(దేవుడు మనకు తోడైయున్నాడు)

గ్రంథకర్త: Father M. Devadasu

నాలుగవ ప్రసంగము



ఇదివరకు మూడుమార్లు ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని వివరింపబడెను. ఈ మాటలో దేవుడు అనుమాటయు, మనము అనుమాట ఉన్నవి గనుక దేవుడు మన జత అని వివరింపబడెను. దేవుడు అనేమాట ఉన్నందున దేవుడు మీ దగ్గర ఉండునా? అని ప్రశ్నింపడు. మీకు తోడైయుండునా? అని ప్రశ్నవేయడు. మీరు అనే ఒకరు ఉన్నారా? అని ప్రశ్నవేయడు. మనమే ప్రశ్నవేయుదుము. ఇమ్మానుయేలు అను ఆయన సందేహము గల ప్రశ్నవేయడు గాని, ఇమ్మానుయేలు అనుమాట విన్న మనమే ప్రశ్నవేయుదుము. సందేహింతుము. ఏలాగనగా మనుష్యులలో కొందరు దేవుడనే ఆయన ఒకడు ఉన్నాడా? అని ప్రశ్నింతురు. దేవుడు ఉన్నాడని నమ్మేవారుకూడ ఒకానొకప్పుడు వ్రశ్నవేయుదురు. దేవుడు మనకు తోడైయుండునని మీరు చెప్పినారుగదా, మొన్న నాకొక కష్టము వచ్చినది. దేవుడు నాకు ఎందుచేత తోడైయుండలేదు. దేవుడు తోడైయుండిన కష్టము నెందుకు తొలగించలేదని ప్రశ్న వేయుదురు. దేవుడున్నాడను వారు లేడనువారుకూడ సందేహింతురు. నరుల కథ ఇట్లున్నది. మనమని చెప్పుకొను మనము ఇమ్మానుయేలు అను మాటలోనున్న అర్ధమును నమ్మకపోయిన ఆయన సహాయము కలుగునా? కొన్ని విషయములలో కలుగును. కొన్నిటిలో కలుగదు. దేవుడు మనలను కలుగజేసెను గనుక నమ్మిన, నమ్మకపోయిన ఉపకారము చేయుచున్నాడు. ఎండ, వాన, గాలి ఇవన్ని దేవుని ఉపకారములే మనము ఆయనను అడగకపోయినను చేయుచున్నాడు. ఎందుకనగా ఆయన దేవుడు గనుక; ఇంకా ఎందుకనగా మనలను కలుగజేసినాడు గనుక; ఇంకా ఎందుకనగా మనకు ఉపకారము చేయుట ఆయన స్వభావము గనుక. దేవుడు మనకు తోడైయున్నాడను సంగతి సర్వసామాన్యమైన సంగతి. ఈ సర్వసామాన్యమైన అర్ధము ఇమ్మానుయేలను మాటలో ఉన్నప్పటికిని ఒక ప్రత్యేకమైన అర్ధముకూడ దీనిలో నున్నది. అది గుర్తించండి. లోకములోనున్న మానవులను రక్షించు నిమిత్తము పుట్టవలసిన యేసుక్రీస్తు ప్రభువునకు ఇమ్మానుయేలను పేరు ప్రత్యేకమైన పేరు. ఎలాగనగా ఇమ్మానుయేలను మాట క్రొత్తమాట. భూమి(నరులు) పుట్టి నాలుగువేల సంవత్సరములైన తరువాత క్రీస్తు ప్రభువు అవతారమెత్తెను. ఇమ్మానుయేలను పేరు అప్పుడు బయలుపడినది. అంతకుముందు ఎనిమిది వందల సంవత్సరములకు ముందు బయలుపడెను. అంతకుముందు బయలు పడలేదు. ఈ పేరు బయలుపడక ముందును తరువాతను, ఇప్పుడును ఇక నెప్పుడును అన్ని మతముల వారును వాడుకొను మాట దేవుడు అనుమాట గాని ఇమ్మానుయేలను మాటకాదు. ఈ పేరు క్రీస్తుయొక్క అవతారకాలమందు పెట్టబడినది. ఇది దేవుని పేరు. అందరు వాడుమాటకాదు. అందరు వాడునది దేవుడు అనుమాట. ఆ దేవుడు మోక్ష లోకమునుండి భూలోకమునకు దిగివచ్చి యేసుక్రీస్తుగా ప్రసిద్ధికెక్కినాడు. గనుక యేసుక్రీస్తు అను పేరు దేవునికి ఉన్న ప్రత్యేకమైన ఒక పేరు. అలాగుననే ఇమ్మానుయేలను పేరుకూడ ఒక ప్రత్యేకమైన పేరు. దేవుడు ప్రత్యేకమైన దేవుడు కాడు. దేవుడు అందరికి దేవుడు. దేవుడు ఒక్కడు గాని ఆయన పనులు అనేకములు. జ్యోతులను కలుగజేయుట, భూమిని కలుగజేయుట, అందున్న సమస్తమును కలుగజేయుట, అనుదినము చెట్లను, జీవరాసులను కలిగించుట, తాను కలుగజేసిన సృష్టిని కాపాడుట ఇవన్ని దేవుడు చేయు ఘనమైన పనులు. వీటన్నిటిలో మహాముఖ్యమైన పని, మహా ఘనమైనపని ఈ పనులన్నిటిలో ప్రత్యేకమైనపని క్రిస్మస్ కాలమునందు బయలుపడినది. ఆదేదనగా దేవుడు మనిషి దగ్గరకు వచ్చివేసినాడు. ఈ సంగతి ఇమ్మానుయేలను మాటలోనున్నది. దేవుడు మనిషి దగ్గరకు వచ్చివేయుట అనునది గొప్పపని కాదా! దేవుడు మోక్షలోకమునుండి భూలోకమునకు ఉవయోగకరమైన పనులు చేయుట గొప్ప సంగతి. మనుష్యులు సంతోషించుసంగతి గాని ఆయనే భూలోకమునకు వచ్చివేసిన సంగతి మరింత గొప్ప సంగతి. మరింత సంతోషకరమైన సంగతి.

ఉదా: తండ్రి దూరదేశములో నుండి కుమారునికి ఉత్తరములు వ్రాయుచు, సొమ్ము పంపించుచు అన్ని సహాయములు చేయుచున్నాడు. కుమారునికి సంతోషము. గాని ఈ సంతోషముకన్న గొప్ప సంతోషము ఎప్పుడు కలుగును? తండ్రి కుమారుని యొద్దకు వచ్చినప్పుడు కలుగును. ఇమ్మానుయేలను మాటలో ఇటువంటి గొప్ప కారణము ఉన్నది. ఇది ప్రత్యేకమైన కార్యముకాదా! రెండు సంగతులు

ఈ రెండు రకములైన ఉపకారములకు తేడాగలదు. ఈ రెండు ఉపకారములు మనిషికి అవసరమే. ఈ రెండు ఉపకారములు మనిషి కొరకే. ఈ రెండు ఉపకారములు చేసిన దేవుడు ఒక్క దేవుడే! ఈ ఒక్క దేవుడే చేసిన మొదటి ఉపకారము మాకు కావలెనని, రెండవ ఉపకారము అనగా క్రీస్తుయొక్క దైవావతార ఉపకారము మాకు అక్కరలేదు అంటే అర్థమేమి? మొదటి ఉపకారము కావలెనా? మొదటి ఉపకారముకంటె ఎక్కువైన అవతార ఉవకారము అక్కరలేదా? అక్కరలేదను వారిమీదనే ఈ ప్రశ్న ఆ ఉపకారములు, ఈ ఉపకారములు రెండును కావలెనను వారికి ఈ ప్రశ్న వేయుము. యేసు క్రీస్తు వారియొక్క జీవిత చరిత్ర చదువుకొను వారికి రెండురకముల ఉపకారములు తెలియగలవు. ఆయనచరిత్ర మత్తయి, మార్కు లూకా, యోహాను అను సువార్తలలో గలదు.


మరియొక ప్రశ్న మేము ఇప్పుడు చెప్పినది కొందరు నమ్మనే నమ్మరు. వారికి రెండవ రకపు మేలు కలుగునా? కలుగదు. నమ్మకపోయిన ఈ భాగ్యము కలుగదు. ఈ రెండవరకపు భాగ్యము మోక్షలోక సంబంధమైనది. నమ్మకమునుబట్టియే కలుగును గాని మరొక దానినిబట్టి కలుగదు. దేవుని సహాయము ఎల్లప్పుడు సిద్ధమే. దైవోపకారము నిత్యము మనకొరకు సిద్ధమై యుండును గాని మనము నమ్మకపోయిన ఆ ఉపకారము ఎట్లు కలుగగలదు. దేవుడు మనకు ఉచితముగా మోక్షభాగ్యములు ఇస్తానంటే నమ్ముట కష్టమా? అనుమానములు తీసివేసికొని నమ్మినయెడల పరమ భాగ్యము కలుగును. అది యేసుక్రీస్తు ప్రభువు వలన కలుగును. నీవు నమ్మకపోయిన నమ్మువారు లేరా? భూమిమీద నేడు ఒక గొప్ప సంఘమున్నది. ప్రతి దేశములో నున్నది. ఆ సంఘము నమ్మేసంఘము. ఏమి నమ్ము సంఘము? దేవుడున్నాడని నమ్ము సంఘము. ఇంకా దేవుని సహాయము మనకుండునని నమ్ము సంఘము. ఇంకా ఆ సహాయము మనకు అని నమ్ము సంఘము. ఇట్లు నమ్ముటకు బుజువు ఏమిటి అని అడుగు పెద్దమనుష్యులుందురు. ఆ బుజువులు కావలెనని కోరువారు లోకములో పుట్టకముందే, దేవుడు ఆ బుజువులు, సాధనములు అమర్చియుంచినాడు. ఏలాగనగా అన్నవస్తాదులు, ధనధాన్యములు మొదలైనవి మనకు ఇచ్చుట లేదా? ఇవి ఇచ్చే దేవుడు పరమభాగ్యములు ఎందుకు ఇవ్వడు? ఇదే బుజువు. ప్రతివారు ఇమ్మానుయేలు పేరులోని పరమభాగ్యము నమ్మి అనుభవింపవలెననినా కోరిక.


మరియొక సంగతి మనకు అనుమాట. ఇది ఏకవచనము కాదు అనగా ఈ ఉపకారము ఒక మనిషికి మాత్రముకాదు. "మనకు” అనుమాట బహువచనము అనగా నమ్మువారందరికిని అని అర్ధము. మనిషి నమ్మిన, నమ్మకపోయిన యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వచ్చియున్నాడు. అందరు నమ్మువరకు రాకుండా నుండలేదు. నమ్మినయెడల ఆయనవలన కలుగు ఉపకారభాగ్యము పొందగలము. “మనకు అనుమాట బహువచనము గనుక ఆ మాటలో గొప్ప సంఘము మన మనో దృష్టికి కనబడుచున్నదిగదా! దేవుడు ఒక్కడే. సంఘము ఒక్కటే. సహాయము ఒక్కటే అని ఈ మూడును ఇమ్మానుయేలు అను మాటలో గలవు అనగా మనకు అను మాటలో సహోదరప్రేమ ఉన్నది. మీరెప్పుడైన చూచినారా? అది విశ్వాసులందరిని కలుపుకొనుమాట. ఇమ్మానుయేలని పలుకువారు విశ్వాసులు. ఆ మాట అంగీకరించువారు విశ్వాసులు. అందుచేత మనకు అనుమాట సరియైన మాట. విశ్వాసులు విశ్వాసులు కలిసికొన్నప్పుడు (ఇమ్మానుయేలు) అని చెప్పుకొని సంతోషించుట మంచిది. విశ్వాసులందరు విశ్వాసులకును విశ్వాసులందరికి దేవుడును దగ్గరైనారు. దూరముగా లేరు. విశ్వాసులు కూడ ఒకరికి ఒకరు దూరముగాలేరు. విశ్వాసుల సంఘము దివ్యమైన సంఘము. అదే ఈ దినములలో మనకు కావలసినది.


ఇంగ్లీషు క్రైస్తవులు స్నేహితులను విడిచిపెట్టి వేరుచోటకు వెళ్ళునప్పుడు (షేక్ హేండ్ ) (Shake hand) చేతులు కలుపుకొంటూ "God be with you" (గాడ్ బి విత్ యు) అని అంటారు. దీని అర్ధము ఏమనగా దేవుడు మీకు తోడై యుండునుగాక! ఈ అర్ధము ఇమ్మానుయేలును బట్టి వచ్చి యుండును. మరియు అరవ క్రైస్తవులు, తెలుగు క్రైస్తవులు ఒక పేరు పెట్టుకొనుచున్నారు. అది దైవ సహాయము అనుపేరు. ఆ పేరుకూడ (ఇమ్మానుయేలు) అను మాటకు అర్ధము అనగా దైవసహాయము మనకు కలిగియుండునుగాక! అని అర్ధము మన అందరకు దైవసహాయము అగత్యము.


యేసు : యేసు అనునది క్రీస్తుయొక్క మరొక పేరు. ఇదికూడా స్వదేశ నామముకాదు. ఏ దేశనామముకాదు. అసలు భూలోక నామమేకాదు. మోక్ష లోకమునుండి వచ్చిన నామము. గనుక సర్వలోకమునకు అన్ని దేశములకు ఉపయోగకరమైన నామము. యేసు అను మాటకు రక్షకుడని అర్ధము. రక్షకుడు అనగా ఎటువంటివాడు, మానవులను పాపములనుండి రక్షించు రక్షకుడు, వ్యాధులు, కరువులు, భూకంపములు, అపాయములు, జంతు బాధలు, విష పురుగులవలన బాధలు, శత్రుబాధలు, ఎండబాధ, చలిబాధ, వరదబాధ, ముండ్ల బాధ. ఈ మొదలైన బాధలు మనుష్యునికి కలుగుట పాపము వలననే. లోకములో పాపము అనేది లేకపోయిన ఈ శ్రమలు ఉండకపోవును. ఈ శ్రమలకు కారణమై యున్న పాపములనుండి రక్షించు రక్షకుడైన యేసుప్రభువు అనగా యేసుక్రీస్తు ప్రభువు గొప్ప రక్షకుడు కాడా! ఈ శ్రమలన్నిటికంటె ఎక్కువ హానికరములైన పాపములనుండి యేసుక్రీస్తు ప్రభువు మనలను రక్షించగలిగిన ఈ శ్రమలనుండి కూడ రక్షించగలడు. ఈ శ్రమలన్నిటికన్న ఎక్కువ హానికరమైన శ్రమ, ఆఖరు శ్రమ మరణము. మరణముకూడ పాపమువలన వచ్చినదే. పాపము లేకపోయిన మరణము కూడ లేనేలేదు. పాపములనుండి రక్షించు యేసు ప్రభువు మరణమునుండి కూడా రక్షించగలడు. మరణమైన తరువాత మరణము కంటె మరణమైయున్న నరకమునుండికూడ ఆయన రక్షించగలడు. నరకముకూడ పాపమునుబట్టి వచ్చును. పాపములనుండియు, శ్రమలనుండియు, మరణము నుండియు రక్షింపగలవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు మనకు ఈ సంగతి అంత వివరముగా తెలియదుగాని ఈ లోకము దాటిపోయిన తరువాత మనము పరలోకములో శాశ్వతకాలము జీవించునప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరణము నుండి నరకమునుండి రక్షించెనని తెలిసికొనగలము. అక్కడకు వెళ్ళిన తరువాత ఇక చావు ఉండదు. యేసు అనగా రక్షకుడు. రక్షణ ఎవరికి అక్కరలేదు అది అందరికి కావలెను గదా! పాపమునుండి రక్షింపబడుట అక్కరలేదనువారు ఉండరు. కాబట్టి యేసు అనే పేరు స్మరణ కోరనివారుకూడ ఉండకూడదు. అనగా యేసుక్రీస్తు వారియొక్క నామస్మరణ అక్కరలేనివారు ఉండకూడదు. అయినను ఉన్నారు. ఏమి చేయగలము? యేసుక్రీస్తు వలన కలిగే ఈ ఉపకారములు గొప్ప ఉపకారములు అని మీకు తోచిన, యేసు అనే పేరు ఎంత గొప్ప పేరు అయినది కూడ మీకు తోచును. యేసుక్రీస్తు పేరు ఎంత గొప్ప పేరైనది. అదికూడ తెలియును. తెలిసినవారందరు రెండు చేతులు జోడించి యేసుక్రీస్తు ప్రభువా! మమ్మును పాపములనుండి రక్షించుము. శ్రమలనుండి రక్షించుము, మరణభీతి నుండి రక్షించుము నరకమునుండి రక్షించుము. శాశ్వతమైన మోక్షలోక జీవితము అనుగ్రహించుమని ప్రార్ధింపగలరు. అప్పుడు మనము మోక్షలోకమునకు వెళ్ళి అక్కడనుండి భూలోకమునకు తొంగిచూచిన యెడల ఓహో! యేసుక్రీస్తు ప్రభువు మనలను పావపములనుండియు, శ్రమలనుండియు, మరణమునుండియు, నరకమునుండియు ఎంత చక్కగా రక్షించినాడు! అని ఆశ్చర్యపడుదుము. మరియు ఆయన మనలను ఎంత గొప్ప సుఖజీవనముగల శాశ్వతానంద లోకములోనికి తీసికొని వచ్చినాడు అని చెప్పుకొందుము.


యేసు అనుమాట భూలోక భాషలోలేదు. భూలోక భాషలలోనున్న నిఘంటువులలోలేదు. ఆ మాట పరలోకమునుండి వచ్చినది. మనము భూలోక భాషలో ఆ మాట వాడుచున్నాము. ఎందుకనగా ఆ నామము మన రక్షణార్ధము దొరికినది. యేసు అను పేరు పలుకుట సుళువేగాని, యేసువలన రక్షణ అని నమ్ముట సుళువుకాదు. యేసు ప్రభువుయొక్క ఒక ముఖ్య శిష్యుడు ఒకసారి ఉపన్యాసములో ఏమి చెప్పినది వినండి. అది బైబిలులోనున్నది. "మరి ఎవరివలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” అపో. కార్య 4:12. క్రైస్తవులకు కష్టము వచ్చినప్పుడు యేసుప్రభువా! యేసుప్రభువా! అని అందురు. అనగా దాని అర్థమేమి? రక్షకా! రక్షకా! అని అర్ధము. భూలోక భాషలో రక్షకా అన్నట్లు మోక్షలోక భాషలో యేసు, యేసు అన్నట్టు హిందువుల పుస్తకములో నున్న (యేసు) అను ఈ పేరు ఆ పుస్తకములోనికి ఎట్లు వచ్చినదో! ఆ గ్రంథకర్తకు ఎట్లు బయలుపడినదో విచారింప వలసినది (యేసు)- శ్రీశుష్క వేదాంత తమోభాస్కరము 174వ పేజీలోనున్నది. ఇమ్మానుయేలను పేరులో దేవుడని ఉన్నది. యేసు అనుపేరులో రక్షకుడని ఉన్నది. ఇప్పుడు ఇమ్మానుయేలను పేరులో దేవుడు మన దగ్గరనున్నట్లు విశదమగుచున్నది. యేసు అనుపేరులో ఆయన రక్షకుడు అన్నట్లు కనబడుచున్నది. దేవుడు ఎంత గొప్పవాడైతేనేమి మనలను రక్షించకపోతే! దేవుడు యేసుగా బయలుపడినాడు. ఆయనను పూజిస్తామా? దేవుడు దేవుడుగా మాత్రమేగాక రక్షకుడుగా బయలుపడినాడు. ఒకడు గొప్పవాడని తెలిసిన గొప్పగానే గౌరవింతుము. ఎంత గొప్పవాడైనను మనకుసహాయము చేయనియెడల గౌరవింతుమా? దేవుడు గొప్పవాడు. తనంతటతానే గొప్పవాడైయున్నాడు. ఆయన గొప్పతనము తగ్గదు. అయితే ఆయన గొప్పవాడను సంగతి ఎప్పుడు అనుభవమునకు వచ్చును? ఆయన మనలను రక్షించునప్పుడే వచ్చును. యేసు అనుమాటలో ఆయన రక్షించేవాడుగా ప్రత్యక్షమైనాడు. పాపము మనిషిని పడవేసినది. గనుక పాపము మనిషిని జయించినది. యేసుప్రభువు వచ్చి పాపాత్ముని రక్షించినాడు గనుక పాపమును జయించినాడు. మనుష్యుడు పాపమును జయింపలేక పోయినాడు. గనుక యేసుప్రభువువచ్చి జయించినాడు. మనమైతే జయించలేదుగాని ఆయన జయించినందువలన ఆ జయము మన జయమాయెను.

యేసు క్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను - కోరిన ఎల్లవారికౌను - వేడిన ఎల్లవారికౌను - నమ్మిన ఎల్లవారికౌను = యేసు పేరె మీ చిక్కులపైన వేసికొన్న జయము - జయమని వ్రానికొన్న జయము. సాద్విలాస్


దేవుని జత ఎవరికి కావలెను. వారు ఇమ్మానుయేలు అను పేరు చూచి ఆనందింతురు, స్మరింతురు, పూజింతురు. ఇది దేవుడు భూమిమీదికి వచ్చినప్పుడు పెట్టుకొన్న పేరు. అట్లే యేసు అను పేరుకూడ దేవుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు పెట్టుకొన్నపేరే. క్రీస్తు అన్నపేరుకూడ దేవుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు పెట్టుకొన్నపేరే. ఈ పేర్లు మన ఉపయోగము నిమిత్తమై తాను పెట్టుకొని తన ప్రేమను బైలుపరచిన పేర్లు గనుక మనము ఈ పేరులను స్మరించుట యుక్తము.


క్రీస్తు : ఈ పేరుకూడ దేవుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు పెట్టుకొన్న పేరు. ఇదికూడ మోక్షలోకమునుండి వచ్చిన నామమే. స్వదేశ నామముకాదు విదేశనామముకాదు, మోక్షలోకనామము. గనుక లోకస్తులందరు గౌరవింపవలసిన నామము. క్రీస్తు అనగా అభిషిక్తుడని అర్ధము. ఒక రాజ్యమును ఏలు పనిమీద ఒక రాజు ఎట్లు పట్టాభిషేకము పొందునో అట్లే మనుష్యులను రక్షించే పనిమీద ఈయన (యేసుక్రీస్తు ప్రభువు) అభిషేకము పొందినాడు. అందుచేత ఈ పేరు ఆయనకు తగియున్నది. రాజు అధికారముతో రాజ్యము ఏలేపని చేయడమే గొప్పపని. అభిషేకము పొందినాడు అనగా ఏమి? ఒకపనిమీద, ప్రత్యేకమైన ఒక పనిమీద నియమించబడియున్నాడని అర్ధము. క్రీస్తు అనగా రక్షించేపనికి ఏర్పాటైన వ్యక్తి అని అర్ధము. లోకములో మనుష్యులకున్న కష్టములనుంచి కొంత వరకు తాత్కాలికముగా రక్షించు రక్షకుడు ఉండవచ్చును. ఉన్నారు గాని పాపము నుండియు, మరణమునుండియు, పాపకారకుడైన సాతానునుండియు, రక్షించే రక్షకుడు లేడు. ఈయన ఆ పనికి ఏర్పాటై వచ్చినాడు. క్రీస్తు అనగా ఇదే అర్ధము. క్రీస్తు అనే ఈ నామము అనేకమందికి అభ్యంతరముగా నుండుమాట అని మీకు తెలియును.

దీని అర్ధము చెప్పుచుండగా ఒక ప్రశ్న చదువువారి మనసులో పుట్టక మానదు. ఆ ప్రశ్నఏమనగా - ఈయన ఒక్కడేనా ఈ రక్షించేపనికి ఏర్పాటైనవాడు? ఇంకెవరులేరా? ఇది న్యాయమైన ప్రశ్న అడుగవలసిన ప్రశ్న తెలిసికొనవలసిన ప్రశ్న మేము క్రీస్తుప్రభువుయొక్క చరిత్ర, బైబిలు కథలు చెప్పిన అన్ని మతములవారు సంతోషముతో ఆలకింతురు. నెమ్మదిగా కూర్చుని ఆలకింతురు. ఇమ్మానుయేలు యేసు క్రీస్తు - ఈ మాటలు సంతోషముతో విందురు. గాని యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు అని చెప్పగానే ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేయుదురు. లేచిపోవుదురు. అయితే బైబిలులో ఈ మాట ఉన్నది గనుక మేము చెప్పక తప్పదు. దేవుడు ఈ పేరులలో బయలుపడినాడు గనుక మేము ఈ మాటలు వినిపించక తప్పదు. నేను ఇచ్చే ఈ మాత్ర తీసికొనిన నీ జబ్బు పూర్తిగా పోవును అని ఒక వైద్యుడు చెప్పిన మనమేమందుము? వేసికొని చూచి పరీక్షింతుముకదా? అలాగే యేసుక్రీస్తు అను ఒక నామమును మనము వాడుకొని పరీక్షించినప్పుడు మనము ఆనందించగలము. అందరికి అనుగుణ్యమైన పేర్లు యేసుప్రభువునకు గలవు. మరియొక సంగతి పేరుకు తగినట్టు ఆయన నడచినాడని ఆయన కథవల్ల తెలియుచున్నది. పేరు ఒక విధముగా నుండి చరిత్ర ఇంకొక విధముగానున్న నమ్ముటకు సంశయము, గాని క్రీస్తు చరిత్ర ఆలాగులేదు. యేసు క్రీస్తుప్రభువు పుట్టినప్పుడు దేవదూత గొల్లలకు ఏమిచెప్పినది జ్ఞాపకము చేయుదును. ఆ మాట ఏదనగా మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు! తరువాత ఈ సంతోషము ప్రజలందరికి కలుగనైయున్నది. దూతయొక్క ఆహ్వానములో ఈ రెండు సంగతులు గలవు. ఎదుటనున్న గొల్లలకు, ఎదుటలేని ప్రజలకును ఈయన రక్షకుడని ఈ రెండు మాటలవలన తెలియుచున్నది. కాబట్టి మొదట వినిన గొల్లలు ఏమని అనుకొనుట న్యాయము? యేసుక్రీస్తు మా రక్షకుడు. మా రక్షకుడు అని చెప్పుకొనుట న్యాయము. ఆ తర్వాత ఈ వార్త విన్నవారందరు ఇదే రీతిగా ఆయన మా రక్షకుడుకూడా అయ్యున్నాడని చెప్పుకొనుట సబబుగా నుండును. (మా కొరకు) (ప్రజలందరి కొరకు) అను అర్ధముకూడ క్రీస్తు అను మాటలో నున్నది. ప్రత్యేకమైన రక్షకుడు అను అర్ధముకూడ నున్నది. తక్కిన రక్షకులకంటె గొప్పవాడు అనికూడ నున్నది. ఈ అర్ధము, ఈ నామములు ఎవరికి వచ్చునో వారు మాత్రమే వీటివల్ల కలుగు ఆనందము పొందగలరు. యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అనగా నాయొక్క అని అర్ధము. యేసు క్రీస్తు అనగా నా ప్రత్యేక రక్షకుడు అని అర్ధము.


త్వరగా రానున్న యేసూ! - త్వరగానే రమ్ము తండ్రీ=త్వరగా వచ్చు ప్రభువా చురుకు - తనమిమ్మునే త్వరపడగలను    ॥త్వరగా॥