప వాక్యముతో మిమ్మును దీవించినయెడల ఆ
వాక్యము మాకెందుకు? ఆ దీవెన మాకెందుకు? ఆ పేరు మాకెందుకు? అని అనువారు ఎవరైనా ఉందురా!
లోకములో “ఇమ్మానుయేలు” అను మాట మన
భాషాపదము కాదని తృణీకరించు వారుందురా! మన భాషాపదము కాకపోయిన మాత్రమున దీవెన ఫలము కాకపోవునా! “ఇమ్మానుయేలు” అను పదము పర
భాషాపదము అయినంత మాత్రమున దానివలన కలుగు దీవెన తగ్గిపోవునా? తగ్గిపోదు గదా! ఇమ్మానుయేలు అనుపేరు కొందరు క్రైస్తవులు
పెట్టుకొనుచున్నారు. గాని అట్టివారు దీని అర్ధము గ్రహించుకొనిన ఈ దీవెన కలుగును. విన్నవారు నమ్మిన ఈ దీవెన కలుగును.
నమ్మినవారు స్వీకరించిన ఈ దీవెన కలుగును. స్మరించినవారు ప్రకటించిన ఈ దీవెన కలుగును.
"ఇమ్మానుయేలు” అను పేరుగల
“క్రీస్తు
లోకమునకు దానమైయున్నారు. ఈ దానమును ముఖ్యముగా “క్రిస్మస్ కాలములో జ్ఞాపకము తెచ్చుకొందుము. ఒకమాటతో ముగించెదను. ఆ మాట
“ఇమ్మానుయేలు” అను పరభాషయందలి మాటయేగాని తెలుగునందు మరొకసారి చెప్పి ముగిస్తాను వినండి, జ్ఞాపకముంచుకొనండి. అదేదంటే దేవుడు
మనకు తోడైయున్నాడు. దేవుడు మనకు తోడైయున్నాడు. దేవుడు మనకు తోడైయున్నాడు. తథాస్థు, తథాస్థు, తథాస్తు. ఇదే నా “క్రిస్మస్"
కాల వర్తమానము.