(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
రాకడ ప్రార్ధనలు - స్తుతులు
-
1. ఒక అబ్బాయి దూరదేశములోనుండి "నేను వచ్చుచున్నానని" ఉత్తరము వ్రాసెను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరము చూచుకొని
ఆనందించి, ఆ
అబ్బాయి కొరకు ఎదురు చూతురుకదా! అట్లే యేసు ప్రభువు వచ్చెదనని చెప్పిరిగదా! వచ్చెదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండునా?
ఎప్పుడో
ఒకప్పుడు వచ్చునుగదా! ఆ అబ్బాయి ఇంటివారు అతనికొరకు ఎదురు చూచినట్లుగా మనమును యేసు ప్రభువు యొక్క రాకకై ఎదురుచూచిన యెడల,
ఆయన
వచ్చినప్పుడు ఆయన ఆగమనములో, ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి ఓ ప్రభువా! నిన్ను
వందించుచున్నాము.
-
2. ఆ అబ్బాయి ఫలాని ఓడకు వచ్చుచున్నానని వ్రాసెను. ఆ ఇంటివారు కాకినాడకు ఓడలో వచ్చుచున్న అబ్బాయిని కలిసికొనుటకు
వెళ్ళిరి.
ఓడ వచ్చినది గాని ఆ అబ్బాయి ఎందుకో ఆ ఓడమీద రాలేదు. ఆ ఇంటివారు ఆ ఓడను చూచి, అబ్బాయి రానందున తిరిగి ఇంటికి
వెళ్ళిపోయిరి.
అయితే ఆ అబ్బాయి రెండవ ఓడమీద దిగినాడు. తన ఇంటివారెవరును తనను కలిసికొనుటకు రానందున తిరిగి వెనుకకు వెళ్ళిపోయినాడు.
అలాగే
యేసుప్రభువు రాకడ ఆలస్యమైనందున అనేకులు వెనుకకు వెళ్ళిపోవుదురు. ఆ అబ్బాయి రెండవ ఓడకు వచ్చినట్లుగా ప్రభువుకూడ
వచ్చి, సిద్ధపడియున్నవారిని తనతోకూడ పైకి తీనికొని వెళ్ళును. గనుక ఆయన రాకడ ఆలస్యమైనందున ఆగిపోక, ఆయనతో వెళ్ళుటకు
సిద్ధము
చేయుమని వేడుకొనవలెను. ఓ ప్రభువా! నీ రాకడ ఆలస్యమైనను మేము వెనుకకు తిరిగిపోవువారిలో చేరకుండ, ఎల్లప్పుడు సిద్ధపడియుండు
కృప
దయ చేయుదువని నమ్ముచు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము.
-
3. ఒక యౌవనస్తుడు తన భార్యకు నేను ఫలాని బండికి వచ్చుచున్నాను, ఆ బండికి నీవు వచ్చి నన్ను కలిసికొనవలెను, లేనియెడల నేను
ఇంటికి రాను అని వ్రాసెను. అతని భార్య వంటలు మొ॥నవన్నియు తయారు చేసికొని స్టేషనుకు వెళ్ళెను. ఆ దినము బండి రెండు గంటలు
ఆలస్యమైనందున ఆమె ఇంటికి వెళ్ళెను. ఆ తరువాత బండి వచ్చినది. అతడు దిగి ఆమె కొరకు అంతా చూచి, ఆమె కనబడనందున విచారించి, ఆ
బండికే వేరొకచోటికి వెళ్ళెను. అలాగే మనమును ఆయన రాక కొరకు ఎదురుచూచి, తీరా వచ్చుసరికి వెనుకకు వెళ్ళిపోవుదుము. రాకడలో
వెళ్ళలేము. గనుక ఆలస్యమైనను ఆయన వచ్చువరకు కనిపెట్టి చూచుచు,
సిద్ధపడవలెను. అప్పుడు రాకడలో వెళ్ళగలము. ఓ ప్రభువా! మేము కనిపెట్టుచు సిద్ధపడుచుండగల కృప
దయచేయుదువని నమ్మి నీకు స్తుతులర్పించుచున్నాము.
-
4. ఒకరు ప్రయాణమునకు వెళ్ళవలెనని గోదావరి స్టేషనుకు వచ్చుసరికి బండి దాటిపోయినది. అతడు వెంటనే తెలివితేటలు గలిగి
రాజమండ్రి
స్టేషనులో బండి అరగంట ఆగునని తెలిసికొని, వెంటనే రిక్షా కట్టించుకొని గబగబ పరుగెత్తించి స్టేషను చేరెను. వెంటనే
టిక్కెట్టు
కొని బండిలో ప్రవేశించినాడు. అలాగే మనమును తెలివితేటలు ఉపయోగించుకొని, గబగబ పనులు చేసికొని రాకడకు సిద్ధపడవలెను. ఒకవేళ
వెనుకబడినను ఏదో ఒక విధముగా అందుకొనవలెను. ఆ ప్రయాణీకునివలె తెలివితేటలు ఉపయోగించి రాకడలో పాల్గొను కృప దయచేయుదువని
నమ్మి
నీకు స్తోత్రములు చెల్లించు చున్నాము.
-
5. ఒకడు మగ్గముపై దుప్పటి నేయుచు, ఈ కొంచెమే ఉన్నదిగదా! అతి త్వరగా నేసి వెంటనే వస్తాను, మీరు వెళ్ళి బండికి టిక్కెట్టు
తీసికొనండని చెప్పెను. అతడు ఆ దుప్పటిని త్వరత్వరగానేసి, ఎగబెట్టేసరికి ఆలస్యమైనది, బండికి అందుకొనవచ్చుననుకొన్నాడు గాని
పనులవలన ఆలస్యమైనందున, అతడు వెళ్ళుసరికి ఆ బండి వెళ్ళి పోయెను. అలాగే ఆయా పనులు పెట్టుకొని
బండిని అతడు దాటిపోజేసినట్లు మనమును నానాపనులు పెట్టుకొని రాకడలో వెళ్ళలేక వెనుకబడి పోవుదుము. ఓ ప్రభువా! నీ రాకడ
విషయములో
మేమట్టి అశ్రద్ధ చూపకుండ మమ్మును సిద్ధపర్చుమని నమ్మి నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము.
-
6. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు, ప్రభువుయొక్క రాకడను మరచి పోవుదురు. ఇంతలో ఆయన
వచ్చి
ఎదురుచూచుచు, సిద్ధపడినవారిని తీసికొనిపోవును. పనులు ముగించుకొని తేరి చూచునప్పటికి రాకడ వచ్చి వెళ్ళిపోవును. పనులు
ముగించుకొని తేరి చూచునప్పటికి రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడ జరుగును. అలాగే సమయమంతా పనులు, పనులు అని పనిపాటలతోనే కాలము
గడుపువారు రాకడలో ప్రభువును కలిసికొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి, నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండ ఉండే కృప
దయచేయుదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము.
-
7. ప్రతి దినము రాకడ ప్రార్ధన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగియుండక పోయిన రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యమును, ఏ
పనిచేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగియుండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదువని
నమ్ముచున్నాము.
నీకు నిత్య స్తోత్రములు.
-
8. ఒక రైతు కళ్ళమునందున్న ధాన్యములోని రాళ్ళను ఏరి పారవేసి, జల్లెడలోవేసి జల్లించి, చేటలోవేసి చెరిగివేసి,
శుభ్రముగానున్న
గట్టి గింజలను జాగ్రత్త చేసెను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటిని, చెత్త, పొట్టువంటి
పాపములను
జల్లించి చెరిగివేసికొనవలెను. అప్పుడు మనమును గట్టిగింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభువా! అట్లు మమ్మును మేము
శుభ్రము చేసికొనగల సహాయము దయచేయుదువు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు.
-
9. ఒక స్త్రీకి చంటి బిడ్డ కలదు. ఆ బిడ్డ ఆడుకొనుచు బురద చేసికొనగా, బిడ్డను ఆమె నీళ్ళతో కడిగి శుద్ధి చేసినది. అయితే ఆ
బిడ్డ
మరల ఆడి మరల బురద చేసికొనగా, తిరిగి తల్లి కడిగివేసినది. అనేకమార్లు ఆ బిడ్డ బురద చేసికొనగా అలాగే తల్లి అనేకమార్లు
కడిగి
శుద్ధిచేసిన రీతిగా మనమును మన మనస్సులోనికి చెడ్డ తలంపులు వచ్చినప్పుడు, వెంటనే యేసు రక్తముతో ఆ పాపమును శుద్ధిచేసుకొను
అలవాటు కలిగియుండవలెను. వెంటనే శుద్ధిచేసికొనకపోయిన ఆలస్యమైపోవును. గనుక (పాపపు తలంపు రాగానే), పాపములో పడగానే ప్రభువు
రక్తముతో పవిత్రము చేసికొనవలెను. ఎన్ని మారులైనను “యేను రక్తమే జయము అనునది అలవాటు చేసికొనవలెను. ఓ ప్రభువా! మేమట్లు
శుద్ధిచేసికొని, నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి వందించుచున్నాము.
-
10. దూర ప్రయాణము చేయువారు ఉదయం కాఫీ, మధ్యాహ్నము, సాయంకాలము భోజనము, 4 గంటలకు మరల కాఫీ తీసికొనినగాని ప్రయాణము చేయలేరు.
అలాగే మనమును ఆకలి వేసినప్పుడెల్ల ప్రభువుయొక్క శరీర రక్తములు అను ఆహారమును తీసికొని అనుభవింపక పోయిన రాకడ ప్రయాణము
చేయలేము.
గనుక సంస్కార భోజనము పుచ్చుకొనిన రాకడలో వెళ్ళగలము. ఓ ప్రభువా! నీవు ఏర్పాటు చేసిన సంస్కారపు విందును అనుభవించి,
బలముపొంది, నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి నీకు నుతులర్పించుచున్నాము.
-
11. క్రైస్తవ సంఘములోని కొందరు రాకడ పమీపమను చున్నారు. కొద్దిమంది మాత్రమే నమ్ముచున్నారు, కొందరు నమ్ముటలేదు. ఓ ప్రభువా!
ఒకవేళ నమ్మనివారు, నమ్మిన యెడల వారిని రాకడకు సిద్ధపరచుము. నమ్మినవారిని ఇంకను సిద్ధపర్చుము. నమ్మని వారికి నమ్మకము
పుట్టించుము. నమ్మిన వారిని, నమ్మలేని వారిని, నమ్మనివారిని రాకడకు సిద్ధపర్చుము. ఇట్లు నీ సంఘమును రాకడకు ఆయత్తము
చేయుదువని
విశ్వాసించి
స్తుతులర్పించుచున్నాము.
-
12. అన్యులలో ప్రభువును నమ్మినవారున్నారు, నమ్మనివారుకూడా ఉన్నారు. వారు సిద్దపడుట ఎట్లు? ఎవరో ఒకరు వెళ్ళి, వారికి
రాకడను
గురించి బోధించ వలెను. లేనియెడల వారికి నమ్మకము కలుగదు. వారు సిద్ధపడినను సరే, సిద్ధపడకపోయినను సరే, వారిని కూడ
సిద్ధపర్చుమని ప్రార్థించుచున్నాము.
-
13. గురుతులు అయిన తర్వాత రాకడ జరుగునని క్రైస్తవులు చెప్పుచున్నారు. అయితే ఎప్పుడును ఒకేలాగున్నది, ఈ గురుతులు
ఎప్పుడును
ఒకేరీతిగా నున్నవి, ఈ గురుతులన్ని ఇదివరకే ఉన్నవి, క్రొత్తవేమియు లేవు అని ఆక్షేపణ చేయు వారిని గురించి ప్రార్ధించవలెను.
గనుక భక్తులైనవారు గురుతులు ఏవేవి, ఏ సంవత్సరమున, ఏయే దేశములలో జరిగినవో, ఇంకా క్రొత్త గురుతులు ఏమి జరుగునో, బైబిలులో
లేని
ఎక్స్ట్రా (Extra) గురుతులు వ్రాయునట్లు ప్రార్థింపవలెను. ఇవి లోకమంతా తెలిసికొనునట్లు భక్తులు త్వరలో వ్రాయునట్లు
ప్రార్ధించ
వలెను. ఓ ప్రభువా! అట్టి భక్తులనులేపి రాకడ గుర్తులను వ్రాసి, లోకమునకు చూపించు కృప దయచేయుదువని నమ్మి నీకు
కృతజ్ఞతార్పణలు
చెల్లించుచున్నాము.
-
14. లోకములో కొందరు సువార్త పత్రికలు అచ్చువేసి, అనేకులకు పంపుచున్నారు. వారు కేవలము దేవునివలన ప్రేరేపింపబడి, అట్టి
వాటిని
వ్రాసి అనేకులకు పంపుచున్నారు. అట్టి పత్రికలలో కొన్ని
-
1) నవీనకాల విషయములు తెలియచేయునవి,
-
2) మరికొన్ని రెండవ రాకడ విషయములు
తెలియజేయునవి,
-
3) కొన్ని ప్రవచన కాల విషయములు తెలియజేయునవైయున్నవి.
పై మూడు రకముల పత్రికలు వారు ఊరకనే అనేకులకు పంపు
చున్నారు. వీటన్నిటిని ప్రభువు దీవించుచున్నారు గనుక ఆయనకు మంగళ స్తోత్రార్పణలు.
-
15. క్రీస్తుమతము పుట్టి 19 శతాబ్ధములు అయినది. ఈ 19 శతాబ్ధములలో ఏయే సంగతులు జరిగినవి, ఎందరు క్రైస్తవులైనది, ఎన్ని
రాకడ
గురుతులు జరిగినవి. ఏయే గురుతులు ఏయే కాలములో జరిగినవి, ఆ గురుతులు జరిగినపుడు వాటి పని ఏమిటయినది, ఆ గురుతులవలన
ప్రభువునకు
ఏమి మహిమ కలిగినది; ఈ విధముగా లోకములో జరిగిన మరియు జరుగుచున్న విషయములు ఒక పుస్తకములో అయ్యగారు వ్రాసి యుంచిరి. ఆ
పుస్తకమును అయ్యగారు జాగ్రత్తగా దాచి ఉంచగా, ఎవరో ఒకరు మరల పంపించెదనని తీసికొని వెళ్ళిరని తెలిసి, ఆ పుస్తకము కొరకు
వ్రాయగా, పంపించెదనన్నారుగాని ఇంతవరకు పంపలేదు. ఆ పుస్తకము మరల దొరికిన యెడల రాకడ గురుతులన్నియు అందులోగలవు. గనుక ఎంత
పనియైనను చేయవచ్చును. అతి త్వరలో దొరుకునట్లు ప్రార్ధన చేయండి. ఆ పుస్తకము
దొరికినప్పుడు, అన్యులు మరియు క్రైస్తవులు ఏలాగున్నది, ఏమేమి పొందినది తెలియగలదు.
ప్రార్థన: దయగల తండ్రీ! నీ రాకడకు కొందరు
సిద్ధపడుచున్నారు, కొందరు సిద్ధపడుటలేదు. కొందరు సిద్ధపడవలెనని తలంచుచున్నారు. కొందరు సిద్ధపడవలెనని ప్రయత్నము
చేయుచున్నారు, గాని సిద్ధపదలేక పోవుచున్నారు. గనుక మమ్ములనందరిని నీ రాకడకు సిద్ధపరచి, నీతో మేమందరము బయలుదేరు భాగ్యము
అనుగ్రహించి సిద్ధపరచి, స్థిరపరచుము.
-
16. పౌలురాజు తైలాభిషేకమును, ఆత్మను పొందినను, యుద్ధములలో జయము పొందినను చివరకు తప్పిపోయెను. అలాగే కొందరు క్రైస్తవులు
చివరివరకు అనగా రాకడ వరకు బాగుండి, రాకడ ఈ వేళో రేపో అనగా తప్పిపోయి నిరాశపడుదురు. మేము అట్టివారము కాకుండా కాపాడుదువని
నమ్మి నిన్ను స్తోత్రించుచున్నాము.
-
17. ఎప్పుడునూ రక్షణను గురించిగాని, రాకడను గురించిగాని, విననివారు ఆఖరు దినమున విని తయారు కావచ్చును. ఏలాగనగా
రైలుబండికి
ఆలస్యముగా బయలు దేరిన కొందరు పరుగెత్తుకొని వచ్చి, రైలు కదిలే సమయములో
ఎక్కుదురు గదా! సిలువ మ్రానుమీద, దొంగ ఆ క్షణములో మారుమనస్సు పొందెనుగదా! అట్లు మేము రాకడలో పాల్గొనుకృప దయచేతువని
నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.
-
18. తీరా మరణ సమయమున కొందరు మారు మనస్సు పొంది, బహు కొద్దిమంది రాకడకు సిద్ధపడుదురు. అది నీ కృప. అట్టి కృప మాకును
దయచేయుము.
నీకే ప్రణుతులు.
-
19. కొందరు మంచి పనిమీద ఉండి, ముగించునప్పటికి రాకడ వచ్చును. భోజనము సగము తినుచున్నప్పుడు, రాకడ వచ్చినయెడల, తయారుగా
నున్నవారు వెళ్ళిపోవుదురు. మేమే స్థితిలో ఆ సమయమునకు ఉన్నను, రాకడలో ఎత్తబడగల కృప దయచేయుదువు గనుక నీకు మా నమస్కారములు.
-
20. కొందరు నిద్రలో ఉండగానే రాకడలో ఎత్తబడుదురు గనుక నీకు మా హృదయ వందనములు.
-
21. ఒకరు, మరియొక గ్రామములో ఎవరో చనిపోయినారని విని ఏడ్చుచుండగా రాకడలో ఎత్తబడుదురు గనుక నీకు స్తుతులు.
-
22. ఒకరు స్వస్థానమునకు వెళ్ళుటకు, అనగా కుమార్తె తండ్రి ఇంటికి వెళ్లుటకు ఆశించును. అలాగే సంఘము ప్రభువుయొక్క రాకడ
కొరకు
చూచుచున్నది. అనగా పెండ్లికుమార్తె, పెండ్లికుమారుని రాక కొరకు ఎదురు చూచుచున్నది. గనుక ఎదురుచూచు సంఘము రాకడలోనికి
వెళ్ళును. ఎదురు చూడనివారు రాకడలోనికి వెళ్ళరు. మేము ఎదురు చూచు వారిగానుండు వీలు కలిగింతువని నమ్మి నిన్ను
స్తుతించుచున్నాము.
-
23. ఒక గ్రామములో చాలా కలహములుండెను. ఒకరు జ్వరముతో నున్న తన కుమార్తెను చూచుటకు వచ్చి, కలహముల యొక్క భయంకర
స్థితినిగూర్చి
వినెను. ఈ కలహములలో తన కుమార్తెను అక్కడ ఉంచుట అపాయమని తలంచి, తన ఇంటికి తీసికొనిపోయెను. అలాగుననే ఈ లోకము గత్తర లోకము,
వ్యాధుల లోకము, పాప లోకము, పాప ఫలితములున్న లోకము, అవస్థల లోకము, కరవుల లోకము, వ్యాధుల లోకము, విష పురుగుల లోకము,
నిరీక్షణ
లేని లోకము, మరణలోకము, దయ్యముల లోకము, దయ్యములకు లోబడిన మనుష్యులున్న లోకము. గనుక ప్రభువు మనలను మోక్ష మందిరమునకు
తీసికొని
వెళ్ళుటకు శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ తండ్రి కుమార్తెను తీసికొని వెళ్ళునప్పుడు “రాను” అని చెప్పదుగదా! అలాగే
మనము
కూడా మేఘములోనికి “రాము” అని చెప్పకూడదు. “ప్రభువా! తండ్రి! సిద్ధముగా నున్నాను” అని చెప్పవలెను. అట్లు చెప్పగల కృప
దయచేయుదువని నమ్మి నిన్ను స్తుతించు చున్నాము.
-
24. సముద్రముయొక్క కెరటములు రేయింబగళ్లు (పగలు, రాత్రి) గాలివలన శబ్దము చేయుచున్నవి. సముద్ర తరంగములను రేపుచున్న గాలివలె
దైవాత్మ భక్తులయొక్క హృదయములను రేయింబగళ్ళు కదిలించుచున్నది. అప్పుడు వారు రక్షణ పొంది అందులకు స్తుతింతురు. మరియు రాకడ
వచ్చుచున్నదని న్తుతించుచు సంతోషింతురు. ఓ ప్రభువా! అట్టి రెండు విధములైన స్తుతులు మాకు నేర్పుము.
-
25. దేవా! నీవు ఏనాడు సూర్య చంద్ర నక్షత్రములను సృజించినావో, ఆ దినము మొదలు నేటివరకు అవి ఆకాశ మండలములోనుండి
ప్రకాశించుచున్నవి. జ్యోతులు తమకు నియమింపబడిన మార్గములో ప్రయాణము చేయుచునే ఉన్నవి. అలాగుననే మేము కూడ మా ఆనంద దీపములతో
మా
మార్గములలో నడచుచు, స్థిరముగా నుండునట్లు దీవించి నీ రాకడకు సిద్ధపరచుము. నీవు దయచేసిన రక్షణ, రాకడ భాగ్యములను గురించి
నిన్ను మహిమపరచు కృప దయచేయుము.
-
26. దేవా! నీవు కలుగజేసి మాలో పెట్టిన ఆత్మ ఎల్లప్పుడు నిన్నే తలంచునట్లు చేయుము. ఆత్మవైన నీతో ఏకీభవించుటకు కృప
దయచేయుము.
మా ఆత్మతో నిన్ను స్తుతించు శక్తి దయచేయుము. మా ఆత్మ నీ యొద్దకు వచ్చువరకు రక్షణను
గురించియు, రాకడను గురించియు, స్తుతించు ధోరణి దయచేయుదువని నమ్మి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము.
-
27. ప్రభువా! మా వ్రాత స్తుతులు నిజమైన స్తుతులుగా, నీకు ఇష్టమైన స్తుతులుగా మార్చివేయుము. వ్రాత ఎప్పటికైన చెరపవచ్చును
గాని, నీ ఆత్మ సహాయము చేత వచ్చిన స్తుతి చెడిపోదు. అట్టి స్తుతి మాకు దయచేయుదువని నమ్మి నిన్ను వందించుచున్నాము.
-
28. ఓ దేవా! వ్రాత ఎంత నిశ్చయమో, ఎంత నిజమో, మా స్తుతికూడ అంత నిశ్చయము, నిజమైయుండుటకు కృప దయచేయుము.
-
29. రక్షణ ఎంత నిశ్చయమో రాకడ అంత నిశ్చయము. మేము స్తుతించుటయు, సిద్ధపడుటయు అంత నిశ్చయమై యుండునట్టి కృప దయచేయుము.
-
30. మేము పరలోకమునకు వచ్చునప్పుడు, మా పాత శరీరము ఇక్కడ విడిచివస్తాము. మా స్తుతులలోను, మా సిద్ధపడుటలోను, మా నమ్మికలోను
ఉన్న కళంకములు ఇక్కడ విడిచిపెట్టు శక్తి దయచేయుము.