(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సైతాను నెదిరించు సూత్రములు
ప్రారంభ ప్రార్ధన
ఓ త్రియేక దేవుడవైన తండ్రీ సాతానును ఎదిరించ వలెనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము.
దయగల తండ్రీ! సర్వశక్తిగల తండ్రీ! మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయుము. శత్రువు బలమంతటిమీద మీకు అధికారమిచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రీ! ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయుమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తయైన తండ్రియొక్క నామములో, సర్వ లోకమును రక్షించిన రక్షణకర్తయైన యేసుప్రభువుయొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు, ఆయత్త పరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రియొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకములోయున్న ఓ సాతానా! సాతాను అనుచరులారా! దురాత్మలారా! దురాత్మల సమూహములారా! దయ్యములారా! భూతములారా! పిశాచములారా! మేము మిమ్ములను ఎదిరించుచు, గద్దించుచున్నాము. గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము.
1. సైతానును ఎదిరించుట
- 1. ఓ సైతానా! మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవు చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి, చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలములేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా! ఆ జయము మా పక్షముగా నున్న జయము గనుక నిన్ను జయించినట్లే.
- 2. ఓ సాతానా! “అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును” (యాకోబు 4:7) అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్ధానమే నాకాధారము. అయితే ఇదివరకు నేనాలాగు చేయలేదు, గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరియైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు.
- 3. ఓ సైతానా! మిఖాయేలు దేవదూత నీతో, మోషే శరీరమును గురించి వాదించినప్పుడు, నిన్ను గద్దించుటకు, దూషించుటకు ప్రయత్నించలేదు గాని యెహోవా నిన్ను గధ్ధించును గాక” అని చెప్పెను (యూదా 9వ వచనము). ప్రభువు మిఖాయేలుకు ఒక్కమాటే ఇచ్చినాడు గనుక ఆ ఒక్కమాటతోనే నిన్ను ఎదిరించినాడు. అయితే బైబిలులో అనేకమైన మాటలు ప్రభువు మాకు ఇచ్చియున్నారు గనుక ఆ మాటలతో నిన్ను గద్దిస్తాము గనుక విను.
- 4. ఓ సైతానా! నిన్ను ఎదిరించవలెనని వాక్యములో నున్నది గనుక నిన్ను ఎదిరించుటకు మాకు దైవాధికారము కలదు. మరియు శీఘ్రముగా నిన్ను మా పాదముల క్రింద (ప్రభువు) చితుక త్రొక్కించును (రోమా 16:20) అని వ్రాయబడియున్నది. కాబట్టి నిన్ను ఎదిరించుటకు, త్రొక్కుటకు మాకు సర్వాధికారమున్నది. నీవు త్రియేక దేవుని ఎదిరించినావు, అందుచేత మేము నిన్ను ఎదిరిస్తున్నాము. మరియు నీవు మా ప్రభువును, సిలువ మ్రానుమీద అంటగొట్టించినావు. మేము నిన్ను మా కాళ్ళ క్రిందవేసి త్రొక్కుటవలన, నీ శిరస్సును, నీ ముఖమును, నీ చేతులను, నీ కాళ్ళను, నీ ప్రక్కను త్రొక్కివేస్తున్నాము. ఇట్టి పని నీవు మా ప్రభువునకు, సిలువ మ్రాను మీద చేయలేదా? ఇప్పుడు మేము నీకు చేస్తున్నాము. సర్పమును చంపువారు ఎక్కడైనను కొట్టి సంతుష్టి పడరుగాని, దాని తల చితుక గొడితేనే గాని వదలిపెట్టరు. అలాగే మేము నిన్ను చితుకగొట్టక మానము. అనగా నీవు నీ తలలో ఆలోచిస్తున్న ఆలోచనలన్ని చితుకగొట్టి, నీ ప్రయత్నములు సాగనీయకుండ చేయుదుము.
- 5. ఓ సైతానా! ప్రభువు యొక్క "మహా శక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుండుడి" (ఎఫె 6:10) అని వ్రాయబడియున్నది. గనుక మేము నిన్ను గద్దించినా, చివాట్లు పెట్టినా, నీ ప్రయత్నములు చిన్నాభిన్నము చేసినా, మా ప్రభువు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమౌతుంది.
- 6. ఓ సైతానా! నీవు మా ప్రభువును చూచి, "నీవు పరిశుద్ధుడవు" అని అన్నావు (లూకా 4:34). అప్పుడాయన ఏమన్నాడు? “ఊరుకో మన్నాడు, అలాగే నీవేదైనా అన్నా మంచిమాట అన్నా చెడ్డమాట అన్నా మేము కూడ “నోరుముయ్!” అంటాము. మాకు అట్టి అధికారము గలదు. యేసుప్రభువు పరిశుద్దుడే, నీవన్న మాట ఆయనకు తగినదే కాని ఆయన ఒప్పుకోలేదు. అలాగే నీవు మా మనస్సులో ఏదైనా ఒక మంచి మాట అంటే, మేము కూడ ఒప్పుకొనము. అప్పుడు నీవు సిగ్గుపడవలెను.
- 7. ఓ సాతానా! మా ప్రభువు నిన్ను చూచి, "సాతానా! నా వెనుకకు పొమ్మని" కసిరినాడు (మత్తయి 16:23). వెంటనే పారిపోయినావు, వెనుకకు చూడకుండ పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నములలో, మా దర్శనములలో మాకు కనబడితే, మా ప్రభువు అన్నమాటే మేముకూడ అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవలసినదే. నీవు మా ప్రభువు యొక్క సెలవు మీద వచ్చినప్పటికిని, మా సెలవుమీద పారిపోవలసినదే.
- 8. ఓ సాతానా! "దుష్టుడు ఎవడును తరుమకుండానే పారిపోవునని" (సామెతలు 28: 1)లో వ్రాయబడియున్నది. మానవులలోనున్న దుష్టునికంటే నీవు ఎక్కువ దుష్టుడవు. మానవుని దుష్టునిగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలెను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభువు సేవ, బైబిలు పఠన చేసి - "సాతానా! మా సమావేశములకు ఎందుకు వచ్చావని" చెప్పి, నిన్ను వెళ్ళిపొమ్మని అనకపోయినప్పటికిని, నీవు వెళ్ళిపోవలయును. మా పరిశుద్ధ ఆచారములను చూచి, నీవు సహించలేవు గనుక పారిపోవలెను. అట్లే నీ దుష్టత్వమును చూచి, ఎవరైనా దేవదూతలు వచ్చి తోలివేస్తారేమోనని ముందే పారిపోవుదువు. గనుక మాకు జయము, నీకు అపజయము మరియు అవమానము.
- 9. ఓ సైతానా! మా ప్రభువు నీకు 'సైతానని' పేరు పెట్టినాడు. ఆ పేరునకు నీవు తగినవాడవు. అనగా నీ పేరునకు "తీర్పు పొందదగినవాడవనే" అర్ధమున్నది (మత్తయి 4:10). గనుక సాతానా! నీ పేరునకును, "పొమ్ము" అను ఆజ్ఞకును సంబంధము ఉన్నది. కాబట్టి నీవు పోయేవాడవే కాని ఉండేవాడవు కావు. ఆ మాట నీకు తగియున్నది. ఆ మాట మేముకూడ వాడవచ్చును. ఆ మాట మా ప్రభువు అన్నప్పుడు నీవు ఎలాగైతే వెళ్ళిపోయినావో, అలాగే ఇప్పుడు మేము ఆ మాట అన్నప్పుడు కూడ నీవు వెళ్ళిపోవాలి. ఓ 'సైతానా! నీవు ఎటువంటివాడవో ఆ సంగతి మాకు తెలియకుండ మారు వేషముతో వస్తావని, బైబిలు గ్రంథములోని కథల వలన తెలిసికొన్నాము. నీవు ఆత్మస్వరూపివైనప్పటికిని, సర్ప రూపముతో మా ఆది తల్లి దగ్గరకు వచ్చినావు గదా! నీ వెంత మారువేషములో వస్తే మాత్రము మాకు తెలియదేమిటి! దైవ వాక్యమువల్ల నీ నిజస్థితి ఎట్లు తెలియునో, అట్లే మా ప్రభువు వల్ల కూడ తెలియును. మా అనుభవమువల్ల కూడ తెలియును, మా జ్ఞానము వల్ల కూడ తెలుస్తుంది. కాబట్టి నీవు మరుగైయుండలేవు. దొంగ దొంగయని యజమానునికి తెలియగానే వాడు పారిపోనట్లు నీవును పారిపోవుదువు.
- 10. ఓ సాతానా! మా ప్రభువు భూమిమీద నున్నప్పుడు, ఆయన ముఖ్యమైన పనులలో ఒక పని, దయ్యములను వెళ్ళగొట్టుటయే. ఆ పనే మాకు కూడ అప్పగించినాడు (మార్కు 1:17). గనుక వెళ్ళగొట్టుట మా పని, పారిపోవుట నీ పని.
- 11. ఓ సాతానా! నీవు "మా మీదికి దండెత్తుదునని" అంటున్నావు. ఈ సంగతి మాకు తెలియదా! మేము "ప్రార్ధించగానే దండెత్తుదువని" మాకు తెలిసినదే. నీవు అనడము వలన నీ తెలివి తక్కువతనము కనబడుచున్నది.
- 12. ఓ సాతానా! మొదటి శతాబ్ధములోనే లోకమంతటిని గురించి యేసుప్రభువు యొక్క శిష్యులు, భక్తులు ప్రార్థించలేదా! అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినావు? మేము ఇప్పుడు ప్రార్థించుచుండగా, మమ్ములను అడగడానికి నీవెవ్వడవు? నీవు దయ్యానివి గాన నీ బుద్ధి కనబరచుచున్నావు.
- 13. ఓ సాతానా! డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వ్రాసిన చిన్న ప్రశ్నోత్తరి, నీవు ఎప్పుడైనా చదివినావా? అందులో మూడవ మనవియొక్క అర్ధములో శరీరము, లోకము, సైతాను మొదలగునవి, దేవుని చిత్తము జరుగకుండ ఆటంకపరచునవి గనుక వాటిని ఎదిరించవలెనని ఉన్నది.
- 14. ఓ సాతానా! నీవు మా కూటస్థులను విడదీస్తా నంటున్నావు. ఆలాగున విడదీస్తే , మేము అనేక చోట్లకుపోయి, సన్నిధి కూటములు పెట్టుదుము. అప్పుడు నీకింకా కష్టము, నష్టము జాగ్రత్త.
- 15. ఓ సాతానా! పాములవాడు బూర ఊదగా, పాము బయటకు వచ్చును పాము ఎందుకు బయటకు వచ్చును? చావునకు వచ్చును! అలాగే మా ప్రార్ధనలు అన్నీ విని, కోపముతో నీవు బయటకు వస్తున్నావు. గనుక నీ అంతము దగ్గరకు వచ్చినది. అది నీకు తెలియడము లేదు.
- 16. ఓ సైతానా! నీవు ఆడ మనిషివి కావు, మగ మనిషివి కావు. గనుక నిన్ను ఒకసారి ఆడ మనిషిగాను, మరియొకసారి మగవానిగాను చేసి మాట్లాడుదుము. నిన్ను అంత నీచముగా చూస్తున్నాము, అయినను నీకు సిగ్గులేదు.
- 17. ఓ సాతానా! నీవు మా స్వంత అవయముల మీద బాణములు వేసినావు. నీవు ఆకారము లేనివాడవు, అయినను నీకు మా వంటి అవయవములు నిరాకారముగా నున్నవని గ్రహించి, నీ నిరాకార అవయవముల మీద మేము బాణములు వేయుచున్నాము.
- 18. ఓ సాతానా! "నీ దూతలు నిన్ను చూచి, నీవు మేము కూడ బెదిరిపోయినాము" అని వారు నిన్ను ఎదిరిస్తారేమో! అప్పుడు నీకు మరింత బాధ. అందుకు నీవు, "నేకు శోధిస్తే మాత్రము మీరెందుకు పడవలెను" అంటే అప్పుడు వారికి బాధ. కాబట్టి నీకు, నీ దూతలకు బాధపడే యోగము పట్టును.
- 19. ఓ దయ్యములారా! మీరు విశ్వాసుల మీద బాణములు వేయునప్పుడు, వారు కూడ మీ మీద బాణములు వేయుదురు. కాబట్టి మీకు ఎల్లప్పుడు తెరిపిలేని బాణములు. మీరు తప్పించుకొనలేరు.
- 20. ఓ సైతానా! ఆదాము మొదలుకొని లోకాంతము వరకు, భూమిమీద ప్రవేశించిన పాపములతోపాటు, వాటి ఫలితములు ఇదివరకే నీ ముఖము మీదికి విసరి వేసినాము. అయితే ఇప్పుడు నీ మీదకు, నీ దూతల మీదకు అసహ్యమైనవి, హానికరమైనవన్నియు విసరి వేయుచున్నాము. అవేవనగా బంద, చెత్త, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, జీవరాసుల యొక్కయు, పురుగుల యొక్కయు మలినము నీ ముఖమున వేయు చున్నాము. ముండ్లు, తుపాకి గుండ్లు, కత్తులు, బళ్ళెములు, ఈటెలు, కొట్టే కర్రలు, కొట్టే రాళ్ళు, నీ మీదికి విసరి వేయుచున్నాము. జీవరాసుల యొక్క శవములుకూడ నీ మీదికి విసరి వేయుచున్నాము. నీవు చెలరేగుచున్నావు గనుక మేముకూడ చెలరేగుచున్నాము. నీవు ఇప్పుడైనా మారుమనస్సు పొందుము. తలకు సంబంధించిన పిచ్చి తనము మొదలగు వ్యాధులు, చెవికి సంబంధించిన వ్యాధులు, కండ్లకు సంబంధించిన వ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు, ఊపిరికి సంబంధించిన వ్యాధులు, కాళ్ళకు సంబంధించిన వ్యాధులు, ఉదరమునకు సంబంధించిన వ్యాధులు, చేతులకు సంబంధించిన వ్యాధులు, చర్మమునకు సంబంధించిన వ్యాధులు, రక్తమునకు సంబంధించిన వ్యాధులు, నాసికకు సంబంధించిన వ్యాధులు, శరీరములో ప్రతి భాగమునకు సంబంధించిన వ్యాధులు, మనసునకు కలిగే గందర గోళములు, అపనమ్మిక, భీతి, విసుగుదల, సణుగు, సందేహము, కోపము, అసూయ, దిగులు మొదలగున వన్నియు ఓ సాతానా! నీ మీదికే విసరి వేయుచున్నాము.
- 21. ఓ సాతానా! ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు మొదలగు నీ పేరులలో ఏదీ మంచి అర్ధము లేదు, చెడుగే ఉన్నది. గనుక నీవు సంతోషించవలసిన పని లేదు. నీ పేరు చెడుగే, నీ అపజయము చెడుగే, నీదంతయు అన్నియు చెడుగే. కాబట్టి మా మీద అధికారము చేయలేవు. మాలో చెడుగున్నను అది నీవు అంటించిన చెడగే కాని, నీవలే తెచ్చిపెట్టుకొనుటకు, మేము సృజించిన చెడుగు కాదు. ఓ భూతమా! నీవు అతిశయింప పనిలేదు.
- 22. ఓ సైతానా! మనుష్యులలో కొందరు నీ మాటలకు లోబడి, నీ వలె దయ్యములుగా మారి, మనుష్యులలో ప్రవేశించి కీడు చేయుచున్నారు. ఇవికూడ నీ దుష్ట క్రియలే.
- 23. ఓ సాతానా! నీకు నిజము చెప్పడము ఎప్పుడైనా తెలుసునా? తెలియదు. అబద్ధము చెప్పుట మాత్రము సుళువుగా తెలుసును, గనుక జాగ్రత్త.
- 24. దుష్టుడవైన ఓ సాతానా! 'నేను ఆత్మ స్వరూపిని, బలము గలవాడనని' అనుకొని విర్రవీగుచున్నావు. నీ దృష్టికి మానవులమైన మేము, బలహీనులుగా కనిపించు చున్నామా? అయితే, “బలమైన సర్పము చలి చీమల చేత చిక్కి చచ్చెను గదరా” అను పద్యము నీకు బాగుగా వర్తించును. ఒకవేళ మేము ఆత్మీయ జీవనములో బలహీనులముగా నున్నప్పటికిని, మేమే చేసే ప్రార్ధనలు నీకు ములుకులై, నిన్ను బంధించి, తుత్తునియలుగా నలగ గొట్టునని గుర్తుంచుకొనుము అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో!
- 25. ఓ సైతానా! మేము నిన్ను ఎదిరించేటప్పుడు నీ సైన్యమంతటిని ఎదిరించినట్లే. మా ఎదిరింపులు నీకు, నీ సైన్యమంతటికిని చెందును.