(దేవుడు మనకు తోడైయున్నాడు)
గ్రంథకర్త: Father M. Devadasu
రెండవ ప్రసంగము
“యేసు” ప్రభువుయొక్క ఒక పేరు “ఇమ్మానుయేలు” అనగా దేవుడు మనకు తోడని యర్థము. అయితే “ఇమ్మానుయేలు” అను ఆ ఒక్క చిన్న పేరునందు గల మాటలు కొంచెము వివరింతును. ఆ పేరులో దేవుడు అను ఒక మాట యున్నది. “దేవుడు” అనుమాట అందరికి సమ్మతియైన మాట. దేవుడనుమాట అన్నిమతములవారు వాడుచున్నారు. దేవునికి మ్రొక్కవలెనని అన్ని మతములవారు అనుకొనుచున్నారు. “క్రైస్తవులు” “క్రీస్తు” అనుమాట వాడుచున్నారుగాని, హిందువు ఆ మాట వాడరు. హిందువులు “క్రిష్ణుడు” అని వాడుచున్నారుగాని క్రైస్తవులు వాడరు. "మహమ్మదీయులు” 'అల్లా' అను మాటను. “దేవుడు” అను మాటను క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు అందరు వాడుదురు. అభ్యంతరములేదు. ఆ మాటయే "ఇమ్మానుయేలు” అను మాటలో నున్నది. గాన యేసుక్రీస్తు యొక్క ఈ పేరు అన్ని మతములవారు సమ్మతించుటకు వీలైన పేరుగా కనబడుచున్నది. ఎందుకందురా! “ఇమ్మానుయేలు” అను పేరులో దేవుడు మీకు తోడైయున్నాడు. యావత్తు దేవుడున్నాడు. దేవునిలో రెండవ భాగములేదు. దేవుడనగా పూర్తియయిన దేవుడు. యేసుక్రీస్తుయొక్క ఈ పేరులో దేవుడే యున్నాడు గాన ఉన్నవాడు దేవుడే గనుక మనమందరము సంతోషించవలసినదే, మ్రొక్కవలసినదే. “యేసుక్రీస్తు” యొక్క ఈ పేరులో దేవుడున్నందువలన ఈ పేరు గొప్ప పేరు. సర్వలోకమునకు అనుగుణ్యమైన పేరు. ఈ పేరు స్మరించినపుడు పలుకునప్పుడు దేవుడే జ్ఞాపకమునకు వచ్చును. భాష భేదముగాని అర్ధమొక్కటే. హెబ్రీ భాషయందు “ఎల్" అందురు. “ఎల్" అనగా దేవుడని అర్ధము. ఇదివరకు చెప్పినట్లు భాష తేడాయేగాని అర్ధము ఒకటియే. దేవుడని మనము ఎప్పుడందుమో అప్పుడే దేవుడు మనకు తోడైనట్టే, దేవుడు మన దగ్గర నున్నట్టే, దేవునిని మనము దేవునిగా మర్యాద చేసినట్టే. ఇది ఎప్పుడైనా విన్నారా! మన భాషలో ఎన్నిమాటలు గలవో ఆ అన్ని మాటలలోకెల్ల ఈ మాట గొప్పమాట. దేవుడను మాటయే గొప్పమాట. ఈ మాటకు ముందు మరి ఏ గొప్పమాటలేదు. ఇదియే మొదటి తెలుగు గొప్ప మాట. తరువాత మాటలు ఈ మాట తరువాత మాటలే! అది ప్రత్యేకమైన మాట. “ఇమ్మానుయేలు” అను మాటయందు ఎవరెవరు గలరు? దేవుడను మనమునుగలము. దేవుడెక్కడో ఆకాశమునందును, మనము పాతాళమునందును లేము. ఇద్దరము ఒక్కచోటనే యున్నాము. చూచినారా “ఇమ్మానుయేలు” యను క్రీస్తుపేరు ఎంత గొప్పపేరో! దేవుడను, మనుష్యుడును కలిసియున్న నామము గొప్పదికాదా! దేవుడు మనము కలిసియే యున్నాము. మనము వెళ్ళి దేవుని దగ్గరలేము. ఆయన మన దగ్గరకు వచ్చి మన దగ్గర నున్నాడు అని దీనియర్ధము. ఆయన ఎక్కడనున్నాడో మనకేమి తెలియును? ఒకవేళ తెలిసిన ఆయన దగ్గర కెట్లు వెళ్ళవలయునో? ఈ రెండును మనకు తెలియవు. అనగా ఎచ్చటనున్నాడో తెలిసికొనుట మనవల్లకాదు. ఎలాగు వెళ్ళవలెనో అది మనవల్ల కాదు. గాన ఆయన మన దగ్గరకు వచ్చివేసినాడని ఈ పేరులో కనబడుచున్నది. ఆయన మన దగ్గరకు వచ్చుట ఎంత గొప్ప కథ! ఎంత వింతైన కధ! ఈ కధ ఎంతో చోద్యముగా నున్నది. దేవుడే మన దగ్గరకు వచ్చివేయుటవల్ల మనము ఎంత ధన్యులము. “ఇమ్మానుయేలు” అనగా ధన్యతగల మాటయైయున్నది గాన ఈ పేరును మనము ఎంతగా కన్నులకు అద్దుకొనవలసి యున్నది. ధ్యానింపవలసియున్నది.
మీకు శుభము కలుగును గాక! “ఇమ్మానుయేలు” అనుమాట (నామము) లో మూడవ మాట ఒకటి ఉన్నది. ఆ మాట ఏదనగా “తోడై" యుండుట. ఈ మాట ఒక గొప్ప మాటయే. దేవుడు అనునది ఒక గొప్పమాట. ఆయన మనకు తోడైయుండుట అనునది ఆయన మన విషయములో చేయు గొప్ప పని. ఆయన మనకు తోడైయుండక పోయిన యెడల మన దగ్గరనున్న ప్రయోజనమేమి? ఆయన మనకు తోడైయున్నాడు. ఇది ఆయన చేయు గొప్ప ఉపకారము. మనకు ఒక మనుష్యుడు జత యున్నంత మాత్రముననే ఎంతో సంతోషము. దేవుడే జత యున్న యెడల మరింత సంతోషముగదా! దేవుడు మన దగ్గర నున్నయెడల ఊరకనే యుండడు. గాని మనకు తోడుగా నుండును. కష్టకాలములో మనకు సహాయము చేయగలడు. “క్రిస్మస్” అను పండుగ ఎంత గొప్ప పండుగో “ఇమ్మానుయేలు” అను “క్రీస్తు" నామములో బైలుపడిపోయినది. ఈ పండుగలో ఎవరున్నారు? దేవుడును, మనమును యున్నాము. గొప్ప పండుగ గదా! ఈ పండుగలో దేవుడు మనకేమి చేయుచున్నాడు. తోడైయున్నాడు. తోడైయుండుట ఒక గొప్ప పండుగకాదా! (క్రిస్మస్) పండుగ అనగా తుదకు ఏమి తేలినది? ఎవరి పండుగైనట్టు? - దేవుని పండుగ - ఎందుకు దేవుని పండుగ - దేవుడు మనకు తోడైయున్నాడు గనుక ఆయన లేనిది సంతోషము లేదు. మనము అనగా ఎవరము క్రైస్తవులమా? ఇతరులమా? మనమనగా ఎవరమోచెప్పుదును. మనము అనగా నరజన్మమెత్తిన మనమందరము ఏ మతస్థులైనా, ఏ దేశస్థులైనా, ఎంత పాపాత్ములైననేమి! దేవుడు మనకు తోడైయున్నాడు. ఈలాగున సంతోషించుటయే (“క్రిస్మసు") పండుగ. యేసు క్రీస్తు అనుపేరులో దేవుడున్నాడని సంతోషించుటయే “క్రిస్మసు” పండుగ దేవుడు మన దగ్గరకు వచ్చుట వలన సంతోషించుటయే (క్రిస్మస్) పండుగ. దేవుడు మనకు తోడైయున్నాడని మురియుచున్న యెడల నిజముగా మురియుచున్న యెడల (క్రిస్మస్) పండుగ చేయుచున్న యొడల దుఃఖ మెందుకుండును! జబ్బేమి చేయలేదు. దయ్యాలేమి చేయలేవు. దేవుడే మనకు తోడైయుండగా మరి ఎవరును తోడై యుండనవసరములేదు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని యనుకొను చున్నారుగదా! ఆ యర్ధమే ఇందులో నున్నది. దేవుడు మనకు దిక్కైయున్నాడు. ఇంతవరకు ఒక చిన్న ప్రసంగము వినిపించియున్నాను. అదేదనగా దేవుడు మనకు తోడైయున్నాడు (క్రిస్మస్) సలాములు.